సాక్షి, ఆదిలాబాద్ : అనుకున్నంతా అయిందని ఆయా పార్టీల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ టికెట్టు ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీ పైనే ప్రతీకారం తీర్చుకునేందుకు రెబల్స్‌గా బరిలోకి దిగారు. పార్టీ నిబంధనలకు కట్టుబడి నామినేషన్ ఉపసంహరించుకుంటారని భావించిన అభ్యర్థులకు చుక్కెదురైంది. పార్టీ టికెట్టు ఇవ్వకపోయినా... బీ–ఫారాలతో సిద్ధంగా ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకొని మరీ పోటీ చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఒకటి రెండు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేస్తున్న రెబల్స్ చాలా చోట్ల విజయావకాశాలను దెబ్బతీసే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పోటీ రసవ్తరంగా మారింది.
చుక్కలు చూపిస్తున్న మాజీ మంత్రి వినోద్..
టీఆర్‌ఎస్ అభ్యర్థిగా చెన్నూరు నుంచి సీటు ఆశిం చి భంగపడ్డ మాజీ మంత్రి గడ్డం వినోద్ చివరికి బెల్లంపల్లి సీటైనా ఇవ్వాలని అధిష్టానాన్ని అభ్యర్థించారు. పార్టీ కాదనడంతో కాంగ్రెస్ లేదా మహాకూటమిలోని పార్టీల తరుపున బెల్లంపల్లి సీటు కోసం విఫలయత్నం చేశారు. బెల్లంపల్లి సీటును సీపీఐకి కేటాయించడంతో మాజీ ఎమ్మె ల్యే గుండ మల్లేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వినోద్ బహుజన సమాజ్ పార్టీ నుం చి అవకాశం రావడంతో ఆ పార్టీ గుర్తుపై పోటీ పడుతున్నారు. తన సోదరుడు, టీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ జి.వివేక్‌తో కూడా విభేదించి పోటీలో కొనసాగుతున్నారు. వినోద్‌కు టీఆర్‌ఎస్‌కు చెందిన బెల్లంపల్లి మున్సిపాలిటీలోని మెజారిటీ పాలకవర్గం మద్దతు తెలుపగా, నియోజకవర్గం లోని కాంగ్రెస్ నాయకుల నుంచి మండలాల వారీగా మద్దతు లభిస్తోంది. వినోద్ బీఎస్‌పీ నుంచి గట్టిపోటీ ఇస్తున్నట్లు తేటతెల్లమైంది. దీంతో టీఆర్‌ఎస్, సీపీఐ అభ్యర్థులు దుర్గం చిన్నయ్య, గుండ మల్లేష్ కూడా వినోద్‌నే టార్గెట్ చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి కొయ్యల ఏమాజీ కూడా బరిలో దిగడంతో చతుర్ముఖ పోటీ పరిస్థితి నెలకొంది. వినోద్‌కు లభిస్తున్న ఆదరణతో మిగతా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
ముథోల్‌లో పటేళ్ల పోరు
ముథోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, ఆయనకు వరుసకు సోదరుడైన రామారావు పటేల్ పోటీపడ్డారు. రామారావు పటేల్ టికెట్టు తెచ్చుకోవడంతో నారాయణరావు పటేల్ రెబల్ అవతారం ఎత్తారు. శరద్‌పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నుంచి బీ–ఫారం తెచ్చి పోటీలో నిలిచారు. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి విఠల్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రామారావు పటేల్, బీజేపీ అభ్యర్థి రమాదేవిలకు ధీటుగా నారాయణరావు పటేల్ పోటీ పడుతున్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నారాయణరావు పటేల్‌కు గ్రామాల్లో ఉన్న సంబంధాలను చూసి మిగతా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. రామారావు పటేల్‌పై కోపంతోనే పోటీలో నిల్చిన నారాయణరావు పటేల్ ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తారోనని అభ్యర్థులు భయపడుతున్నారు.
గత ఎన్నికల్లో అభ్యర్థులు... ఇప్పుడు రెబల్స్‌గా..
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్టుపై పోటీ చేసి ఓడిపోయిన అనిల్ జాదవ్ (బోథ్), అజ్మీరా హరినాయక్ (ఖానాపూర్) ఇప్పుడు రెబల్స్‌గా బరిలో నిలిచారు. బోథ్ టికెట్టు సోయం బాపూరావుకు రాగా, ఖానాపూర్ సీటును రమేష్ రాథోడ్ దక్కించుకున్నారు. బోథ్‌లో ఆదివాసీ ఓట్లపై నమ్మకంతో కాంగ్రెస్ సోయం బాపూరావుకు టికెట్టు ఇవ్వగా, ఇక్కడి లంబాడాలతో పాటు గిరిజనేతర ఓట్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో అనిల్ జాదవ్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి అనిల్ జాదవ్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ ప్రజల్లో సానుభూతి సంపాదించుకున్నారు. టికెట్టు రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి సవాల్ విసురుతున్నారు. ప్రచారంలో కూడా ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్‌తో పాటు టీఆర్‌ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపూరావుకు కూడా మింగుడు పడడం లేదు. ఖానాపూర్‌లో హరినాయక్ పరిస్థితి అదే. చివరి నిమిషంలో పార్టీ మారిన రాథోడ్ రమేష్‌కు సీటివ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. బీఎస్‌పీ అభ్యర్థిగా తన సత్తా చూపుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ బ్యాచ్ నుంచి ఇద్దరు
రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ (చెన్నూరు), రావి శ్రీనివాస్ (సిర్పూరు)లకు నిరాశ ఎదురవడంతో రెబల్ అవతారం ఎత్తి ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారారు. బోడ జనార్దన్ మాజీ మంత్రిగా, నాలుగుసార్లు వరుస ఎమ్మెల్యేగా ఉన్న పరిచయాలతో బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను భయపెడుతున్నారు. తనకు చివరి అవకాశంగా గెలిపించాలని చేస్తున్న విజ్ఞప్తి సానుకూల ఫలితాన్నిస్తుందని భావిస్తున్నారు. రావి శ్రీనివాస్ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడాయన బీఎస్‌పీ తరుపున పోటీ చేస్తూ తనకు మామ అయిన టీఆర్‌ఎస్ అభ్యరిథ కోనేరు కోనప్పను, కాంగ్రెస్‌కు చెందిన హరీష్‌బాబును ఆందోళనకు గురి చేస్తున్నారు.
⇔మంచిర్యాలలో ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు చెందిన బేర సత్యనారాయణ, ఆరె శ్రీనివాస్ బీఎస్‌పీ, బీఎల్‌ఎఫ్ నుంచి పోటీ చేస్తుండగా, చల్లగుళ్ల విజయశ్రీ ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. వీరు ఎవరి ఓట్లను చీలుస్తారో తెలియక ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
⇔బోథ్ నుంచి కుమ్రం కోటేష్ పోటీ పడుతున్నారు. ఆదివాసీ వర్గానికి చెందిన కోటేష్ వల్ల ఎవరి ఓట్లు చీలుతాయో తెలియని పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment