కౌంట్‌డౌన్‌ !   | Assembly Elections Closed By Yesterday 5pm | Sakshi
Sakshi News home page

కౌంట్‌డౌన్‌ !  

Published Thu, Dec 6 2018 4:12 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Assembly Elections Closed By Yesterday 5pm - Sakshi

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం ముగిసింది. శుక్రవారం నాటి పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ప్రధాన పార్టీలనూ ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారు... ఏ పార్టీని ఆదరిస్తారనేది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంది. నాలుగేళ్లలో తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మళ్లీ తమను గెలిపిస్తే రాష్ట్రంలో కొనసాగుతోన్న అభివృద్ధి పనులు పూర్తవుతాయంటూ ప్రజలను ఆకర్శించే ప్రయత్నం చేశారు. ఇటు తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటు ఆకాంక్షలు నెరవేరలేదంటూ ప్రజాకూటమీ ప్రజల ముందుకు వెళ్లింది. దీనికితోడు ఇరు పార్టీలు ప్రజలను ఆకట్టుకునే సంక్షేమ పథకాలు తమ మేనిఫెస్టోలో పొందుపరిచాయి. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ అభ్యర్థులు ఓటర్లను ఆకర్శించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఓటర్లు ఎవరికి జై కొడతారూ..? ఏ పార్టీకి పట్టం కడుతారనేది జిల్లాలో ఆసక్తికరంగా మారింది. దాదాపు రెండు నెలలుగా జరిగిన ప్రచారపోరులో ఓటర్లు ఎవరిని విశ్వసిస్తారనే దానిపై చర్చ సాగుతోంది. 

సాక్షి, జగిత్యాల:   జగిత్యాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌కుమార్‌కు, స్థానిక తాజామాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డికి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ధర్మపురి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ప్రభుత్వ తాజా మాజీ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌కు కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మధ్య పోటీ ఉంది. కోరుట్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన తాజామాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు కాంగ్రెస్‌ అభ్యర్థి జువ్వాడీ నర్సింగరావు మద్య పోటీ ఉంది. వేములవాడ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ మధ్య పోటీ నెలకొంది. చొప్పదండి నియోజకవర్గంలో మాత్రం త్రిముఖ పోటీ ఉంది. అక్కడి తాజామాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థిని బొడిగె శోభ, టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి సుంకె రవిశంకర్, కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యం మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.  


జగిత్యాల జైత్రయాత్ర ఎవరిదో..? 
2014 సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏకైక ప్రతిపక్షస్థానంగా నిలిచిన జగిత్యాల అసెంబ్లీ సీటును ఈసారి ఎలాగైన కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ క్రమంలో నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత జగిత్యాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నో అభివృద్ధి పనులు మంజూరు చేయించుకున్నారు. స్థానిక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైన.. నిరుత్సాహపడకుండా గడిచిన నాలుగేళ్లలో ప్రజల మధ్యే ఉంటూ పార్టీని బలోపేతం చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తాజామాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై గెలుపొందేలా ప్రజలకు దగ్గరయ్యారు. ఈక్రమంలో మహాకూటమీ పొత్తులు.. సీట్ల సర్దుబాటులో భాగంగా జిల్లాలో పోటీకి దూరమైన టీడీపీ పార్టీ జీవన్‌రెడ్డికి మద్దతు ప్రకటించింది. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ సైతం జీవన్‌రెడ్డిని మద్దతుగా ప్రచారం నిర్వహించారు. దీంతో జగిత్యాల గెలుపుపై రాష్ట్రస్థాయిలో ఉత్కంఠ నెలకొంది.  


హోరెత్తించారు 
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా గత నెల 26న.. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్నారు. అక్టోబర్‌ 24న మేడిపల్లి, ఈనెల 4న కోరుట్లలో జరిగిన ఆశీర్వాద సభల్లో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. వీరితోపాటు నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో అనేకమార్లు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అక్టోబర్‌ 31న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మెట్‌పల్లిలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. జగిత్యాల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్‌రెడ్డికి మద్దతుగా ప్రజాగాయకుడు గద్దర్, అంతర్జాతీయకవి ఇమ్రాన్‌ ప్రతాప్‌గడీ ప్రచారం నిర్వహించారు. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికివారుగా తమ నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తించారు. సకుటుంబ సపరివారంగా ఓటర్లను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థించారు. గతంతో పోలిస్తే ఎన్నికల ఖర్చులోనూ అభ్యర్థులు పోటీపడ్డారు. దీంతో ప్రధాన పార్టీల అతిరథ నేతల సభలకు జనం భారీగా తరలిరావటం ... పల్లెపల్లెన అభ్యర్థుల ప్రచారానికి స్పందన కనిపించింది. కాగా 28 ఏళ్ల తర్వాత బీజేపీ జగిత్యాల నుంచి పోటీకి దిగింది. ముదుగంటి రవీందర్‌రెడ్డిని బరిలో దింపింది. టీఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం గులాబీ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement