బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. తక్షణమే సీఎంను మార్చి ఆయన స్థానంలో కొత్త వ్యక్తికి పాలనా పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా యడియూరప్పకు వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నేత బసన్నగౌడ పాటిల్ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఆయన వర్గంగా భావిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు చేస్తున్నారనే వార్తలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా యడియూరప్ప తీవ్రంగా విఫలమయ్యారని, వయసు మీదపడటంతో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని ఆయన వ్యతిరేక వర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. (ప్రధాని మోదీపై అమిత్ షా ప్రశంసలు)
కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి కేంద్ర అండదండలతో యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసింది. కుమారస్వామికి వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపించి.. ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకంగా మారిన 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ఇప్పడు బీజేపీ సర్కార్‌లో కీలక పదవుల్లో ఉన్నారు. వీరిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా దక్కాయి. ఈ పరిణామం సొంత పార్టీలోని నేతలకు అస్సలు మింగుడు పడటంలేదు. పార్టీని నమ్ముకుని ఎప్పటి నుంచో ఉంటున్న తమను కాదని.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం ఏంటని తమ అసంతృప్తికి వెల్లగక్కుతున్నారు.
ఇక ఈ క్రమంలోనే యడియూరప్పను ముఖ్యమంత్రి పదవిలో నుంచి తొలగించి ఆ స్థానంలో కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఎవరికి వారే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ జాబితాలో సీనియర్ నేతైన బసన్నగౌడ పాటిల్ ముందుండగా.. ఆయనకు పోటీగా మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ దూసుకొచ్చారు. తన వర్గం ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక తానేమీ తక్కువ కాదంటూ సీనియర్ నేత ఉమేష్ కట్టి కూడా రేసులోకి వచ్చారు. గురువారం రాత్రి 16 మంది తన అనుచర ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ పరిణామాలన్నీ కన్నడలో హాట్ టాపిక్‌గా మారాయి. (ఎన్నో ముడులు విప్పిన మోదీ)
తాజా పరిస్థితుల నేపథ్యంలో సీఎం యడియూరప్ప కూడా అప్రమత్తం అయ్యారు. మంత్రి రాములుతో తాజా పరిణామాలతో చర్చించారు. ఈ వ్యవహారమంతా చూస్తుంటే త్వరలోనే కర్ణాటక ముఖ్యమంత్రి స్థానంలో కొత్త నేతను చూడొచ్చని సంకేతాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో యడియూరప్పను కాదని మరొకరికి అవకాశం ఇస్తే మరోసారి సర్కార్ కూలిపోక తప్పదనే భయం బీజేపీ నేతలను వెంటాడుతోంది. మరికొన్నాళ్ల పాటు యడ్డీనే సీఎంగా కొనసాగిస్తే మేలనే అభిప్రాయం కాషాయ నాయకత్వంలో వినిపిస్తోంది. దీనిపై పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment