బెంగళూరు: కర్ణాటకలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్పపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రధాని మోదీతోపాటు యడియూరప్ప సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ఇప్పటికే ప్రకటించిన యెడియూరప్పను మళ్లీ క్రియాశీలకంగా మార్చేందుకు కమలనాథులు ప్రయత్నాలు ప్రారంభించారు. అట్టడుగు స్థాయి నుంచి పార్టీని విస్తరించి, నాలుగు పర్యాయాలు సీఎం పీఠం అధిరోహించిన నేతగా ఆయనపై ఇప్పటికీ ప్రజాభిమానం చెక్కుచెదరలేదు.
మరీ ముఖ్యంగా లింగాయత్ కులస్తుల్లో80 ఏళ్ల ఈ వృద్ధ నేతకున్న పలుకుబడి మరే ఇతర రాజకీయ పార్టీ నేతకూ లేదు. ఈ విషయాన్ని గ్రహించే ఆయన కేంద్ర నాయకత్వం రానున్న ఎన్నికల్లో ఆయన్ను ‘పోస్టర్ బాయ్’గా ఉంచి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరిగిన పలు బహిరంగ సభలు, సమావేశాల్లో ప్రధాని మోదీతోపాటు హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యెడియూరప్పపై ప్రశంసలు కురిపించడం వెనుక కారణం ఇదే.
ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడం, లింగాయత్ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడంతోపాటు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు సైతం యెడియూరప్ప అవసరం ఎంతో ఉందని రాజకీయ పరిశీలకులతోపాటు కాషాయ వర్గాలు సైతం అంటున్నాయి. రాష్ట్ర బీజేపీకి మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇష్టం లేకున్నా యెడియూరప్పనే ప్రచారంలో ముందుంచేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమవుతోందని అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన రాజకీయ విశ్లేషకుడు ఎ.నారాయణ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment