రంగంలోకి మోదీ | Narendra Modi to visit Karnataka next month | Sakshi
Sakshi News home page

రంగంలోకి మోదీ

Published Mon, Dec 25 2017 7:17 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

Narendra Modi to visit Karnataka next month - Sakshi

చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న నానుడి ప్రకారం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలను చాలా సీరియస్‌గానే తీసుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. గుజరాత్‌ పరిణామాలతో ముందే మేల్కొన్న బీజేపీ పెద్దలు ప్రచార రథాన్ని  తామే ముందుండి నడిపించాలనే నిశ్చయంతో ఉన్నారు.

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఎలాగైనా సరే అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ రాష్ట్రంలో ప్రధాని మోదీ యాత్రల ద్వారా ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వచ్చే నాలుగు నెలల వ్యవధిలో ప్రధాని మోదీ కర్ణాటకలో 15–18 యాత్రలు, సమావేశాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కారణం అక్కడి స్థానిక నేతల కంటే ప్రధాని మోదీ చరిష్మానే కారణమన్నది అందరికీ తెలిసిన విషయమే. గుజరాత్‌లో విస్తృతంగా పర్యటించిన నరేంద్రమోదీ అక్కడ పార్టీ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని, బీజేపీని విజయతీరాలకు చేర్చారు. గుజరాత్‌ పరిణామాలతో.. కర్ణాటకలో ఏ ప్రాంతాన్ని కూడా నిర్లక్ష్యం చేయరాదని బీజేపీ పెద్దలు నిర్ణయించారు.

ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు అధికార కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కోపోతున్నారని కాషాయం హైకమాండ్‌కు నివేదికలు అందుతున్నాయి. దీంతో పార్టీ పెద్దలు అమిత్‌ షా, నరేంద్రమోదీలు స్వయంగా తామే పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతలను తీసుకున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్రమోదీ రానున్న నాలుగు నెలల్లో రాష్ట్రంలో సుడిగాలి యాత్రలు చేపట్టనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 15–18 వరకు యాత్రలు, సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రచారాన్ని నడిపిస్తారు.

జనవరి 28న బెంగళూరు సభకు మోదీ
అధికార కాంగ్రెస్‌ పార్టీ విధానాలను ఎండగట్టే ఉద్దేశంతో బీజేపీ ప్రారంభించిన పరివర్తనా యాత్ర జనవరి 28 నాటికి ముగియనుంది. బెంగళూరులో భారీస్థాయిలో జరిగే ఆ సభలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ తర్వాత బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 10 రోడ్‌ షోలతో పాటు 15 వరకు సమావేశాల్లో ప్రధాని పాల్గొననున్నట్లు సమాచారం.

ఇంటెలిజెన్స్‌ సమాచారంతోనే
కాగా, కర్ణాటకలోని ప్రస్తుత పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర ఇంటలిజెన్స్‌ అధికారులతో ఇప్పటికే ఒక నివేదికను తెప్పించుకున్నట్లు సమాచారం. మోదీ పర్యటనల వల్లే మొగ్గు లభిస్తుందని అందులో పేర్కొన్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement