సాక్షి, వనపర్తి: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ నేడు తొలిసారిగా వనపర్తికి విచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 2గంటలకు జిల్లా కేంద్రానికి సమీపంలోని నాగవరానికి చేరుకుంటారు.నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, అలంపూర్ సెగ్మెంట్లనుంచి ఈ ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులను తరలించేందుకు మాజీ మంత్రి డాక్టర్ జి. చిన్నారెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.
సభా ప్రాంగణంలో 16 గ్యాలరీలు ఏర్పాటు చేయగా వీఐపీ, ప్రెస్ గ్యాలరీ మినహాయిస్తే మిగతా 14 గ్యాలరీల్లో సాధారణ కార్యకర్తలు, నాయకులకు కెటాయించారు. రాహుల్ గాంధీ వెంట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, రాష్ట్రస్థాయి నాయకులు సభకు హాజరు కానున్నారు.
ఎస్‌పీజీ పర్యవేక్షణలో నిఘా
రాహుల్‌గాంధీ ప్రచారసభ భద్రతా ఏర్పాట్లను స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ)అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజులుగా స్పెషల్‌పార్టీ దళాలు వనపర్తిలో మకాం వేశాయి. సభావేదిక, ఇతర ప్రాంతాలు, హెలీ ప్యాడ్ వద్ద డాగ్‌స్క్వాడ్‌లతో తనిఖీలు చేయించారు. అలా గే కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
లక్ష మందికి ఏర్పాట్లు : చిన్నారెడ్డి
రాహుల్ గాంధీ సభకు నాగర్‌కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి లక్ష మందిని జన సమీకరణ చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని మాజి మంత్రి డాక్టర్ జి. చిన్నారెడ్డి తెలిపారు. అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ బాద్యులతో పాటు మండలాల, పట్టణ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలను తరలిస్తున్నాము.
హెలీప్యాడ్ సిద్ధం
రాహుల్ గాంధి ఆకాశ మార్గాన హెలిక్యాప్టర్‌లో సోమవారం మధ్యహ్నాం రెండు గంటలకు వనపర్తికి చేరుకుంటారు. ఇక్కడ హెలిక్యాప్టర్ ల్యాండ్ చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. ఆదివారం హెలిక్యాప్టర్ ట్రాయల్ రన్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment