
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది నేరస్తులకు బీజేపీ టికెట్లు ఇచ్చిందన్నారు. కర్ణాటకలో గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని చుట్టూ పెట్టుకుని తమపై అవినీతి ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.
మోదీ ఇక్కడకు వచ్చి అవినీతి గురించి మాట్లాడతారని, కానీ బ్యాంకులకు రూ.30 వేల కోట్లు మోసగించి పరారైన నీరవ్‌మోదీ గురించి ఆయన మాట్లాడరని చెప్పారు. మోదీ ప్రచారం సందర్భంగా ఏదైనా వేదికపై నిలబడితే ఆయనకు ఒకవైపు యడ్యూరప్ప, మరోవైపు జైలు జీవితం గడిపిన మరో నలుగురు కనిపిస్తారన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఉద్దేశించి 10 శాతం కమిషన్ ప్రభుత్వం అని మోదీ విమర్శించిన సంగతి తెలిసిందే.
రాహుల్‌కు తప్పిన ముప్పు
రాహుల్‌కి పెనుప్రమాదం తప్పింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు రాహుల్ గురువారం ఓ విమానంలో బయలుదేరారు. ఉదయం 10.45 గంటలకు విమానంలోని ఆటోపైలెట్ మోడ్ ఒక్కసారిగా ఆగింది. దీంతో విమానం ఒక్కసారిగా గాల్లో పక్కకు ఒరిగిపోయి వేగంగా కిందకు జారిపోయింది. వెంటనే స్పందించిన పైలెట్ విమానాన్ని మాన్యువల్ మోడ్‌లోకి తీసుకొచ్చి హుబ్బలి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment