సాక్షి, ముంబై: నవీముంబైలో ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు ముందుకు కదిలేలాలేదు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఢిల్లీలో సోమవారం జరగాల్సిన ఉన్నతస్థాయి సమావేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు రద్దు చేశాయి. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్, ఇతర సీనియర్ అధికారులు హాజరు కావల్సి ఉంది. అయితే ఆకస్మాత్తుగా ఈ సమావేశం రద్దు కావడంవల్ల ఎటూ తేలలేదు. దీంతో ఎంతోకాలంగా పెండింగులో ఉండిపోయిన ప్రతిపాదిత విమానాశ్రయం పనులు మరింత జాప్యం జరిగే అవకాశం ఏర్పడింది.
15 సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టు నిర్మించాలనే అంశం తెరమీదకు వచ్చింది. 1998లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.నాలుగు వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. కానీ ఇప్పుడది తడిసి మోపెడైంది. దాదాపు వ్యయం నాలుగు రెట్లు పెరిగిపోయింది. అంటే రూ.15 వేల కోట్లకుపైగా చేరుకుంది. ఈ ప్రాజెక్టు కోసం సిటీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) 4,500 ఎకరాల స్థలం కావాలని సర్కార్‌ను డిమాండ్ చేసింది. అయితే స్థలం కోల్పోతున్న రైతులు నష్టపరిహారంగా అదనంగా 20 శాతం మంచి భూమి అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రకారం రైతులకు స్థలం అందజేయాలంటే 290 హెక్టార్లు సేకరించాల్సి ఉంది. అప్పుడే ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయి. కానీ ఇది సాధ్యం కాకపోవడంతో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన సమావేశం ఆకస్మాత్తుగా రద్దు కావడంతో మరింత జాప్యానికి దారి తీసింది.
ఈ ప్రాజెక్ట్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కేంద్ర మంత్రి శరద్ పవార్ కూడా అభిప్రాయపడ్డారు. కానీ స్థలంపై రైతులు చేస్తున్న డిమాండ్ ఈ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచే విధంగా ఉందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అంటున్నారు. బాధిత రైతులకు నష్ట పరిహారం చెల్లించే విషయమై ఈ నెల 20న రైతులతో చవాన్ చర్చలు జరిపారు. అయినా సఫలం కాలేదు. కాగా, ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొల్పనున్నట్లు వార్తలు గుప్పుమనడంతో చుట్టుపక్క గ్రామస్తులు, రైతులు తమ స్థలాల రేట్లు ఒక్కసారిగా పెంచేశారు. దీంతో ఇప్పుడు రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలంటే రైతులు చేస్తున్న డిమాండ్ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఈ ప్రాజెక్టు భవితవ్యం అంధకారంలో పడే ప్రమాదం ఉంది.
ముందుకు కదలని నవీముంబై విమానాశ్రయ ప్రాజెక్ట్
Published Wed, Sep 25 2013 5:45 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement
Advertisement