సాక్షి, ముంబై: నవీముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో నిరాశ్రయులవుతున్నవారికి పరిహారంగా ఇచ్చే ప్యాకేజీ వారికి ఆమోదయోగ్యంగా ఉంటుందని సీఎం పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. నవీముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చవాన్ విమానాశ్రయ నిర్మాణ పనుల విషయమై మాట్లాడారు. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటవుతుండడంతో పది గ్రామాల ప్రజలు నిరాశ్రయులవుతున్నారని, అయితే వారు కోల్పోయిన స్థలాలకంటే ఎక్కువ స్థలాన్ని మరో చోట ఇస్తామన్నారు. నగదు పరిహారం కూడా వారికి ఆమోదయోగ్యంగా ఉంటుందని చవాన్ చెప్పారు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల నుంచి అన్ని అనుమతులు లభించాయని చెప్పారు. దీంతో పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా గుర్తింపు పొందనుందన్నారు.
నవీముంబై విమానాశ్రయం ప్రాజెక్టు విషయమై చర్చించేందుకు నవంబరు 13వ తేదీన ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమవుతానని చవాన్ చెప్పారు. ప్రతిపాదిత నవీముంైబె విమానాశ్రయం, వర్లీ-శివ్డీ ఎలివేటెడ్ ప్రాజెక్టు, శివ్డీ-నవాశేవా సీ లింకు తదితర కీలక ప్రాజెక్టుల కారణంగా ముంబైలోని ఆర్థిక కేంద్రాలన్నీ నవీముంబైకి స్థలాంతరం అవుతాయని, దీంతో భవిష్యత్తులో దేశ ఆర్థిక రాజధానిగా నవీముంబైకి గుర్తింపు దక్కుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. అంతేకాక ఆర్థిక, వ్యాపార కేంద్రాలన్నీ నవీముంబైకి తరలిపోవడంవల్ల ముంబైలో ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుందన్నారు. ఈ ప్రాజెక్టులన్ని కార్యరూపం దాలిస్తే నవీముంబైలోని ప్రాంతాలన్నీ ఎంతో అభివృద్ధి చెందుతాయని ధీమా వ్యక్తం చేశారు. విమానాశ్రయ నిర్మాణంతో నవీముంబై మెట్రోపాలిటన్ సిటీగా అవతరిస్తుందన్నారు.
ఆమోదయోగ్యంగా ప్యాకేజీ
Published Sat, Nov 2 2013 12:16 AM | Last Updated on Tue, Oct 9 2018 4:27 PM
Advertisement
Advertisement