Navi Mumbai airport
-
నవీ ముంబై విమానాశ్రయ పనులు ఎల్అండ్టీ చేతికి...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవీకే అనుబంధ కంపెనీ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్టును ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్కు అప్పగించింది. ఇందులో భాగంగా 3.7 కిలోమీటర్ల పొడవైన రన్‌వే, డిపార్చర్, అరైవల్ టెర్మినల్, అప్రాన్ సిస్టమ్స్, ట్యాక్సీవే సిస్టమ్స్, ఎయిర్‌ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, యుటిలిటీస్ తదితర పనులను ఎల్అండ్టీ చేపడుతుంది. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ డిజైన్ పనులను జహా హాదిద్ ఆర్కిటెక్ట్స్ దక్కించుకుంది. -
‘నవీ ముంబై’.. జీవీకేదే!
చేజిక్కిన ఎయిర్‌పోర్టు కాంట్రాక్టు ♦ చివరి వరకు ప్రయత్నించిన జీఎంఆర్ ♦ ప్రాజెక్టు విలువ రూ.16,000 కోట్లు ♦ 2019 నాటికి అందుబాటులోకి.. సాక్షి, బిజినెస్ ప్రతినిధి: నవీ ముంబై ఎయిర్‌పోర్టు కాంట్రాక్టును తెలుగు రాష్ట్రానికి చెందిన జీవీకే గ్రూపు దక్కించుకుంది. రూ.16,000 కోట్ల విలువైన ప్రాజెక్టును దక్కించుకోవడానికి జీవీకే గ్రూపునకు చెందిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్(ఎంఐఏఎల్)తో పాటు జీఎంఆర్, టాటా రియల్టీ, హిరానందని డెవలపర్స్ వంటి సంస్థలు పోటీపడినా చివరకు జీవీకే, జీఎంఆర్‌లు మాత్రమే ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేశాయి. జీఎంఆర్ కంటే జీవీకే ఎక్కువ ఆదాయం ఇవ్వడానికి ముందుకు రావడంతో జీవీకేకి కాంట్రాక్టు పనులు అప్పచెప్పినట్లు సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) ప్రకటించింది. ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేయడానికి సోమవారం ఆఖరి రోజు కాగా కేవలం రెండు బిడ్లు మాత్రమే వచ్చాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ మోడల్లో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఆదాయంలో 12.60 శాతం వాటా ఇవ్వడానికి జీవీకే ముందుకు రాగా, జీఎంఆర్ 10.44 శాతం ఆఫర్ చేసింది. ఇప్పటికే జీవీకే ముంబై, బెంగళూరు ఎయిర్‌పోర్టులను, జీఎంఆర్ ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ముంబై ఎయిర్‌పోర్టు సామర్థ్యం నిడిపోవనుండటంతో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు నిర్మించాలని నిర్ణయించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నవీ ముంబైలో కొత్త ఏయిర్పోర్టు నిర్మించాలని తొలుత 1997లో ప్రతిపాదించగా, దీన్ని 2007లో ప్రభుత్వం ఆమోదించింది. అప్పటి నుంచి భూసేకరణ, పర్యావరణ అనుమతులు వంటి అనేక అవాంతరాలను ఎదుర్కొన్న ఈ ప్రాజెక్టు చివరకు సోమవారం బిడ్డింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. 2019 డిసెంబర్ నాటికీ ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జీవీకే సమర్పించిన బిడ్డింగ్‌కు ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ ఆమోదం తర్వాత అధికారికంగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సిడ్కో అధికారులు తెలిపారు. 2,867 ఎకరాల్లో 5,23,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు రన్‌వేలతో ఈ ఎయిర్‌పోర్టును జీవీకే నిర్మించనుంది. ముంబైలోని ఛత్రపతి శివాజి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణించే సామర్థ్యంతో నిర్మించారు. కానీ ఇప్పటికే ఈ ఎయిర్‌పోర్టు సామర్థ్యం 4.5 కోట్లకు చేరుకోగా, వచ్చే రెండేళ్లలో ఇది 5.5 కోట్లకు దాటుతుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ప్రస్తుత ఎయిర్‌పోర్టు నవీ ముంబైకి దూరంగా ఉన్న దృష్ట్యా నవీ ముంబైలో కొత్త ఎయిర్‌పోర్టుకు ఓకే చెప్పారు. గర్వకారణం: జీవీకే రెడ్డి నవీ ముంబై ప్రాజెక్టు దక్కించుకోవడం తమకు గర్వకారణమని, సంక్లిష్టమైన ముంబై విమానాశ్రయంలో టెర్మినల్ 2ను ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తమ సమర్ధతకు ఇది తార్కాణమని జీవీకే గ్రూప్ వ్యవస్థాపకుడు జీవీకే రెడ్డి పేర్కొన్నారు. 15 ఏళ్ల సాఫ్ట్‌లోన్: ఈ ప్రాజెక్టు మొదలు పెట్టడానికి అయ్యే ప్రీడెవలప్మెంట్ వ్యయాన్ని సిడ్కో సాఫ్ట్ లోన్‌గా ఇవ్వనుంది. రుణ కాలపరిమితిని తొలుత 11 ఏళ్లుగా నిర్ణయించగా ఇప్పుడు దాన్ని 15 ఏళ్లకు పొడిగించారు. అసలు వ్యయంతో సం బంధం లేకుండా ప్రీడెవలప్మెంట్ వ్యయాన్ని రూ. 3,500 కోట్లకు పరిమితం చేశారు. 3,420 కోట్లను 11వ ఏడాది నుంచి ప్రతీనెలా చెల్లించాలి. రూ.430 కోట్లను సిడ్కో ఈక్విటీగా పరిగణిస్తారు. -
ఎయిర్‌పోర్ట్‌కు మార్గం సుగమం!
సాక్షి, ముంబై: ప్రతిపాదిత నవీముంబై అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల స్థలాలు కోల్పోయిన బాధితులు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో అక్కడి గ్రామస్తులవల్ల ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోవడంతో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో)కు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2018 వరకు పూర్తిచేయాలని సంకల్పించినట్లు సిడ్కో ఎండీ సంజయ్ భాటియా చెప్పారు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు గ్రామస్తులు సహకరించాలని సిడ్కో రెండు నెలల కిందటే స్పష్టం చేసింది. అందుకు వారు ససేమిరా అనడంతో అడ్డంకులు ఎదురయ్యాయి. కాని కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన భూసేకరణ చట్టం ప్రకారం ఆ స్థలాలన్నింటినీ గ్రామస్తుల నుంచి బలవంతంగా తీసుకోవల్సి ఉంటుంది. అందుకు మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఇలా బలవంతంగా భూసేకరణ జరిగితే బాధితులకు సిడ్కో ద్వారా లభించే పునరావాస ప్యాకేజీ వర్తించదని అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో గ్రామస్తులు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో బాధితులతో చివరిసారిగా సిడ్కో అధికారులు చర్చలు జరిపారు. అందులో గ్రామ ప్రజలు కొంత వెనక్కి తగ్గారు. ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మొత్తం 2,268 ఎకరాల స్థలం అవసరముంది. అందులో సిడ్కో వద్ద 1,572 ఎకరాల స్థలం ఉండగా, మిగిలిన స్థలాన్ని ఆ పరిసరా ప్రాంతంలో ఉన్న 12 గ్రామాలు, 10 పల్లెల నుంచి సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో కొందరు సిడ్కో అందజేసిన ప్యాకేజీలు తీసుకుని గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ ప్యాకేజీలు, నష్టపరిహారం గిట్టుబాటుకావంటూ ఇప్పటికీ కొన్ని గ్రామాల ప్రజలు అక్కడే ఉన్నారు. చివరకు వీరి పిటిషన్‌ను కోర్టు కూడా తిరస్కరించడంతో నిర్మాణ పనులు చేపట్టేందుకు ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే.. -
విమానాశ్రయ నిర్మాణంపై సందిగ్ధం
సాక్షి, ముంబై: ఒకవైపు నవీముంబైలో విమానాశ్రయ నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించే పనిలో ఉన్న ప్రభుత్వం, మరోవైపు మడ్‌జెట్టీ సముద్రతీర ప్రాంతాన్ని మట్టితో నింపి జుహూ విమానాశ్రయంలో రన్‌వే నిర్మించే ప్రతిపాదననూ పరిశీలిస్తోంది. ఇందుకోసం తీరప్రాంతంలో స్థలాన్ని సేకరించే పనులపై అధ్యయనం నిర్వహించి నివేదిక రూపొందించే పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం జుహూ విమానాశ్రయంలో హెలికాప్టర్లు, చిన్న తరహా చార్టర్డ్ విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడ భారీ విమానాలు టేకప్, ల్యాండింగ్‌కు సరిపడేంత రన్‌వే లేదు. అందుకే సముద్రతీరంలో మట్టిపోసి భారీ రన్‌వే నిర్మిస్తే, కొత్త విమానాశ్రయం నిర్మించాల్సిన అవసరం ఉండబోదని భావిస్తున్నారు. నవీముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలంటే అనేక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. విమానాశ్రయం నిర్మించేందుకు ఎంత ఖర్చవుతుందో అంతే మొత్తం మౌలిక సదుపాయాల కల్పనకూ వ్యయం చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. నవీముంబై విమానాశ్రయ నిర్మాణం కోసం భూములను వదులుకున్న బాధితులకు నష్టపరిహారం కింద ప్రభుత్వం భారీ నష్టపరిహార ప్యాకేజీలు ప్రకటించింది. అయినప్పటికీ భూయజమానులు ఇప్పటికీ ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రతిపాదిత నవీముంబై విమానాశ్రయం పూర్తయ్యేందుకు దాదాపు రూ.15 వేల కోట్లు కావాలి. మౌలిక సదుపాయాలు కల్పించడానికి, ప్రాజెక్టు బాధితులకు నష్టపరిహారం చెల్లించడం, పునరావాసం కల్పించడానికి అదనంగా మరో రూ.10 వేల కోట్లు చెల్లించాలి. అలాగే ముంబై నుంచి ఈ విమానాశ్రయానికి చేరుకోవడానికి ట్రాన్స్‌హార్బర్ లింక్ రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు రూ.10 వేల కోట్లు ఖర్చయ్యే అవకాశాలున్నాయి. వీట న్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు బిల్డర్లు ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు అంతగా ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నవీముంబైలో కొత్త విమానాశ్రయానికి బదులుగా మడ్ జెట్టి సముద్ర తీరాన్ని మట్టితో నింపి భారీ రన్‌వే నిర్మిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని విమానయానశాఖకు ప్రభుత్వం సూచించింది. ముంబైలోని అంతర్జాతీయ (సహర్) విమానాశ్రయంపై భారాన్ని తగ్గించడానికి జుహూ విమానాశ్రయాన్ని విస్తరించాలనే ప్రతిపాదన ఇదివరకే తెరపైకి రావడం సంగతి తెలిసిందే. కొత్త విమానాశ్రయానికి బదులు జుహూ విమానాశ్రయాన్ని విస్తరించి రన్‌వే ఏర్పాటు చేయడం ఎంతో లాభదాయకమని నిపుణులు చెబుతున్నారు. అందుకు 1,140 మీటర్ల పొడవైన రన్‌వే నిర్మించేందుకు సముద్రంలో రెండువేల మీటర్ల వరకు మట్టిని నింపాల్సి ఉంటుంది. వర్షాకాల ంలో భారీ సముద్రపు అలలను దృష్టిలో ఉంచుకుని జుహూ విమానాశ్రయ రన్‌వే బాగా ఎత్తులో నిర్మించే అవకాశముంది. కొత్తగా టర్మినల్నూ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు సీఆర్‌జెడ్ (కోస్తా నియంత్రణ ప్రాంతం) నియమాలు అడ్డు వచ్చే ప్రమాదం ఉంది. భారీ అలలు వచ్చే 500 మీటర్ల పరిధిలో నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదు. కాబట్టి మడ్‌జెట్టీ తీరంలో రన్‌వేను నిర్మించాలంటే ప్రభుత్వం అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
మూడు మహా ప్రాజెక్టులకు ఓకే
న్యూఢిల్లీ: రెండు నూతన విమానాశ్రయాల నిర్మాణంతోపాటు మరొక దాని విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులను సత్వరమే చేపట్టాలని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అధ్యక్షతన బుధవారం దేశరాజధానిలో జరిగిన సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్, రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తదితరులు పాల్గొన్నారు. వాణిజ్య రాజధానితోపాటు ఇతర ప్రధాన నగరాలను అభివృద్ధి బాటలో ముందుంచేందుకు కీలక ప్రాజెక్టులు చేపట్టాల్సిన ఆవశ్యకతపై ఈ సందర్భంగా ఈ సమావేశంలో చర్చించారు. పుణే, నవీముంబైలలో కొత్త విమానాశ్రయాల నిర్మాణంతోపాటు నాగపూర్ విమానాశ్రయాన్ని విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారని ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు ఎటువంటి అడ్డంకులు లేవన్నారు. కాగా ముంబై నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు 60 కిలోమీటర్ల పొడవున రూ. 20 వేల కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి విదితమే. కాగా, చర్చిగేట్-విరార్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు కోసం నగరవాసులు మరికొంతకాలం ఎదురుచూడక తప్పదు. ఇందుకు కారణం ముంబైలో ట్రాఫిక్ స్థితిగతులపై మరొకసారి అధ్యయనం చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడమే. ఈ విషయాన్ని రైల్వే శాఖ అధికారి బుధవారం వెల్లడించారు. 60 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు రూ. 20 వేల కోట్లు ఖర్చవ్వచ్చని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ప్రాజెక్టుపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. కాగా ప్రతిపాదిత ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చ వాన్ ఈ సందర్భంగా పీఎం మన్మోహన్‌సింగ్‌కు విన్నవించారు. -
ఆమోదయోగ్యంగా ప్యాకేజీ
సాక్షి, ముంబై: నవీముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో నిరాశ్రయులవుతున్నవారికి పరిహారంగా ఇచ్చే ప్యాకేజీ వారికి ఆమోదయోగ్యంగా ఉంటుందని సీఎం పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. నవీముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చవాన్ విమానాశ్రయ నిర్మాణ పనుల విషయమై మాట్లాడారు. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటవుతుండడంతో పది గ్రామాల ప్రజలు నిరాశ్రయులవుతున్నారని, అయితే వారు కోల్పోయిన స్థలాలకంటే ఎక్కువ స్థలాన్ని మరో చోట ఇస్తామన్నారు. నగదు పరిహారం కూడా వారికి ఆమోదయోగ్యంగా ఉంటుందని చవాన్ చెప్పారు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల నుంచి అన్ని అనుమతులు లభించాయని చెప్పారు. దీంతో పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా గుర్తింపు పొందనుందన్నారు. నవీముంబై విమానాశ్రయం ప్రాజెక్టు విషయమై చర్చించేందుకు నవంబరు 13వ తేదీన ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమవుతానని చవాన్ చెప్పారు. ప్రతిపాదిత నవీముంైబె విమానాశ్రయం, వర్లీ-శివ్డీ ఎలివేటెడ్ ప్రాజెక్టు, శివ్డీ-నవాశేవా సీ లింకు తదితర కీలక ప్రాజెక్టుల కారణంగా ముంబైలోని ఆర్థిక కేంద్రాలన్నీ నవీముంబైకి స్థలాంతరం అవుతాయని, దీంతో భవిష్యత్తులో దేశ ఆర్థిక రాజధానిగా నవీముంబైకి గుర్తింపు దక్కుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. అంతేకాక ఆర్థిక, వ్యాపార కేంద్రాలన్నీ నవీముంబైకి తరలిపోవడంవల్ల ముంబైలో ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుందన్నారు. ఈ ప్రాజెక్టులన్ని కార్యరూపం దాలిస్తే నవీముంబైలోని ప్రాంతాలన్నీ ఎంతో అభివృద్ధి చెందుతాయని ధీమా వ్యక్తం చేశారు. విమానాశ్రయ నిర్మాణంతో నవీముంబై మెట్రోపాలిటన్ సిటీగా అవతరిస్తుందన్నారు. -
‘నవీముంబై’ ప్రాజెక్టుకు తొలగిన అడ్డంకులు
సాక్షి, ముంబై: ప్రతిపాదిత నవీముంబై విమానాశ్రయ ప్రాజెక్టుకు సంబంధించిన అడ్డంకులన్నీ దాదాపు తొలగిపోయినట్టే. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దేశరాజధానిలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలు సఫలీకృతమయ్యాయి. దీంతో వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో టెండర్లను ఆహ్వానించే అవకాశముంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టుపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఢిల్లీలో సోమవారం జరగాల్సిన ఉన్నత స్థాయి సమావేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఈ సమావేశం రద్దు కావడంతో ఈ ప్రాజెక్టు వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ మాదిరిగానే ఉండిపోయింది. అయితే ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చవాన్ తాజాగా జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు మార్గం సుగమమైంది. నవీముంబైలో తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు ఉప్పు భూముల వివాదం, అటవీ , పర్యావరణ శాఖ అభ్యంతరాలు, స్థానిక ప్రజలు, రైతుల ఆందోళనలు, రాజకీయ నాయకులు జోక్యం తదితర వివాదాల మధ్య చిక్కుకున్న సంగతి విదితమే. 1998లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.4,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా ఇప్పుడది దాదాపు రూ 20 వేల కోట్లకు చేరుకుంది. 2015లో ఈ ప్రాజెక్టు తొలి విడత పనులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. -
ముందుకు కదలని నవీముంబై విమానాశ్రయ ప్రాజెక్ట్
సాక్షి, ముంబై: నవీముంబైలో ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు ముందుకు కదిలేలాలేదు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఢిల్లీలో సోమవారం జరగాల్సిన ఉన్నతస్థాయి సమావేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు రద్దు చేశాయి. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్, ఇతర సీనియర్ అధికారులు హాజరు కావల్సి ఉంది. అయితే ఆకస్మాత్తుగా ఈ సమావేశం రద్దు కావడంవల్ల ఎటూ తేలలేదు. దీంతో ఎంతోకాలంగా పెండింగులో ఉండిపోయిన ప్రతిపాదిత విమానాశ్రయం పనులు మరింత జాప్యం జరిగే అవకాశం ఏర్పడింది. 15 సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టు నిర్మించాలనే అంశం తెరమీదకు వచ్చింది. 1998లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.నాలుగు వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. కానీ ఇప్పుడది తడిసి మోపెడైంది. దాదాపు వ్యయం నాలుగు రెట్లు పెరిగిపోయింది. అంటే రూ.15 వేల కోట్లకుపైగా చేరుకుంది. ఈ ప్రాజెక్టు కోసం సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) 4,500 ఎకరాల స్థలం కావాలని సర్కార్‌ను డిమాండ్ చేసింది. అయితే స్థలం కోల్పోతున్న రైతులు నష్టపరిహారంగా అదనంగా 20 శాతం మంచి భూమి అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రకారం రైతులకు స్థలం అందజేయాలంటే 290 హెక్టార్లు సేకరించాల్సి ఉంది. అప్పుడే ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయి. కానీ ఇది సాధ్యం కాకపోవడంతో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన సమావేశం ఆకస్మాత్తుగా రద్దు కావడంతో మరింత జాప్యానికి దారి తీసింది. ఈ ప్రాజెక్ట్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కేంద్ర మంత్రి శరద్ పవార్ కూడా అభిప్రాయపడ్డారు. కానీ స్థలంపై రైతులు చేస్తున్న డిమాండ్ ఈ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచే విధంగా ఉందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అంటున్నారు. బాధిత రైతులకు నష్ట పరిహారం చెల్లించే విషయమై ఈ నెల 20న రైతులతో చవాన్ చర్చలు జరిపారు. అయినా సఫలం కాలేదు. కాగా, ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొల్పనున్నట్లు వార్తలు గుప్పుమనడంతో చుట్టుపక్క గ్రామస్తులు, రైతులు తమ స్థలాల రేట్లు ఒక్కసారిగా పెంచేశారు. దీంతో ఇప్పుడు రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలంటే రైతులు చేస్తున్న డిమాండ్ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఈ ప్రాజెక్టు భవితవ్యం అంధకారంలో పడే ప్రమాదం ఉంది.