సాక్షి, ముంబై: ఒకవైపు నవీముంబైలో విమానాశ్రయ నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించే పనిలో ఉన్న ప్రభుత్వం, మరోవైపు మడ్‌జెట్టీ సముద్రతీర ప్రాంతాన్ని మట్టితో నింపి జుహూ విమానాశ్రయంలో రన్‌వే నిర్మించే ప్రతిపాదననూ పరిశీలిస్తోంది. ఇందుకోసం తీరప్రాంతంలో స్థలాన్ని సేకరించే పనులపై అధ్యయనం నిర్వహించి నివేదిక రూపొందించే పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం జుహూ విమానాశ్రయంలో హెలికాప్టర్లు, చిన్న తరహా చార్టర్డ్ విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడ భారీ విమానాలు టేకప్, ల్యాండింగ్‌కు సరిపడేంత రన్‌వే లేదు. అందుకే సముద్రతీరంలో మట్టిపోసి భారీ రన్‌వే నిర్మిస్తే, కొత్త విమానాశ్రయం నిర్మించాల్సిన అవసరం ఉండబోదని భావిస్తున్నారు.
నవీముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలంటే అనేక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. విమానాశ్రయం నిర్మించేందుకు ఎంత ఖర్చవుతుందో అంతే మొత్తం మౌలిక సదుపాయాల కల్పనకూ వ్యయం చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. నవీముంబై విమానాశ్రయ నిర్మాణం కోసం భూములను వదులుకున్న బాధితులకు నష్టపరిహారం కింద ప్రభుత్వం భారీ నష్టపరిహార ప్యాకేజీలు ప్రకటించింది. అయినప్పటికీ భూయజమానులు ఇప్పటికీ ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రతిపాదిత నవీముంబై విమానాశ్రయం పూర్తయ్యేందుకు దాదాపు రూ.15 వేల కోట్లు కావాలి. మౌలిక సదుపాయాలు కల్పించడానికి, ప్రాజెక్టు బాధితులకు నష్టపరిహారం చెల్లించడం, పునరావాసం కల్పించడానికి అదనంగా మరో రూ.10 వేల కోట్లు చెల్లించాలి. అలాగే ముంబై నుంచి ఈ విమానాశ్రయానికి చేరుకోవడానికి ట్రాన్స్‌హార్బర్ లింక్ రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు రూ.10 వేల కోట్లు ఖర్చయ్యే అవకాశాలున్నాయి. వీట న్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు బిల్డర్లు ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు అంతగా ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నవీముంబైలో కొత్త విమానాశ్రయానికి బదులుగా మడ్ జెట్టి సముద్ర తీరాన్ని మట్టితో నింపి భారీ రన్‌వే నిర్మిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని విమానయానశాఖకు ప్రభుత్వం సూచించింది. ముంబైలోని అంతర్జాతీయ (సహర్) విమానాశ్రయంపై భారాన్ని తగ్గించడానికి జుహూ విమానాశ్రయాన్ని విస్తరించాలనే ప్రతిపాదన ఇదివరకే తెరపైకి రావడం సంగతి తెలిసిందే. కొత్త విమానాశ్రయానికి బదులు జుహూ విమానాశ్రయాన్ని విస్తరించి రన్‌వే ఏర్పాటు చేయడం ఎంతో లాభదాయకమని నిపుణులు చెబుతున్నారు. అందుకు 1,140 మీటర్ల పొడవైన రన్‌వే నిర్మించేందుకు సముద్రంలో రెండువేల మీటర్ల వరకు మట్టిని నింపాల్సి ఉంటుంది. వర్షాకాల ంలో భారీ సముద్రపు అలలను దృష్టిలో ఉంచుకుని జుహూ విమానాశ్రయ రన్‌వే బాగా ఎత్తులో నిర్మించే అవకాశముంది. కొత్తగా టర్మినల్‌నూ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు సీఆర్‌జెడ్ (కోస్తా నియంత్రణ ప్రాంతం) నియమాలు అడ్డు వచ్చే ప్రమాదం ఉంది. భారీ అలలు వచ్చే 500 మీటర్ల పరిధిలో నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదు. కాబట్టి మడ్‌జెట్టీ తీరంలో రన్‌వేను నిర్మించాలంటే ప్రభుత్వం అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
విమానాశ్రయ నిర్మాణంపై సందిగ్ధం
Published Mon, Dec 30 2013 5:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement