సాక్షి, ముంబై: ప్రతిపాదిత నవీముంబై అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల స్థలాలు కోల్పోయిన బాధితులు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో అక్కడి గ్రామస్తులవల్ల ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోవడంతో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిటీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సిడ్కో)కు మార్గం సుగమమైంది.
అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2018 వరకు పూర్తిచేయాలని సంకల్పించినట్లు సిడ్కో ఎండీ సంజయ్ భాటియా చెప్పారు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు గ్రామస్తులు సహకరించాలని సిడ్కో రెండు నెలల కిందటే స్పష్టం చేసింది. అందుకు వారు ససేమిరా అనడంతో అడ్డంకులు ఎదురయ్యాయి. కాని కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన భూసేకరణ చట్టం ప్రకారం ఆ స్థలాలన్నింటినీ గ్రామస్తుల నుంచి బలవంతంగా తీసుకోవల్సి ఉంటుంది.
అందుకు మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఇలా బలవంతంగా భూసేకరణ జరిగితే బాధితులకు సిడ్కో ద్వారా లభించే పునరావాస ప్యాకేజీ వర్తించదని అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో గ్రామస్తులు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో బాధితులతో చివరిసారిగా సిడ్కో అధికారులు చర్చలు జరిపారు. అందులో గ్రామ ప్రజలు కొంత వెనక్కి తగ్గారు. ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మొత్తం 2,268 ఎకరాల స్థలం అవసరముంది.
అందులో సిడ్కో వద్ద 1,572 ఎకరాల స్థలం ఉండగా, మిగిలిన స్థలాన్ని ఆ పరిసరా ప్రాంతంలో ఉన్న 12 గ్రామాలు, 10 పల్లెల నుంచి సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో కొందరు సిడ్కో అందజేసిన ప్యాకేజీలు తీసుకుని గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ ప్యాకేజీలు, నష్టపరిహారం గిట్టుబాటుకావంటూ ఇప్పటికీ కొన్ని గ్రామాల ప్రజలు అక్కడే ఉన్నారు. చివరకు వీరి పిటిషన్‌ను కోర్టు కూడా తిరస్కరించడంతో నిర్మాణ పనులు చేపట్టేందుకు ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే..
ఎయిర్‌పోర్ట్‌కు మార్గం సుగమం!
Published Fri, Sep 26 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 2:00 PM
Advertisement
Advertisement