Cidco
-
ఎయిర్పోర్ట్కు మార్గం సుగమం!
సాక్షి, ముంబై: ప్రతిపాదిత నవీముంబై అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల స్థలాలు కోల్పోయిన బాధితులు పెట్టుకున్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో అక్కడి గ్రామస్తులవల్ల ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోవడంతో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో)కు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2018 వరకు పూర్తిచేయాలని సంకల్పించినట్లు సిడ్కో ఎండీ సంజయ్ భాటియా చెప్పారు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు గ్రామస్తులు సహకరించాలని సిడ్కో రెండు నెలల కిందటే స్పష్టం చేసింది. అందుకు వారు ససేమిరా అనడంతో అడ్డంకులు ఎదురయ్యాయి. కాని కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన భూసేకరణ చట్టం ప్రకారం ఆ స్థలాలన్నింటినీ గ్రామస్తుల నుంచి బలవంతంగా తీసుకోవల్సి ఉంటుంది. అందుకు మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఇలా బలవంతంగా భూసేకరణ జరిగితే బాధితులకు సిడ్కో ద్వారా లభించే పునరావాస ప్యాకేజీ వర్తించదని అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో గ్రామస్తులు పెట్టుకున్న పిటిషన్ను కోర్టు తిరస్కరించడంతో బాధితులతో చివరిసారిగా సిడ్కో అధికారులు చర్చలు జరిపారు. అందులో గ్రామ ప్రజలు కొంత వెనక్కి తగ్గారు. ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మొత్తం 2,268 ఎకరాల స్థలం అవసరముంది. అందులో సిడ్కో వద్ద 1,572 ఎకరాల స్థలం ఉండగా, మిగిలిన స్థలాన్ని ఆ పరిసరా ప్రాంతంలో ఉన్న 12 గ్రామాలు, 10 పల్లెల నుంచి సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో కొందరు సిడ్కో అందజేసిన ప్యాకేజీలు తీసుకుని గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ ప్యాకేజీలు, నష్టపరిహారం గిట్టుబాటుకావంటూ ఇప్పటికీ కొన్ని గ్రామాల ప్రజలు అక్కడే ఉన్నారు. చివరకు వీరి పిటిషన్ను కోర్టు కూడా తిరస్కరించడంతో నిర్మాణ పనులు చేపట్టేందుకు ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే.. -
ఇస్తారా.. లాక్కోవాలా..!
సాక్షి, ముంబై: ప్రతిపాదిత నవీముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు గ్రామస్తులకు ఇచ్చిన గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన భూసేకరణ చట్టం ప్రకారం ఆ స్థలాన్ని గ్రామస్తుల నుంచి బలవంతంగా తీసుకోనున్నారు. ఇలా బలవంతంగా భూసేకరణ జరిగితే బాధితులకు సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) ద్వారా లభించే పునరావాస ప్యాకేజీ వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో తాడో, పేడో తేల్చుకునేందుకు గ్రామస్తుల వద్ద కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మొత్తం 2,268 ఎకరాల స్థలం అవసరముంది. అందులో సిడ్కో వద్ద 1,572 ఎకరాల స్థలం ఉంది. మిగత 696 ఎక్టార్ల స్థలాన్ని ఆ పరిసర ప్రాంతంలో ఉన్న 22 గ్రామాల నుంచి సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో కొన్ని గ్రామాలు, పల్లె ప్రజలకు సిడ్కో పరిపాలన విభాగం పునరావాసం కల్పించడంతోపాటు ప్యాకేజీలు, నష్ట పరిహారం అందజేసింది. దీంతో వారు గ్రామాలను ఖాళీచేసి వెళ్లిపోయారు. కాని సిడ్కో అందజేసిన ప్యాకేజీలు, నష్టపరిహారం గిట్టుబాటుకాకపోవడంతో ఇప్పటికీ కొన్ని గ్రామాల ప్రజలు అక్కడే ఉన్నారు. దీంతో నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చివరకు సిడ్కో ఈ నెల 30 లోపు గ్రామాలను ఖాళీ చేయాలని రెండు నెలల కిందటే గడువు ఇచ్చింది. లేదంటే నియమాల ప్రకారం బలవంతంగా ఖాళీ చేయించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయినప్పటికీ గ్రామ ప్రజలు జంకడం లేదు. సమయం దగ్గరపడుతున్న కొద్దీ మరింత ఉత్కంఠ రేపుతోంది. కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ బలవంతంగా ఖాళీ చేయిస్తే ప్రభుత్వం ద్వారా పొందే ప్యాకేజీలను నష్టపోవల్సి వస్తుందని వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు గ్రామస్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.