ముంబై: ఎల్గార్ పరిషత్– మావోయిస్టుల లింకు కేసులో పరిశోధకుడు రొనా విల్సన్, ఉద్యమకారుడు సుధీర్ ధావలె దాదాపు ఆరేళ్ల అనంతరం శుక్రవారం జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. వీరిద్దరికీ ఈ నెల 8వ తేదీన బాంబే హైకోర్టు బెయిలిచ్చింది. ‘వీరు 2018 నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. వీరిపై ఇప్పటికీ ఆరోపణలను నమోదు చేయలేదు. ఈ కేసులో 300 మంది సాక్ష్యులను విచారించాల్సి ఉందని ఎన్‌ఐఏ అంటోంది. ఈ దృష్ట్యా కేసు విచారణ కనీస భవిష్యత్తులో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు’అని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
విల్సన్, ధావలెలు శుక్రవారం ఎన్‌ఐఏ కోర్టులో బెయిల్‌కు సంబంధించిన లాంఛనాలు పూర్తి చేసి తలోజా జైలు నుంచి విడుదలయ్యారు. 2017 డిసెంబర్ 31వ తేదీన పుణేలో జరిగిన ఎల్గార్ పరిషత్ సమావేశంలో చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలే ఆ తర్వాత కోరెగావ్–భీమాలో హింసాత్మక ఘటనలకు దారి తీసినట్లు కేసు నమోదైంది. వీరికి మావోయిస్టులతో సంబంధాలున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఉద్యమకారులు, విద్యావేత్తలు సహా14 మందిని అరెస్ట్ చేశారు. వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తెల్తుండే, అరుణ్ ఫెరీరా తదితర 8 మంది విడుదలయ్యారు. మహేశ్ రౌత్ పెట్టుకున్న బెయిల్‌కు వ్యతిరేకంగా ఎన్‌ఐఏ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో ఆయన జైలులోనే ఉన్నారు. స్టాన్ స్వామి అనే క్రైస్తవ ప్రబోధకుడు జైలులోనే 2021లో చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment