‘నవీ ముంబై’.. జీవీకేదే!
చేజిక్కిన ఎయిర్‌పోర్టు కాంట్రాక్టు
♦ చివరి వరకు ప్రయత్నించిన జీఎంఆర్
♦ ప్రాజెక్టు విలువ రూ.16,000 కోట్లు
♦ 2019 నాటికి అందుబాటులోకి..
సాక్షి, బిజినెస్ ప్రతినిధి: నవీ ముంబై ఎయిర్‌పోర్టు కాంట్రాక్టును తెలుగు రాష్ట్రానికి చెందిన జీవీకే గ్రూపు దక్కించుకుంది. రూ.16,000 కోట్ల విలువైన ప్రాజెక్టును దక్కించుకోవడానికి జీవీకే గ్రూపునకు చెందిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్(ఎంఐఏఎల్)తో పాటు జీఎంఆర్, టాటా రియల్టీ, హిరానందని డెవలపర్స్ వంటి సంస్థలు పోటీపడినా చివరకు జీవీకే, జీఎంఆర్‌లు మాత్రమే ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేశాయి. జీఎంఆర్ కంటే జీవీకే ఎక్కువ ఆదాయం ఇవ్వడానికి ముందుకు రావడంతో జీవీకేకి కాంట్రాక్టు పనులు అప్పచెప్పినట్లు సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) ప్రకటించింది.
ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేయడానికి సోమవారం ఆఖరి రోజు కాగా కేవలం రెండు బిడ్లు మాత్రమే వచ్చాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ మోడల్‌లో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఆదాయంలో 12.60 శాతం వాటా ఇవ్వడానికి జీవీకే ముందుకు రాగా, జీఎంఆర్ 10.44 శాతం ఆఫర్ చేసింది. ఇప్పటికే జీవీకే ముంబై, బెంగళూరు ఎయిర్‌పోర్టులను, జీఎంఆర్ ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ముంబై ఎయిర్‌పోర్టు సామర్థ్యం నిడిపోవనుండటంతో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు నిర్మించాలని నిర్ణయించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నవీ ముంబైలో కొత్త ఏయిర్‌పోర్టు నిర్మించాలని తొలుత 1997లో ప్రతిపాదించగా, దీన్ని 2007లో ప్రభుత్వం ఆమోదించింది.
అప్పటి నుంచి భూసేకరణ, పర్యావరణ అనుమతులు వంటి అనేక అవాంతరాలను ఎదుర్కొన్న ఈ ప్రాజెక్టు చివరకు సోమవారం బిడ్డింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. 2019 డిసెంబర్ నాటికీ ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జీవీకే సమర్పించిన బిడ్డింగ్‌కు ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ ఆమోదం తర్వాత అధికారికంగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సిడ్కో అధికారులు తెలిపారు. 2,867 ఎకరాల్లో 5,23,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు రన్‌వేలతో ఈ ఎయిర్‌పోర్టును జీవీకే నిర్మించనుంది. ముంబైలోని ఛత్రపతి శివాజి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణించే సామర్థ్యంతో నిర్మించారు. కానీ ఇప్పటికే ఈ ఎయిర్‌పోర్టు సామర్థ్యం 4.5 కోట్లకు చేరుకోగా, వచ్చే రెండేళ్లలో ఇది 5.5 కోట్లకు దాటుతుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ప్రస్తుత ఎయిర్‌పోర్టు నవీ ముంబైకి దూరంగా ఉన్న దృష్ట్యా నవీ ముంబైలో కొత్త ఎయిర్‌పోర్టుకు ఓకే చెప్పారు.
గర్వకారణం: జీవీకే రెడ్డి
నవీ ముంబై ప్రాజెక్టు దక్కించుకోవడం తమకు గర్వకారణమని, సంక్లిష్టమైన ముంబై విమానాశ్రయంలో టెర్మినల్ 2ను ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తమ సమర్ధతకు ఇది తార్కాణమని జీవీకే గ్రూప్ వ్యవస్థాపకుడు జీవీకే రెడ్డి పేర్కొన్నారు.
15 ఏళ్ల సాఫ్ట్‌లోన్: ఈ ప్రాజెక్టు మొదలు పెట్టడానికి అయ్యే ప్రీడెవలప్‌మెంట్ వ్యయాన్ని సిడ్కో సాఫ్ట్ లోన్‌గా ఇవ్వనుంది. రుణ కాలపరిమితిని తొలుత 11 ఏళ్లుగా నిర్ణయించగా ఇప్పుడు దాన్ని 15 ఏళ్లకు పొడిగించారు. అసలు వ్యయంతో సం బంధం లేకుండా ప్రీడెవలప్‌మెంట్ వ్యయాన్ని రూ. 3,500 కోట్లకు పరిమితం చేశారు. 3,420 కోట్లను 11వ ఏడాది నుంచి ప్రతీనెలా చెల్లించాలి. రూ.430 కోట్లను సిడ్కో ఈక్విటీగా పరిగణిస్తారు.