సాక్షి, అమరావతి: రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మాజీమంత్రి అజిత్ సింగ్ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దివంగత అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేంద్ర మంత్రిగా అజిత్ సింగ్ రైతులకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్(82) గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన కరోనా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖనాయకుడైన అజిత్ సింగ్ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఏప్రిల్ 20న కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షిణించింది. గురువారం అజిత్ సింగ్ ఆరోగ్యం పరిస్థితి పూర్తిగా విషమించటంతో మృతి చెందినట్లు ఆయన కుమారుడు, మాజీ ఎంపీ జయంత్ చౌదరి ట్విటర్‌లో పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ సంతాపం
కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు, చౌదరి అజిత్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. దివంగత అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.పలు దఫాలు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను చేపట్టిన అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారని, రైతునేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సీఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రాజకీయ ప్రక్రియకు అజిత్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతు పలికిన వారి జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తించుకుంటారని సీఎం కేసీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment