కాంగ్రెస్ ఓ మహాసముద్రం | Congress is an Ocean | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ఓ మహాసముద్రం

Published Tue, Mar 25 2014 3:30 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ ఓ మహాసముద్రం - Sakshi

కాంగ్రెస్ ఓ మహాసముద్రం

గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్:కాంగ్రెస్ మహాసముద్రం లాంటిదని కేంద్ర మంత్రి చిరంజీవి అభివర్ణించారు. కుళ్లూ, చెత్తా ఒడ్డుకు చేరుకుంటాయని, సముద్రం మాత్రం పవిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన విషయంలో ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌పై దుష్ర్పచారం చేశాయనీ, నిజాలు అందరికీ తెలిపి పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. బస్సుయాత్రలో భాగంగా సోమవారం గుంటూరు నగరానికి చేరుకున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు గుంటూరు జీటీ రోడ్డులోని సన్నిధి ఫంక్షన్ హాల్‌లో జరిగిన జిల్లా, నగర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువతరానికి అవకాశం ఇస్తుందనీ, యువత వినియోగించుకోవాలని సూచించారు.
 
నిఖార్సయిన వాడ్ని కాబట్టే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా..
తాను నికార్సయిన వ్యక్తిని కాబట్టే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నానని చిరంజీవి చెప్పారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ బీసీలు, దళితులను ముఖ్యమంత్రులనుచేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోనే అందరికీ సమానావకాశాలుంటాయని, సామాజిక న్యాయం జరుగుతుందన్నారు.
 
కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లే విభజన సాకుతో పార్టీని ఎక్కువగా బలహీన పరచారని, కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. స్టాలిన్ సినిమాలోని డైలాగులు చెప్పి కార్యకర్తలను ఉత్తేజ పరిచేందుకు ప్రయత్నించారు.
 
కాంగ్రెస్ తప్పులేదని చెప్పండి..
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసం కాంగ్రెస్‌పార్టీ చేసిన పనులను ఏకరవు పెట్టారు. రాష్ట్ర విభజనపై టీడీపీ, వైఎస్సార్ సీపీలు ఇచ్చిన లేఖల ప్రతులను చూపించారు. వాటిని ఇంటింటికీ చూపించి విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పులేదనే విషయాన్ని వివరించాలని కార్యకర్తలను కోరారు.
 
గుంటూరు మిర్చి ఘాటు, పల్నాటి పౌరుషాన్ని చూపించి ప్రాంతీయ పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మస్తాన్‌వలి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనపడితే రాష్ట్రం బలహీనపడినట్లేనన్నారు. బడా వ్యాపారవేత్తలు పార్టీ ముసుగులు ధరించి వస్తున్నారని, వారి ఉచ్చులో ఇరుక్కోవద్దని కోరారు.
 
కేంద్ర మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ నరరూప రాక్షసుడు నరేంద్ర మోడీతో చంద్రబాబు జతకట్టారని, ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు.వ్యాపారులను టీడీపీలోకి చేర్చుకోవడంపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్టీ నడుతున్నారా వ్యాపార సంస్థ నడుపుతున్నారా అంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు.
 
 కాంగ్రెస్‌లోనే కొనసాగుతా..
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నాలుగు రోజులుగా సందిగ్ధంలో ఉన్న తాను తన కుమార్తె ఇచ్చిన నైతిక స్థైర్యంతో స్థిర నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.సమావేశంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, మాజీ మంత్రులు కాసు కృష్ణారెడ్డి, కొండ్రు ముర ళి, ఎమ్మెల్సీలు సింగం బసవపున్నయ్య, మహమ్మద్ జానీ, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement