నిలబడి నిరసన తెలిపిన చిరంజీవి
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై రాజ్యసభలో సీమాంధ్ర సభ్యుల నిరసన కొనసాగుతోంది. కేవీపీ రామచంద్రరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్ చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కొనసాగించారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు చిరంజీవి, జేడీ శీలం, కావూరి సాంబశివరావు తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. టి. సుబ్బిరామిరెడ్డి కూడా తన స్థానంలోనే నిలబడ్డారు. సీమాంధ్ర సభ్యుల ఆందోళనతో పెద్దల సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
సభను దారికి తెచ్చిన తర్వాతే చర్చ చేపట్టాలని చైర్మన్ను బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు కోరారు. కేంద్ర మంత్రులు నిలబడి నిరసన తెలుపుతుంటే సభను ఎలా నడిపిస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యులు కాని కేంద్ర మంత్రి సభలో నిరసన ఎలా తెలుపుతారని బీజేపీ నేత అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. కాంగ్రెస్ డ్రామాలాడుతోందని మరో బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. కేంద్ర మంత్రులే బిల్లు పెడతారు, అడ్డుకుంటారని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన రాపోలు ఆనంద భాస్కర్ రెండు చేతులు జోడించి నమస్తూ తన స్థానంలో నిలుచున్నారు. సీమాంధ్ర సభ్యుల నిరసన కొనసాగడంతో సభను గంటపాటు వాయిదా వేశారు.