సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేట్‌లోని లాల్ బంగ్లాలో యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రులు, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీనటుడు చిరంజీవి కలిసి ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాఘవేంద్రరావు, మాజీ క్రికెటర్ అజారుద్దీన్, పుల్లెల గోపిచంద్, క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ వ్యవస్థాపకులు కంచర్ల సుధాకర్, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్‌ను ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ హెల్త్ హబ్ సిటీగా మారుతోందని కొనియాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ఒక టీచర్ అని, అది మనకు ఎన్నో పాఠాలను నేర్పుతోందన్నారు. జీవితంలో ఎప్పుడూ నెగెటివిటీ ఉండొద్దు కానీ కరోనా విషయంలో నెగెటివ్ ఉండాల్సిందేనన్నారు. పట్టణాల్లో కరోనా బాగా విజృంభించిందని, గ్రామాల్లో కరోనా ప్రభావం అంతగా లేదన్నారు. పట్టణాల్లో జీవనం, జీవన విధానం దగ్గరదగ్గరగా ఉందని, రాబోయే రోజుల్లో గాలి వెలుతురు వచ్చేలా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
‘గాలి వెలుతురు రాకపోతే అది ఇల్లే కాదు. ఇంటికి సౌందర్యమా, సౌకర్యమా ఏది ముఖ్యమో ఆలోచించుకోవాలి. సౌకర్యం ఉంటేనే ఇల్లు సౌందర్యంగా ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. శారీరక శ్రమ చేయాలి. పిజ్జా బర్గర్ విదేశాల్లో అవసరం. విదేశాల్లో పనికొస్తాయి. మనకు ఆ తిండి పనికి రాదు. మన సంస్కృతి, మన బాషా, మన కట్టుబాట్లు అన్ని పాటించాలి. మనం ఏ స్థాయిలో ఉన్న మన డ్రెస్సు, అడ్రెస్సు మారకూడదు’. అని వ్యాఖ్యానించారు.
నగరంలో ఇన్ని డైయాగ్నోస్టిక్స్ ఉన్నప్పటికీ అత్యాధునికమైన, అడ్వాన్స్ టెక్నాలజీ యోధ లైఫ్ లైన్‌లో ఉన్నాయని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. తెలంగాణలో ఆరోగ్యానికి పెద్దపీట వేసేందుకు మల్టీ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేద వారికి వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వం తరపున తమకు అన్ని సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాల్లో కూడా యోధ లైఫ్ లైన్ విస్తరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు కంచర్ల సుధాకర్ 25 లక్షల విరాళం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment