‘అమ్మమ్మా.. ఎక్కడ వున్నావ్?’ అంటూ ఇంట్లోకి వచ్చి మా అమ్మ గదిలోకి దూరింది బిందు. మా మేనకోడలు. ఇంట్లో మా అమ్మ లేకపోయేసరికి గదిలో నుండి బయటకు వస్తూ ‘ఇదేంటి మామయ్యా ఈ బాక్స్ చాలా కొత్తగా వుంది.. చాలా వెరైటీగా కూడా వుంది?’ అంది మా అమ్మ గదిలోని కొత్త టిఫిన్‌బాక్స్‌ను చూపిస్తూ. ‘ఓహ్ అదా.. టిఫిన్‌బాక్స్‌ల నోము అనీ కొత్త కాన్సెప్ట్.. ఈ మధ్యే మా అపార్ట్‌మెంట్‌లో మామ్మలు మొదలుపెట్టిన కొత్త నోము. రోజూ ఈవెనింగ్ మాకు ఇది మాములే’ అన్నాను.‘టిఫిన్‌బాక్స్‌ల నోమా.. అదేంటి కొత్తగా? లక్ష పసుపు, గరిస ధాన్యం ఇలాంటి నోముల పేర్లు విన్నాను. కానీ ఈ టిఫిన్‌బాక్స్‌ల నోము ఏమిటి మామయ్యా ఎప్పుడు వినలేదు?’ అంది.
నేను నవ్వుతూ ‘ఏముంది.. లేటెస్ట్‌గా మా అపార్ట్‌మెంట్‌లో మీ అమ్మమ్మ వాళ్ళ బ్యాచ్ వుంది కదా! వాళ్ళు కనుక్కున్న కొత్త నోము. ముసలమ్మలు అందరికీ ఆటవిడుపు. ఇంట్లో మీ అత్తలాంటి కోడళ్ళకు పని పొదుపు. దేముడిని బట్టి పాత నోములు. అవసరాన్ని బట్టి కొత్త నోములు. నోములలో ఎవల్యూషన్.. అదే నీ భాషలో చెప్పాలి అంటే కొత్త వర్షన్ అన్న మాట’ అన్నాను.‘ఇందులో ఏదో చిన్న తేడా కొడుతోంది.. నాకు డౌటే! ఇదేదో నీ స్కీమ్‌లాగే వుంది. డీటైల్డ్‌గా చెప్పు మామయ్యా..’ అంది బిందు ఆత్రుతతో.
‘సరే.. ఎలాగూ మీ అమ్మమ్మ లేదు. పెదమామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కాబట్టి ఈ బాక్స్‌లో ఈరోజు వెరైటీ ఏముందో తింటూ మాట్లాడుకుందాం’ అంటూ బాక్స్ ఓపెన్ చేశాను.‘ఆలూ పరాఠా విత్ భేండీ కా సాలన్.. బై 506’ అని చిన్న పేపర్ మీద రాసిన స్లిప్‌తో పాటు 4 ఆలూ పరాఠాలు, కూర వేడిగా వుండటంతో నేనూ, బిందు ఒక పట్టుపట్టాం. ఎప్పుడూ వాళ్ళమ్మ వండే చపాతీ, బంగాళదుంపల కూర తినీ మొహం వాచిందో ఏమో నాలుగు పరాఠాల్లో మూడు తనే తినేసింది. నోము వెనుక కథ చెప్పేదాక వదల్లేదు. నాకూ ఆ టిఫిన్‌బాక్స్‌ల నోము వ్రత కథ పుట్టుకను వివరించక తప్పలేదు.
కార్తిక మాసం, శనివారం.. తెల్లవారి 5.00 కావస్తోంది. చలి కాస్త ఎక్కువగా వుండడంతో నేను చాలా వేగిరంగా అడుగులు వేస్తున్నాను. ఇంకా 6 ప్రదక్షిణలు వున్నాయి. మొత్తం 9 అయితేనే శనీశ్వరున్ని దర్శించాలంట! నేను 5వ ప్రదక్షిణలో వుండగా ‘హే భగవాన్ నా కష్టాన్ని తీర్చు. నీకెలా చెప్పుకోవాలి.. నాదేమీ పెద్ద కష్టం కాదు. నా కోడలు మనసు మార్చు చాలు. లేదా నా చేయి బాగుచెయ్. నాకింకేమీ వద్దు.
నా భర్తకు కడుపు నిండా ఇంత పెట్టలేని నా బతుకూ ఒక బతుకేనా? ఛ.. భగవాన్ నా కష్టాన్ని తీర్చు’ అంటూ ఒక ముసలి స్త్రీ మనసులో కోరుకుంటున్నాను అనుకుంటూ బయటకే మాట్లాడుతూ భక్తిగా ప్రదక్షిణలు చేస్తోంది.నేను ఆమెకు దారిచ్చి ‘ఎవరో పాపం’ అనుకుంటూ వెనుకకు తగ్గాను. అప్పుడే ఎవరో గుడి వరండాలో లైట్ వేయడంతో చూశాను. ఆవిడ మా అపార్ట్‌మెంట్‌లో కిందటేడాది వచ్చిన సిక్కుల మామ్మగారు. అయ్యో ఈవిడకు ఇన్ని కష్టాలా! చాలా మంచి ఫ్యామిలీ. వాళ్ళ అబ్బాయికి ఎదో బ్యాంకులో ఉద్యోగం అని విన్నాను.
సర్లే తాటిచెట్టుకు కల్లు, కష్టాలు లేని ఇల్లు లేకుండా ఎక్కడైనా ఉంటాయా అనుకొని నా ప్రదక్షిణలు ముగించి నువ్వుల నూనె అభిషేకం కోసం కోవెలలోకి ప్రవేశించాను. లోపల కనీసం అయిదారుగురు ముసలమ్మలు మా అపార్ట్‌మెంట్ వాళ్ళే వున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. అందరినీ చిన్న నవ్వుతో పలకరించి నా పూజ ముగించి ఇంటి దారి పట్టాను.
ఇంట్లో అమ్మ.. మా ఆవిడ పెట్టిన పెరుగన్నం తినకుండా, టిఫిన్‌బాక్స్‌లో మా చిన్నోడు వదిలేసిన రెండు ఇడ్లీలను తిని బ్రేక్‌ఫస్ట్ కానిచ్చింది. లోపల వంటగదిలో గిన్నెలు మాట్లాడుకుంటున్నాయి. ఏదో జరిగిందని నాకు చూచాయగా తెలుస్తోంది. ఎస్.. మా ఇంట్లో మ్యూజిక్ స్టార్ట్ అయింది.
కాకపోతే ఇద్దరూ వాయించేది నన్నే! ఏం జరిగిందని ఎవరిని ముందు అడగాలో తెలియక ‘టిఫిన్ పెటు’్ట అన్నాను మా శ్రీమతితో.‘ఆవిడ వదిలిన అన్నం తినేయండి.. ఈ రోజు టిఫిన్ చేయలేదు. చేయను కూడా!’ వంటింట్లోంచి గిన్నెల శబ్దాల మధ్య నుంచే సమాధానం. అప్పుడప్పుడు మా ఆవిడ భీష్మ ప్రతిజ్ఞ సారీ మంగమ్మ శపథం చేస్తుంది.‘ఇదిగో చిన్నా.. మీ నాన్నకు ఈ పెరుగన్నం ఇవ్వరా’ అని మా అమ్మ, మా చిన్నోడికి హుకుం జారీచేసింది. మరికొంతసేపు వుంటే తుఫాను తీరం దాటేటట్టు వుందని, నాలుగు ముద్దలు పెరుగన్నం తిని చల్లగా ఆఫీస్‌కు జారుకున్నాను.
∙∙
ఆఫీస్‌లో అటెండర్ 11 గంటలకు టీతో పాటు ఒక పాంఫ్లెట్ కూడా ఇచ్చాడు. ‘టేస్ట్ అఫ్ ఇండియా’ న్యూ స్టార్టప్ అట. నలుగురు కుర్రాళ్ళు సాధించిన విజయం. కరోనా సమయంలో మార్కెట్లు, హోటళ్ళు తెరుచుకోనప్పుడు, ప్రజలంతా ఇళ్ళలోనే వివిధ రుచులకు యూట్యూబ్ ద్వారా అలవాటు పడినప్పుడు, వారు చదివింది ఏంబీఏ అయినా రోజుకో రాష్ట్ర రుచిని చాలా సింపుల్‌గా తక్కువ మొత్తానికి మన ఇంటికే అందించిన స్టార్టప్ అది.
ఈ మధ్య మా ఆఫీస్‌లో చాలామంది దీని గురించి మాట్లాడుకోవడం చూశాను. ఇంట్లో క్యారేజ్ టైమ్‌కి అవకపోతే ఆర్డర్ ఇస్తే అర్ధగంటలో ఆఫీస్‌కే భోజనం, అలాగే స్కూల్ పిల్లలకు కూడా వారి స్కూల్‌కే మధ్యాహ్నం క్యారేజ్ పంపే సౌకర్యం. చెప్పానుగా ఈ రోజు నుంచి మా ఇంట్లో మా అమ్మకి, మా ఆవిడకి సంగీత సాధన అని, ఆ వాయిద్యం నేనే అని! అందుకే ఎలాగూ నాకు ఈ రోజు క్యారేజ్ లేదు. ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ చేశాను.
ఈరోజు తమిళనాడు ఫుడ్ అంట.. ఇంకేం సాంబార్ కన్ఫర్మ్ అనుకున్నా. సరిగ్గా ఒంటి గంటకి ఫుడ్ వచ్చింది. నేను ఊహించిన దానికన్నా చాలా బాగుంది. ఒక మనిషికి సరిగ్గా సరిపోతుంది. పైగా చివర్లో పెరుగు అన్నం కూడా ఇచ్చాడు. రోజూ మా ఆవిడ వంటలకు అలవాటుపడ్డ నాకు ఈ రోజు చిన్న రిలీఫే! సాయంత్రం ఇంటికి వెళుతూ ఎందుకైనా మంచిదని మల్లెపూలు, దగ్గు మందు రెండూ కొనుక్కెళ్ళా.మొదటిది మా ఆవిడ అడగనిది.. రెండోది మా అమ్మ మొన్నే అడిగినది!
మా ఇంటి ముందు ఎప్పటిలాగే కారిడార్లో మీటింగ్ జరుగుతోంది.. మా చిన్నోడు దానిని ‘నానమ్మ అసెంబ్లీ’ అంటాడు. అది మా ఇంటి దగ్గర అవుతుంది కాబట్టి అందులో మా అమ్మ సీఎం అంట. మా ఎదురింటావిడ ఫుడ్ మినిస్టర్ అంట. మిగతా అందరికీ ఏవేవో మినిస్ట్రీలు ఇచ్చాడు. నిజమే.. ప్రతిరోజు సాయంత్రం నాలుగు నుంచి 7.30 వరకూ ఈ బామ్మల మీటింగ్ ఎందుకంటే ఏడున్నరకి అదేదో దీపం సీరియల్ వుంది. వీళ్ళకు అదే సభా వాయిదా మంత్రం.వారిని దాటి ఇంట్లోకి వెళ్ళానో లేదో మా ఆవిడ తన చేతిలోని చీపురును కిందపడేసి ‘బయట సభాప్రాంగణాన్ని, అదే మన కారిడార్‌ని మీటింగ్ అయిపోయిన తరువాత మీ అమ్మను తుడవమనండి. ఇల్లు అంతా తుడిచేశాను’ అంటూ విసురుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది.
‘ఏంటి ప్రాబ్లం?’ అని డైరెక్ట్‌గానే అడిగేశాను నేను తెచ్చిన మల్లెపూలను ఆమె చేతికిస్తూ! మా ఆవిడ ఆ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నట్లు వెంటనే ‘ఆవిడగారికి రోజూ చపాతీలు చెయ్యాలట. దానికో కూర మళ్ళీ వేరేగా! మీరు, పిల్లలు చపాతీలు ఎప్పుడో గాని తినరు. కాబట్టి మీకొక కూర.. నా వల్ల కాదు బాబోయ్! ఒక్క రోజులో ఎన్ని వంటలు? నా బతుకంతా వంటిల్లే. కనీసం చపాతీ పిండి కలిపి సాయం చేసేవాళ్ళు లేరు. పోనీ మొన్న ఒక 6 చపాతీలు చేసి ఆ రోజు మూడు మీ అమ్మకు పెట్టి, మిగిలిన ఆ మూడిటిని నిన్న పెడితే ‘ఛీ.. ఛీ.. చల్లగా వున్నాయి. నేను తినను. ఇవి నాకొద్దు’ అంది. ప్రతిరోజూ చేయడం నా వల్ల కాదు. మీరా బయటి నుంచి తీసుకురారు. ఏదయినా అంటే కరోనా అంటారు.
పోనీ ఆవిడను చేసుకోమంటే ‘సరే ఈరోజుకి అన్నం తినేసా’్త అంటుంది. అంటే కేవలం నాకు పని కల్పించడం కోసమేనా ఆవిడ వున్నది’ అంటూ దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్ పెద్ద డైలాగ్‌లాగ ఆగకుండా చెప్పింది. నేనింకా ఉదయం తిన్న సాంబార్ రుచి గురించి చెప్పి, అలా చేయమందామని అడుగుదాం అనుకున్నా. ఈ పరిస్థితులలో అడగ గలనా? నో.. నెవర్! తెలివిగా మాట్లాడటమో లేక నోరు మూసుకుని కూర్చోవడమో ఎదో ఒకటి తెలిసివుండాలి అనే వాట్సాప్ సామెత గుర్తుకు వచ్చి నేను ఆ రెండో దానికే ఓటు వేశాను. రాత్రికి మా అమ్మకు టాబ్లెట్ ఇస్తూ ‘అమ్మా.. ఈరోజు గుడికి ఆ పంజాబీ అంటీ, మన అపార్ట్‌మెంట్‌లోని ఇంకొందరు బామ్మలు కూడా వచ్చారు’ అని చెప్పాను.
‘ఓహ్ అదా! ఈ కార్తిక మాసంలో త్రయోదశి నాడు ఆ శనీశ్వరుని అభిషేకిస్తే కష్టాలన్నీ తొలగి పోతాయని ఎవరో స్వామిజీ సుశీలమ్మ గారికి చెప్పారట. ఆవిడ ఆ వీడియోను వాట్సాప్‌లో పంపారు. అందుకే అందరూ వెళ్ళారు. నేనే తెల్లవారి లేవలేక వెళ్ళలేదురా. అయినా నాకేం కష్టాలున్నాయని? నువ్వు వున్నావు కదరా చూసుకోవడానికి’ అంది. ప్రేమతో కూడిన రాగం అది.‘వాళ్లకు మాత్రం వచ్చిన కష్టమేంటమ్మా? పిల్లలు సెటిల్ అయ్యారు. పెళ్ళిళ్ళు చేశారు. ఇల్లూ వాకిలీ సమకూర్చుకున్నారు కదా’ అన్నాను.మా అమ్మ ఒక నవ్వు నవ్వి ‘వారిది కాసుల కష్టం కాదురా.. కడుపు కష్టం’ అంది. ‘కడుపు కష్టమా? అదేమిటమ్మా.. హయిగా అందరూ అన్నీ వండుకొని తింటున్నారు, లేకపోతే బయటి నుంచి తెప్పించుకొని మరీ తింటున్నారుగా’ అన్నాను.
‘ఒరే బుజ్జీ.. మేము అన్నీ తినలేమురా! అందరికీ బీపీలు, షుగర్‌లు. మా తిండి వేరు, మా రుచులు వేరు. ఎదో రోజూ రాత్రి ఏడింటికి ఒక రెండు వేడి వేడి చపాతీలు లేదా పుల్కా.. చాలు రా! కానీ దానికే మేము నోచుకోవడం లేదు’ అంటూ తనను కూడా కలిపి చెప్పింది.
నాకు అర్థమయింది. దగ్గు మందు కొద్దిగా గ్లాసులో పోసి ఇచ్చాను. తాగింది. ‘సరే.. మరి ఆ పంజాబీ అంటీ బాధేంటమ్మా..’ అడిగాను.
‘ఓహ్ అదా! ఆ పంజాబీ వాళ్ళ కోడలు.. మన తెలుగు పిల్ల. వాళ్ళ అబ్బాయిది ప్రేమ పెళ్ళాయే! వారికా రెండు పూటలా చపాతీలు లేనిదే ముద్ద దిగదు. పోనీ ఆవిడే చేసుకుందామనుకుంటే ఆమె చేతికి తిమ్మిర్లు. చేసుకోలేదు. ఆ పిల్లకేమో ఉద్యోగం. రాత్రి ఏడింటికి గానీ ఇల్లు చేరదు.
ఈసురోమంటూ ఇల్లు చేరేసరికే ఉన్న ఓపిక నశిస్తుంది. దాంతో ఉదయం చేసినవాటితోనే సరిపెట్టేస్తుంది. అలా ఆ మొగుడూపెళ్ళాలు నోటికింత నచ్చిన తిండి దొరకక బాధపడుతున్నారు. ఆలూమగలు ఉద్యోగం చేయనిదే గడవని జీవితాలు.. ఏమిటో ఈ జీవితాలు! అన్నీ వున్నాయి.. కానీ..’ అంటూ నిస్పృహతో కూడిన నిట్టుర్పు విడిచింది అమ్మ.‘ఇక అక్కడ వుండలేక బయటకు వచ్చేశాను. నాకు అర్థమయింది ఏమిటంటే.. దాదాపు ప్రతి ఇంట్లో మా ఇంటి ప్రాబ్లమే అని. ఉద్యోగం నుంచి వచ్చిన కోడళ్ళు తమకెవరైనా ఒక ముద్ద పడేస్తే తిని పడుకుందాం అనుకుంటారు. మరి అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మల చిన్న ఆశతో కూడిన అవసరం ఎలా తీరాలి? అని ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించాను.
ఉదయం తిన్న సాంబారు.. టేస్ట్ అఫ్ ఇండియా.. ఏంబీఏ కుర్రాళ్ళు.. కలిస్తే రోజుకొక వెరైటీ భోజనం! అంతే ఒక ఆలోచన.. నా మెదడులో ఫ్లాష్ లైట్‌లా వెలిగింది.తెల్లవారి మా అమ్మను వాకింగ్‌కి తీసుకెళ్ళి, నా ప్లాన్ మొత్తం చెప్పాను. మా అమ్మ సన్నగా నవ్వి, ‘బాగుంది కానీ వర్కవుట్ అవుతుంది అంటావా?’ అంది.మళ్ళీ తనే ‘సరే చెప్పిచూస్తాను. నిన్న మా సభ ఈ రోజు ఉదయానికి వాయిదా పడింది. అందులో ఈ బిల్లు ప్రవేశపెడతాను. సభ్యుల ఆమోదంతో శాసనంగా మారితే ఇక మా పంట .. సారీ వంట పండినట్టే. మా కడుపు నిండినట్టే’ అంది నవ్వుతూ.ఆఫీసుకు వెళ్ళానేగానీ మనసులో ఒకటే ఆలోచన.. మా బామ్మలు నా ఐడియాకి ఎలా రియాక్ట్ అవుతారో అని. అయినా ఇందులో పెద్ద లాజిక్ లేదు.
మా అపార్ట్‌మెంట్‌లో 14 ఫ్లాట్స్ ఉన్నాయి. దాదాపు ప్రతి ఇంట్లో 60 దాటిన వాళ్ళు వున్నారు. వాళ్ళందరికీ షుగర్, బీపీలున్నాయి. సో వాళ్ళకు రాత్రి తప్పనిసరిగా పుల్కానో చపాతీనో కావాలి. ఎవరూ రాత్రి అన్నం తినరు. కొందరి కోడళ్ళకు చేయడం కుదరదు. మరికొందరికి పొదుపుతో కూడిన బద్ధకం. దీంతో ఆ అత్తలకు అలక. కోడళ్ళు వినక కుటుంబాలన్నీ గతుకుల రోడ్డులో నడక. కాబట్టి నా ప్లాన్ ప్రకారం ఈ కారిడార్ అసెంబ్లీలో సభ్యులు అందరూ ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు రోజుకొకరి ఇంట్లో కలుస్తారు. అందరూ కలిసి నచ్చిన వంటను చేసుకుంటారు. ఒకరికొకరు సాయం.. పర్యవేక్షణ.. 14 టిఫిన్‌బాక్సుల్లో.. ఇంట్లో కనీసం ఇద్దరికి సరిపోయేలా పెట్టివ్వటం, హోస్ట్ చేసిన వారింట్లో అందరికీ సరిపోయేలాగా వండుతారు కాబట్టి వారికీ మరి రాత్రి వండుకొనే సమస్య ఉండదు.
ఇక ఏ కోడలూ తన అత్తమామలకు ప్రత్యేకంగా రాత్రి టిఫిన్ చేసిపెట్టాల్సిన అవసరం ఉండదు. బయట నుంచి తీసుకురానక్కర్లేదు. సాయంత్రం భర్తతో సరదాగా షాపింగ్ చేసుకోవచ్చు, షికారుకెళ్ళొచ్చు. లేటుగా ఇంటికి రావచ్చు. పెద్దలకు రోజుకొక వెరైటీ.. బామ్మలు అందరికీ కాలక్షేపం.. డిగ్నిటీ అఫ్ లేబర్! తను చేసిన వెరైటీని మొత్తం అపార్ట్‌మెంట్‌లో వాళ్ళు మెచ్చుకుంటే అదొక ఆనందం, గౌరవం. ఇంటి ఫుడ్ కాబట్టి అందరికీ ఆరోగ్యం! చివరకు ‘రోగీ అదే కోరాడు.. వైద్యుడూ అదే ఇచ్చాడు’ అనే సామెతలా.. అంతే సింపుల్!
∙∙
ఆఫీస్ నుండి వెళుతూ ‘ఒకవేళ నా ఐడియా శాసనంగా మారితే ఈ 14 టిఫిన్‌బాక్స్‌లు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం’ అనుకుంటూ ఒక గిఫ్ట్‌షాప్‌లోకి వెళ్ళాను. అక్కడ అప్పటికే మా అపార్ట్‌మెంట్ రావుగారు వచ్చి టిఫిన్‌బాక్స్ సెక్షన్‌లో బాక్స్‌లు వెతుకుతూ కనపడ్డారు. ‘ఏమోయ్.. రఘూ.. రా.. రా.. ఇద్దరికి సరిపడా టిఫిన్ పట్టే 14 టిఫిన్‌బాక్స్‌లు కావాలోయ్. సెలెక్ట్ చేయలేకపోతున్నాను. సరైన సమయానికి వచ్చావ్.. చూడూ.. ఈ మోడల్స్‌లో ఏవి బాగుంటాయో.. సెలెక్ట్ చేయవా?’ అన్నాడు.
‘అన్నెందుకు సార్?’ అడిగాను ఆత్రుతగా.‘ఎమోనోయ్.. మీ అంటీ ఎదో కొత్త నోము మొదలు పెడుతోందట. రోజూ మన అపార్ట్‌మెంట్‌లో ఆడాళ్ళు చేస్తారుట. అందుకే’అన్నారు రావుగారు.నాకు అర్థమైపోయింది.. నా ఐడియా వర్కవుట్ అయిందని. దాని ఫలితమే ఈ బాక్స్‌లు అని. వాళ్ళకు నా ప్లాన్‌ను సరిగ్గా వివరించి ఒప్పించినందుకు మా అమ్మకు మనసులోనే థాంక్స్ చెప్పుకున్నాను.
∙∙
కారిడార్ మీటింగ్ చాలా హుషారుగా సాగుతోంది. మా అమ్మ నన్ను విజయగర్వంతో చూసింది. ఆవిడ పెట్టిన బిల్ పాస్ అయిందని అర్థమైంది. చెప్పుల్ని ఒకపక్కగా విడుస్తూ, ఒకింత గర్వంగా ఫీల్ అయ్యాను. ఒకింత అనుమానమూ వేసింది..‘మీ అందరికీ నచ్చిందా.. ఒకేనా.. చేయగలరా?’ అని అడిగాను. ముక్తకంఠంతో అంతా ‘ఇప్పుడయితే మేము అమ్మమ్మలం.. నానమ్మలం.. కానీ ఎప్పటికీ అమ్మలమే కదా! కుటుంబంలో అందరి ఆకలి తీర్చిన వాళ్ళమే కదా’ అన్నారు.
నా మనసు తేలికపడింది. హుషారుగా ఇంట్లోకి నడిచా. నన్ను చూస్తూనే మా ఆవిడ ‘ఈరోజు వేడిగా చపాతీలు చేయాలా? ఫుల్కాలు చేయాలా?’ అడిగింది చిరుకోపంతో! ‘ఈరోజే చివరిసారి కదా.. నీకు నచ్చింది చెయ్’ అన్నాను.
కొత్త టిఫిన్‌బాక్స్‌ల నోము గూర్చి చెప్పి, ‘రేపే నోము ప్రారంభం’ అన్నాను. అంతే .. మా ఆవిడ నవ్వుతూ ముందురోజు నేను కొన్న మల్లెపూల దండను ఫ్రిజ్‌లోంచి తీసి సిగలో తురుముకుంది.
∙∙
టిఫిన్‌బాక్స్‌ల నోము చరిత్ర సంపూర్ణం. ఇది శ్రద్ధగా చదివినవారికి.. విన్నవారికి .. ఆచరించినవారికి గృహంలో సుఖశాంతులు కలుగుతాయి. అపార్ట్‌మెంట్లు చల్లగా.. హయిగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment