గోపి వాళ్ళ నాన్నకు మంచి ఉద్యోగం వచ్చింది. ఇంట్లో అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఉద్యోగం కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో గోపికి తెలుసు. నాన్న రోజూ ఆఫీస్ నుంచి వచ్చాక చదువుకుంటూ ఉండేవాడు. ఒకసారి గోపి.. నాన్నతో ఆడుకోవడానికి కుదరట్లేదని పేచీ పెట్టాడు. అప్పుడు వాళ్లమ్మ ‘మన కోసమే నాన్న మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నారు. మనం ఇబ్బంది పడకుండా ఉండాలనే ఆయన ప్రయత్నం.
ఈ కొన్ని రోజులు నాన్నను చదువుకోనిస్తే, పరీక్ష అయిపోయాక నాన్నతో హాయిగా ఆడుకోవచ్చు’ అని సముదాయించింది. అప్పటి నుంచి గోపి కూడా నాన్నకు మంచి ఉద్యోగం రావాలని కోరుకోసాగాడు. నాన్నను ఇబ్బంది పెట్టకుండా, అమ్మతో ఆడుకోసాగాడు. పరీక్ష రోజున నాన్నతో పాటు గుడికి వెళ్లి దేవుడిని ప్రార్థించాడు. పరీక్ష పాసై, తాను కోరుకున్న ఉద్యాగాన్ని పొందాడు గోపి వాళ్ల నాన్న. ఆయన కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని అందరూ అంటుంటే, తను కూడా నాన్నలాగే ఏదైనా సాధించాలి అనుకున్నాడు గోపి.
నాన్న కొత్త ఉద్యోగానికి వెళుతున్నాడు. ప్రభుత్వ బడిలో చదివే గోపి కూడా ఇప్పుడు ఊళ్లో ఉన్న పెద్ద బడికి వెళుతున్నాడు. ఆ కొత్త బడి చాలా బాగుంది. బస్సులో వెళ్లడం, రావడం అంతా సరదాగా ఉంది. బట్టలు, భాష అంతా కొత్తగా ఉంది. ‘క్రమశిక్షణతో లేకపోతే ఇంటికి పంపించేస్తారుట. అందుకే జాగ్రత్తగా ఉండాల’ని గోపికి మరీ మరీ చెప్పింది అమ్మ. కొత్త స్నేహితుల పరిచయాలు, వాళ్ల గురించి తెలుసుకోవడం చాలా హుషారుగా ఉంది. నెమ్మదిగా కొత్త బడికి అలవాటుపడ్డాడు గోపి. పాత బడిలో కన్నా ఇక్కడ చాలా బాగుందనిపించింది అతనికి.
ఓ ఆదివారం.. పాత బడిలోని స్నేహితులు తమతో ఆడుకోవడానికి గోపిని రమ్మన్నారు. వాళ్లను చూడగానే ఆ అబ్బాయికి చాలా సంతోషమనిపించింది. తన కొత్త బడి సంగతులన్నీ ఒక్కొక్కటిగా వాళ్లకు చెప్పడం మొదలుపెట్టాడు. ప్రభుత్వ బడిలో అవన్నీ లేకపోవడంతో వాళ్లు ఆశ్చర్యంగా వినసాగారు. వాళ్ల ముఖాల్లోని ఆశ్చర్యాన్ని చూస్తూ తనకు తెలియకుండానే మరిన్ని గొప్పలు చెప్పుకుపోసాగాడు గోపి. కాసేపటికి ఆ పిల్లలకు విసుగనిపించింది. దాంతో ఆడుకోకుండానే ఇళ్లకు వెళ్లిపోయారు. గోపికి కోపం వచ్చింది. ఇంకెప్పుడూ వాళ్లతో మాట్లాడకూడదనుకున్నాడు. దిగులుగా కూర్చున్నాడు. ఇంతలో గోపికి ఎంతో ఇష్టమైన కిరణ్ మామయ్య వచ్చాడు. అతన్ని చూడగానే గోపి దిగులు ఎగిరిపోయింది.
కిరణ్ మామయ్య, గోపి వాళ్ల నాన్నతో కలిసి పని చేసేవాడు. ఇరు కుటుంబాలు చాలా స్నేహంగా ఉంటాయి. కిరణ్ మామయ్యతో కొత్త బడి విశేషాలను చెప్తుండగా నాన్న వచ్చాడు. గోపి వాళ్ల నాన్న కూడా కిరణ్ మామయ్యను చూడగానే ఎంతో ఉత్సాహంగా పలకరించాడు. వాళ్ల పాత ఆఫీసులో సంగతుల గురించి, తన స్నేహితుల గురించి అడిగి తెలుసుకున్నాడు నాన్న. ఒకరిద్దరి స్నేహితులకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. కొత్త ఆఫీసు గురించి పెద్దగా ఏమీ చెప్పలేదు. ఇదివరకటిలాగానే ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. నాన్న ఇప్పుడు కిరణ్ మామయ్య కన్నా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అయినా ఎందుకు తన గురించి ఎక్కువ చెప్పుకోవట్లేదు? తను అలా ఎక్కువ చెప్పుకోవడం వలనే తన స్నేహితులు వెళ్లిపోయారా? ఆలోచించసాగాడు గోపి!
∙డా. హారిక చెరుకుపల్లి
Comments
Please login to add a commentAdd a comment