ఉదయం 7:30కే కల్లాల వద్ద రోడ్డు మీద బస్సు దిగి, రోడ్డు అవతలికి దాటేందుకు రెండడుగులు వేసిన. ఇటు నుండి ఒకదాని వెనుక ఒకటి రెండు ఇసుక టిప్పర్లు, అటు నుండి రెండు కార్లు ఒకదాని తర్వాత ఒకటి దుమ్ములేపుకుంటూ పోయినాయి. ఏమాత్రం ఏ మారినా పెద్ద ప్రమాదం జరిగుండేది. ఈమధ్యనే ఇది డబుల్ రోడ్డు కావడంతో ప్రొద్దుటూరు నుండి కమలాపురానికి వచ్చిపోయే వాహనాలన్నీ ఈ పల్లెల దారి పట్టాయి. రోడ్డు వెడల్పు కావడంతో వేగం మితిమీరింది. మా ఊరి పెన్నలో ఇసుక క్వారీకీ అనుమతిచ్చారు. రేయింబవళ్లు భారీ ఇసుక టిప్పర్లు.
ఈసారి అటూ ఇటూ చూసుకొని రోడ్డు దాటాను. రోడ్డుకు ఊరి రచ్చబండకు ఓ అర ఫర్లాంగు దూరం. రచ్చబండ వరకున్న సిమెంటు బాటకు ఇరువైపులా ఊరి రైతుల కల్లాలు. రచ్చబండ వద్ద నుండి రెండు దారులు చీలి వాటికిరువైపులా ఇండ్లు మొదలవుతాయి. రోడ్డు దాటుకుని పది అడుగులు వేయగానే గవిని కాడి నాగిరెడ్డి కల్లం గోడ మీద.. వేపచెట్టు కింద ఓ పదిపన్నెండు మంది కూర్చొని గట్టిగా మాట్లాడుకుంటున్నారు. నన్ను చూసి ఓ నలుగురు వరుసలు పెట్టి పలకరిస్తూ క్షేమసమాచారాలడిగినారు. ‘మామకు కచ్చితంగా తెలిసుంటుంది.. ఏం మామా! మన చేలల్లో ఎక్స్‌ప్రెస్ హైవే ఖాయమే కదా, మళ్లా ఏమన్నా మారుస్తారా?’ పని వుంటే తప్ప వూరు దాటని శీను అడిగినాడు.
నాకు జవాబు చెప్పే అవకాశం రానివ్వలేదు. ఊరి రాజకీయాల్లో ఉంటూ ఆఫీసుల చుట్టూ తిరిగే నారపరెడ్డి అందుకొని ‘సర్వే అయిపోయి ల్యాండ్ అక్విజిషన్ కూడా అయిపోయింది. రేపో మాపో భూములకు లెక్క ఇచ్చి పొజిషన్‌లోకి తీసుకుంటారు. ఇంకేం మారుస్తారు!’ అన్నాడు. నేను అందరికీ చేయూపుతూ అక్కడి నుండి ముందుకు కదిలిన. రచ్చబండ వద్ద ఓ పదీపన్నెండు మంది మాట్లాడుకుంటున్నారు. బహుశా హైవే గురించే అనిపించింది. బావమరిది ఇంటికి చేరి కాళ్లూ, మొహం కడుక్కుని కూర్చున్నాక, ఒక కాగితం తెచ్చి చేతికిచ్చాడు.
ఫలానా సర్వే నంబర్లో 55 సెంట్లను రోడ్డు నిర్మాణం కోసం తీసుకోబోతున్నట్లు, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫలానా తేదీలోపు తెలియజేయాలని భూసేకరణ అధికారి నుండి వచ్చిన నోటీసు. హైవే కోసం స్వాధీనం చేసుకోబోతున్న భూముల గురించి భూయజమానులందరితో పాటు నాకూ పంపిన ఫార్మల్ నోటీసు అది. ఊరి అడ్రస్‌కు వచ్చింది. ఈ సారాంశం రెండు రోజుల కింద నా మొబైల్‌కు వచ్చినదే. ఇప్పుడు అభ్యంతరాలు తీసుకునేదేమీ ఉండదు. పరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకుంటారంతే! ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి కోర్టుల చుట్టూ తిరగాల్సిందే.
నోటీసు పక్కన పడేసి, ‘ఊర్లో అంతా దీని మీదే మాట్లాడుకుంటున్నట్లుందే!’ అన్నాను. ‘అవును బావా! హైవే కోసం భూములు పోతున్న వారి బాధ ఒకటైతే, తమ భూములు హైవే పక్కన లేకుండా ఎక్కడో ఉన్న వారి బాధ ఇంకొకటి’ అన్నాడు శివ. నాకు అర్థమైంది. హైవే కోసం సేకరిస్తున్న భూములకు ఇప్పుడున్న రేటు కన్నా ఎక్కువే ఇస్తున్నా, హైవే పక్కనున్న భూములకు ఊహించని రేట్లు వస్తాయి. అందుకే హైవే కోసం భూమి పోవడం కన్నా హైవే పక్కన భూమి ఉన్న రైతులను చూసి ఒకింత ఈర‡్ష్య పడుతున్నట్లుంది. ఒకప్పుడు తమవి మంచి కండగలిగిన భూములని మురిసిపోయిన రైతులు, ఇప్పుడా భూములు హైవే చుట్టుపక్కల లేనందుకు ఖిన్నులవుతున్నారు.
‘మనసులో బాధపడటంతోనే ఇది ఆగిపోదు. ఎన్ని అనర్థాలు జరుగుతాయో! మనుషులంతా ఎలా విడిపోతారో!’ నాలో నేను అనుకున్నట్లే అన్నాను. ‘నిజమే బావా! ఎప్పుడో చేల పంపకాలు జరిగిన అన్నదమ్ముల నడుమ ఇప్పుడు కొత్తగా అసూయలు, సరిపోనితనాలు పొడచూపుతున్నాయి. పెద్ద సుబ్బన్న గారి కొండారెడ్డి, రామిరెడ్డి పదహైదేళ్ల కిందట భూములు పంచుకొని వేరుపడినారు. రాళ్లవాగు చేను నాలుగెకరాల్లో, పెద్దోడు కొండారెడ్డికి పైదిక్కు అంటే పడమర దిక్కు రెండెకరాలు, చిన్నోడు రామిరెడ్డికి తగ్గు దిక్కు తూర్పున రెండెకరాలు వచ్చింది. ఇప్పుడు చిన్నోడి చేను రెండెకరాలు పూర్తిగా హైవే కోసం పోతోంది.
పెద్దోడి రెండెకరాలు హైవే పక్కన నిలబడింది. అప్పుడు చేను నిలువునా పంచినారు, ఇప్పుడు అడ్డంగా పంచి ఇద్దరికీ సమంగా లాభం వచ్చేలా చూడాలని చిన్నోడు సర్పంచు దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి తిరుగుతున్నాడు. పదహైదేళ్లనాడు జరిగిన పంపకం, ఎవరి పాస్ పుస్తకాలు వాళ్లవైనాయి, తిరిగి పంపకానికి ఒప్పుకోనని పెద్దోడు భీష్మించుకున్నాడు. చిన్నోడు ఓర్పు తక్కువ మనిషి. ఏమైతుందో!’ శివ మాటల్లో కొంత ఆందోళన కనపడింది.
నాకు తెలియకుండానే ఒక నిట్టూర్పు వెలువడింది. నేను ఊరికి వచ్చింది కూడా ఈ హైవే గొడవల పంచాయతీకే. మేనమామ కొడుకులిద్దరూ ఎప్పుడో జరిగిన భూముల పంపకం మీద ఇప్పుడు గొడవ పడుతున్నారు. ఆరోజు అన్నదమ్ములు ఇద్దరూ ఆస్తులు పంచుకునేటప్పుడు ఉన్న పెద్ద మనుషుల్లో నేనొకడిని. మేనరికపు చుట్టరికం కూడా ఉండడంతో పెద్దోడు రాఘవ ఫోన్ చేసి రమ్మన్నాడు. ఐదేళ్ల కిందట రాఘవ, చంద్ర భూములు పంచుకునేటప్పుడు వడ్డోనివంక పంపుల్లో నాలుగెకరాలు, రాళ్లవాగున ఐదెకరాలు త్రాసులో పెట్టి కోరుకోమన్నాము.
వడ్డోనివంకన పంపులు కండగలిగిన సారవంతమైన భూములు. రాళ్లవాగున సాధారణ భూములు. అందుకనే ఇక్కడి నాలుగెకరాలు అక్కడి ఐదెకరాలకు సమానమని పెద్ద మనుషుల తీర్మానం. పెద్దోడు కాబట్టి రాఘవకే మొదట కోరుకునే అవకాశం వున్నింది. ఆరోజు రాఘవ కండగలిగిన వడ్డోనివంకన నాలుగెకరాల భూమి కావాలన్నాడు. చంద్ర మారు మాట్లాడకుండా రాళ్లవాగున ఐదెకరాలు తీసుకున్నాడు. ఇప్పుడు రాళ్లవాగు చేల మీదుగా ఆరులైన్ల హైవే నిర్మాణం జరుగుతోంది. చంద్ర చేలో ఒక ఎకరా హైవే భూసేకరణలో పోయి, హైవే పక్కన నాలుగు ఎకరాలు మిగులుతోంది.
ఇప్పుడు రాఘవకు భరించలేనంత బాధగా వుంది. ఆడపిల్లలు గలోన్ని, ఐదారేళ్లుంటే పెళ్లికి ఎదుగుతారు. వడ్డోనివంకన రెండెకరాలు తీసుకొని హైవే పక్కన తనకు రెండెకరాలు ఇవ్వాలని అడుగుతున్నాడు. చంద్ర అందుకు ససేమిరా అంటున్నాడు. రాఘవ నాలుగెకరాలు ఇస్తే హైవే పక్కన రెండెకరాలు ఇస్తానంటున్నాడు. ఇది మరీ అన్యాయం అని చెబితే వినడం లేదు. మంచి పంట పండే నాలుగెకరాల భూమి అంతా తనకిచ్చి, హైవే పక్కన రెండెకరాలు రాఘవ ఏం చేసుకుంటాడు! పైగా అది సాధారణ భూమి. హైవే పక్కన పొల్యూషన్ వల్ల అసలు పంట పండదని చెబితే చంద్ర వినడం లేదు.
‘హైవే పక్కన పంటలు పండించుకోవడానికా వాడు అడిగేది? రెండేళ్లలో హైవే పడితే ఎకరా నలభై యాభై లక్షలు పోతుంది. ఇప్పుడే ఇరవైయైదు లక్షలకు అడుగుతున్నార’ని ఎదురు వాదన తీస్తున్నాడు చంద్ర.‘భూముల ధరలు గాలిలో దీపం రా! మొదట్లో పెరగొచ్చు. తర్వాత నిలబడి పోవచ్చు. రెండేళ్లకు పెరుగుతాయని గ్యారంటీ లేదు. అదంతా రియల్ దందాల మాయాజాలం మీద ఆధారపడి ఉంటుంది. పెరిగినప్పుడు ఇంకా పెరుగుతుందని మీరు అమ్ముకోలేకపోవచ్చు. తర్వాత కొనేవాడు ఉండడు’ అని ఎంత చెప్పినా వినడం లేదు.
రాఘవేమో కనీసం ఒక ఎకరంన్నర అయినా హైవే పక్కన తనకిప్పించమంటున్నాడు. ఆడపిల్లలు గలోన్నని ఏడుపు మొహం పెడతాడు. అన్నదమ్ముల నడుమ ఆ పంచాయతీ తీర్చడానికే ఇప్పుడు నేను ఊర్లో అడుగు పెట్టింది. నేను వస్తున్నానని నిన్ననే ఫోన్లో చెప్పడంతో అన్నదమ్ములతో పాటు వాళ్ల భార్యలు ఇండ్ల వద్దే వున్నారు.. మొగుళ్లకు దన్నుగా నిలబడటానికి. రాఘవ ఇంట్లోనే కూర్చున్నాం. కాఫీలు, టిఫిన్లు అని హడావిడి చేయబోతే వద్దన్నాను. శివుడి ఇంటి వద్ద కాఫీ తాగి వచ్చానన్నాను. మా కోసం వచ్చి అక్కడ తాగడమేమిటని రాఘవ భార్య నిష్ఠూరమాడింది. అన్నదమ్ములతో ఎంతసేపు మాట్లాడినా పాతపాటే. ఎవరూ ఒక మెట్టు దిగి రావడం లేదు. వాళ్లు ఒక మెట్టు దిగాలనుకున్నా, వాళ్ల భార్యలు దిగనివ్వడం లేదు.
విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం. ఆఖరకు ఆడోళ్లను గట్టిగా కసురుకునేసరికి, నా మీద రుసరుసలాడుతూ ఇద్దరూ నోరు మూసుకొని కూర్చున్నారు. మధ్యాహ్నం భోజన సమయానికి ఇద్దరినీ ఒక మాట మీదికి తెచ్చిన. వడ్డోనివంకనున్న నాలుగు ఎకరాల్లో రాఘవ ఎకరంన్నర చంద్రకు ఇచ్చేటట్లు, హైవే పక్కన చంద్రకు మిగిలిన నాలుగెకరాల్లో ఒక ఎకరా రాఘవకు ఇచ్చేటట్లు ఖరారైంది. ఎకరాకు మించి ఇవ్వడానికి చంద్ర ససేమిరా ఒప్పుకోలేదు. ఆ ఎకరాకే రాఘవను ఒప్పించి ఇద్దరి నడుమ అప్పటికప్పుడు అగ్రిమెంటు రాయించాను. ఇద్దరికీ, ముఖ్యంగా ఆడవాళ్లిద్దరికీ నా మీద కోపంగానే వుంది. భోంచేసి పొమ్మని రాఘవ మొహమాటానికి పిలుస్తున్నా, వద్దని వారించి నేను బయటపడిన.
నేను వచ్చినప్పటి నుండి ఆడవాళ్లిద్దరూ అక్కడే ఉన్నారు. ఇంకేం భోజనం ఉంటుంది? శివుని ఇంటికి చేరి, ఇంత తిని ఓ కునుకు తీసి, సాయంత్రం నాలుగు గంటల బస్సుకు కడపకు పోదామని బయలుదేరిన.రచ్చబండ వద్ద ఉదయం కన్నా ఇంకా ఎక్కువ మందే గుమిగూడి ఉన్నారు. ఈ నడుమ కాలంలో రచ్చబండ మీద ఒకరిద్దరు కునికిపాట్లు పడటం మినహా ఇంత జనాన్ని చూడలేదు. టీవీలు, తర్వాత సెల్‌ఫోన్లు వచ్చాక సంఘజీవనం మాయమైపోయింది. మనుషులు ఒంటరిగా మిగిలిపోయారు. ఇప్పుడు ఆశ్చర్యంగా రచ్చబండ మీద పదహైదు పదహారుమంది ఉన్నారు.
రెండు రోజుల్లో భూములు కోల్పోయిన రైతులకు హైవే భూసేకరణ డబ్బు, అందబోతోంది. ల్యాండ్ అక్విజిషన్ పూర్తయిందనే సమాచారం రైతులకన్నా ముందు రాజకీయ నాయకులకు తెలుస్తుంది. రాజకీయ నాయకుల అనుచరగణమంతా నెలరోజుల కిందటి నుండే హైవే పక్కనున్న భూములు కొనేందుకు రైతులను ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రలోభ పెడుతున్నారు. ఇప్పుడు గ్రామీణ జనం అంత అమాయకంగా లేరు. ఆ ముచ్చట్లు చెప్పుకునేందుకే రచ్చబండ మీద కూడినట్లుంది.
తనను ఫలానా వాడు ఎకరా ఇరవై లక్షలకు అడిగాడని ఒకడు చెబుతుంటే, మరొకడు ఆ ఫలానా వాడే నాకు ఇరవైయైదు లక్షలు ఇస్తానన్నాడని చెబుతున్నాడు. ఫలానా సుబ్బారెడ్డికి కోటి వస్తుందంటే, ఫలానా ఎల్లారెడ్డికి కోటిన్నర వస్తుందని చెప్పుకుంటున్నారు. అప్పుడే ఎందుకు అమ్మడం! హైవే ఓపెనింగ్ అయ్యేవరకు ఆగాలని ఒకడు అంటున్నాడు. మొదట్లోనే భూములు అమ్మి సొమ్ము చేసుకోవాలని, తర్వాత ఈ వేడి చల్లబడి భూముల అమ్మకం మందగిస్తే అప్పుడు అమ్ముకోవాలన్నా కొనేవాడు ఉండడని మరొకడు అంటున్నాడు.
దోవన పోతున్న నన్ను చూసి కొందరు వాళ్ల డబ్బు మాటలు ఆపి, క్షేమ సమాచారాలు అడిగినారు. నేను పొడిపొడిగా సమాధానమిస్తూ దాటుకుందామని చూసిన.‘ఒక నిమిషం రావోయ్!’ అని టంగుటూరోల్ల జయరామిరెడ్డి పిలవడంతో, పెద్దవాడు పిలిచాడనే గౌరవంతో రచ్చబండ మీదకు చేరక తప్పలేదు. ‘హైవే పక్కన భూములకు ఇప్పుడే ఊహించని ధరలు పలుకుతున్నాయి. హైవే కోసం తీసుకున్న భూములకు పరిహారం పెంచాలని మండలాఫీసు కాడ ధర్నా చేస్తే ఎట్లుంటుంది? ఏమన్నా సలహా ఇయ్యి’ ఒక పెద్దమనిషి నన్ను సలహా అడిగినాడు.‘మైలవరం డ్యామ్ నుండి మన పొలాలకు నీళ్లు విడిచి పదహైదేళ్లయింది.
ఒక్కసారన్నా మన నీళ్ల హక్కు గురించి అడిగినామా! డ్యామ్ నీళ్లన్నీ ఫ్యాక్టరీలకు ఇచ్చి మమ్మల్ని ఎండబెడుతున్నారని ధర్నా చేసినామా? కాలువలకు నీళ్లొచ్చేటప్పుడు రెండు పంటలు పండించుకున్నది మతికి లేదా? వాన లేని కరువులో కూడా నమ్మకంగా ఒక పంటైనా వచ్చింది. ఆ నీళ్ల హక్కును మనం అడగకుండా ఎందుకు వదిలేసుకుంటున్నాం’ అనడిగిన. అందరూ నన్ను తిక్కోడ్ని చూసినట్లు చూసినారు. జయరామిరెడ్డి కల్పించుకుంటూ ‘ఆ నీళ్ల కత ఇప్పుడెందుకు లేవోయ్! ఇప్పుడు నీళ్ల అవసరం లేకుండా అందరూ బుడ్డసెనగ వేయడం మరిగినారు.
వానాకాలం పోయేముందు అక్టోబర్ ఆఖర్లో విత్తనం వేస్తే, తర్వాత చలికి అదే పండుతుంది. నీళ్లవసరం ఎవరికీ లేదు గానీ, ఇప్పుడు ఈ హైవే భూముల పరిహారం గురించి చెప్పు’ అన్నాడు. ‘ఈ హైవే ఎవరికి లాభం? ఊర్లో పదిమందికి లాభమేమో, మిగతా అందరూ దాని నష్టాలను అనుభవిస్తారు’ అన్నాను. ‘నష్టమేముంది మామా! హైవే పడితే విజయవాడకు కార్లో నాలుగ్గంటల్లో పోవచ్చు’ అన్నాడు రాము.‘హైవే పక్కన నీ రెండెకరాలు 50 లక్షలకు అమ్మి 20 లక్షలతో కారు తేవాలనుకుంటున్నావేమో! కారు బంగారు బాతు కాదు, రెండెకరాల పంట పొలం మాదిరి గుడ్లు పెట్టడానికి. అయినా నీయట్లాటోళ్లు నలుగురు కార్లు తెచ్చుకున్నా రోజూ విజయవాడకు ఏం అడుక్కు తినడానికి పోతావురా! ఆరేడు గంటల్లో పోతే నష్టమొస్తుందా?’ అని అడిగేసరికి వాడు గతుక్కుమన్నాడు.
‘కారు కొనేవాడివి, ఏడాదికి ఒకసారో రెండుసార్లో విజయవాడకు నాలుగైదు గంటల్లో పోవచ్చని నువ్వు సంతోషపడొచ్చు. బస్సులో పోయే వాళ్లు ఆ భారం ఎందుకు మోయాల్రా! ఇక్కడి నుండి విజయవాడకు పది టోల్‌గేట్లు పెడతారు. టోల్‌గేట్ చార్జీల భారం అంతా బస్సు ప్రయాణికుల మీద పడుతుంది. ఈ టోల్ చార్జీలన్నీ ఎవడి కోసం కట్టాలి? ఎవడో హైవే అవసరమైన వాడి కోసం లక్షలాది సామాన్యులు ఎందుకు నష్టపోవాలి?’‘ఏందబ్బా నువ్వు ఇట్లా అంటావు! రోడ్లు అభివృద్ధికి చిహ్నం’ అని అందరూ అంటుంటే చెండ్రాయుడు అర్ధోక్తిలో అన్నాడు.‘రోడ్లు అభివృద్ధికి చిహ్నమే. ఎంతవరకు? ఊర్ల కోసం, ఊర్లో జనం కోసం రోడ్లు ఉండాలి. అంతేగాని రోడ్ల కోసం ఊర్లు అన్నట్లు మారకూడదు.’
‘మాకేం అర్థం కాలే!’ చెండ్రాయుడు మళ్లీ అదే అర్ధోక్తిలో. మిగతావాళ్లంతా తమకు రుచించని మాటలు వింటున్నట్లు మొహాలు పెట్టినారు.‘హైవే వల్ల మన ప్రాంత ఖనిజ సంపదంతా రాష్ట్రాలు, దేశాలు దాటిపోతుంది. మన ఖనిజ సంపదతో మనకు పరిశ్రమలొస్తే మనకు మేలు గానీ, తరలిపోతే మనకేం లాభం? ఇట్లాంటివెన్నో నష్టాలు. మన ఊరి రోడ్డునే తీసుకుందాం. రెండేళ్ల కిందట దాకా సింగిల్ రోడ్డు. ప్రొద్దుటూరు నుండి కమలాపురం వరకు బస్సు తిరిగేది. ఈ రూట్‌లో ఉన్న ఊర్ల వాళ్ల మోటార్ సైకిళ్లు తిరిగేవి. అంతవరకు మనకు అవసరం. నిరుడు డబుల్ రోడ్డు వేసినారు. బస్సుతోపాటు కమలాపురం – ప్రొద్దుటూరు తిరిగే వాహనాల సంఖ్య పెరిగింది. ఏడెనిమిది కిలోమీటర్లు కలిసొస్తుందని కడపకు పోయే వాహనాలన్నీ ఇదే రూట్లో పోతున్నాయి.
అది కూడా నష్టం లేదనుకుందాం. డబుల్ రోడ్డు కాగానే మన ఊరి పెన్నలో ఇసుక క్వారీ లీజుకు ఇచ్చినారు. ఆ ఇసుక వల్ల ప్రభుత్వానికి వచ్చేదెంతో గానీ, ఎమ్మెల్యే మాత్రం రేయింబవళ్లు పెద్దపెద్ద టిప్పర్లతో ఇసుక తీసుకుపోతున్నాడు. మన సంపదను ఎవడో దోచుకుపోతున్నాడు. ఏట్లో ఇసుక లేకుండా పోవడంతో భూగర్భజలం అడుగంటింది. నిన్న వేసవిలో నీళ్లు లేక ఎంత అలమటించామో గుర్తులేదా! ఈ టిప్పర్లు వాహనాల వల్ల ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయో తెలుసు కదా! మన ఊరిలోనే ఈ ఏడాదిలో నలుగురు యాక్సిడెంట్లో చనిపోయినారు.
పల్లెలకు ఎంత వెడల్పు రోడ్లు అవసరమో అంతే వెడల్పు రోడ్లు వుంటే అభివృద్ధి. అది జనం కోసం. అంతకు మించిన వెడల్పు వేసినారంటే అది జనం కోసం కాదు. ఇంకెవరి కోసమో! ఆ నష్టాలను మాత్రం మనమందరం పంచుకోవాలి. రోడ్డు వల్ల వచ్చే లాభాలను వాళ్లెవరో దండుకుంటారు. హైవే కూడా అంతే’ నేను ఊరి రోడ్డు గురించి చెప్పేసరికి ఒకరిద్దరు ఆలోచనలో పడినట్లున్నారు. రచ్చబండ మీదున్న చాలామందికి నా మాటలు రుచించలేదు.
‘సరేలేవోయ్, మనం వద్దంటే ఆగుతుందా! ఆ పరిహారం పెంపు కోసం ధర్నా చేద్దాం! నువ్వు కూడా ఈరోజు ఊర్లోనే ఉండి రేపు మాతోపాటు రా! నీది యాభైయైదు సెంట్లు రోడ్డుకు పోయింది కదా!’ అన్నాడు జయరామి రెడ్డి రచ్చబండ దిగిపోతూ. నేనూ రచ్చబండ దిగి కల్లాల బయటున్న రోడ్డు మొహం పట్టిన, కడపకు పోయేందుకు. ‘ఏ అభివృద్ధి ఎవరికోసమో తెలుసుకోలేనంత అజ్ఞానంలోకి భ్రమల్లోకి జనాన్ని తోసేస్తున్నారు. ఆ జ్ఞానం ఎవరు కలిగించాలి?’ నాలో ముసురుకుంటున్న ఆలోచనలు.
ఇంతలో రచ్చబండ మీద పెద్ద పెద్దగా మాటల అలికిడి వినిపించింది. వెనక్కు తిరిగి చూసిన. రచ్చబండ మీద నుండి అందరూ బిలబిలమంటూ దిగి తగ్గుబజారు దిక్కు పరుగులు తీస్తున్నారు. ఏమైందోననే ఆందోళన నాకు. వెనక్కు వచ్చి, జనంలో పోతున్న రామును కేకేసి పిలిచిన. వచ్చినాడు.నేను అడగక ముందే ‘చేల పంపకాల్లో హైవే పక్కన సగం భూమిని తనకివ్వడానికి ఒప్పుకోలేదని రామిరెడ్డి, కొండారెడ్డి ఏదో గొడవపడినారంట. ఆ గొడవలో రామిరెడ్డి గొడ్డలి తీసుకుని అన్న తలకాయ పగుల కొట్టినాడంట. రా! నువ్వూ!’ అంటూ పరుగు లాంటి నడకతో ముందుకు కదిలినాడు.
నాకు విస్మయం కలిగింది. ‘ఎవరి కోసమో జరుగుతున్న అభివృద్ధి. సాధారణ జనాలకు అవసరం లేని, సంబంధం లేని అభివృద్ధి. తను సాగినంత పొడవునా గ్రామాల్లో ఇంకా ఎంతమంది అన్నదమ్ముల్లో చిచ్చు పెట్టిందో ఈ హైవే’ ఆలోచిస్తూ, కొండారెడ్డి ఇంటిదిక్కు వడివడిగా అడుగులేసిన. పడమట పొద్దు మునిగిపోతూ ఆకాశమంతా ఎర్రగావు లేచింది.
‘ఆ నీళ్ల కత ఇప్పుడెందుకు లేవోయ్! ఇప్పుడు నీళ్ల అవసరం లేకుండా అందరూ బుడ్డసెనగ వేయడం మరిగినారు. వానాకాలం పోయేముందు అక్టోబర్ ఆఖర్లో విత్తనం వేస్తే, తర్వాత చలికి అదే పండుతుంది. నీళ్లవసరం ఎవరికీ లేదు గానీ, ఇప్పుడు ఈ హైవే భూముల పరిహారం గురించి చెప్పు’ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment