ఈవారం కథ: చాక్లెట్‌ రాపర్స్‌ | Story Of Week | Sakshi
Sakshi News home page

ఈవారం కథ: చాక్లెట్‌ రాపర్స్‌

Published Sun, Dec 1 2024 9:10 AM | Last Updated on Sun, Dec 1 2024 9:10 AM

Story Of Week

మార్నింగ్‌ 5:30కి అలారం మోగగానే నిద్రలేచాను. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన నేను మామూలుగా పగలు అసలు సూర్యుడినే చూడకూడదు అనుకుంటా! అలాంటిది అంత ఎర్లీగా నిద్ర లేవటానికి కారణం వీకెండ్‌. నాకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ ఆడటానికి శనివారం మాత్రమే కుదురుతుంది. ఫ్రెండ్స్‌ అందరినీ అలర్ట్‌ చేసి ఫ్రెష్‌ అయి పక్కనే ఉన్న గ్రౌండ్‌కి బయలుదేరాం. మా కాలనీలో ఉన్న డాక్టర్స్‌ టీమ్‌ వర్సెస్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయీస్‌ టీమ్‌కి ప్రతి శనివారం క్రికెట్‌ మ్యాచ్‌ ఉంటుంది. ఫీమేల్‌ ఆడియన్స్‌ మ్యాచ్‌ చూడటానికి గ్రౌండ్‌కి వస్తూండటంతో మేం ఆడే క్రికెట్‌ మ్యాచ్‌కి విపరీతంగా క్రేజ్‌ పెరిగిపోయింది. అందరూ యూత్‌ అవటంతో క్రికెట్‌ మ్యాచులు హోరాహోరీగా సాగుతాయి. లాస్ట్‌ రెండు వారాలు మేం మ్యాచ్‌లు ఓడిపోవటం వల్ల ఈసారి మాకు ప్రెషర్‌ ఎక్కువ అయింది. 

మా కెప్టెన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ తీసుకోవటంతో ఫీల్డింగ్‌ చేయటానికి గ్రౌండ్‌లో దిగాం. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ 20 ఓవర్స్‌లో 140/6 చేసింది. ఇంకా కొంచెం గ్యాప్‌ తీసుకుని చేజింగ్‌ స్టార్ట్‌ చేశాం. ఓపెనింగ్‌ బ్యాటర్స్‌ బాగా ఆడటంతో మ్యాచ్‌ మా చేతుల్లో ఉన్నట్టే అన్పించింది. 10 ఓవర్స్‌కి 84/2. ఇంకో 60 బాల్స్‌లో 57 రన్స్‌ చేస్తే మ్యాచ్‌ మాదే. కానీ వెంటవెంటనే వికెట్స్‌ పడటంతో టెన్షన్‌ ఎక్కువైంది. 16 ఓవర్స్‌ 108/5. బౌలింగ్‌ కట్టుదిట్టంగా ఉంది. చూస్తుండగానే మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌కి వచ్చింది. 6 బాల్స్‌ 10 రన్స్‌.  రెండు టీమ్స్‌లో ఒత్తిడి కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. ఈలోపు రెండు బాల్స్‌ డాట్‌ అయ్యాయి. ఒత్తిడి మొత్తం మా టీమ్‌ పైనే పడింది. అవతలి వాళ్లు మ్యాచ్‌ గెలిచేసిన ఆనందంలో ఉన్నారు. 

3వ బాల్‌ బౌండరీ.. 4 రన్స్‌ వచ్చాయి. ఇంకా 3 బాల్స్‌లో 6 రన్స్‌.. వికెట్‌ పడింది. ఓపెనర్‌గా వచ్చి బాగా సెట్‌ అయి బ్యాటింగ్‌ చేస్తున్న బ్యాట్స్‌మన్‌ అవుట్‌ అయిపోయాడు. 2 బాల్స్‌లో 6 రన్స్‌.. మ్యాచ్‌ పూర్తిగా వాళ్లవైపే ఉంది. ఒక బాల్‌ డాట్‌ అయితే మ్యాచ్‌ వాళ్లదే. 7వ ప్లేస్‌లో కెప్టెన్, నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అజయ్‌ బ్యాటింగ్‌కి దిగాడు. అజయ్‌ ఏ టైమ్‌లో అయినా కూల్‌గా ఉండగలడు. హిట్టింగ్‌ బ్యాట్స్‌మన్‌. ఇలాంటి చాలా సందర్భాల్లో అజయ్‌ మా టీమ్‌ని గెలిపించాడు. బౌలర్‌ బాల్‌ వేయటానికి సిద్ధమయ్యాడు. బాల్‌ యార్కర్‌ మిస్‌ అయి ఫుల్‌ టాస్‌ పడింది. అంతే, అజయ్‌ షాట్‌ కొట్టగానే బాల్‌ లాంగ్‌ ఆన్‌లో గ్రౌండ్‌ బయట పడింది. అరుపులు కేకలతో మా టీమ్‌ హోరెత్తించింది. సునాయాసంగా గెలిచే మ్యాచ్‌ ఓడిపోవటంతో డాక్టర్స్‌ టీమ్‌ బాధగా గ్రౌండ్‌  వదిలింది. 

మ్యాచ్‌ గెలిపించిన ఆనందంలో ట్రీట్‌ ఇవ్వడానికి మా అందరినీ పక్కనే ఉన్న బేకరీకి తీసుకువెళ్లాడు మా కెప్టెన్‌. ఎవరికి కావలసినవి వాళ్లు తీసుకున్నారు. ఇంతలో మా వాచ్‌మన్‌ కొడుకు అటుగా వచ్చి ఇవాళ ‘నా బర్త్‌ డే’ అంటూ చాక్లెట్స్‌ ఇచ్చాడు. అబ్బాయిని విష్‌ చేశాను. కానీ ఆ చాక్లెట్‌ చూస్తే కోపం వచ్చింది. పిల్లాడి ముందు ఏమీ అనక, పక్కకు వెళ్లి దాన్ని విసిరికొట్టి,  బేకరీ బిల్‌ పే చేయటానికి వెళ్లాను. నాలుగు రూపాయలు చేంజ్‌ లేకపోవటంతో బేకరీ అతను చాక్లెట్లు ఇచ్చాడు. సేమ్‌ చాక్లెట్స్‌.. చిర్రెత్తుకొచ్చింది. ఆ చాక్లెట్స్‌నీ విసిరికొట్టి, షాప్‌ అతని కాలర్‌ పట్టుకుని ‘చేంజ్‌ ఇవ్వటం నేర్చుకో!’ అంటూ విసురుగా అక్కడి నుంచి కదిలాను. 

కాస్త దూరం నడిచాక.. ఆ షాప్‌ అన్నతో అలా బిహేవ్‌ చేసినందుకు బాధపడి తిరిగెళ్లి ‘సారీ’ చెప్పి వచ్చేశాను. నా తీరు చూసి ‘ఏమైంది?’ అడిగాడు నా ఫ్రెండ్‌ అజయ్‌. ‘తర్వాత మాట్లాడదాం’ అంటూ మా ఫ్లాట్‌కి వెళ్లిపోయాను.మా ఫ్లాట్‌లో నలుగురం ఉంటాం. అందరం ఒకే కంపెనీలో వర్క్‌ చేస్తున్నాం. సాయంత్రం ఎవరి పనుల్లో వాళ్లం ఉండగా ఇంతలో పవర్‌ కట్‌ అయింది. చేసేదేం లేక రూమ్మేట్స్‌ అందరం అపార్ట్‌మెంట్స్‌ టెర్రస్‌ పైకి ఎక్కాం. ఇంక ఎవరి ఫోన్‌లోనూ బ్యాటరీ పెద్దగా లేకపోవటంతో వెంటనే ఫుడ్‌ ఆర్డరిచ్చి, ఫోన్స్‌ పక్కన పడేశాం. లోకంలో జరుగుతున్న  విషయాల మీద చర్చ మొదలుపెట్టాం. భిన్నమైన ఇష్టాలు, హాబీలు ఉండటంతో సంభాషణ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. 

నా రూమ్మేట్‌ రాకేశ్‌కి టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ అంటే చాలా ఇష్టం. దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇంతలో మా ఫ్రెండ్‌ విక్రమ్‌ ‘టైమ్‌ ట్రావెల్‌ పాసిబుల్‌ అయ్యి పదేళ్ల వయసులో ఉన్న పాస్ట్‌ సెల్ఫ్‌ను మనం కలుసుకోగలిగితే మీకు మీరు ఇచ్చుకునే ఇన్ఫర్మేషన్‌.. గిఫ్ట్‌ ఏంటి?’ అని అడిగాడు. ‘నువ్‌ ఏం చేస్తావో చెప్పు ముందు?’ అని విక్రమ్‌ని అడిగా. ‘ల్యాండ్స్‌ పైన ఇన్వెస్ట్‌ చేయమని, ఫ్యూచర్‌లో ఏ షేర్స్‌ పేరుగుతాయో.. వాటిని వీలైనన్ని కొనమని డీటైల్స్‌ ఇస్తా’ అని చెప్పాడు. రాకేశ్‌ని అడిగితే ‘విన్నింగ్‌ బెట్‌ డీటైల్స్‌ ఇస్తా’ అన్నాడు. అజయేమో క్రిప్టో కరెన్సీ అన్నాడు. ఇక అందరూ నా వైపు తిరిగారు.. నేనేం చెప్తానా అని!    కింద నుంచి వాచ్‌మన్‌ కొడుకు ఏడుపు వినపడింది. 

రాత్రి నిశ్శబ్దంగా ఉండటంతో వాడి ఏడుపు టెర్రస్‌ని చేరింది. ‘ఏమైందిరా.. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు?’ అంటూ అజయ్‌ వెళ్లబోయాడు. అంతలో రాకేశ్‌ ‘మార్నింగ్‌ మనోడు చేసిన ఘనకార్యం గుర్తొచ్చి భయపడి ఏడుస్తున్నాడేమో’అన్నాడు. ఇంతలో అజయ్‌ ‘మార్నింగ్‌ ఎందుకురా అలా బిహేవ్‌ చేశావ్‌?’ అడిగాడు. నేను జవాబు చెప్పకుండా దాటవేస్తానేమో అని అందరూ ఒక్కటిగా ఏమైందో చెప్పమంటూ వెంటపడ్డారు. ‘చిన్నప్పుడు నన్నొక చాక్లెట్‌ కంపెనీ కొన్నాళ్ల పాటు మెంటల్‌ టార్చర్‌ చేసింది..’ అంటూ ఆగాను. అందరి మొహాల్లో ఉత్సుకత! నా కథ చెప్పడం మొదలుపెట్టాను.   ‘మేము కదిరిలో ఉండేవాళ్లం. నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, చెల్లి, నేను.. ఇదీ మా కుటుంబం! నాన్న టైలర్‌. అమ్మ హౌస్‌వైఫ్‌. 

నానమ్మ, తాత పళ్ల వ్యాపారం చేసేవాళ్లు.  ముగ్గురి సంపాదనతో హ్యాపీగా గడిచిపోయేది. ఉన్నట్టుండి ఒకరోజు తాత కళ్లు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్‌లో చూపిస్తే.. క్యాన్సర్‌ అని, ఎక్కువ రోజులు బతకడని చెప్పారు. అప్పటికి క్యాన్సర్‌ అంటే ఏంటో కూడా తెలియదు. ఏం చేయాలో తెలియని అయోమయం నుంచి తేరుకోక ముందే తాత చనిపోయాడు. రెండు నెలల తర్వాత తాత మీద బెంగతో నానమ్మ కూడా చనిపోయింది. కన్నీళ్లు ఆకలి తీర్చలేవు కదా! నాన్నే ముందు తేరుకుని పనిలో పడ్డాడు. ఒక్కరి సంపాదనే అవటంతో ఇల్లు గడవటం కొంచెం కష్టమయింది. అమ్మ మిషన్‌ కుట్టటం మొదలుపెట్టింది. అప్పటికి నేను నాలుగవ తరగతి. సోషల్‌ టెక్స్‌›్టబుక్‌లోని  పావర్టీ లెసన్‌ వింటున్నప్పుడు మా కుటుంబం పేదరికానికి చాలా దగ్గరగా ఉన్నట్టనిపించింది.

 డబ్బుతో ముడిపడి ఉన్న చిన్నచిన్న కోరికలు, ఆశలను చిన్న వయసులోనే చంపేసుకోవాలని పేదరికం ఒక గొప్ప ఫిలాసఫీ నేర్పిస్తుంది. దాన్ని ఒంటబట్టించుకున్న నేను బట్టలు, బొమ్మల కోసం అమ్మానాన్నల్ని ఇబ్బంది పెట్టటం మానేశా. నా పదకొండవ బర్త్‌ డే అప్పుడు.. ‘ఏం కావాలి?’ అని అడిగారు నాన్న. క్రికెట్‌ బ్యాట్‌ అని చెప్పా. మంచి బ్యాట్‌ ఎంత అవుతుందని అడిగితే, అయిదువందల రూపాయలు అని చెప్పా. రవి ఫ్యాన్సీ స్టోర్‌లో ఎమ్మారెఫ్‌ క్రికెట్‌ బ్యాట్‌.. నేను చాలాసార్లు కొనాలనుకుని.. కొనలేక ఆశను చంపేసుకున్న బ్యాట్‌.. ఆ బ్యాట్‌ ఎంతని షాపతణ్ణి ఒక 30 సార్లు అడిగుంటా! నా బర్త్‌డేకి మూడు రోజుల ముందు నుంచి ఎక్కువ కష్టపడటం మొదలుపెట్టాడు నాన్న. బహుశా ఆ బ్యాట్‌ కొనటానికేనేమో అనిపించింది. 

క్రికెట్‌ బ్యాటే అడగటానికి కారణం లేకపోలేదు. క్రికెట్‌ గ్రౌండ్‌కి వెళ్తే బ్యాట్‌ ఎవరి దగ్గర ఉంటే వాడికే బ్యాటింగ్‌. మాతో రోజు మొత్తం గ్రౌండ్‌లో ఫీల్డింగ్‌ చేయించేవాళ్లు. బౌలింగ్‌ కూడా ఇచ్చేవాళ్లు కాదు. ఫీల్డింగ్‌తో మేము బాగా అలసిపోయాక మా ముఖాన ఒక ఫోర్‌ బాల్స్‌ బ్యాటింగ్‌ ఇచ్చేవాళ్లు. సో నేను బ్యాట్‌ కొనగానే నా ఫ్రెండ్స్‌ అందరికీ బ్యాటింగ్‌ ఇవ్వాలని, వేరే వాళ్లలా చేయకూడదని ఫిక్స్‌ అయ్యా. 
నా పుట్టినరోజు రానే వచ్చింది. నా ఆలోచనలు అన్నీ ఆ క్రికెట్‌ బ్యాట్‌ చుట్టే! ఆ బ్యాట్‌ని గ్రౌండ్‌కి తీసుకెళ్తే నాకొచ్చే రెస్పెక్ట్‌ గురించే! అయితే ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. మామూలుగా ఉదయం ఏడయినా నిద్ర లేవని నాకు అయిదున్నరకే తెల్లారింది. లేచి చూస్తే.. మా అత్త, మామ కనిపించారు. ఏదో పని పైన వెళ్లి రిటర్న్‌లో మా ఇంటికి వచ్చారు.  

అమ్మ పుట్టినరోజు విషెస్‌ చెప్పింది. అమ్మ చెప్పగానే అందరూ విష్‌ చేశారు. నేను మాత్రం నాన్న కోసం వెతుకుతూ అమ్మని అడిగితే మార్కెట్‌కి వెళ్లాడని చెప్పింది. వాళ్ల చెల్లి వచ్చిన ఆనందంలో నాన్న నాన్‌వెజ్‌ వెరైటీస్‌ అన్నీ తీసుకొచ్చాడు. నాకు అప్పటికే ఏదో తేడా కొట్టింది. ఇక నన్ను చూసి మా నాన్న విషెస్‌ చెప్పినప్పుడే కన్ఫర్మ్‌ అయింది బ్యాట్‌ కొనే ప్రోగ్రామ్‌ బిస్కట్‌ అయిందని. ఏడుపు ముంచుకొచ్చింది. భూమి మీద అత్యంత కష్టమైన పని ఏడుపు ఆపుకొని నవ్వు నటించటం. అంత చిన్న వయసులోనే జీవితంపై మొదటిసారి విరక్తి కలిగింది. ఇక వాళ్లని వీళ్లని నమ్ముకుంటే లాభం లేదని నేనే డబ్బు సంపాదించాలని డిసైడ్‌ అయ్యా. నాకు బాగా ఇష్టమైన హాబీ కథలు రాయటం, చదవటం. 

ఒకసారి వారెన్‌ బఫెట్‌ గురించి పేపర్లో చదివా.. ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకడని, పన్నెండేళ్లకే అతను స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేశాడని, పేపర్‌ బాయ్‌గా కూడా పని చేశాడని! అది చదివాక వారెన్‌ బఫెట్‌ను అమ్మేద్దామని ఫిక్స్‌ అయ్యా! అంటే మా ఇంట్లో ఉన్న పాత న్యూస్‌ పేపర్లను అమ్మేద్దామని! మా స్కూల్‌ దగ్గర్లోని గుజిరీ షాపులో ఎంక్వయిరీ చేయగా తెలిసిందేమంటే కేజీ న్యూస్‌ పేపర్స్‌కి ఆరు రూపాయలని, పన్నెండు ఫుల్‌ న్యూస్‌ పేపర్స్‌ కిలో బరువు ఉంటాయని! మా ఇంట్లో పేపర్స్‌ని ఎవరికీ తెలియకుండా గుజిరీ షాపులో అమ్మేశా. స్కూల్లో నేను బ్రైట్‌ స్టూడెంట్‌ను అవటంతో నన్నే క్లాస్‌ లీడరుగా పెట్టారు. దాంతో క్లాస్‌లో అందరినీ ఉద్దేశించి ఓ ప్రశ్న అడిగా.. ‘ఎంతమంది ఇళ్లల్లో న్యూస్‌ పేపర్స్‌ వస్తాయి?’ అని. అరవై మందిలో ముప్ఫై అయిదు మంది చేతులు ఎత్తారు. ‘ప్రిన్సిపాల్‌ మేడమ్‌ చెప్పమంది’ అంటూ ఒక్కొక్కరినీ పన్నెండు న్యూస్‌ పేపర్స్‌ తీసుకురమ్మన్నాను.

 మరుసటి రోజు ట్వంటీ మెంబర్స్‌ న్యూస్‌ పేపర్స్‌ తీసుకొచ్చారు. ఫ్రెండ్స్‌తో కలిసి ఆ పేపర్స్‌ని గుజిరీ షాప్‌కి తీసుకెళ్లా. 120 రూపాయలు వచ్చాయి. అంత డబ్బును చూసిందిలేదెప్పుడూ! కొంచెం అమౌంట్‌తో స్నాక్స్‌ తీసుకున్నా. సాయంత్రం స్టడీ అవర్‌ బ్రేక్‌లో అందరికీ స్నాక్స్‌ పంచిపెట్టా. మనం ఒక తప్పు చేస్తున్నప్పుడు అందులోకి ఎంత ఎక్కువ మందిని లాగితే పనిష్‌మెంట్‌ అంత తక్కువ ఉంటుంది. సో అలా నా క్రైమ్‌లో అందర్నీ పార్టనర్స్‌ని చేసేశా.  ముందురోజు స్నాక్స్‌ పంచటంతో పేపర్లను తీసుకొచ్చే వాళ్ల సంఖ్య పెరిగింది. అలాగే నా బ్యాంక్‌ బాలెన్స్‌ .. ఐ మీన్‌ కిడ్డీ బ్యాంక్‌ బాలెన్స్‌ కూడా పెరిగింది. బ్యాట్‌కి సరిపోయే డబ్బులు వచ్చేశాయని హ్యాపీగా ఫీల్‌ అయ్యేలోపు మేటర్‌ ప్రిన్సిపాల్‌ మేడమ్‌కి తెలిసింది. ప్రేయర్‌లో మా గ్యాంగ్‌ని పిచ్చికొట్టుడు కొట్టింది.

పరువు పోయింది. అప్పటికీ పరువు కంటే పైసలే ముఖ్యమని గట్టిగా ఫిక్స్‌ అయ్యా! మేడమ్‌కి నా దగ్గరున్న మనీ గురించి చెప్పలేదు. లక్కీగా నా ఫ్రెండ్స్‌ అందరూ మాథమేటిక్స్‌లో వీక్‌. దాంతో నా దగ్గర ఎంత డబ్బున్నదీ ఎవరికీ తెలీలేదు. ‘ఎందుకలా చేశావ్‌?’ అని అడిగింది ప్రిన్సిపాల్‌ మేడమ్‌. ఆ క్షణంలో నా బ్రెయిన్‌ మెర్క్యురీలా పని చేసింది. ‘ఆ రోజు అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ బర్త్‌డే.. ఎలా సెలబ్రేట్‌ చేయాలో తెలియక అలా చేశా’ అని చెప్పా. మా ప్రిన్సిపాల్‌ ఫిజిక్స్‌ టీచర్‌ అవటంతో నన్ను కొట్టినందుకు చాలా రిగ్రెట్‌ ఫీల్‌ అయింది. కేకు తెప్పించి నాతోనే క్లాస్‌లో కట్‌ చేయించింది. నేను ఎవరినయినా మేనిప్యులేట్‌ చేయగలనని తెలిసింది. ఆ రోజు ఈవెనింగ్‌ డబ్బు లెక్క పెట్టా.. బ్యాట్‌కి సరిపోయేన్ని ఉన్నాయి. అంతే ఫుల్‌ జోష్‌ వచ్చింది. 

ఈలోపు మా చెల్లికి మలేరియా జ్వరమని తేలింది. పండగలు ఏవీ లేకపోవటంతో మా నాన్నకి బిజినెస్‌ సరిగా జరగలేదు. అసలు డబ్బు లేదు. ఎవర్ని అప్పు అడగాలో తెలియని పరిస్థితి. ఆ టైమ్‌లో నా చెల్లి కంటే నాకేదీ ఎక్కువ కాదనిపించింది. ఉన్న డబ్బు మొత్తంలో అయిదువందలు మా నాన్నకి ఇచ్చేశా. ఆ డబ్బు ఎక్కడిదని అడిగే స్థితిలో లేడు నాన్న. అమ్మ అడిగితే దాచుకున్న డబ్బని చెప్పా. ఆ క్షణంలో అమ్మ, నాన్న నన్ను ఒక హీరోని చూసినట్టు చూశారు. జీవితంలో ఫస్ట్‌ టైమ్‌ ఒక హీరోలా ఫీల్‌ అయ్యా. నా దగ్గర ఇంకా మనీ ఉండటంతో బ్యాట్‌ కొనటానికి చైనా బజార్‌కి వెళ్లాం. అరవై అయిదు రూపాయలకి మీడియం సైజు చెక్క బ్యాట్‌ ఇచ్చాడు. హ్యాపీగా ఆదివారం గ్రౌండ్‌లో తెగ క్రికెట్‌ ఆడాం. మా దగ్గర వికెట్స్‌ లేకపోవటంతో వాటి స్థానంలో ఒక బండరాయిని నిలబెట్టాం.

 మా ఫ్రెండ్‌ నిఖిల్‌æఅవుట్‌ అవగానే బ్యాట్‌ను ఆ బండరాయికి ఒరిగించి వెళ్లబోతుండగా.. ఆ బండ కాస్తా బ్యాట్‌ మీద పడి బ్యాట్‌ రెండు  ముక్కలయింది. అప్పుడు అర్థమయింది నాకు ఆ షాప్‌కి చైనా బజార్‌ అనే పేరు ఎందుకు పెట్టారో! నా ఫ్రెండ్‌ నిఖిల్‌ని ఒక్కొక్కరు ఒక్కో మాటన్నారు. నేను మాత్రం ఏమీ అనలేదు. కళ్లతోనే థ్యాంక్స్‌ చెప్పాడు నిఖిల్‌. సెకండ్‌ టైమ్‌ హీరోలా ఫీలయ్యా.  ఏదైతేనేం ఉన్న కొంచెం సంతోషం కూడా విరిగిపోయింది.  ఒకసారి ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక చాక్లెట్‌ కంపెనీ యాడ్‌ వచ్చింది.. అజయ్‌.. మార్నింగ్‌ నన్ను షాప్‌లో అడిగిన ప్రశ్నకి ఆన్సర్‌ దొరకబోతోందని ఇంట్రెస్టింగ్‌గా వింటున్నాడు. రాకేశ్‌ అండ్‌ విక్రమ్‌ కూడా! ‘చాక్లెట్స్‌ కొంటే ఆ రాపర్స్‌ వెనుక రన్స్‌ ఉంటాయని, ఆరయాభై పూర్తిచేసి, చెప్పిన అడ్రస్‌కి కొరియర్‌ చేస్తే.. సెల్‌ఫోన్, క్రికెట్‌ బ్యాట్‌ ఇంకా చాలా గిఫ్ట్స్‌తోపాటు ధోనీని కలుసుకునే అవకాశం’ అనేది ఆ యాడ్‌ సారాంశం. 

అందులో క్రికెట్‌ బ్యాట్‌ తప్ప నాకింకేదీ ఇంపార్టెంట్‌ అనిపించలేదు. మళ్లీ నా మైండ్‌ మెర్క్యురీలా వర్క్‌ చేయటం మొదలుపెట్టింది. ఫ్రెండ్స్‌ అందరినీ వీలైనన్ని చాక్లెట్స్‌ కొనమని చెప్పా. ఆ రాపర్స్‌ని నేను కలెక్ట్‌ చేయసాగాను. ఎవరు దేనికి మనీ ఇచ్చినా ఆ చాక్లెట్స్‌నే కొనసాగాను. రాపర్స్‌ని చూసి ‘అవెందుకు?’ అడిగింది అమ్మ. ఆ యాడ్‌ చూపించా అమ్మకు. నవ్వుతూ ‘ఇప్పుడు రాపర్స్‌ కలెక్ట్‌ చేసి పంపితే బ్యాట్‌ వస్తుందా’ అని అడిగింది. వస్తుందని చాలా నమ్మకంగా చెప్పా. మొత్తానికి నా ఫ్రెండ్స్, నేను.. అందరం కలిసి యాభై రన్స్‌ అయితే చేశాం. ఇక నా బాధ చూడలేక అమ్మ ఆ చాక్లెట్‌ రాపర్స్‌ అన్నీ ప్యాక్‌ చేసి వాళ్లు చెప్పిన అడ్రస్‌కి పోస్ట్‌ చేసింది. నా ఆనందానికి అవధుల్లేవు.. మంచి బ్యాట్‌ రాబోతోందని! మా పోస్ట్‌మన్‌ని రోజూ అడగడమే నాకేమైనా పార్సిల్‌ వచ్చిందా.. అని! అలా దాదాపు రెండు నెలలు అతని వెంటబడ్డా! నేనతణ్ణి అడిగిన ప్రతిసారీ అతను నన్ను ఏం పార్సిల్‌ అంటూ ఎదురు ప్రశ్న వేసేవాడు. నేను చెప్పేవాడిని కాదు. 

ఎందుకంటే దొంగ ఎదుటివారినెప్పటికీ నమ్మడు. నాకు వచ్చే బ్యాట్‌ని అతను తీసేసుకుంటాడేమోనని నా అనుమానం. అలా రెండు నెలలు గడిచాయి. ఎలాంటి రిప్లయ్‌ రాలేదు. దాంతో నేను రాపర్స్‌ పంపిన అడ్రస్‌కి వారం వారం లెటర్లు రాయటం మొదలుపెట్టా. ఈలోపు నాన్నకు బిజినెస్‌ అవకపోటంతో ఆర్థిక ఇబ్బందులతో మేము ఊరు మారాల్సి వచ్చింది. నా బాధ వర్ణనాతీతం. ఆఖరికి మా ఫ్రెండ్స్‌కి, మా పక్కింటి అక్కకి.. నా పేరు మీద పార్సిల్‌ వస్తే తీసుకుని పెట్టుకొమ్మని చెప్పా! ఊరు మారిపోయాక కూడా మా పక్కింటి వాళ్లకు ఫోన్‌ చేసి.. చాలాసార్లు అడిగా పార్సిల్‌ ఏమైనా వచ్చిందా అని! ఆ క్రికెట్‌ బ్యాట్‌ వస్తుందని నేను చుసిన ఎదురుచూపులు కలిగించిన బాధ మాటల్లో చెప్పలేను. అలా నా బాల్యంలో నన్ను అంతలా ఎమోషనల్‌ డ్యామేజ్‌ చేసిన ఆ చాక్లెట్‌ కంపెనీ పేరు మహాలాక్టో! ఆ సంఘటన తర్వాత జీవితంలో ఆ చాక్లెట్‌ను ముట్టుకోలేదు’ అని చెప్పా.

ఇదంతా విన్న మా ఫ్రెండ్స్‌ కళ్లల్లో నీళ్లు తిరగడం గమనించా. అవతలి వాళ్ల బాధ విని కన్నీళ్లుపెట్టుకునే∙మంచి ఫ్రెండ్స్‌ ఉన్నారు నాకు అనుకున్నా. ‘కెలెడియోస్కోపిక్‌ మెమోరీస్‌’ అంటే మనం ఆ పర్టిక్యులర్‌ సందర్భంలో చాలా బాధ అనుభవించి ఉంటాం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఎవరికైనా ఆ జ్ఞాపకాలు చెప్పినప్పుడు చాలా ఫన్నీవేలో చెప్తాం’ అంటూ మా ఫ్రెండ్స్‌ని ఆ మూడ్‌ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించా. ఈలోపు ఫుడ్‌ రావటంతో నేను, అజయ్‌ ఇద్దరం గ్రౌండ్‌ ఫ్లోర్‌కి వెళ్లాం. çఫుడ్‌ తీసుకుని వెనక్కి వస్తుండగా మా అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ కొడుకు టిన్ను ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. 

‘ఎందుకు ఏడుస్తున్నాడు?’ అని మా వాచ్‌మన్‌ని అడిగా. ‘ఇవాళ వాడి బర్త్‌డే .. గిఫ్ట్‌గా క్రికెట్‌ బ్యాట్‌ కొనివ్వమని ఏడుస్తున్నాడు’ అని చెప్పాడు వాచ్‌మన్‌. మరుసటిరోజు ఉదయం ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు నా దగ్గరున్న క్రికెట్‌ బ్యాట్స్‌లో ఒకటి టిన్నుకి గిఫ్ట్‌గా ఇచ్చా. వాడి కళ్లల్లో కనపడిన ఆనందం మాటల్లో చెప్పలేను. వాడు నన్నో హీరోలా చూశాడు. వాడి జీవితంలో నన్నెప్పుడూ హీరోలానే గుర్తుపెట్టుకుంటాడు అనే ఆలోచన నాకూ ఆనందాన్నిచ్చింది. టైమ్‌ ట్రావెల్‌లో గతంలోకి వెళ్లి నాకు నేను క్రికెట్‌ బ్యాట్‌ని ప్రెజెంట్‌ చేసుకోలేకపోవచ్చు. కానీ టిన్నుకు ఇచ్చి.. ఆ హ్యాపీనెస్‌ని మాత్రం సొంతం చేసుకున్నా!  

  ఒకసారి ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక చాక్లెట్‌ కంపెనీ యాడ్‌ వచ్చింది.. అజయ్‌.. మార్నింగ్‌ నన్ను షాప్‌లో అడిగిన ప్రశ్నకి ఆన్సర్‌ దొరకబోతోందని ఇంట్రెస్టింగ్‌గా వింటున్నాడు. రాకేశ్‌ అండ్‌ విక్రమ్‌ కూడా!

మా కాలనీలో ఉన్న డాక్టర్స్‌ టీమ్‌ వర్సెస్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయీస్‌ టీమ్‌కి ప్రతి శనివారం క్రికెట్‌ మ్యాచ్‌ ఉంటుంది. ఫీమేల్‌ ఆడియన్స్‌ మ్యాచ్‌ చూడటానికి గ్రౌండ్‌కి వస్తూండటంతో మేం ఆడే క్రికెట్‌ మ్యాచ్‌కి విపరీతంగా క్రేజ్‌ పెరిగిపోయింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement