యువ కథ: చందమామ రావే! | Yuva Katha magazine stories | Sakshi
Sakshi News home page

యువ కథ: చందమామ రావే!

Published Sun, Jan 19 2025 11:16 AM | Last Updated on Sun, Jan 19 2025 11:17 AM

Yuva Katha magazine stories

రోజులాగే ఆ రోజూ సెల్‌లో అలారం మోగింది, కాకపోతే గంట ముందుగా. ఠక్కున లేచి అలారం ఆఫ్‌ చేశాడు అనంత మూర్తి. ‘అప్పుడే తెల్లారిందా’ మెల్లగా కళ్ళు తెరవకుండానే అడిగింది భార్య నీరసంగా.‘ఈరోజు త్వరగా వెళ్లాలని చెప్పానుగా. రాత్రి టెంపరేచర్‌ ఏమీ లేదుగా నీకు’ అడిగాడు.‘ఊహూ’తాకి చూడాలనిపించింది. కాని టైమ్‌ లేదు. లైట్‌ వేసి ముందురోజే తీసి వుంచుకున్న టవల్, షేవింగ్‌ కిట్‌ తీసుకుని బాత్రూమ్‌లోకి వెళ్ళాడు. ఇంకా పేపర్‌ కూడా రాలేదు. ముందు రోజు సండే బుక్‌ తీసుకుని తిరగేస్తూ కూర్చున్నాడు. ‘ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఇన్నాళ్లు పడిన కష్టానికి ఫలితం వచ్చే రోజు. వెళ్ళగానే ఆఫీస్‌ మొత్తం ఒక రౌండ్‌ వేయాలి. ఆ మహీధర్‌ని నమ్మలేం. ఏదీ సక్రమంగా చేయడు. 

ఎంట్రన్స్‌లో కుండీలన్నీ సరిగ్గా పెట్టించాడో లేదో. అసలే మబ్బు గాడు’ మనసులోనే అనుకుంటున్నాడు. చూపు పుస్తకం మీద ఉందే కానీ ఆలోచనలు మొత్తం ఆఫీస్‌లోనే ఉన్నాయి. టైమ్‌ అయిపోతోంది ఇంక లాభం లేదు అనుకుని కడుపు ఖాళీ అవ్వకపోయినా లేచి స్నానం ముగించుకుని బయటికి వచ్చాడు. అనంతమూర్తి మొదటి నుండి పని రాక్షసుడే. తన నిరంతర కృషే ఈరోజు తనకి జనరల్‌ మేనేజర్‌గా గుర్తింపు తెచ్చిందని పూర్తిగా నమ్ముతాడు. అందుకే కొత్త బ్రాంచ్‌ ఓపెన్‌ చేయాల్సి వచ్చినప్పుడు దాని పూర్తి బాధ్యత మూర్తి చేతిలో పెట్టింది కంపెనీ. 

ఈరోజు అది అన్ని బ్రాంచీల్లో కెల్లా అతి తక్కువ కాలంలో ఉన్నతమైన ఫలితాలను సాధించింది. తనని అభినందించడానికి సాక్షాత్తు కంపెనీ íసీఈవో రాబోతున్నారు.డ్రైవాష్‌ నుండి తెప్పించుకున్న సూట్‌కి ఉన్న ట్యాగ్‌ కట్‌ చేస్తూ భార్యకి చెప్తున్నాడు– ‘సాయంత్రం నాకు రావడానికి లేట్‌ అవ్వచ్చు, ఆఫీస్‌ వాళ్ళతో బయటకి వెళ్తాను. డిన్నర్‌కి రాను. నువ్‌ మందులేసుకుని పడుకో. రఘు, సుమ లేచాక చెప్పు రేపు వాళ్ళకి గుడ్‌ న్యూస్‌ చెప్తా అని!’ కార్‌ తీసుకుని ఆఫీస్‌ బ్యాగ్‌తో బయటకువెళ్తుంటే ఎదురైంది సుభద్ర.. ‘అమ్మగారు లేచారాండయ్య? జ్వరం తగ్గిందా?’‘ఆ..!’ అంటూ గడియారంలో టైమ్‌ చూసుకుంటూ కార్‌ ఎక్కి ఆఫీస్‌కి బయల్దేరాడు. 

దారిలోనే మహీధర్‌కి కాల్‌ చేశాడు. పూర్తిగా రింగ్‌ అయినా ఫోన్‌ ఎత్తలేదు. ‘ఇంత నిర్లక్ష్యం ఏంటో ఈ యువతకి. వీళ్ళు ఎలా పైకి వస్తారు. ఐదు రోజుల కష్టాన్ని రెండు రోజుల్లో తగలేస్తారు’ అనుకుంటూ అభిరామ్‌కి డయల్‌ చేశాడు. ‘హాలో.. ఆయన స్నానం చేస్తున్నారు. ఏదైనా ముఖ్యమైన విషయమాండి?’ అభిరామ్‌ భార్య ‘20 మినిట్స్‌లో ఆఫీస్‌లో ఉండాలని చెప్పండి’‘ఒక్కరిక్కూడా శ్రద్ధ లేదు. వాళ్ళ వయసులో నేను ఎంత పోటీ పడేవాడ్నో, ఏదో ఒక అవకాశం దొరకక పోతుందా ప్రూవ్‌ చేసుకోడానికని..’ పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఆఫీస్‌ చేరుకున్నాడు. 

మూర్తి లోపలికి వెళ్తుండగానే అటెండర్‌ రవి రావడం చూసి కొత్తగా తెప్పించిన కుండీలను ఎక్కడెక్కడ పెట్టాలో స్వయంగా చూపించాడు. అవన్నీ కూడా హరిశ్చంద్రగారు ఖాళీ సమయాల్లో గార్డెనింగ్‌ చేస్తానని ఇంటర్వ్యూలో చెప్పడం వల్లే.. విజిట్‌ గురించి తెలిశాక అప్పటికప్పుడు ఆర్డర్‌ చేసి రకరకాల బోన్సాయ్‌ మొక్కలు తెప్పించాడు. కార్పెట్‌ క్లీనింగ్‌ సరిగ్గా చేశారా లేదా అని చెక్‌ చేశాడు. కారిడార్‌ మొత్తం తిరిగి అన్ని విండోస్‌ ఓపెన్‌ చేసి చూశాడు. ఇంతలో అభిరామ్, మహీధర్‌ వచ్చారు. ‘పాత ఫైల్స్‌ అన్నీ సెపరేట్‌ షెల్ఫ్‌లోకి షిఫ్ట్‌ చేయించావా?’ ‘లాస్ట్‌ వర్కింగ్‌ డేనే చేశాం సర్‌’ మహీధర్‌ వెనకే నడుస్తూ చెప్పాడు. 

‘అప్‌ కమింగ్‌ ప్రాజెక్ట్‌ డీటేల్స్‌?’ ‘డేటా రెడీగా ఉంది సర్‌’ అభిరామ్‌ వైపు ప్రశ్నార్థకంగా చూసి తలాడిస్తూ చెప్పాడు మహీ. స్టాఫ్‌ అందరూ ఒక్కొక్కరూ రావడం గమనించి మూర్తి వారినుద్దేశించి చెప్పసాగాడు. ‘ఈరోజు మనకు ముఖ్యమైన రోజు. ఇంత వరకు మీరందరూ నాకు సహకరించినందుకు ఫలితం కొద్దిసేపట్లో మనం చూడబోతున్నాం’మాటల మధ్యలో అభిరామ్‌ ఫోన్‌లో మాట్లాడుతూ బయటకి లోపలికి తిరుగుతూనే ఉన్నాడు. అది కనిపెట్టిన మహీధర్‌ ‘అభి, ఎందుకలా తిరుగుతున్నావ్, ఎవరి కోసం చూస్తున్నావ్‌?’ అడిగాడు. ‘ఈ రవిగాడు అనుకున్నంత పని చేశాడు’‘రవి బొకే తేవడానికి వెళ్ళాడుగా?’‘ఔను, అలాగే ప్లంబర్‌ని కూడా తీసుకు రమ్మని నేనే పంపాను’
‘వార్నీ, నువ్వింకా ఆ ట్యాప్‌ ఫిక్స్‌ చేయించలేదా.. బాస్‌ ఇంకా చెక్‌ చేయాల్సింది వాష్‌రూమ్స్‌ మాత్రమే. ఆయన కంట పడిందో.. చిన్న పని కూడా చేతకాదు అని నెలంతా వాయించేస్తాడు.

 అయినా నీకు చెప్పాను చూడూ’ మహీధర్‌ తలపట్టుకున్నాడు. ‘నేను ఆరోజే రవికి చెప్పాను. వాడు చిన్న పనే అయిపోతుంది అన్నాడు. ఇందాకే నాతో చెప్పాడు ప్లంబర్‌ రాలేదని, ఏదేమైనా 10 నిమిషాల్లో తీసుకొస్తా అన్నాడు. అదే ఫోన్‌ చేస్తున్నా, తీయట్లేదు’ ఏం చేయాలో తెలీక నీళ్లు నములుతూ చెప్పాడు అభి.రవి వెళ్లి అరగంట దాటింది. టైమ్‌ 10 అయింది. సీఈవో గారు ఎప్పుడైనా రావచ్చు, ఇంకా ఈ ట్యాప్‌ ఫిక్సింగ్‌ ఇప్పుడు కాదు అనుకుని అభిరామ్‌.. మహీధర్‌ దగ్గరకి వచ్చి అదే చెప్పాడు. ‘నీకేం? నువ్‌ ఎన్నైనా చెప్తావ్, బాస్‌ చెప్పింది నీకు కాదు కదా. అసలు ఆరోజే నేను ఆ పని అయ్యాక వెళ్లాల్సింది. ఫ్రైడే ఈవెనింగ్‌ అని నీ హెల్ప్‌ అడిగాను చూడూ నా చెప్పుతో నేను కొట్టుకోవాలి’ కోపంగా మహీ లోపలికెళ్లి నెమ్మదిగా స్టాఫ్‌ వాష్‌రూమ్‌లోకి వెళ్లాడు.

ఫ్రైడే రోజు–‘నేను మీ కంటికి పిచ్చి వెధవలా కనిపిస్తున్నానా?’ సడన్‌గా ఫ్లోర్‌ మీద ప్రత్యక్షమయ్యాడు మూర్తి. అప్పటి వరకూ గుసగుసగా మాట్లాడుకుంటున్న స్టాఫ్‌ మొత్తం ఆగి ఎవరికి మూడిందా అని చూస్తున్నారు.. ఫ్లోర్‌ మొత్తం గుండు సూది పడినా వినిపించేంత సైలెంట్‌గా ఉంది. ‘టప్‌..!’ ఒక శబ్దం ‘ఏదో ఒకటి పెరికేసి నా మొఖాన కొడితే తప్పులన్నీ వెతికి పట్టుకునే డ్యూటీ నేను చేయాలా?’ పూనకం వచ్చినట్టు ఊగి పోతున్నాడు మూర్తి మహీధర్‌ మీద. మహీధర్‌ టీమ్‌లోని సంజన రాసిన ప్రోగ్రామ్‌లో మిస్టేక్స్‌ రిపీట్‌ ఔతున్నాయి. ఆడపిల్లలను మందలించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ముందే వాళ్ళ టీమ్‌ లీడ్‌ మీద విరుచుకుపడటం మూర్తికి అలవాటే! 
‘టప్‌! టప్‌!’  ‘ఏంటా శబ్దం?’ పక్కనే ఉన్న స్టాఫ్‌ వాష్‌రూమ్‌ వైపు అసహనంగా చూస్తూ అడిగాడు మూర్తి. 

వెంటనే తేరుకుని ‘వాష్‌రూమ్‌ నుండే వస్తున్నట్టుంది సర్‌’ మహీ నెమ్మదిగా చెప్పాడు. మూర్తి ఏదో అందుకునే లోపే ‘టప్‌..!’ మళ్లీ వచ్చింది. ‘అదేంటో చూడు..’ ఆదేశించాడు మూర్తి. వాష్‌ బేసిన్‌ అవుట్‌ లెట్‌ నుండి ఒక్కో చుక్క కారి సరిగ్గా కింద వాటర్‌ పోవడానికి ఉండే మెటల్‌ ప్లేట్‌ మీద పడుతున్నాయి. మెటల్‌ ప్లేట్‌ కింద ఖాళీ ఉండటం చేతనేమో ఆ శబ్దం స్పష్టంగా వినబడుతోంది.  ‘వాటర్‌ లీక్‌ ఔతుంది సర్‌’ డోర్‌ తీసి మెల్లగా చెప్పాడు మహీధర్‌. అది చూస్తున్న మూర్తి ఇంకా ఏం మాట్లాడకముందే ‘రవికి చెప్పి క్లియర్‌ చేయిస్తాను సర్‌’ అన్నాడు మహీధర్‌. ఈ రకంగా అయినా ప్రోగ్రామింగ్‌ విషయం వదిలేస్తాడన్న ఆశతో. మూర్తి సూటిగా మహీధర్‌ కళ్ళలోకి చూసి, ‘ఒక్క చుక్కే కదా అని వదిలేస్తే నాలుగు రోజుల్లో ట్యాంక్‌ ఖాళీ ఔతుంది. చిన్న తప్పైనా వెంటనే కట్టడి చేయాలి’ అని సంజన గురించి కూడా మందలించినట్టు చెప్పి వెళ్ళిపోయాడు. 

‘హమ్మయ్య.. ఈవాళ్టికి గండం గడిచింది’ అని మనసులోనే అనుకుంటూ సంజనకి వివరంగా చెప్పాడు. అటెండర్‌ రవి ఆరోజు కొన్ని అరెంజ్‌మెంట్స్‌కి బయటికి వెళ్లడంతో వచ్చాక ట్యాప్‌ విషయం చెప్పమని అభిరామ్‌కి చెప్పి వీకెండ్‌ పార్టీ ఉందని ఆఫీస్‌ టైమ్‌ అవ్వకముందే బాస్‌ వెళ్ళగానే బయల్దేరాడు మహీధర్‌. ఈరోజు– మూర్తి స్టాఫ్‌ అందరినీ ఎవరి పనులు వాళ్ళని చూసుకోమని మహీని మాత్రం తన రూమ్‌కి పిలిచాడు. వాష్‌రూమ్‌ వైపు చూస్తూ మూర్తి వెనకాలే నడుస్తున్నాడు. శబ్దం అయితే రావట్లేదు. ‘బహుశా నిన్నంతా సండే.. ఎవరూ వాడకపోవడం వలన వాటర్‌ లీక్‌ అవడం లేదేమో. ఏదైతే ఏం ఈ ఒక్క రోజూ గడిస్తే చాలు’ అనుకున్నాడు.

సీఈవోగారు ఒప్పుకుంటే లంచ్‌కి తీసుకెళ్లడానికి ఎక్కడ బావుంటుందో చూడమని అడిగాడు మూర్తి. టార్గెట్‌ ప్రమోషన్‌. జోనల్‌ వైజ్‌గా బ్రాంచెస్‌ టేక్‌ కేర్‌ చేయాలని. అది చెప్పడానికే సీఈవో డైరెక్ట్‌గా వస్తున్నారని మూర్తి ఎక్స్‌పెక్టేషన్‌. తను అనుకున్నదే జరిగితే సాయంత్రం స్టాఫ్‌ అందరికీ డిన్నర్‌ ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకు ఒక ప్లేస్‌ కూడా సెలెక్ట్‌ చేయమన్నాడు. ఈలోగా ప్లంబర్‌ను వెంటపెట్టుకొచ్చిన రవిని అభి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి సైలెంట్‌గా వాష్‌రూమ్‌లోకి పంపించాడు. ప్లంబర్‌కి అక్కడ ఏం చేయాలో చూపించి.. బయటికి చప్పుడు రాకుండా త్వరగా చేయమని, తను చెప్పేవరకూ బయటికి రావద్దని జాగ్రత్తలు చెప్పి, బొకేలు ఇవ్వడానికి బాస్‌ రూమ్‌కి వెళ్ళాడు రవి. 

అతను వెళ్లేసరికి ఫోన్‌లో మాట్లాడుతున్నాడు మూర్తి. ఫోన్‌ పెట్టేసి, బొకే టేబుల్‌ మీద పెడుతున్న రవికి చెప్తున్నాడు– ‘అవసరంలేదు బయటకే తీసుకురా. సర్, ఆల్రెడీ ఆన్‌ ద వే. ప్రయర్‌గా ఫినిష్‌ చేసుకుని వెళ్లాలని ముందే బయల్దేరారట. ఎనీ మినిట్‌ రీచ్‌ ఔతారు. నువ్వెళ్ళి మన స్టాఫ్‌ అందరికీ ఇన్ఫార్మ్‌ చెయ్‌. మహీ, టేక్‌ కేర్‌ ఆఫ్‌ ఎవ్రీతింగ్‌’ అంటూ రవితో పాటే బయటికి నడిచారు ఇద్దరూ. రవికి ఏం చేయాలో తెలీలేదు. అభి వంక బేలగా చూస్తూ వస్తున్నాడు. ఆల్రెడీ ఇందాక తిట్టిన తిట్లకే రవి మొఖం వాచిపోయింది. పెద్దసార్‌ వచ్చేస్తున్నారని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అందర్నీ చూస్తూ చెప్పి అభిని చూసి తల కిందకేసుకున్నాడు. 

నోరు తెరుద్దామనుకున్న అభి, వెనకే వస్తున్న మూర్తి, మహీధర్‌లను చూసి ఆగిపోయాడు. మూర్తి.. అభిని పిలిచి రిసీవ్‌ చేసుకోడానికి కొంతమంది స్టాఫ్‌తో బయటే ఉండమన్నాడు. చేసేదిలేక బయటికి నడిచాడు అభి. సీఈవో హరిశ్చంద్ర గారు వచ్చేశారు. కార్‌ దిగడంతోనే అందరూ దండలూ బొకేలతో విష్‌ చేసి లోపలికి తీసుకొచ్చారు. ప్రమిసెస్‌ చాలా బావుందని మెచ్చుకున్నారు. అందరూ ఆ క్రెడిట్‌ మూర్తిగారిదే అని ముక్తకంఠంతో చెప్పారు. మూర్తి చాలా పొంగిపోయాడు. సీఈవో ఒక్కొక్కరిని పలకరిస్తూ అభినందించారు. 

ఆ సంవత్సరం సంస్థ సాధించిన విజయాలు గర్వంగా చెప్తూ అందులో అధిక భాగం మీకే చెందుతుందని ఎంప్లాయీ‹స్‌ని ఉద్దేశించి చాలాసేపు మాట్లాడారు. అందరికీ బోనస్‌లు ప్రకటించారు. ‘అతితక్కువ కాలంలో మంచి ఫలితాలు తెచ్చినందుకు మీ అందరి కృషిని స్వయంగా అభినందించాలని వచ్చాను. ఈ విజయం వెనుక ఉన్న విజనరీ మైండ్‌ మూర్తి గారిని’ అని ముగించేలోపు ‘కెవ్వ్‌’ అనే కేక ఒకటి అప్పుడే వినిపించి అందరూ అవాక్కయ్యారు. అది వాష్‌రూమ్‌ నుండి వచ్చిందని తెలిసి రవి, అభి తర్వాత మహీ గతుక్కుమన్నారు. మూర్తికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏదో విందామనుకుంటే ఇంకేదో వినాల్సివచ్చింది. 

వాష్‌రూమ్‌ నుండి బయటకొచ్చిన స్టాఫ్‌ మెంబర్‌ అనురాధ ఏడ్వలేక నవ్వుతూ ‘సారీ సర్‌.. సడన్‌గా లోపల మనిషిని చూసేసరికి’
‘మనిషా, ఎవరు?’ హరిశ్చంద్రగారే అడిగారు. భయపడేంతగా ఎవర్ని చూసి ఉంటుందా అని మూర్తి కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అభిరామ్‌కి విషయం అర్థమై ఏం జరగబోతోందో ఊహించలేకపోతున్నాడు. ఒకచేతిలో పెద్ద ఇనుప రెంచితో మరోచేతిలో నల్లటి బ్యాగ్‌తో సన్నగా ఉన్న ఒక మనిషి బయటకొచ్చాడు. చిన్న చెక్స్‌ ఉన్న వైట్‌ హాఫ్‌ హ్యాండ్స్‌ షర్ట్, కాస్త పొట్టి ప్యాంట్‌తో మనిషి నీట్‌గానే ఉన్నాడు. ‘ఎవరు నువ్వు.. లోపలేం చేస్తున్నావ్‌?’ సూటిగా అతన్నే చూస్తూ అడిగారు హరిశ్చంద్ర గారు. మూర్తికి సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు పడినట్టు అయింది. సమాధానం చెప్తే తెలుసుకుందామని మూర్తి కూడా ఎదురు చూస్తున్నాడు. 

‘నా పేరు రాజు, ట్యాప్‌ రిపేర్‌ చేయనీకి ఒచ్చిన సార్‌‘‘రిపేర్‌ అయిందా?’‘అయింది సార్‌’‘ఎంతసేపటి నుండి చేస్తున్నావ్‌?’‘రొండు గంటలైంది’‘వాట్‌?’‘అది మొదటి 20 నిమిషాల్లోనే అయిపోయింది సార్‌’‘మరి లోపల ఎందుకున్నావ్‌ ?’రవి వంక చూసి మౌనంగా ఉండిపోయాడు రాజు. ‘రవీ, ఏంటిదంతా?’ మూర్తి కలగచేకున్నాడు. ‘సారీ సర్‌.. మీకు తెలియకుండా చేయించాలనుకోడం నా తప్పే’ రవి.. మూర్తికి దణ్ణంపెట్టి హరిశ్చంద్ర గారికి వివరించడం మొదలెట్టాడు. ‘సర్, నేను ఈపని శనివారమే చేయించాల్సింది. ఆరోజు నుండి ఎవరూ దొరక్కపోవడంతో నా స్నేహితుడ్ని బతిమాలి తీసుకొచ్చే సరికి ఉదయం లేట్‌ అయ్యింది. విషయం తెలిస్తే జీఎం సర్‌ కోప్పడతారని తెలియకుండా చేపించాలనుకున్నాను. ఇంతలో..’

‘అంటే ఇతను ప్లంబర్‌ కాదా?’ ‘ఔనని చెప్పలేం సర్, కానీ ఇతనికి ప్లంబింగ్‌ పని బాగానే వచ్చు. ఇతను ఈ పని ఆ పని అని కాకుండా అన్ని పనులూ చేస్తుంటాడు సర్‌. ఒక ఆటో ఉంది. కానీ రోజూ తిప్పడు. ఇలాగే చిన్న చిన్న రిపేర్లు, కరెంటు పని మెకానిక్‌ పని అన్నీ వచ్చు’‘ఓహో! అల్‌రౌండర్‌ అన్నమాట. కానీ అరగంటలో అయ్యే పనికి రెండు గంటలు ఎందుకు లోపలే ఉన్నావ్‌?’ రాజునే గమనిస్తూ అడిగారు హరిశ్చంద్ర గారు. ‘ఈ సారు కంగారుగా నాకాడికొచ్చి చిన్న పనుందని వెంటపెట్టుకుని వచ్చే. ఏదో అవసరం మీద వచ్చిన. నావల్ల ఏ ఇబ్బంది అయినా ఆయన పని పాడు చేసినటై్టతదని లోపల్నే ఉన్న.’ ‘నువ్వేమో ఫ్రెండ్‌ అంటున్నావ్, అతను సారంటున్నాడు?’ రవిని ప్రశ్నించారు హరిశ్చంద్ర గారు. 

‘సర్‌’ ఎలా చెప్పాలా అని మౌనంగానే ఉన్నాడు రవి. ‘ఇంకేదైనా దాస్తున్నారా మీ ఇద్దరూ కలిసి?’ అని హరిశ్చంద్ర అడగడంతో రవికి చెమటలు పట్టేశాయి. మూర్తికి చాలా ఇబ్బందిగా అనిపించింది. తన ముందే సీఈవో తన అటెండర్‌ని ప్రశ్నించడం ఒక ఫెయిల్యూర్‌లా ఫీలయ్యాడు. ‘అయ్యో సర్, ఇంతవరకు ఎలాంటి తప్పు జరగలేదు సర్‌. జీఎంగారు ఏ విషయంలో అయినా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు’ అని రాజుతో పరిచయం నుండి చెప్పడం మొదలుపెట్టాడు రవి. ‘నిజానికి ఇతన్ని నేను ఎప్పటి నుండో చూస్తున్నాను కానీ ఈరోజే కలిశాను. పోయిన వారం వినాయక నిమజ్జనానికి మా వీధిలో డాన్స్‌ వేస్తుంటే చూశా. 

ఆ రోజే మాట్లాడాలనుకున్నా కానీ హడావిడిలో కుదరలేదు. మళ్ళా ఒకరోజు తెల్లవారు ఝామున మా అత్తమ్మోళ్లని బస్టాండ్‌ నుండి తీస్కొస్తుంటే కాలవొడ్డు దగ్గర చిన్న పార్క్‌లో నలుగురు పిల్లలతో కలిసి యోగా చేస్తూ కనిపించాడు. ఆరోజు గుర్తు పట్టా. చిన్న పనికి ఆదివారం ఎవరూ రావట్లేదని నిన్నంతా ఫోన్లు చేస్తుంటే విని మా చంటోడు చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్‌ వాళ్ళ నాన్నకి పంపులు బిగించడం వచ్చు అని. ఈరోజు వేరే దారిలేక అనుమానంగానే ఇల్లు వెతుక్కుని వెళ్లాను. అడగ్గానే నాతో వచ్చాడు’మూర్తికి ఇదంతా అనవసరంగా తోచినా అనుమానించాల్సిన అవసరంలేదని మాత్రం ఇద్దరికీ స్పష్టమైంది. హరిశ్చంద్రగారికి రాజు ఓపిక నచ్చింది. ఇన్ని పనులొచ్చినా ఏ పనిలోనూ ఎందుకు కుదరలేదో తెలుసుకోవాలనిపించింది. 

‘నువ్వు యోగా టీచరా?’ రాజునే అడిగారు హరిశ్చంద్ర గారు. ‘కాదు సార్‌. ఆయన చూసిన నలుగురు నా పిల్లలే. దాదాపు ప్రతిరోజూ పొద్దున్నే నా భార్యతో పార్క్‌కి పోయి కాసేపు ఆసనాలు ఏసి ఎండకి తిరిగి ఇంటికొస్తాము. అందుకే ఆటో కొన్నాను. మేం ఎక్కడికైనా అందులోనే ఎల్లేది. ఎప్పుడైనా పని లేకుంటే నాలుగు రౌండ్లు వేసొస్తా’‘ఈ రోజుల్లో నలుగురు పిల్లలను పెంచడం భారం అనిపించలేదా?’‘అదేంది సర్‌.. నేను పెంచేడిదేముంది? ప్రకృతిలో పుట్టింది ఏదైనా పెరిగేటిదే కదా. వాళ్ళకి ఇంతబుద్ధి నియ్యాలె. ఇంత ముద్ద పెట్టాలె. ఆకాడికి ఐతే కష్టం చేయగలను. 

నా ఇంటిది పోరు పెట్టేటిది కాదు. మా ఇంట్లనే కాయకూరలు కుండీల్లో పాదు పెట్టింది. మేం తినగా పక్కనోళ్లు కొంచపోయి తోచింది ఇస్తరు. పైసా పైసా దాపెట్టి అపదకొస్తదంటది. నా పెద్ద కూతురు పలుకు బంగారం. ఈ ఏడు ఆరో తరగతికొచ్చింది. హనుమంతుడి గుళ్లో శ్లోకాలు పాడతది. ఆడికొచ్చే ఒక ముసలావిడ గొంతు కలిపింది. ఇప్పుడు ఆమెతోని తోల్కపోయి స్టేజీల మీద పాడిస్తది. మన ప్రయత్నం సుబ్రంగుంటే దారి కూడా సుగమంగుంటది కదా సార్‌’ చెప్తూనే వాళ్ళమ్మాయి గొంతు విన్నట్టు మైమరచి పోతున్నాడు రాజు. హరిశ్చంద్రతో పాటు మూర్తి, మిగిలిన స్టాఫ్‌ అందరూ కూడా ప్రశాంతంగా వింటున్నారు. 

‘మీ ఆవిడ సరే, మీ పిల్లలైనా అది కావాలి ఇది కావాలి అని అడుగుతారుగా?’ గురువు దగ్గర హితబోధ కోసం ఎదురుచూస్తున్నట్టు అడిగారు హరిశ్చంద్ర గారు. ‘అడుగుతారు సార్‌. చిన్నప్పుడు చందమామ కావాలని అడుగుతాము. అలాగని అడిగినోళ్ళని కొడతామా.. చందమామని కొంటామా! గిది అంతే. మొన్న మూడోవాడు పెద్ద టీవీ కావాలనీ, రోజూ ఎన్నో సినిమాలు చూడొచ్చని అడిగిండు. వాని కోరిక సమంగాదని ఎట్లా తెలియాలె. మర్నాడే బడి నుంచి వచ్చినాక ఆరుగురిమి శ్రీనివాస థియేటర్‌కి పోయి మహేష్‌ బాబు సినిమా చూపిచ్చి ఇంటర్వెల్‌లో అందరం కేకులు తిని మస్తు ఖుషీ అయి వచ్చినం. 

ఆ రేత్తిరి నా కొడుకును అడిగిన.. ఎట్లుంది నాయిన సినిమా? అని. ‘చానా బాగుంది నానోయ్‌.. మస్తుగుంది అన్నడు. నేనన్నా ‘మరి ఇంట్లో టీవీ కొని రోజూ చూస్తే ఆ మజా వస్తదా? నువ్‌ రోజూ బడి నించి వచ్చినాక చెల్లితోని ఆడుకోవాలే.. లెక్కలూ, పాఠాలు చదవాలే.. అమ్మతోని కథలు చెప్పించుకుంటా బువ్వ తినాలే.. డాబా మీద చుక్కలు చూస్తా పండుకోవాలే. మల్ల మనందరం థియేటర్‌కి పోయి సినిమా జూడాలే.. అని.’ అందరూ అప్రయత్నంగా చప్పట్లు కొట్టారు అభి, మహీతో సహా. హరిశ్చంద్ర గట్టిగా నవ్వుకున్నారు. మూర్తీ నవ్వక తప్పలేదు. అందర్నీ చూస్తూ రాజూ నవ్వడం మొదలుపెట్టాడు. హరిశ్చంద్రకి తన ప్రశ్నకి జవాబు దొరికిందనిపించింది. స్టాఫ్‌ అందరికీ సీఈవో స్పీచ్‌ కంటే రాజు స్పీచ్‌ బావుందనిపించింది.

 మూర్తికి ఎక్కడో కలుక్కుమనింది. గత వారం రోజులుగా జ్వరంతో నీరసపడిన భార్య, ఐదు నిమిషాలు కూడా తనతో నవ్వుతూ మాట్లాడలేని పిల్లలు జ్ఞాపకమొచ్చారు. ఆరోజు రాజుని కలవడం తనకెంతో ఆనందంగా ఉందని, తనని తీసుకొచ్చిన రవికి థాంక్స్‌ చెప్పి, ఆ అవకాశం మూర్తి వల్లనే వచ్చిందని అభినందించారు హరిశ్చంద్ర. మూర్తి ప్రమోషన్‌ గురించి చెప్పి, ఆయనే అందరినీ లంచ్‌కి తీసుకెళ్లాడు రాజుతో సహా! రాజు జీవితంలోనూ ఏదో ప్రమోషన్‌ ఉందనిపించింది. దాని కోసం ఇంట్లో కూడా కష్టపడాలని నిశ్చయించుకున్నాకే లంచ్‌లో అతడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు.మరిచిన రుచులను గుర్తుచేసే సందర్భాలు రావడమూ అదృష్టమే.

ఆల్రెడీ ఇందాక తిట్టిన తిట్లకే రవి మొఖం వాచిపోయింది. పెద్దసార్‌ వచ్చేస్తున్నారని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అందర్నీ చూస్తూ చెప్పి అభిని చూసి తల కిందకేసుకున్నాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement