బాల ఏసు పండుగ | Festival Ati atihan in the Philippines | Sakshi
Sakshi News home page

బాల ఏసు పండుగ

Published Sun, Jan 19 2025 1:55 PM | Last Updated on Sun, Jan 19 2025 1:55 PM

Festival Ati atihan in the Philippines

ప్రపంచంలోని చాలా చోట్ల శిలువ మీద ఉన్న జీసస్‌ను ఆరాధిస్తారు. ఫిలిప్పీన్స్‌లో మాత్రం బాల ఏసును ఆరాధిస్తూ పండుగ జరుపుకొంటారు. ‘అతి అతిహన్‌’ పేరుతో ఈ పండుగ చేసుకుంటారు. దీన్నే ‘కలిబో శాంటో నినో ఫెస్టివల్‌’ అని కూడా పిలుస్తారు. ఇది ఫిలిప్పీన్స్‌ అక్లాన్‌ ప్రావిన్స్‌ లోని పలు పట్టణాలలో ఘనంగా జరుగుతుంది. ‘హోలీ చైల్డ్‌’ లేదా ‘బేబీ జీసస్‌’ను గౌరవించుకుంటూ మత పెద్దలు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ పండుగలో బాల ఏసును ప్రత్యేకంగా కొలుస్తారు.

ప్రతి ఏడాది జనవరి నెలలోని మూడవ ఆదివారం రోజున ఈ పండుగ మొదలవుతుంది. ఈ ఏడాది  జనవరి 19న ఈ వేడుక జరుగుతోంది. ఫిలిప్పీన్స్‌ పండుగల్లో ప్రత్యేకంగా జరిగే ‘దినాగ్యాంగ్‌ ఆఫ్‌ ఇలోయిలో’, ‘సినలోగ్‌ ఆఫ్‌ సిబూ’ వంటి పండుగలకు కూడా ఈ ‘అతి అతిహన్‌’ పండుగే మూలమట! అందుకే ఈ పండుగను అక్కడివారు మదర్‌ ఫెస్టివల్‌ లేదా పెద్ద పండుగ అని పిలుచుకుంటారు. ఈ పండుగలో మతపరమైన ఊరేగింపులు, వీధి కవాతులు అద్భుతంగా జరుగుతాయి. రంగురంగుల దుస్తులు ధరించి నృత్యబృందాలు, కవాతు బ్యాండ్‌లు దుమ్ము లేపుతుంటాయి. ప్రజలంతా ముఖానికి, శరీరానికి రంగులు పూసుకుని, నృత్యం చేస్తూ ఈ ఊరేగింపుల్లో పాల్గొంటారు. 

ఈ ‘అతి అతిహన్‌’ వేడుక మూలాలు ఇప్పటివి కావు, క్రీస్తుశకం 1212 నాటివి. ఇండోనేషియా, మలేషియా, బ్రూనై దేశాల మధ్యనున్న బోర్నియో ద్వీపం నుంచి పారిపోయిన ‘డాటస్‌’ అనే పదిమంది మలయ్‌ అధిపతులు ఫిలిప్పీన్స్‌ లోని పనాయ్‌ ద్వీపంలో స్థిరపడ్డారు. ఆ పదిమంది బృందానికి పెద్ద అయిన ‘దాతు పుటి’ స్థానిక ‘అతి’ తెగ ప్రజలతో వ్యాపారం చేసేవాడు. ఒకసారి స్థానికంగా కరవు పీడిస్తుంటే, అక్కడి ప్రజలకు తినడానికి తిండి ఇచ్చి ఆదుకున్నాడు. దానికి కృతజ్ఞతగా ఆనాడే ఈ వేడుక మొదలైందని చెబుతారు. 

1960ల నాటికి, ఫిలిప్పీన్స్‌ పర్యాటక శాఖ స్థానిక పండుగలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించడంతో ఈ పండుగ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. 1972 నాటికి ఈ పండుగలో వాడే వస్త్రాల్లో కూడా చాలా మార్పు మొదలైంది. ఆఫ్రికా, పాపువా న్యూ గినీ తదితర దేశాలతో పాటు భారతీయ గిరిజన సంప్రదాయ వస్త్రధారణ కూడా ఈ వేడుకలో ప్రత్యేకంగా నిలుస్తుంది. 2012 నాటికి ఈ పండుగ యునెస్కో సాంస్కృతిక వారసత్వ వేడుకల జాబితాలో చోటు పొందింది. ఈ వేడుకను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఈ వేడుకలను చూడటానికి ఏడాది ముందు నుంచే ఇక్కడ రూమ్స్‌ బుక్‌ చేసుకుంటారంటే, ఇది ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవాల్సిందే!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement