ఏటా శరదృతువు ప్రారంభంలో యాపిల్ కోతల కాలంలో అక్కడ పండుగ జరుపుకొంటారు. ఊరంతా భారీస్థాయిలో యాపిల్‌పండ్ల ప్రదర్శనలు కనిపిస్తాయి. కూడళ్లలో యాపిల్‌పండ్లతో తీర్చిదిద్దిన కళాఖండాలు కనువిందు చేస్తాయి. ఈ విలక్షణమైన పండుగ స్వీడన్‌లో సిమ్రిషామ్ మునిసిపాలిటీ పరిధిలోని కివిక్ ప్రాంతంలో జరుగుతుంది. ‘కివిక్ యాపిల్ మార్కెట్ ఫెస్టివల్’గా పేరుపొందిన ఈ పండుగకు స్వీడన్ నలుమూలల నుంచే కాకుండా, యూరోప్‌లోని పలు ఇతర దేశాల నుంచి కూడా జనాలు పెద్దసంఖ్యలో వస్తుంటారు.
యాపిల్ కోతల పండుగ రోజుల్లో కివిక్ ప్రాంతంలోని పిల్లా పెద్దా అందరూ యాపిల్ తోటల్లోకి, శివార్లలోని చిట్టడవుల్లోకి వెళ్లి యాపిల్‌పండ్లను కోసుకొస్తారు. యాపిల్ బుట్టలు మోసుకుంటూ, సంప్రదాయ నృత్య సంగీతాల నడుమ ఊరేగింపులు జరుపుతారు. యాపిల్ విస్తారంగా పండే కివిక్‌ను ‘యాపిల్ కేపిటల్ ఆఫ్ స్వీడన్’ అని కూడా అంటారు. ఇక్కడి నుంచి రకరకాల యాపిల్‌పండ్లు పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి.
కివిక్‌లో జరిగే యాపిల్ పండుగను చూడటానికే కాకుండా, ఇక్కడి పురాతన రాతియుగం నాటి ఆనవాళ్లను, కాంస్యయుగానికి చెందిన మూడువేల ఏళ్ల నాటి శ్మశాన వాటికను, అందులోని ఆనాటి రాజు సమాధిని చూడటానికి కూడా పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులను మరింత ఆకట్టుకునేందుకు సిమ్రిషాన్ స్థానిక పరిపాలనా సంస్థ 1988 నుంచి ఇక్కడ యాపిల్ పండుగను వార్షిక వేడుకగా నిర్వహించడం ప్రారంభించింది. యాపిల్ పండుగ సందర్భంగా ఊళ్లో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికలపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు జరుగుతాయి. ఈ ఏడాది యాపిల్ పండుగ వేడుకలు సెప్టెంబర్ 28న మొదలయ్యాయి. ఈ వేడుకలు అక్టోబర్ 6 నాటితో ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment