ఆపిల్ జిలేబి
కావలసినవి: మైదా – 1 కప్పు, శనగ పిండి – 1 టేబుల్ స్పూన్, ఆపిల్ – 2 (తొక్క, గింజలు తొలగించి, ముక్కలు కట్ చేసుకుని మిక్సీపట్టి గుజ్జులా చేసుకోవాలి), గడ్డ పెరుగు, పంచదార – 1 కప్పు చొప్పున నీరు – సరిపడా, ఏలకుల పొడి – పావు టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, నెయ్యి – సరిపడా, ఫుడ్ కలర్ – కొద్దిగా (ఆరెంజ్ కలర్/ అభిరుచిని బట్టి)
తయారీ: ముందుగా ఒక పెద్ద బౌల్‌లోకి మైదా పిండి, శనగపిండి, పెరుగు తీసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో ఆపిల్ గుజ్జు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని, పాన్‌లో పంచదార, అర కప్పు నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. అందులో ఏలకుల పొడి, ఫుడ్ కలర్ వేసుకుని గరిటెతో తిప్పుతూ తీగ పాకం రాగానే.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరో కళాయిలో నెయ్యి వేసుకుని.. అందులో ఆపిల్–మైదా మిశ్రమంతో జిలేబీలు వేసి.. దోరగా వేగిన వెంటనే పాకంలో వేసుకుంటే సరిపోతుంది.
ఎగ్ టొమాటో కప్స్
కావలసినవి: టొమాటో – 6 (పైభాగం కొద్దిగా కట్ చేసుకుని, లోపల గుజ్జు అంతా తొలగించి బౌల్ / కప్పు మాదిరి చేసుకోవాలి), గుడ్లు – 6, మోజెరెల్లా చీజ్ తురుము – 100 గ్రాములు, ఉప్పు – తగినంత, మిరియాలపొడి – 1 టీ స్పూన్, కొత్తిమీర తురుము –కొద్దిగా, ఉల్లికాడ ముక్కలు – 1 టేబుల్ స్పూన్, మాయోనైజ్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్లు
తయారీ: ముందుగా ప్రతి టొమాటో కప్‌లో కొన్ని ఉల్లికాడ ముక్కలు, కొద్దిగా చీజ్ తురుము, మాయోనైజ్ క్రీమ్ వేసుకుని, ఒక్కో గుడ్డు పగలగొట్టి వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసి ఓవెన్‌లో బేక్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి గుడ్డు వేసుకునే ముందు కానీ తర్వాత కానీ చీజ్ తురుము వేసుకోవచ్చు. క్యారెట్ తురుము, బీట్‌రూట్ తురుము వంటివి కూడా అదనంగా కలుపుకుని బేక్ చేసుకోవచ్చు.
ఫ్రైడ్ మిల్క్
కావలసినవి: కార్న్ పౌడర్ – అర కప్పు+ 4 టేబుల్ స్పూన్లు, పంచదార – అర కప్పు, పాలు – 2 కప్పులు, మైదా పిండి – పావు కప్పు, నీళ్లు – అర కప్పు, బ్రెడ్ పౌడర్ – పావు కప్పు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ: ముందుగా కళాయిలో కార్న్ పౌడర్, పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో పాలు పోసుకుని పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. వెంటనే స్టవ్ ఆన్ చేసుకుని చిన్న మంట మీద.. అది దగ్గరపడే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. దగ్గర పడిన తర్వాత నెయ్యి రాసిన బౌల్‌లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని.. 2 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు అది మెత్తటి స్పాంజీలా తయారవుతుంది. దాన్ని నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి. తర్వాత రెండు బౌల్స్ తీసుకుని.. ఒకదానిలో మైదాపిండి, 4 టేబుల్ స్పూన్ల కార్న్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుని నీళ్లతో పలుచగా కలుపుకోవాలి. మరో బౌల్‌లో బ్రెడ్ పౌడర్ వేసుకుని.. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని మైదా మిశ్రమంలో ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి.. 10 నిమిషాల పాటు మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టాలి. అనంతరం నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.
సేకరణ: సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment