
సర్వాంతర్యామి అంటే ఎంతటి వాడు? ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? ఏ రూపలావణ్యాలను కలిగి ఉంటాడు... వంటి ప్రశ్నలు మదిని తొలిచేస్తుంటాయి. అదేవిధంగా తన రూపానికి కారణం ఏంటి? తన చుట్టూ ఉన్న దృశ్యమాన ప్రపంచం ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడిందనేవి నిరంతరం సమాధానాలు వెతుక్కునే ప్రశ్నలు. మానవుడు తనను తాను ఉత్కృష్ట రూపంగా, తన జన్మ మహోన్నతమైనదిగా ఊహించుకుని భగవంతుడు కూడా అదే విధంగా ఉంటాడనుకుంటాడు. మరింత శక్తిమంతుడు కాబట్టి, అనేక శిరస్సులు, బాహువులతో ఊహించుకుంటాడు. కానీ, ఉపనిషత్తుల్లోని జ్ఞానం మానవునికి ఆ భగవంతుని రూపాన్ని అనంతమైనశక్తిగా, ఇంద్రియాలు గ్రహించలేని సూక్ష్మరూపమైననూ, తాను లేని ప్రాంతంగాని, పదార్థాలు గాని లేనట్టి హేతువుగానూ తేల్చేసాయి. వేలప్రశ్నలకు, సందేహాలకు నిత్య నూతన సమాధానాలు ఉపనిషత్తులలో చూడగలం. ఉపనిషత్తులలో ఆధ్యాత్మికతను వెతికితే ఆధ్యాత్మికత, విజ్ఞానశాస్త్రాన్ని వెతికితే విజ్ఞాన శాస్త్రం, భగవంతుని వెతికితే భగవంతుడు కనిపిస్తాడు. అంటే ఈ మూడింటినీ సమాధానపరిచే అద్భుత జ్ఞానం వాటిల్లో ఉందన్నమాట. ఆత్మనైనా, అనంతశక్తినైనా, భగవంతుడినైనా జ్ఞానాన్ని ఆధారం చేసుకునే తెలుసుకోవాలి.
ఆ జ్ఞానం సాహిత్యరూపంలో నిండి ఉంది. అయితే, భగవంతుని అర్థం చేసుకోవడానికి ఇక్కడొక వెంట్రుకవాసి వ్యత్యాసం ఉంటుంది. కేవలజ్ఞానం ద్వారా ఆ అనంతశక్తిని తెలుసుకున్నా అది పూర్తిగా అవగతం కాదు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని, నిరంతర చింతన ద్వారా అటువంటి జ్ఞానాన్ని అనుభవిస్తామో, ఎప్పడైతే అలాంటి జ్ఞానాన్ని మనసులో రమింపజేస్తామో అప్పుడే ఆ పరమాత్మను లేక అనంతశక్తిని లేదా భగవంతుని సందర్శించగలుగుతాము. అప్పుడే ‘అహం బ్రహ్మాస్మి’ స్థితి సాధ్యమవుతుంది. అంటే ఆత్మకు, సాధకునికి మధ్య అభేదం ఏర్పడుతుంది. ఆ సాధకునికి పంచేంద్రియాల ద్వారా ఏ విషయాన్ని గ్రహించినా ఆత్మానందమే కలుగుతుంది. ఎందుకంటే ఈ దృశ్యమాన ప్రపంచం లోపలా, బయటా అంతటా తాను ఆ ఆత్మనే సందర్శించగలుగుతాడు. తనలో కూడా ఆ ఆత్మని అనుభవించగలుగుతాడు. అదే బ్రహ్మానందం. అదే ఆధ్యాత్మిక మకరందం. దానిని మించిన తీపి దొరకదు, దానిని మించిన ఆనందం లభించదు.
– రావుల గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment