good words
-
ఆ న్యాయస్థానంలో అందరూ జవాబుదారులే!
దైవ ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా అంటుండేవారు: మీలో ప్రతి ఒక్కడూ సంరక్షకుడే, జవాబుదారుడే. సావధానంగా వినండి: మీలో ప్రతి ఒక్కడూ (తమ తమ పరిధుల్లో) యజమానినే, సంరక్షకుడే. మీలో ప్రతి ఒక్కరిని, వారి సంరక్షణలో ఉన్న వారి బాపతు అడగడం జరుగుతుంది.వివరణ: ముస్లిం సమాజంలోని ప్రతి వ్యక్తి అనేక బాధ్యతలకు కట్టుబడి ఉన్నాడు. తనకు అందుబాటులో ఉన్నది, తాను ఖర్చు చేసే ప్రతి విషయం అల్లాహ్ అతనికి ప్రసాదించిన ఓ అమానతు. దైవానికి దాసునిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసినందువల్ల అల్లాహ్ తనకు అందించిన ఆ అమానుతును కొల్లగొట్టకుండా దాన్ని ఎంతో మేళకువగా పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే మరణానంతరం ఈ భూమిలో తనకు లభించిన ప్రతి వరాన్ని, ప్రతి శక్తిని, సామర్థ్యాన్ని గురించి ఎలాంటి మొహమాటం లేకుండా అక్కడ అడగడం జరుగుతుంది. ఒక ముస్లింగా మనిషి తాను పని చేసే పరిధిలో, శక్తి సామర్థ్యాల్లో స్వతంత్రుడు ఎంత మాత్రం కాడు, సరి కదా ఆ వరాలన్నింటికీ అతను సంరక్షకుడు. దైవ న్యాయస్థానం లో బాధ్యతలు, సంరక్షణకులకు సంబంధించిన పూర్తి రికార్డు ప్రశ్నల రూపంలో ఎదురవుతుంది. ఇస్లామీయ దేశాధ్యక్షుణ్ణి నేరుగాను, ఇస్లామీయ పాలనా వ్యవస్థలో, న్యాయవ్యవస్థలో పనిచేసే ప్రతి చిన్నా, పెద్దా అధికారుల్ని, ఉద్యోగుల్ని పరోక్షంగానూ హెచ్చరించడం జరిగింది. ఈ హెచ్చరిక ఏమిటంటే మీరు ఏ హోదాల్లోనైతే పనిచేస్తున్నారో లేక ఏ ఏ ప్రభుత్వ శాఖలకు ఇన్చా ర్జీలుగా ఉన్నారో ఎంతో న్యాయంగా దైవభీతి కలిగి మీ బాధ్యతలను నెరవేర్చే ప్రయత్నం చేయండి.పరలోకంలో అల్లాహ్ ఏర్పరిచిన న్యాయస్థానంలో మిమ్మల్ని నిలబెట్టి మీరు భూలోకంలో ఏ బాధ్యతలను నిర్వహించారో మీకు ఏ అమానతు అయితే అప్పగించడం జరిగిందో దాన్ని పూర్తిగా నిర్వర్తించారా లేదా అని అడగడం జరుగుతుంది జాగ్రత్త.ప్రతివాడు తన భార్య పిల్లల నైతికతలకు, విద్యాబుద్ధులకు కాపలాదారుడు. భార్య తన శీల సంపదకు, తన పిల్లల శిక్షణకు, భర్త ఆస్తికి, ఇంటిని నడిపేందుకు బాధ్యురాలు. భార్యాభర్తలను ఒకరి విషయాల్లో మరొకరిని బాధ్యులుగా, కాపరదారులుగా చేయడం జరిగింది. మొత్తానికి ప్రళయ దినం నాడు ప్రతివ్యక్తి తన జీవిత కర్మల చిట్టా చేతబట్టి అల్లాహ్ న్యాయస్థానంలో నిలబడవలసి ఉంది.ఇస్లామీయ రాజ్య పాలకుడు ఓ సంరక్షకుడు. అతనితో అతని రాజ్యంలోని ప్రజానీకం గురించి అడగడం జరుగుతుంది. ప్రతివాడు తన భార్య, పిల్లలకు యజమాని. అతడు తన బాధ్యతలను గురించి దేవునికి జవాబు చెప్పుకోవాల్సి ఉంది. ∙స్త్రీ (భార్య), తన భర్త ఇంటికి (అతని సంతానానికి) బాధ్యురాలు. గృహ సంబంధమైన బాధ్యతల గురించి ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. ∙నౌకరు తన యజమానికి; కుమారుడు తన తండ్రి ఆస్తికి సంరక్షకుడు. దేవుడు వారి బాధ్యతలను గురించి అడుగుతాడు. – మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
మంచి మాటల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
దయచేసి మనసు విప్పి మీతో మీరు మమేకం కండి లేదా ఇతరులతో అయినా మంచిగా మాట్లాడండి. నిజానికి మనుషులకు ఆ తీరికే లేదు. సెల్ఫోన్లు వచ్చాక..ఆ ఫోన్ చూసుకుంటూనే ఆఫీస్‌కి వెళ్తారు. మళ్లీ అలానే ఇంటికి వచ్చేస్తారు. ఆఖరికి ఇంటి దగ్గర అదే పని. దేన్ని ఎంతవరకు వాడాలో తెలియదో లేక వస్తువుల వ్యామోహంలో పిచ్చెక్కి మనిషి ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు. కానీ కాసేపు మన తోటి వారితో ఇరువురికి ఉపయోగపడే మంచి మాటాల మాట్లాడితే అవి ఎంతగా ప్రభావంతంగా పనిచేస్తాయో తెలుసా!. వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసా! ఐతే ఒక్కసారి ఈ కథ వినండి. ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు. వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని భావించి, తన వెయ్యేళ్ల తపశ్శక్తిని ఆయనకు ధారపోశాడు. వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు. కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశాడు. పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరూ మాట్లాడుకున్నారు. చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు, అప్పటి వరకు తాము మాట్లాడుకున్న మంచి విషయాల పుణ్య ఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్టు చెప్పాడు. దీంతో విశ్వామిత్రుడు చిన్నబోయాడు. తాను కానుకగా ఇచ్చిన వెయ్యేళ్ల తపోఫలానికి ఒక్క పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్య ఫలంతో ఏవిధంగా సాటి వస్తుందని అనుకున్నాడు. అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడిగాడు కూడా. తపోఫలం? సత్సాంగత్య ఫలం? రెండింటిలో ఏది గొప్పదో తెలుసుకోవడానికి ఇద్దరూ బ్రహ్మ వద్దకు వెళ్లారు. ఆయన విష్ణువు వద్దకు వెళ్లమన్నాడు. విష్ణువు, దీనికి పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలడని చెప్పి ఆయన వద్దకు పంపాడు. ఆయనేమో పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవరూ ఏ ఫలం గొప్పదో చెప్పలేరని తేల్చాడు. ఇద్దరూ కలిసి అక్కడకూ వెళ్లారు. వారిద్దరి సందేహం విన్న ఆదిశేషుడు సమాధానం చెప్పడానికి కొంత వ్యవధి కావాలని అడిగాడు. అప్పటివరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయాలని షరతు కూడా పెట్టాడు. తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచండని సలహా ఇచ్చాడు. దీంతో విశ్వామిత్రుడు వెంటనే 'నా వేయి సంవత్సరాల తపోఫలాన్ని ధారపోస్తాను. ఆ తపశ్శక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుంది’ అన్నాడు. అయితే భూమిలో ఏ చలనం లేదు. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు ‘ఒక్క పూట సమయంలో మేము చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్య ఫలం ధారపోస్తున్నాను. ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను’ అన్నాడు. వశిష్ఠుడు అలా అనగానే, ఆదిశేషుని తలపై ఉన్న భూమి చటుక్కున ఆకాశాన నిలబడింది. ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై పెట్టుకుని మీ ఇద్దరూ ఇక వెళ్లవచ్చు అని అంటాడు. అడిగిన దానికి బదులివ్వకుండా వెళ్లమంటే ఎలా? అని ఇద్దరూ ఆదిశేషుడిని నిలదీస్తారు. మీ ఎదురుగానే రుజువైంది కదా! ఏ తపోఫలం గొప్పదో? ఇక వేరే తీర్పు చెప్పడానికి ఏముంది?’ అని ఆదిశేషుడు బదులిచ్చాడు. వేయి సంవత్సరాల తపశ్శక్తి ధారపోసినా కదలని భూమి ఒక్క అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వలన కలిగిన పుణ్య ఫలాన్ని ధారపోయడం వలన ఇట్టే ఆకాశంలో నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు, వశిష్ఠుడు గ్రహిస్తారు. చూశారుగా! మంచి మాటల ప్రభావమెంతో? ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మన మధ్య మంచి మాటలు తగ్గిపోతున్నాయి. ఒంటరిగా ఉన్నా..ఏ ఇద్దరు కలిసినా సెల్ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. నిజానికి దానితోనే పుణ్య కాలం కాస్తా గడిచిపోతోంది. ఇక మనం మనసు విప్పి మనతో మనం, ఇతరులతో మనం మంచి మాటలు ఎప్పుడూ మాట్లాడతామో కదా!. (చదవండి: స్నానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు.. నీరు లేకుండా స్నానం చేయొచ్చని తెలుసా!) -
మంచి మాట: దిద్దుకోవలసిన తప్పులు
మానవ జీవనాన్ని, మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వాటిల్లో ప్రధానమైనవి తప్పులు. ఆచరణల్లోని తప్పులు మాత్రమే కాదు ఆలోచనల్లోని తప్పులు కూడా మానవాళికీ, ప్రపంచానికీ అనాదిగా హానిచేస్తూనే ఉన్నాయి. ఆత్మావలోకనం చేసుకుంటే మనం చేసిన తప్పులవల్ల మనకు ఎంత హాని జరిగిందో, మన తప్పులవల్ల ఇతరులకు ఎంత హాని జరిగిందో మనకే తెలిసిపోతుంది. చరిత్రను అవలోకిస్తే దేశాలకూ, ప్రపంచానికీ తప్పులు ఎంత హాని చేశాయో తెలిసిపోతుంది. హిట్లర్ తప్పులవల్ల ప్రపంచయుద్ధమే జరిగి తత్ఫలితంగా కలిగిన వినాశనం మనకు తెలిసిందే. పెద్దస్థాయిల్లో జరిగిన తప్పులవల్ల సామాన్య ప్రజలు విలవిలాడిపోయిన కథనాన్ని చరిత్ర మనకు చెబుతూనే ఉంది. కళ, భాష, సాంస్కృతిక రంగాలకూ తప్పులవల్ల హాని జరుగుతూనే ఉంది. కొన్ని దశాబ్దుల క్రితం చోటు చేసుకున్న తప్పులవల్ల తెలుగు సాహిత్యానికే కాదు భాషకు కూడా జరిగిన పెనుహాని ఇవాళ క్షేత్రవాస్తవంగా మనకు తెలుస్తూనే ఉంది. తప్పులవల్ల మనం తప్పులతోనే ప్రయాణం చేస్తున్నాం; తప్పులవైపే ప్రయాణం చేస్తున్నాం; తప్పులతో మనం మమైకమైపోయాం. తప్పులకు ప్రతి మనిషీ గురయ్యాడు; బలయ్యాడు. విద్యలోని తప్పులు, వృత్తిలోని తప్పులు, వ్యవహారాల్లోని తప్పులు, ఆచారాల్లోని తప్పులు, మతపరమైన తప్పులు, విశ్వాసాల్లోని తప్పులు, ప్రవర్తనల్లోని తప్పులు వీటివల్ల మనిషి జీవితం తప్పులమయం అయిపోయింది. ఫలితంగా మనిషి ఒక తప్పుడు జీవి అయిపోయాడు! మనిషి చేస్తున్నట్లుగా, చేస్తున్నంతగా జంతువులు తప్పులు చెయ్యడం లేదు! మనుషులు చేసిన, చేస్తున్న తప్పులవల్ల మానవప్రపంచానికే కాదు జంతుజాలానికి కూడా హాని జరుగుతోంది. చాల తప్పులు చలామణిలోకి వచ్చేశాయి. చాపకింద నీరులా తప్పులు మనలోకి రావడం కాదు కొనసాగుతున్న వానలా తప్పులు మనపై పడ్డాయి, పడుతున్నాయి.. అందువల్ల మనం తడిసిపోతూ ఉండడం కాదు, ఆ తప్పులు చప్పుడు చెయ్యని నిప్పులుగా అయిపోవడం వల్ల మనం మనకు తెలియకుండానే వాటికి కాలిపోతూ ఉన్నాం. చాల కాలంగా తప్పులతో, తప్పులలో, తప్పుల కోసమే బతుకుతున్నామా అన్నట్లుగా మనం బతుకుతున్నాం. దానికి పర్యవసానంగా చాల కాలంగా తప్పులు మనల్ని శిక్షిస్తున్నాయి... బతకుతున్నాం అనడానికి ఋజువుగా నిత్యమూ మనం తప్పులవల్ల శిక్షను అనుభవిస్తూ ఉన్నాం. అయినా మనకు తప్పుల విషయమై ఉండాల్సిన అవగాహన రావడంలేదు. చరిత్రలోని తప్పులు, తప్పుల చరిత్ర... వీటి నుంచి మనం పాఠాలు నేర్చుకోలేదు. అందుకే మనల్ని భయాలు, అందోళనలు, ఆపదలు, గందరగోళం చుట్టుముట్టాయి, చుట్టుముడుతున్నాయి. గతంలోని తప్పులతో మనం పోరాడడం లేదు. వర్తమానంలోని తప్పుల గురించి మనం ఆలోచించడంలేదు. భవిష్యత్తులో తప్పులవల్ల జరగనున్న విపత్తుల్ని గ్రహించడం లేదు. తప్పు జరగడం, తప్పు చెయ్యడం అనేవి మనిషికి సహజమైనవే. కానీ తప్పే జరుగుతూ ఉండడం, తప్పే చేస్తూ ఉండడం సహజం కాకూడదు. మన తప్పుల్ని, మనలోని తప్పుల్ని తెలుసుకోలేకపోతే మనం నేరస్థులం అవుతాం.తప్పులవల్ల వర్తమాన, భవిష్యత్తుల్లో మనం ముప్పుల పాలు కాకూడదు. ప్రతి సంవత్సరమూ ధనుర్మాసంలో మన ముందుకు వస్తూ ఉండే తిరుప్పావై పాసురాలలో ఒక చోట ఆణ్డాళ్ చెప్పింది: ‘దామోదరుణ్ణి నోరారా గానం చేసి, మనసారా ధ్యానిస్తే జరిగిపోయిన తప్పులూ, జరగబోయే తప్పులూ మంటల్లో దూదిపింజలైపోతాయి’. జరిగిన, జరగబోయే తప్పులు కాలి భస్మం అయిపోవాలని 1,200 యేళ్ల క్రితమే ఇలా ఇంత గొప్పగా ఆశంసించడం జరిగింది. మన తప్పులు, మన చుట్టూ ఉన్న తప్పులు కాలిపోకపోతే ఆ తప్పులకు మనం కాలిపోతాం. సరైన మనస్తత్వంతో, వివేకంతో మనలోని తప్పుల్ని తొలగించుకోవాలి; మనం ఒప్పుల్ని ఒంటబట్టించుకోవాలి; ఆపై మనం క్షేమంగానూ, మేలైనవాళ్లంగానూ బతకాలి. – రోచిష్మాన్ -
మాటే సోపానం
ఇంటిని చక్కదిద్దుకోవడంలోనే కాదు వంటలు, ఆటలు, కళలు, రకరకాల వృత్తులు, వ్యాపారాలు .. ఇదీ అన్ని చెప్పలేనంత ప్రతిభను మహిళలు మాత్రమే కనబరుస్తారు. వీటన్నింటిలో రాణించాలంటే అవసరమైనది మంచి మాట. ‘నలుగురితో ఎలా మెలగాలో తెలుసుండటంతో పాటు ‘మంచి మాట’ కూడా తోడైతే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోగలరు అని వివరిస్తున్నారు డాక్టర్ డి.కల్పన. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉంటున్న ఈ పబ్లిక్ స్పీకింగ్ ట్రెయినర్ గృహిణిగా ఉన్న తన జీవితమే ‘మాట’ను ఉపాధిగా మార్చుకోవడానికి ఉపకరించిందని తెలియజేశారు. ‘‘డిగ్రీ పూర్తి చేసిన నాకు పెళ్లి తర్వాత ‘మాట’ సమస్య వచ్చింది. కొన్నాళ్లు నలుగురిలో మాట్లాడటానికి జంకడం నాకు నేనుగా గమనించాను. అది గుర్తించి ఈ సమస్య నుంచి బయటపడాలనుకున్నాను. అందుకు నా కుటుంబం మద్దతుగా నిలిచింది. సమస్య నుంచి బయట పడ్డాను. నాలాగ మొదట మాట తడబడటం అనే సమస్య చాలా మందిలో ఉండటం గమనించాను. కొందరు ‘మాట’తో ఎంతగా వృద్ధిలోకి వస్తున్నారో గమనించాను. కొందరు ప్రతిభ ఉన్నా వెనకంజలో ఉంటున్నవారినీ చూశాను. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు. అప్పుడే ‘పబ్లిక్ స్పీకింగ్’ కాన్సెప్ట్‌పై శిక్షణ అవసరం గ్రహించి, ఇంట్లోవారితో చర్చించాను. అందకు నాకు పూర్తి మద్దతు లభించింది. మీడియా జంక్షన్ పేరుతో పబ్లిక్ స్పీకింగ్పైన 18 ఏళ్లుగా శిక్షకురాలిగా ఉన్నాను. తరగతులకు వచ్చేవారిలో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారి నుంచి రాజకీయాల్లోకి రావాలనుకున్నవారు, వచ్చినవారూ పాల్గొన్నారు. వారందరికీ చెప్పిన విషయాల్లో ముఖ్యమైనవి... భయం గడప దాటాలి ప్రతి ఒక్కరిలోనూ వారి మనసు పొరల్లో ఎన్నో అంశాల దాగి ఉంటాయి. కానీ, వాటిని బయటకు సరిగ్గా వ్యక్తపరచలేరు. కొందరు వ్యక్తపరిస్తే ఆహ్లాదంగా ఉంటుంది. మరికొందరి మాటలను అస్సలు వినలేం. ఎదుటివారిని నొప్పించకుండా ఒప్పించగల నేర్పుతో ‘మాట’ ఉండాలంటే సాధన అవసరం. దానికి ముందు ‘ఏం మాట్లాడితే ఏం అనుకుంటారో’ అనే భయాన్ని వదిలిపెట్టాలి. తల్లిగా పిల్లలతో కథల రూపేణా, వారి విషయాలు కనుక్కోవడంలోనూ మాట్లాడుతూ ఉండాలి. పేరెంట్ టీచర్ మీటింగ్స్‌లో పాల్గొని అక్కడి టీచర్స్‌తో మాట్లాడాలి. అలాగే, ఇంటికి ఎవరో ఒకరు అతిథులుగా వస్తారు. వారితోనూ మాట కలపచ్చు. కాలనీలు, అపార్ట్మెంట్లలో గెట్ టుగెదర్ లాంటివి ఏర్పాటు చేసుకొని, మీరు చెప్పాలనుకున్న విషయాన్ని తెలియజేయాలి. వచ్చిన చిన్న అవకాశాన్నే అయినా ఉపయోగించుకొని మాట్లాడుతూ ఉంటే అదే సరైన దారి చూపుతుంది. మాట్లాడటం అనే కళను ఒంటపట్టేలా చేస్తుంది. చిన్న చిన్న పార్టీలే మాటకు వేదికలు మాట మనపైన మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకు మహిళలకు తరచూ తారసపడేవి నలుగురైదుగురితో ఏర్పాటుచేసుకునే కిట్టీపార్టీ, బర్త్ డే పార్టీ, చిన్న చిన్న వేడుకలలో ఒక యాక్టివిటీ ప్రోగ్రామ్‌ను ఏర్పాటుచేసి, అందులో పాల్గొనాలి. ఒక్కొక్క పాయింట్ మీద ఒక్క నిమిషం మాట్లాడాలి. ఉదాహరణకు.. క్యాండిల్ కేర్, పెన్ను, పుస్తకం, బెలూన్స్.. ఇలా మీ కళ్ల ముందు ఉన్న వస్తువులను ఉపయోగించుకుంటూ దాని ప్రాముఖ్యాన్ని బయటకు వ్యక్తపరచడం అన్నమాట. మాటతో సమస్యలు దూరం డాక్టర్ మాట ద్వారానే సగం జబ్బు తగ్గిపోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే లాయర్లు కూడా మాట ద్వారానే రాణించాలి. కొన్ని సార్లు మాట కటువుగా, కొన్నిసార్లు మృదువుగా ఉండాలి. ఎక్కడ ఆపాలి, స్వరం ఎక్కడ పెంచాలి అనే విషయాల్లో మనకు పూర్తి ఆత్మవిశ్వాసం వస్తే కోరుకున్న రంగాల్లో కోరుకున్న ప్రగతి సాధించడానికి ‘మాట’ ఎంతగానో సాయపడుతుంది. ‘మాట’ సరైన విధంగా ఉపయోగించకపోతే ఆ ‘మాట’నే వారికి అథఃపాతాళానికి చేరుస్తుంది. ఈ విషయాన్ని కూడా ఎప్పుడూ గుర్తుంచుకొని వృద్ధిలోకి రావడానికి ‘మాట’ను మంత్రంగా ఉపయోగించుకొని ఎదుగుదలకు సోపానంగా మలచుకోవాలి’’ అని వివరించారు ఈ ట్రెయినర్. బొమ్మలతో స్పీచ్ సాధ్యమే నలుగురైదుగురు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఒక చోట చేరినప్పుడు ఒక బాక్స్‌లో చిన్న చిన్న బొమ్మలు, వస్తువులు వేసి... ఎవరికి ఏ వస్తువు వస్తే ఆ టాపిక్ మీద నిమిషం సేపైనా మాట్లాడాలి. దినపప్రతికల్లో వచ్చిన ఏదైనా ఒక వార్త తీసుకొని మాట్లాడవచ్చు. మా దగ్గర నాలుగు రోజుల ప్రోగ్రామ్ స్పీకింగ్ కోర్స్‌లో, ఒకరోజు ఫుల్ డే కేటాయిస్తాం. అందుకు అందరికీ వీలున్న సెలవురోజున ఎంచుకుంటున్నాం. డాక్టర్ డి. కల్పన – నిర్మలారెడ్డి -
శతక నీతి – సుమతి..: వారి వెంట ఉంటే చాలు!
సత్పురుషులు అంటే కచ్చితంగా ఇలానే ఉంటారు అని చెప్పలేం. మంచి గుణాలతో మాత్రం ఉంటారు. రామ్ చరిత్ మానస్ లో తులసీదాస్ గారు సత్పురుషులను మూడు వర్గాలుగా విభజించారు. గులాబీ చెట్టు మంచి పూలు పూస్తుంది. చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. మంచి వాసనలు ఉంటాయి. కానీ ఆ చెట్టుకు కాయలుండవు. పండ్లుండవు. ఒకరకం సత్పురుషులు ఈ గులాబీ చెట్టులాంటివారు. మంచి మాటలు చెబుతూ సమాజాన్ని నడిపిస్తుంటారు. వారు ఎవరికీ అపకారం చేయరు. ఎవరినీ పాడు చేయరు. కానీ వాళ్ళు మంచి పనులు అదే పనిగా చేస్తున్నారా అంటే చెప్పడం కొద్దిగా కష్టమే. మామిడి చెట్టు ఉంటుంది. పూత పూస్తుంది, కాయా కాస్తుంది. పండ్లూ వస్తాయి. రెండో రకం సత్పురుషులు ఇలాటి వారు. మంచి మాటలు చెబుతారు. మంచి పనులూ చేస్తుంటారు. రెండూ ఉంటాయి తప్ప మంచి మాటలు చెప్పి పనులు చెయ్యకుండా కూర్చునే రకం కాదు. తమతో ఉన్న వాళ్ళను తమ వెంట తిప్పుకుంటూ అందరితో మంచి పనులు చేయిస్తుంటారు. పనస చెట్టు ఉంది. మామిడి కాయ లేదా పండయితే ఒకరికే సరిపోతుంది. పనసపండును పదిమందికి పంచవచ్చు. ఈ రకం వారు మంచి మాటలు అదే పనిగా చెప్పరు. కానీ మంచి పనులు మాత్రం ఆపకుండా చేసుకుంటూ పోతుంటారు. ఇదీ తులసీదాసుగారి వర్గీకరణ. ఇటువంటి సత్పురుషులతో కలిసి మెలిసి తిరుగుతుంటే మనం కూడా పూజార్హత పొందుతాం. వారితో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మంచిపనులు చేస్తూ పోతుంటాం. వారి త్యాగశీలత, నిస్వార్థంగా పనిచేసే తత్త్వం, అంకిత భావం, సమాజం పట్ల ప్రేమానురాగాలవంటి గుణాలను వారు చెబుతూ ఆచరించి చూపుతుంటే ... వాటి ప్రభావం మన మీద కూడా గాఢంగా పడుతుంది. క్రమేణా జీవితం దానికి అలవాటు పడి మనలో ఉన్న దుర్గుణాలు వాటతంట అవే మాయమయిపోతుంటాయి. సత్పురుషులతో సహవాస గొప్పదనాన్ని చెప్పడానికి రామకృష్ణ పరమ హంస ఒక ఉదాహరణ చూపుతుంటారు. ఒక ఏనుగు దారివెంట నడిచి వెడుతుంటూంది. కొబ్బరి చెట్టు కనపడితే కొబ్బరి కాయలను తొండంతో తుంపి నోట్లో వేసుకుంటుంది. అరటి చెట్టు కనబడితే ఆకులను పట్టి లాగేస్తుంది, చింపేస్తుంది. అంతవరకు దాని మీద కూర్చున్న మావటి పట్టించుకోడు. అక్కడ అరటి గెలలను తొండంతో పట్టుకుని లాగేయపోతుండగా... అంకుశం గుచ్చే ప్రయత్నం చేస్తాడు.. వెంటనే అది తొండాన్ని వెనక్కి తీసేసుకుంటుంది. సత్పురుషులు మావటిలాంటి వారు. మనం పనికిమాలిన పనులు చేస్తున్నా, అనవసర మాటలు మాట్లాడుతున్నా... మృదువుగానే మనల్ని మందలిస్తారు. మనల్ని చక్కదిద్దుతారు. నిజానికి వారు ప్రత్యేకించి మనల్ని పట్టించుకోనక్కరలేదు. వాళ్ళ సాహచర్యంలో అటువంటి పనులు చేయడానికి, అధిక ప్రసంగాలకు ఆస్కారముండదు. ధూళికణమయినా గాలితో కలిస్తే పైకెగిరినట్టు సత్పురుషుల సాంగత్యం మనల్ని ఉన్నతంగా నిలుపుతుంది. వారి సాంగత్యం లేకపోయినా నష్టమేదీ నేరుగా అనుభవంలోకి రాదు కానీ దుర్జనులతో కలిస్తే మాత్రం హాని జరిగితీరుతుందని చెప్పడానికే బద్దెనగారు –‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ హెచ్చరిస్తున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
చెవులు జాగ్రత్త..!
‘‘వినదగునెవ్వరు సెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ !’’..అన్న బద్దెనగారి పద్యాన్ని చూద్దాం. భగవంతుడు మనకు రెండు చెవులు, ఒక నోరు ఇచ్చాడు. నిజానికి మనం అనేక విషయాలను తెలుసుకోవడం చెవుల ద్వారానే సాధ్యం. ‘భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః..’’ అంటుంది వేదం. అంటే –మా చెవులు భద్రముగా ఉండుగాక, ఎల్లవేళలా అవి శుభప్రదములైన వాటినే వినుగాక...’’ అని. ఎంతమంది చెప్పిన మంచి మాటలు వింటే అంత గొప్ప శీలవైభవం ఏర్పడుతుంది. వాటిని ఎప్పుడూ వింటూ ఉండాలి. అయితే వినేటప్పుడు ఏవి మంచిమాటలో ఏవి హానికరమో మనకు ముందుగా తెలియదు కదా..అందుకే ఎవరు ఏది చెప్పినా వినగలగడం వాటిలో మంచిని స్వీకరించగలగడం అనేది ఒక గొప్ప కళ. ఈ నేర్పరితనం మనకు రావాలంటే... మహాత్ములయిన వారితో కలిసి తిరుగుతూ ఉండాలి. అటువంటి వారు చెప్పే మాటలతో ... ఒక గ్రంథాలయంలో కూర్చుని చదివితే లభించే సమాచారం కన్నా ఎక్కువగా దొరుకుతుంది.. అదికూడా వివేకం, విచక్షణా జ్ఞానంతో కలిసి లభిస్తుంది. అందుకే రామాయణంలో ... రావణుడితో మారీచుడు మాట్లాడుతూ... ‘‘సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః ’ అప్రియతస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ’’..అంటాడు. లోకంలో మనం తప్పు చేస్తున్నామని తెలిసి కూడా ..‘‘బాగుంది. మంచిపని చేస్తున్నావు. నీకిష్టమయింది నీవు చేయకపోతే ఎవరు చేస్తారు, నీ సంతోషం కన్నా గొప్పదేముంటుంది !..’’ అంటూ మనల్ని తప్పుత్రోవలో ప్రోత్సహించేవారు చాలా మంది కనబడతారు. కారణం? ‘‘ఇప్పుడు వీడికి మంచి చెప్పినా వింటాడాం ఏం!’’ అనుకుంటారు. అంతే తప్ప ‘ఇది తప్పు. నీవిలా చేయవద్దు’ అని చెప్పేవారు చాలా చాలా అరుదుగా ఉంటారు. నిజంగా మన అభివృద్ధిని కోరుకునేవారు, మనమంటే ప్రేమాభిమానాలు ఉన్న... తాతలు, తల్లిదండ్రులు, గురువులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, మేనమామ, మేనత్తలవంటివారు... మన మనసు కష్టపడుతుందని తెలిసినా, మనకు ఏది మంచో ఏ మాటలు ఆచరణలో పెడితే మనం వద్ధిలోకి వస్తామో... అటువంటివి నిర్మొహమాటంగా మనకు చెపుతారు. సాలగ్రామం ఎక్కడుంటుంది? రాళ్లకుప్పలోనే కదా! అన్ని రాళ్లు పరిశీలనగా వెతుకుతుంటే సాలగ్రామం దొరుకుతుంది. అలాగే అక్కరలేని మాటలు, మన మనసును ఆకట్టుకోవడానికి మనకు హానికరమని తెలిసి కూడా ప్రీతితో అదే పనిగా పొగుడుతూ మాట్లాడే మాటలు.. అప్పటికి మన మనసుకు ఆహ్లాదం కలిగించినా వాటిని గుర్తెరిగి మసలుకోవాలి. రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ‘చేతులకు నూనె రాసుకొని పనస తొనలు తీసేవాడికి దాని పాలజిగురు అంటదు. అంతే. జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప అసలు ప్రయత్నం మానకూడదు.. వినాలి ఎవరు ఏది చెప్పినా వినాలి. వాటిలో మనకు ఉపద్రవాన్ని తెచ్చిపెట్టేవాటిని వదిలేయాలి. అదే మారీచుడు చెప్పింది... హితం కోరి చెప్పేవాడి మాట మనసుకు కఠినంగా తగిలినా...స్వీకరించాలి. మంచి చెప్పేవాడు దొరకనే దొరకడు. అటువంటివాడు దొరికినా ఓపికగా వినేవాడు దొరకడు. మంచి చెప్పేవాడు, శ్రద్ధగా హితోక్తులు వినేవాడు ఒకేచోట సర్వసాధారణంగా దొరకరు. దొరికితే అది తీర్థం. అది క్షేత్రం. కారణం– ఫలితం వారిద్దరికే కాదు దేశకాలాలతో సంబంధం లేకుండా అందరికీ అన్వయం అవుతుంది. సూక్తి సుధ ► జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకూడదు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ► నేను ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు దాని అర్థం నేను తప్పిపోయానని కాదు. ► ఎప్పుడూ పొందనిది కావాలంటే ఎప్పుడూ చేయని కృషి చేయాలి. ► భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడు భయపడేవారు ఏమి సాధించలేరు. ► సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పిల్లలకు మంచిమాటలు నేర్పిస్తున్నారా?
సమాజం అభివృద్ధి అనుకరణతోనే సాగింది. ముఖ్యంగా భాష పెంపొందేది దీనితోనే. పిల్లలు ‘అమ్మ’ అనమంటే ‘అమ్మ’ అంటారు. ‘ఆవు’ అనమంటే ‘ఆవు’ అంటారు. ఇంటిలోనే భాష సరిగా లేకుంటే పిల్లలకు ఎలా వస్తుంది? కొన్నిసార్లు ఇంటిలో ఎలాంటి తప్పుమాటలు మాట్లాడకపోయినా పిల్లలు అక్కడక్కడ విని నేర్చుకుంటారు. ఇలాంటి అలవాటును మొదటిలోనే మాన్పిస్తే పిల్లలకు మంచి భాష అలవడుతుంది. మీ పిల్లలూ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మాన్పించే ప్రయత్నం చేస్తున్నారా? 1. పిల్లలు తప్పు మాట్లాడిన వెంటనే దాన్ని సవరిస్తారు. ఎ. అవును బి. కాదు 2. తప్పు మాటలు మాట్లాడేటప్పుడు పట్టించుకోకుండా, వారిని మీ అటెన్షన్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 3. పిల్లలకు చెప్పే ముందు మీరూ అలాంటి మాటలు మాట్లాడరు. ఎ. అవును బి. కాదు 4. చెడ్డమాట స్థానంలో మంచిమాట మాట్లాడిన ప్రతిసారీ ఏదైనా బహుమతి ఇస్తామని ప్రామిస్ చేస్తారు. ఎ. అవును బి. కాదు 5. పిల్లలు ఇలాంటి మాటలను చాలా చోట్ల నుంచి వింటారు కాబట్టి వారిని అర్థం చేసుకొని, అలాంటి పదాల నష్టం ఏమిటో వివరిస్తారు. ఎ. అవును బి. కాదు 6. పిల్లల ప్రవర్తనలో మార్పు రాకపోతే కొంచెం ఘాటుగా స్పందించటానికి వెనకాడరు. ఎ. అవును బి. కాదు 7. తప్పు మాట్లాడిన ప్రతిసారీ ఒక రూపాయి కాయిన్, రూమ్‌లో అమర్చిన జార్లో వేయాలని చెప్తారు. (దీన్నో గేమ్లాకాక పనిష్మెంట్లా ఉపయోగిస్తారు) ఎ. అవును బి. కాదు 8. చెడ్డమాటలకు బదులు నవ్వు తెప్పించే పదాలు ఉపయోగించటం నేర్పిస్తారు. ఎ. అవును బి. కాదు 9. పిల్లలు అలాంటి మాటలను ఎక్కడనుంచి నేర్చుకుంటున్నారో గమనించి ఆ సోర్సును ఆపేస్తారు. ఎ. అవును బి. కాదు 10. మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు నవ్వరు. నవ్వు వారిని ఎంకరేజ్ చేస్తుందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఏడు దాటితే పిల్లల తప్పుమాటలు మాన్పించటానికి ప్రయత్నిస్తారు. ఇదేవిధంగా వారిలో మంచి ప్రవర్తన కలగటానికి ప్రయత్నించండి. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే పిల్లల్లో మంచిమాటలు నేర్పించటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయరు. ‘ఎ’ లను సమాధానాలుగా చేసుకొని పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకురావటానికి ప్రయత్నించండి. -
హితోక్తులు వింటారా?!
మానవాళిని కలవరపరుస్తున్న భూతాపోన్నతిపై ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా ముందుకు కదలాల్సిన ఆవశ్యకత కనిపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టినట్టు నిర్మొహమాటంగా మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు సంపన్న దేశాలు అదనపు బాధ్యత తీసుకోనట్టయితే, ఏకపక్ష చర్యలకు పూనుకుంటే సమస్యలు ఎదురవుతాయని పారిస్‌లో ప్రారంభమైన వాతావరణ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆయన సరిగానే హెచ్చరించారు. సంపన్న దేశాలకు కాసుల కాంక్షే తప్ప పర్యావరణ పరిరక్షణ ధ్యాస ఏరోజూ లేదు. శిలాజ ఇంధనాలను ఎడాపెడా వాడుతూ... ఆ క్రమంలో విడుదలయ్యే కర్బన ఉద్గారాల గురించి అవి పట్టించుకోలేదు. కాలుష్యం పర్యవసానంగా భూగోళానికి ముప్పు ముంచుకొస్తున్నదని... రాగల కాలంలో సముద్ర మట్టాలు పెరిగి ముంబై, కోల్‌కతా, ఢాకా వంటి నగరాలన్నీ మునుగుతాయని ఆమధ్య ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వాతావరణ మార్పులకు సంబంధించిన అంతర్ ప్రభుత్వ బృందం (ఐపీసీసీ) నివేదిక హెచ్చరించింది. గత నెలలో విడుదలైన ఒక స్వచ్ఛంద సంస్థ నివేదిక సైతం నిష్టుర సత్యాలను వెల్లడించింది. ఉష్ణోగ్రత మరో నాలుగు డిగ్రీల సెల్సియస్ పెరిగితే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకుపైగా జనం ఉంటున్న ప్రాంతాలన్నీ సముద్రాల్లో కలిసిపోతాయని ఆ సంస్థ హెచ్చరించింది. ఇందులో మన దేశానికి చెందిన తీరప్రాంత వాసులు అయిదున్నర కోట్లమంది కూడా ఉంటారు. వాస్తవానికి ఇదెవరో పరిశోధన చేసి చెప్పాల్సిన అంశం కూడా కాదు. అందుకు సంబంధించిన ఛాయలు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. మండు వేసవిలో తుఫాన్లు, వరదలు... చలిపులి చంపుకు తినే శీతాకాలంలో భానుడి భగభగలు... వట్టిపోతున్న వానాకాలం మనల్ని దిగ్భ్రాంతిపరుస్తున్నాయి. ఎడారులు విస్తరిస్తున్నాయి. సముద్రాలు వేడెక్కుతున్నాయి. అడవులు కార్చిచ్చులబారిన పడుతున్నాయి. హిమనదాలు కరుగుతున్నాయి. ఇవన్నీ మానవాళికి ప్రకృతి చేస్తున్న హెచ్చరికలు. వాటిని గుర్తించి సరిచేసుకోవడమా, నాశనం కావడానికి సిద్ధం కావడమా అన్నది తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో కూడా సంపన్న దేశాలు కుటిల ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. తమ బాధ్యతలనుంచి తప్పుకోవడానికి తోవలు వెదుక్కుంటున్నాయి. పారిస్‌లో ఈ నెల 11 వరకూ కొనసాగే శిఖరాగ్ర సదస్సు ముందు బృహత్తర కర్తవ్యాలున్నాయి. పారిశ్రామికీకరణకు ముందున్న ఉష్ణోగ్రతలకంటే 2 డిగ్రీల సెల్సియస్ మించకుండా చూడాలన్నది ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ఇదంతా 2100 నాటికి సాధించాలని, అందుకోసం అన్ని దేశాలూ సమష్టిగా కదలాలని అనుకున్నారు. అయితే ఆ లక్ష్యాన్ని నీరుగార్చేందుకు సంపన్న దేశాలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. పారిస్ శిఖరాగ్ర సదస్సుకు ముందే ఈ ఎత్తుగడలు మొదలైపోయాయి. పారిస్‌లో రేపన్నరోజున వైఫల్యాలు ఎదురైతే అందుకు పూర్తి బాధ్యతను భారత్‌పై నెట్టి తప్పుకోవాలని అమెరికా భావిస్తున్నదని నాలుగురోజుల క్రితమే నిపుణులు హెచ్చరించారు. వాతావరణ సదస్సులో భారత్ ఒక సవాలుగా ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ వ్యాఖ్యానించడం దీన్ని నిర్ధారిస్తున్నది. అందుకే ఉద్గారాల భారాన్ని భారత్‌వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై మోపాలని చూడటం తప్పని మోదీ చెప్పాల్సివచ్చింది. వాస్తవానికి వాతావరణంపై 1992లోనే రియోడి జెనైరోలో ప్రపంచ దేశాలన్నీ మొట్టమొదటి సమావేశం నిర్వహించుకుని ఒక కార్యాచరణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. క్షీణిస్తున్న వాతావరణాన్ని సరిచేసేందుకు ప్రభుత్వాలన్నీ ముందుకు రావాలని ఆ సదస్సు పిలుపునిచ్చింది. ఆ తర్వాత 1997లో క్యోటోలో జరిగిన శిఖరాగ్ర సదస్సు 1990నాటితో పోలిస్తే 2012కల్లా 5 శాతం ఉద్గారాలను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఆ సదస్సు నిర్ణయాలను అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు అల్ గోర్ సైతం అంగీకరించి సంతకం చేశారు. కానీ అమెరికన్ కాంగ్రెస్ దానికి మోకాలడ్డింది. క్యోటో నిర్ణయాలు దశాబ్దంపాటు స్తంభించిపోవడానికి అమెరికా అనుసరించిన వైఖరే ప్రధాన కారణం. తాము యధేచ్ఛగా వాతావరణంలోకి వదిలిపెడుతున్న ఉద్గారాలవల్ల ప్రపంచానికి వచ్చే ముప్పేమీ లేదని రిపబ్లికన్లు మూర్ఖంగా వాదిస్తూ వచ్చారు. అశాస్త్రీయమైన అంచనాలతో అభివృద్ధిని అడ్డుకోవడం తగదని మొండికేశారు. ఇన్నాళ్లకు ఆ దేశానికి జ్ఞానోదయమైంది. కర్బన ఉద్గారాల్లో తమ దేశం రెండో స్థానంలో ఉన్న సంగతి తెలుసునంటూ ఇప్పుడు ఒబామా మాట్లాడుతున్నారు. దాని పరిష్కార బాధ్యతనూ నెత్తినెత్తుకుంటామంటున్నారు. మంచిదే. కానీ పేద దేశాలకు ఆర్థిక సాయంవంటి చర్యలు మాత్రమే సరిపోవు. కర్బన ఉద్గారాల్లో తమ వాటా ఎంతో తేల్చి దానికి అనుగుణమైన నిష్పత్తిలో వాటిని తగ్గిస్తామని వాగ్దానం చేయాలి. ప్రధాని మోదీ చెప్పింది ఇదే. ఆ పని చేయకుండా కాలుష్యాన్ని సాకుగా చూపి వర్ధమాన దేశాల అభివృద్ధిని అడ్డుకోవడానికీ లేదా కాలుష్యాన్ని నియంత్రించే సాంకేతికతను పెద్ద ధరకు అమ్ముకోవడానికీ ప్రయత్నించడం అనైతికత అనిపించుకుంటుంది. చమురు, సహజవాయువు, బొగ్గువంటి వనరుల విచ్చలవిడి వాడకం వల్లనే కర్బన ఉద్గారాలు అసాధారణ స్థాయిలో పెరిగాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మూడు వనరులనూ ఎడా పెడా వాడుకుని సంపద పోగేసుకున్నవి అమెరికా, బ్రిటన్, కెనడా, రష్యా, జర్మనీ దేశాలేనని ఐపీసీసీ నివేదిక తెలిపింది. ఈమధ్య కాలంలో చైనా సైతం కర్బన ఉద్గారాల పెరుగుదలకు కారకురాలవుతోంది. వీరంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కాలుష్యాన్ని తగ్గించుకోవడమేకాక వర్ధమాన దేశాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాల్సిన అవసరం పెరిగింది. అవి మినహా ఏం చేస్తామన్నా ఉత్త బడాయి మాటలుగానే మిగులుతాయి. నరేంద్ర మోదీ హితవచనాలను సంపన్న దేశాలు తలకెక్కించుకోవాలి.