హదీసు ప్రబోధిని
దైవ ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా అంటుండేవారు: మీలో ప్రతి ఒక్కడూ సంరక్షకుడే, జవాబుదారుడే. సావధానంగా వినండి: మీలో ప్రతి ఒక్కడూ (తమ తమ పరిధుల్లో) యజమానినే, సంరక్షకుడే. మీలో ప్రతి ఒక్కరిని, వారి సంరక్షణలో ఉన్న వారి బాపతు అడగడం జరుగుతుంది.
వివరణ: ముస్లిం సమాజంలోని ప్రతి వ్యక్తి అనేక బాధ్యతలకు కట్టుబడి ఉన్నాడు. తనకు అందుబాటులో ఉన్నది, తాను ఖర్చు చేసే ప్రతి విషయం అల్లాహ్ అతనికి ప్రసాదించిన ఓ అమానతు. దైవానికి దాసునిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసినందువల్ల అల్లాహ్ తనకు అందించిన ఆ అమానుతును కొల్లగొట్టకుండా దాన్ని ఎంతో మేళకువగా పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే మరణానంతరం ఈ భూమిలో తనకు లభించిన ప్రతి వరాన్ని, ప్రతి శక్తిని, సామర్థ్యాన్ని గురించి ఎలాంటి మొహమాటం లేకుండా అక్కడ అడగడం జరుగుతుంది.
ఒక ముస్లింగా మనిషి తాను పని చేసే పరిధిలో, శక్తి సామర్థ్యాల్లో స్వతంత్రుడు ఎంత మాత్రం కాడు, సరి కదా ఆ వరాలన్నింటికీ అతను సంరక్షకుడు. దైవ న్యాయస్థానం లో బాధ్యతలు, సంరక్షణకులకు సంబంధించిన పూర్తి రికార్డు ప్రశ్నల రూపంలో ఎదురవుతుంది. ఇస్లామీయ దేశాధ్యక్షుణ్ణి నేరుగాను, ఇస్లామీయ పాలనా వ్యవస్థలో, న్యాయవ్యవస్థలో పనిచేసే ప్రతి చిన్నా, పెద్దా అధికారుల్ని, ఉద్యోగుల్ని పరోక్షంగానూ హెచ్చరించడం జరిగింది. ఈ హెచ్చరిక ఏమిటంటే మీరు ఏ హోదాల్లోనైతే పనిచేస్తున్నారో లేక ఏ ఏ ప్రభుత్వ శాఖలకు ఇన్చా ర్జీలుగా ఉన్నారో ఎంతో న్యాయంగా దైవభీతి కలిగి మీ బాధ్యతలను నెరవేర్చే ప్రయత్నం చేయండి.పరలోకంలో అల్లాహ్ ఏర్పరిచిన న్యాయస్థానంలో మిమ్మల్ని నిలబెట్టి మీరు భూలోకంలో ఏ బాధ్యతలను నిర్వహించారో మీకు ఏ అమానతు అయితే అప్పగించడం జరిగిందో దాన్ని పూర్తిగా నిర్వర్తించారా లేదా అని అడగడం జరుగుతుంది జాగ్రత్త.
ప్రతివాడు తన భార్య పిల్లల నైతికతలకు, విద్యాబుద్ధులకు కాపలాదారుడు. భార్య తన శీల సంపదకు, తన పిల్లల శిక్షణకు, భర్త ఆస్తికి, ఇంటిని నడిపేందుకు బాధ్యురాలు. భార్యాభర్తలను ఒకరి విషయాల్లో మరొకరిని బాధ్యులుగా, కాపరదారులుగా చేయడం జరిగింది. మొత్తానికి ప్రళయ దినం నాడు ప్రతివ్యక్తి తన జీవిత కర్మల చిట్టా చేతబట్టి అల్లాహ్ న్యాయస్థానంలో నిలబడవలసి ఉంది.
ఇస్లామీయ రాజ్య పాలకుడు ఓ సంరక్షకుడు. అతనితో అతని రాజ్యంలోని ప్రజానీకం గురించి అడగడం జరుగుతుంది. ప్రతివాడు తన భార్య, పిల్లలకు యజమాని. అతడు తన బాధ్యతలను గురించి దేవునికి జవాబు చెప్పుకోవాల్సి ఉంది. ∙స్త్రీ (భార్య), తన భర్త ఇంటికి (అతని సంతానానికి) బాధ్యురాలు. గృహ సంబంధమైన బాధ్యతల గురించి ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. ∙నౌకరు తన యజమానికి; కుమారుడు తన తండ్రి ఆస్తికి సంరక్షకుడు. దేవుడు వారి బాధ్యతలను గురించి అడుగుతాడు.
– మొహమ్మద్ అబ్దుల్ రషీద్
Comments
Please login to add a commentAdd a comment