
సమాజం తమను చిన్న చూపు చూస్తున్నా.. మిగతావారితో తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నా వారంతా. ఆత్మగౌరవంలోనూ, ఆత్మవిశ్వాసంలోనూ ఇతరులకు దీటుగా బతికి చూపిస్తున్నారు. ఎనిమిది సంవత్సరాల తమ కష్టానికి ఫలితం లభించింది. తమతో పాటు తోటి ట్రాన్స్‌జెండర్లు కూడా తమ కాళ్లపై తాము నిలబడేలా వారికి అండగా నిలబడుతున్నారు. అనుకున్నతదే తడవుగా ఆలోచనలను ఆచరణలో పెట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. ఆ కార్యాచరణకు ఇతర సంస్థలు సైతం మేమున్నామంటూ మద్దతు తెలిపి భుజం తట్టాయి. ట్రాన్స్‌జెండర్స్ అనుకున్న లక్ష్యం నేరవేరేలా చేశాయి.
నలుగురూ వారిని ఎగతాళి చేసినా.. అవహేళనకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్లు తామేమీ తక్కువ కాదంటూ ఇతర రంగాల్లో రాణిస్తున్నారు. సూరారం కాలనీకి చెందిన ట్రాన్స్‌జెండర్ రాపేటి జాస్మిన్. తన తోటివారికి అండగా నిలిచేందుకు ‘ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ’ అనే సంస్థను 2020లో స్థాపించి ట్రాన్స్‌జెండర్లను డ్వాక్రా గ్రూప్, స్కిల్ డెవలప్‌మెంట్, టైలరింగ్, బ్యుటీషియన్, కంప్యూటర్ కోర్స్, జ్యూట్ మేకింగ్ వంటి వివిధ రంగాల్లో రాణించేందుకు కార్యాచరణ రూపొందించారు.
ముంబై నుంచి ట్రైనర్స్..
ముంబైకి చెందిన గౌరవ్, ఫ్రాంక్లిన్ టెంప్లేషన్ సంస్థలు తోడుగా నిలవడంతో ‘సాక్ష్యం 3.0 ఫ్రైడ్ ఈవెంట్’ అనే ప్రాజెక్టు పేరిట వందరోజుల పాటు శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకుని సోమవారం సూరారం కాలనీ ఎన్‌టీఆర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు, స్థానిక ఎస్‌ఐ రాజు చేతుల మీదుగా 100 మంది సర్టిఫికెట్లను అందుకున్నారు. అనంతరం అపోలో ఆస్పత్రి వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
పదిమందికి ఉపాధి కల్పిస్తా..
ఇటీవల శిక్షణలో భాగంగా బ్యుటీషియన్‌లో నూతన విధానాలను నేర్చుకున్నా. స్థానికంగా సొంత బ్యూటీ పార్లర్ ఏర్పాటుచేసి పదిమందికి ఉపాధి కల్పించాలనేదే నా ఉద్దేశం. నగరంలో ఇతర కార్యక్రమాలకు ఎక్కడైనా బ్యుటీషియన్ ఈవెంట్స్‌కు వెళ్లేలా మా టీమ్ తయారు చేస్తా. మాకు కూడా సంఘంలో మహిళలతో సమానంగా గౌరవం అందాలి.
– అంజలి బ్యుటీషియన్
కంప్యూటర్‌పై పట్టు సాధించా..
కంప్యూటర్ శిక్షణలో పలు మెళకువలు నేర్చుకున్నా. టైపింగ్ నుండి మొదలుకొని ఫొటో ఎడిటింగ్ వరకూ నేర్చుకున్నా. ఇప్పుడు నేను పదిమందికీ నేరి్పంచే విధంగా పట్టు సాధించా. నా కాళ్లపై నేను నిలబడగలననే ధైర్యం వచ్చింది. మున్ముందు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని మరింత తెలుసుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడతా.
– నవీన
లేటెస్ట్ మోడల్ టైలరింగ్ నేర్చుకున్నా..
క్రమం తప్పకుండా టైలరింగ్‌లో శిక్షణ ద్వారా పట్టుసాధించా. లేటెస్ట్ మోడల్ డిజైనింగ్‌లోనూ ప్రావీణ్యం పొందాను. సొంతగా టైలరింగ్ షాపు ఏర్పాటు చేసి తోటి వారికి ఉపాధి కల్పిస్తా..
– శరణ్య, టైలర్