
‘మీకు ఎంతమంది పిల్లలు?’ అని ఎవరైనా అడిగితే... ‘35 మంది ఆడపిల్లలు’ అని చెబుతాడు హరే రామ్ పాండే. నిజానికి వారు ఆయన సొంతబిడ్డలు కాదు. సొంత బిడ్డల కంటే ఎక్కువగా వారికి తండ్రి ప్రేమను పంచుతున్నాడు హరే రామ్ పాండే. జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌కు చెందిన పాండే అనాథ అమ్మాయిల కోసం ఆశ్రమాన్ని నడుపుతున్నాడు...కొన్ని సంవత్సరాల క్రితం....ఒక అడవిలో చిన్న పాప ఏడుస్తూ ΄పాండేకు కనిపించింది. పాపను చీమలు కుడుతున్నాయి. దయనీయస్థితిలో ఉన్న పాపను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు.
21 రోజుల పాటు చికిత్స జరిగింది. ఆ బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడింది. ‘తాప్సీ’ అని పేరు పెట్టాడు. ఇలాంటి ఎంతోమంది తాప్సీల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు హరే రామ్‌పాండే. భార్య భావని కుమారితో కలిసి దేవ్‌ఘర్‌లో ‘నారాయణ్ సేవా ఆశ్రమం’ నడుపుతున్నాడు పాండే. చెత్త కుండీలో, అడవుల్లో, ముళ్ల పొదల్లో దీనస్థితిలో కనిపించిన ఎంతోమంది పసిబిడ్డలను రక్షించి వారికి తన ఆశ్రమంలో ఆశ్రయం కనిపిస్తున్నాడు పాండే.
‘నేను తాప్సీని మొదట చూసినప్పుడు ఏడుపు ఆగలేదు. ఈ పసిబిడ్డను అడవిలో వదిలి వెళ్లడానికి వారికి మనసు ఎలా వచ్చింది అని కోపం వచ్చింది. అయితే దుఃఖంతో, కోపంతో సమస్యకు పరిష్కారం దొరకదు. నేను చేయాల్సింది ఉంది అనుకున్నాను. చేశాను’ గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు పాండే.
కొన్ని సంవత్సరాలుగా రైల్వే పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది, ప్రభుత్వ అధికారుల నుంచి పాండేకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. వారి నుంచి సమాచారం అందుకున్న వెంటనే దీనస్థితిలో ఉన్న బిడ్డను ఆశ్రమానికి తీసుకువచ్చి అన్ని వసతులు కల్పిస్తుంటాడు పాండే. సహాయం మాట ఎలా ఉన్నా మొదట్లో ఇరుగు పొరుగు వారి నుంచి అసహనం ఎదురయ్యేది.
‘ఎక్కడెక్కడో నుంచి పిల్లలను తీసుకువస్తున్నారు. వారు ఏ కులం, ఏ మతం అనేది తెలియదు. వారి తల్లిదండ్రులకు లేని ప్రేమ మీకెందుకు?’... ఇలాంటి మాటలు ఎన్నో వినిపించేవి. అయినప్పటికీ కోపం తెచ్చుకోకుండా... ‘వారు నా బిడ్డలు. చివరి శ్వాస వరకు నా పిల్లలను నేను కాపాడుకుంటాను’ అనే మాట పాండే నోటి నుంచి వచ్చేది.
ఆశ్రమంలో పెరిగిన తాప్సీ, ఖుషీలు ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. డాక్టర్ కావాలనేది వారి లక్ష్యం. ఆశ్రమాన్ని నడిపించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పాండే సంపన్నుడు కాదు. అయితే ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా దాతల సహాయ సహకారాలతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు పాండే.
దయాగుణ శక్తి
చేసే పని మంచిదైతే ఎన్ని అడ్డంకులు ఎదురైనా అవి తొలగిపోతాయి. నా పనికి అయిదు మంది అడ్డు పడితే పదిమంది సహాయం చేయడానికి ముందుకు వచ్చేవారు. ఇది నా ఘనత కాదు. దయాగుణానికి ఉన్న శక్తి. మనకు ఎదురైన అనుభవాలను చూసి ‘అయ్యో!’ అని బాధపడడం మాత్రమే కాకుండా ‘నా వంతుగా ఏం చేయగలను’ అని ఆలోచిస్తే ఎన్నో మంచి పనులు జరుగుతాయి.
– హరే రామ్ పాండే
(చదవండి: ఎయిమ్స్‌కు తొలి మహిళా డైరెక్టర్ ఆమె..! నాటి ప్రధాని ఇందిరా గాంధీ అంతిమ క్షణాల్లో..)