Muhammad
-
మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పాతబస్తీలో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా రాజాసింగ్.. యూ ట్యూబ్‌లో వీడియోను విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో, ముజ్లిస్ నేతలు.. తమ మనోభావాలను కించపరిచే విధంగా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈక్రమంలో మజ్లిస్ నేతలు.. అర్ధరాత్రి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ముందు, పట్టణంలోని ఇతర ప్రాంతాలలో బైఠాయించి నిరసనలకు దిగారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ పలు పీఎస్‌లలో ఫిర్యాదులు చేశారు. భవానీనగర్, డబీర్‌పురా, రెయిన్ బజార్ పీఎస్‌లలో ఫిర్యాదులు చేయడంతో రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలో హై టెన్షన్ నెలకొంది. -
అబు యూసుఫ్‌కు హైదరాబాద్ లింకు!
సాక్షి, హైదారాబాద్: ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అక్కడి రిడ్జి రోడ్డులో అరెస్టు చేసిన ఐసిస్ ఉగ్రవాది మహ్మద్ ముస్తాఖిమ్ ఖాన్ అలియాస్ అబు యూసుఫ్ ఖాన్ కదలికలు హైదరాబాద్‌లోనూ సాగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. సౌదీ అరేబియా నుంచి డిపోర్టేషన్ ద్వారా తిరిగి వచ్చిన ఇతగాడు కొన్నాళ్లు హైదరాబాద్‌లో పెయింటర్‌గా పని చేసినట్లు స్పెషల్ సెల్ గుర్తించింది. ఇతడు సౌదీలో ఉండగానే ఉగ్రవాదం వైపు మళ్లినట్లు ఆధారాలు లభించడం.. అక్కడ నుంచి వచ్చాక హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలడంతో ఇక్కడి కార్యకలాపాలపై ఆరా తీయడానికి కేంద్ర నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లా బధియా బైషాహి గ్రామానికి చెందిన అబు యూసుఫ్ తొమ్మిదో తరగతిలో చదువుకు స్వస్తి చెప్పిన ఇతగాడు ఆపై బతుకుతెరువు కోసం పెయింటర్‌గా మారాడు. కొన్నాళ్లు తన స్వస్థలంలోనే పని చేసిన ఇతగాడు బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లాలని భావించాడు. (ఐసిస్ టెర్రరిస్టు అబు యూసుఫ్ ఖాన్ అరెస్టు) దీంతో అప్పటికే అక్కడ ఉన్న తన సోదరుడి సహకారంతో 2006లో సౌదీ అరేబియా చేరుకున్నాడు. సౌదీలో ఉండగా తన సెల్‌ఫోన్ సహాయంతో ఎక్కువ సేపు ఇంటర్నెట్లో గడిపేవాడు. ఇలా ఐసిస్, అల్ కాయిదా వీడియోలకు ఎక్కువగా వీక్షించేవాడు. ఈ విషయం ఆన్లైన్ ద్వారా గుర్తించిన సిరియాకు చెందిన ఐసిస్ హ్యాండ్లర్ ఉగ్రవాదం వైపు మళ్లించాడు. అతడే మహ్మద్ ముస్తాఖిమ్ ఖాన్ పేరును అబు యూసుఫ్ అల్ హింద్‌గా మార్చాడు. దాదాపు నాలుగేళ్ల పాటు అక్కడే ఉన్నప్పటికీ వర్క్ పర్మిట్ పునరుద్ధరించుకోలేదు. దీంతో అక్కడి అధికారులు యూసుఫ్‌ను డిపోర్టేషన్ పద్ధతిలో బలవంతంగా అక్కడ నుంచి తిప్పి పంపారు. అక్కడ నుంచి ఇతగాడు తన స్వగ్రామమైన బధియా బైషాహికి చేరుకున్నాడు. (ఐసిస్ కొత్త లీడరే అమెరికా టార్గెట్: ట్రంప్) అక్కడ ఉండగానూ ఐసిస్ హ్యాండ్లర్‌తో ఆన్లైన్ ద్వారా టచ్‌లో ఉన్నాడు. తన స్వస్థంలో కొన్నాళ్లు పని చేసిన యూసుఫ్ అక్కడ నుంచి ముంబైకి వెళ్లాడు. అట్నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇతగాడు దాదాపు రెండేళ్లు పెయింటర్‌గా నివసించాడు. హైదరాబాద్‌లోనూ ఐసిస్ ఛాయలు, ఆ ఉగ్రవాదుల కదలికలు ఉండటం, ఇతడు ఇక్కడ నివసించడంతో అతడి కార్యకలాపాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆ సమయంలో ఎవరెవరిని కలిశాడు? ఎక్కడెక్కడ సంచరించాడు? అనే విషయాలపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ఈ కోణంలో ఇతడిని విచారించడానికి రాష్ట్ర నిఘా విభాగానికి చెందిన ఓ ప్రత్యేక బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లింది. -
సమాజం స్వర్గధామం కాదా?
ఎవరైనా మనకు ఉపకారం చేస్తే మనం ప్రత్యుపకారం చేస్తాం. ఎవరైనా మనకు హాని తలపెడితే మనమూ వారిపట్ల అలానే వ్యవహరించాలని అనుకుంటాం. ఇది లోకం పోకడ. కాని అలా చేయవద్దని, ఇతరులెవరైనా మీకు అపకారం తలపెట్టినా మీరు మాత్రం వారికి ఉపకారమే చేయాలని ముహమ్మద్ ప్రవక్త(స)బోధించారు. ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త వారివద్దకు వచ్చి..‘దైవప్రవక్తా..! నేను నా బంధువుల పట్ల ఎంత క్షమాశీలిగా వ్యవహరించినా వారు నాపట్ల దౌర్జన్యంగానే ప్రవర్తిస్తున్నారు. నేనెంతగా కలుపుకుని పోవాలని ప్రయత్నించినా వారు తెగదెంపులకే ప్రయత్నిస్తున్నారు. నేను ఉపకారం చేస్తే, వారు నాకు అపకారం తలపెడుతున్నారు. మరి నేను కూడా వారితో అలానే వ్యవహరించనా?’ అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రవక్త మహనీయులు, ‘వద్దు..వారిని వారి మానాన వదిలేయి, వారు దౌర్జన్యం చేసినా, నువ్వు మాత్రం వారికి ఉపకారం చేస్తూనే ఉండు. నువ్వు గనక ఇలా చేస్తే అల్లాహ్ తరఫున నీకు సహా యం లభిస్తూనే ఉం టుంది.’ అన్నారు. అంటే చెడుకు చెడు సమాధానం కాదు. బంధువులైనా, కాకపోయినా.. అందరికీ ఇదేసూత్రం వర్తిస్తుంది. కాకపోతే బంధువులకు కాస్త అధిక ప్రాముఖ్యం ఉంటుంది. మన ఉపకారానికి, మన సత్ ప్రవర్తనకు మొట్టమొదటి హక్కుదారులు తల్లిదండ్రులు. తరువాతనే భార్యాబిడ్డలు. తరువాత అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు. ఆ తరువాత సమీప బంధువులు, ఆ తరువాత ఇతర బంధువర్గం. ఈ విధంగా క్రమం విస్తరిస్తుంది. ఎవరికి వారు ఇదేవిధంగా ఆలోచిస్తే, దీన్ని ఒక బాధ్యతగా గుర్తించి ఆచరించగలిగితే ఆ బంధుత్వాలు, ఆ కుటుంబాలు, ఆ సమాజంలో ఎంతటి సంతోషం వెల్లివిరుస్తుందో..! ఆర్థికంగా కలిగిన వారు, వారి బంధువుల్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే, వారిని ఆదుకోవడం ఆ సమీప బంధువుల విధి. కాని చాలామంది ఈ బాధ్యత పట్ల ఏమరుపాటుగా ఉన్నారంటే తప్పు కాదు. ఎంతోమంది తిండి, బట్ట, నివాసం లాంటి కనీస అవసరాలకు కూడా నోచుకోకుండా ఉన్నవారు సమాజంలో ఉన్నారు. వారివారి బంధువులు తలా ఒక చెయ్యేసి వారిని ఆదుకోగలిగితే, వారు కూడా ఆర్థికంగా నిలదొక్కుకుని ఇతరులకు సహాయకారులుగా నిలిచే అవకాశం ఉంటుంది. బంధువుల పట్ల బాధ్యత తీరిపోతే, అప్పుడు సమాజంలోని ఇతర అభాగ్యులను అక్కున చేర్చుకోవాలి. వారికీ సహాయ సహకారాలు అందించాలి. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. ముఖ్యంగా ఇరుగు పొరుగుపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎందుకంటే,‘మీ పొరుగు వారు ఆకలితో ఉండగా, మీరు కడుపునిండా తింటే మీలో రవ్వంత విశ్వాసంగాని, మానవత్వంగాని లేనట్టే’ అన్నారు ముహమ్మద్ ప్రవక్త(స). ఎవరి దుష్ప్రవర్తన కారణంగా వారి పొరుగువారు భద్రంగా, సురక్షితంగా ఉండరో అలాంటివారికి అల్లాహ్ పట్ల విశ్వాసమేలేద’ ని ఆయన బోధించారు. కనుక దైవాదేశాలూ, ప్రవక్త హితవచనాల వెలుగులో ప్రతి ఒక్కరూ తమ జీవితాలను సమీక్షించుకుంటూ, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు, మన సహాయానికి అర్హులైన ఇతర వర్గాల పట్ల తమబాధ్యతను చిత్తశుధ్ధితో నెరవేర్చాల్సిన అవసరం ఉంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ ధర్మ జిజ్ఞాస శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుందెందుకు? తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచెం ఉండటం నిజమే. దీనికి కారణం ఏమంటే, తిరుమలేశుడు కుబేరుని వద్ద అప్పు చేశాడట. దానిని తీర్చడం కోసం ద్రవ్యాన్ని కుంచెంతో కొలిచి ఇచ్చేవాడట శ్రీనివాసుడు. స్వామివారి పక్షాన గోవింద రాజస్వామి ఈ కార్యాన్ని సాగించారట. ఈ క్రమంలో ఆయన స్వామివారికి వచ్చిన కానుకలను కొలిచీ కొలిచీ అలసి సొలసి తలకింద కుంచె పెట్టుకుని అలాగే నిద్రలోకి ఒరిగిపోయారనీ, అందుకే ఆయన తల వద్ద కుంచెం ఉంటుందనీ చెబుతారు. -
చెడు దుర్వాసన లాంటిది
తోటి వారు సంతోషాల్లో ఉంటే చూసి ఏడ్వడం, బాధల్లో ఉంటే నవ్వడం మనల్ని కష్టాలు పాలు చేస్తుంది. జునైద్ తెలివైన యువకుడు. అందుకే అతడంటే పాదుషాకి ఎంతో అభిమానం. జునైద్ ను సంప్రదించకుండా ఏ నిర్ణయమూ తీసుకునేవాడు కాదు. అది చూసి దర్బారులోని ఒక మంత్రి ఓర్వలేకపోయాడు. దర్బారునుంచి జునైద్ ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని రకరకాల కుట్రలు పన్నేవాడు. ఒకరోజు పాదుషా దగ్గరికెళ్లి ‘‘పాదుషా గారు జునైద్ మీ గురించి చెడుగా చెబుతున్నాడు. మీ దేహం నుంచి దుర్వాసన వస్తుందని ప్రచారం చేస్తున్నాడు. కావాలంటే రేపు అతను దర్బారులోకి రాగానే అతన్ని మీ దగ్గరకు పిలిపించుకుని చూడండి. అతను మీతో మాట్లాడేటప్పుడు ముక్కు, నోరు మూసుకుని మీతో మాట్లాడతాడు.’’ విషం చిమ్మాడతను. మంత్రి మాటలకు పాదుషా ఆశ్చర్యపోయాడు. రెండోరోజు ఉదయం మంత్రి తన పథకంలో భాగంగా జునైద్ కు మాయమాటలు చెప్పి తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. విందు ముగిసాక మాటల్లో పెట్టి వెల్లిపాయలు తినిపించాడు. విందు అవగానే జునైద్ దర్బారుకు వెళ్లాడు. జునైద్‌ను ఏదో అడిగేందుకు పాదుషా దగ్గరికి పిలిపించుకోగానే తన నోటినుంచి వస్తున్న దుర్వాసన వల్ల పాదుషా గారికి ఇబ్బంది కలుగుతుందనే భయంతో ముక్కూ, నోరు మూసుకున్నాడు. అది చూసిన పాదుషా మంత్రి చెప్పింది నిజమేనని నిర్ధారించుకున్నాడు. జునైద్ మీద కట్టలు తెగేంత కోపం వచ్చింది. వెంటనే ఒక లేఖను రాసి ఈ లేఖను గవర్నర్‌కు ఇమ్మని దానికి జునైద్ కు అందించాడు. జునైద్ లేఖను తీసుకుని దర్బారు నుంచి బయటకు వచ్చాడు. దారిలోనే మంత్రి ఎదురయ్యాడు. జునైద్ చేతిలో ఉన్న లేఖను చూసి ‘ఈ ఉత్తరంలో ఏముంది?’ అని అడిగాడు. ‘‘పాదుషా గారు నాకోసం నగదు బహుమతులు ఇవ్వమని సిఫారసు లేఖ రాశారనుకుంటాను’’ అని చెప్పాడు. మంత్రి ఆ లేఖను తనకివ్వవలసిందిగా ప్రాధేయపడ్డాడు. జునైద్ ఆ ఉత్తరాన్ని మంత్రికి ఇచ్చేశాడు. మంత్రి ఆ ఉత్తరాన్ని అందుకుని ఎంతో సంబరపడుతూ తీసుకెళ్లి గవర్నర్ కు అందించాడు. గవర్నర్ ఉత్తరాన్ని తెరిచి చూడగా అందులో ‘‘ఈ లేఖను తెచ్చిన వ్యక్తిని ఉరితీసి చంపేయండి. శవాన్ని నా దగ్గరకు పంపండి’’ అని రాసి ఉంది. పాదుషా గారి ఆజ్ఞ మేరకు మంత్రిని ఉరికొయ్యకు వేలాడదీశారు. మరునాడు యధావిధిగా దర్బారుకు వచ్చిన జునైద్‌ను చూసిన పాదుషా నిర్ఘాంతపోయి తానిచ్చిన ఆ ఉత్తరం ఏమయ్యిందని అడిగారు. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు జునైద్. ఈ మాటలు విన్న పాదుషా నువ్వు మంచి వాడివి కాబట్టే నీ మంచే నిన్ను బతికించింది. పాపానికి ఒడిగట్టిన ఆ మంత్రికి తగిన శాస్తి జరిగిందని చెప్పి జునైద్ కు విలువైన కానుకలు అందించాడు. తోటి వారు సంతోషాల్లో ఉంటే చూసి ఏడ్వడం, బాధల్లో ఉంటే నవ్వడం మనల్ని కష్టాలు పాలు చేస్తుంది. – ముహమ్మద్ ముజాహిద్ -
ఈ రోజు చెత్త పడలేదే!
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త ఇంటినుండి బయలుదేరి ఎటో వెళుతున్నారు. కొద్దిదూరం వెళ్ళిన తరువాత ఒక ఇంటిదగ్గర గోడపై నుండి ఊడ్చిన చెత్తాచెదారం పైన పడింది. ప్రవక్త మహనీయులు తల, వస్త్రాలు శుభ్రంగా దులుపుకొని తన దారిన తను వెళ్లిపోయారు. రెండవరోజు కూడా అదేవిధంగా ఊడ్చిన చెత్తమీద పడింది. ప్రవక్త ఆ మలినమంతా మళ్ళీ శుభ్రం చేసుకొని ముందుకు సాగిపోయారు. ప్రతిరోజూ ఇలానే జరిగేది.ఎవరో కావాలనే ప్రతిరోజూ చెత్తాచెదారం వేయడం, ప్రవక్త ఎవరినీ ఏమీ అనకుండానే ఓ చిరునవ్వు నవ్వి దులుపుకుని వెళ్ళిపోవడం ఇదే తంతు. ఏం జరిగిందో ఏమోగాని ఒకరోజు ప్రవక ్తమహనీయులు యధాప్రకారం అదే దారిన వెళ్ళారు. కాని ఆరోజు కసువు పడలేదు. ఆ రోజే కాదు, తరువాత రెండు రోజులు కూడా ఎలాంటి చెత్తాచెదారం పడలేదు. అలా రెండు మూడు రోజులుగా పడకపోయేసరికి చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. ఫలానా ఇంట్లో ఎవరూ లేరా? ఏదైనా ఊరెళ్ళారా? అని.ఆ ఇంట్లో ఒక ముసలమ్మ మాత్రమే ఉంటుందని, కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోందని వారు చెప్పారు. వెంటనే ప్రవక్త తను వెళుతున్న పని వాయిదా వేసుకొని, ఆ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఒక వృద్ధురాలు తీవ్రజ్వరంతో బాధపడుతోంది. వైద్యం, తిండి తిప్పలు లేక ఆమె నీరసించి పోయింది.‘‘అమ్మా! ఎలా ఉన్నారు?’’ అని ఆప్యాయంగా పరామర్శించారు. మంచినీళ్ళు తాగించారు. అత్యవసర సేవలు అందించి సపర్యలు చేశారు. రోజూ వచ్చి, ఆమె కోలుకునే వరకూ కనిపెట్టుకుని ఉన్నారు. తనపట్ల ప్రవక్త ప్రవర్తిస్తున్న తీరుకు ఆ వృద్ధురాలు ఆశ్చర్యచకితురాలైంది. తను ఆయనని ఛీత్కరించినా, చెత్తాచెదారం పైన పోసి అవమానించినా, ఆ మహనీయుడు తనపై చూపిన దయకు, చేసిన మేలుకు ముగ్ధురాలైపోయింది. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందుతూ, ప్రవక్తకు ప్రియశిష్యురాలిగా మారిపోయింది. చెడుకు చెడు సమాధానం కాదు. చెడును మంచి ద్వారా నిర్మూలించడమంటే ఇదే..! – మదీహా -
స్వర్గవనమా..! నరక కూపమా..!!
ఒకరోజు ముహమ్మద్ ప్రవక్త (స) నమాజుకోసం ఇంటినుండి బయలుదేరి మస్జిదుకు వెళ్ళారు. అప్పుడక్కడ మసీదులో కొంతమంది పగలబడి నవ్వుతున్నారు. వాళ్ళు ఏమరుపాటులో పyì ఉన్నారనడానికి అదొక సూచన. ప్రవక్తమహనీయులు అది గమనించారు. వారిని సంస్కరించాలన్న సత్ సంకల్పంతో ఇలా సెలవిచ్చారు:’మీరు గనక మనోవాంఛలను తుంచివేసే మరణాన్ని తరచుగా గుర్తుచేసుకుంటూ ఉన్నట్లయితే, అది మిమ్మల్ని ఇంతలా ఏమరుపాటులో పడి ఉండనిచ్చేది కాదు. కాబట్టి మీరు ఎక్కువగా మృత్యువును గుర్తుచేసుకుంటూ ఉండండి. ఎందుకంటే, మనందరి చివరి మజిలీ అయినటువంటి సమాధి ప్రతిరోజూ, ‘నేను ఒంటరి గృహాన్ని. మట్టి, పురుగుల పుట్టను’ అని ఎలుగెత్తి నినదిస్తూ ఉంటుంది. సమాధి పలికే ఈ పలుకుల్ని, దైవం ఎవరికైతే సమాధి పలుకులు వినగలిగే చెవులను ప్రసాదిస్తాడో వారు మాత్రమే వినగలరు. అంటే, ఒకవ్యక్తి మరణించిన తరువాత అతణ్ణి సమాధి అనబడే భూభాగంలో ఉంచి, పూడ్చడం జరుగుతుంది. అప్పుడు, విశ్వాసం, కర్మల ప్రాతిపదికన ఆ భూమి(సమాధి)ప్రవర్తన మృతుని పట్ల ఎలా ఉంటుందో ప్రవక్తమహనీయులు ఇలా వివరించారు. ‘ఒక వ్యక్తి సమాధి చేయబడిన తరువాత, అతను గనక నిజమైన విశ్వాసి అయినట్లయితే, భూమి ఒక ఆప్తమిత్రునికి స్వాగతం పలికినట్లుగా ఆహ్వానిస్తూ, ‘స్వాగతం.! సుస్వాగతం.! నీరాక సంతోషం, శుభకరం.! రా.. నా ఇంటిలోకి ప్రవేశించు. నా వెన్నుపై ఎంతమంది నడిచారో వారందరిలో నువ్వే నాకు అత్యంత ప్రీతిపాత్రుడవన్నవిషయం నీకు తెలియాలి. ఈరోజు నువ్వునాదగ్గరికొచ్చావు. నాకు అప్పగించబడ్డావు. ఇప్పుడు నేను నీతో ఎలా ప్రవర్తిస్తానోచూడు.’ అంటూ భూమి (సమాధి) ఆ విశ్వాసి కనుచూపు మేర విశాలమవుతుంది. అతని/ఆమె కోసం స్వర్గద్వారం తెరవబడుతుంది. అలాగే, ఒక పాపాత్ముడు సమాధి చేయబడినప్పుడు భూమి అతనితో ఇలా అంటుంది. ‘ఎంతమంది నాపై నడిచేవారో వారందరిలో నువ్వే నాకు అయిష్టమైనవాడివి, అత్యంత నీచుడివి. ఈరోజు నువ్వు నాకు అప్పగించబడ్డావు. నా అధీనంలో ఉన్నావు. ఇకచూడు, నీపట్ల నాప్రవర్తన ఎలా ఉంటుందో..!’ అంటూ ఆ సమాధి నలువైపులనుండీ అతణ్ణి ఒత్తిపడేస్తుంది. ఆ ఒత్తిడికి పక్కటెముకలు ఒకదానిలోకొకటి చొచ్చుకొనిపోతాయి. అందుకే... ‘సమాధి స్వర్గవనాల్లోని ఓ ఉద్యానవనం లేదా నరకకూపాల్లోని ఓ నరకపు అగడ్త తప్ప మరేమీ కాద’ని ప్రవక్తమహనీయులు సెలవిచ్చారు.అందుకని ప్రతి ఒక్కరూ స్వర్గాన్ని సొంతం చేసుకోడానికి, నరక జ్వాలలనుండి రక్షించబడడానికి శక్తివంచనలేని ప్రయత్నం చెయ్యాలి. ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ, సమాజ సంక్షేమానికి పాటుబడాలి. అల్లాహ్ మనందరికీ ఇహలోక, పరలోక సాఫల్యాలు అనుగ్రహించాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఇలవంక నెలవంక
రమజాన్ పండుగ సంబరాలుప్రాపంచిక లక్ష్యాలు పూర్తిచేసుకున్నందుకు కాక, ఒక ఆరాధనా విధి నెరవేర్చి పరలోక మోక్షానికి అర్హత సంపాదించుకున్నామన్న సంతోషంలో జరుగుతాయి. అల్లాహు అక్బర్ .. అల్లాహుఅక్బర్.. లాయిలాహ ఇల్లల్లాహువల్లాహుఅక్బర్ అల్లాహుఅక్బర్ వలిల్లాహిల్ హంద్ ..!రమజాన్ రోజు ఎటువిన్నా ఈ స్తోత్ర గానమే, ఆ దయామయుని కీర్తిగానమే వినిపిస్తూ హృదయాలను పులకింపజేస్తూ ఉంటుంది. ఊరు, వాడ, పల్లె, పట్నం, చిన్నా పెద్దా, ఆడామగా, ముసలీ ముతకా అనే తేడా లేకుండా ఎవరినోటవిన్నా ఈ అమృత వచనాలే జాలువారుతూ ఉంటాయి.కొత్తబట్టలు, కొత్తకొత్త మేజోళ్ళు, కొత్తహంగులు, తెల్లని టోపీలు, అత్తరు పరిమళాలు, అస్సలాము అలైకుం, ఈద్ ముబారక్‌లు, చిరునవ్వుల కరచాలనాలు, ఆలింగనాల ఆనంద తరంగాలు, అలయ్ బలయ్లతో విశ్వాసుల హృదయాలు సంతోషసాగరంలో ఓలలాడుతూ ఉంటాయి.సేమ్యాలు, షీర్ ఖుర్మాలు, బగారా, బిర్యానీల ఘుమఘుమలతో, ఉల్లాస పరవళ్ల హడావిడితో ముస్లిముల లోగిళ్లు కిలకిల నవ్వుతూ, కళకళలాడుతూ ఉంటాయి. ఇళ్లలో ఆడవాళ్ల హడావిడికి, పిల్లల సందడికి హద్దులే ఉండవు. ఎందుకంటే ఇది ఒక్కనాటి పండుగకాదు గదా! నెలనాళ్ల పాటు భక్తిప్రపత్తులతో జరుపుకున్న పండుగకు అల్విదా చెబుతున్న ముగింపు ఉత్సవం. రమజాన్ నెలరోజులూ ముస్లింల వీధులు ‘సహెరీ’,‘ఇఫ్తార్ ’ ల సందడితో నిత్యనూతనంగా కొత్తశోభతో అలరారుతుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ వింత అనుభూతుల్ని పంచుతుంటాయి. భక్తులు పవిత్రగ్రంథ పారాయణా మధురిమను గ్రోలుతూ వినూత్న అనుభూతులతో పరవశించిపోతుంటారు. ఆనందహేల అవును, ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాలు, అనుభవాలు, అనుభూతుల సమ్మేళనమే రమజాన్ పండుగ. ఇలాంటి ఓ అద్భుతమైన, అపురూప సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్’. దీన్నే రమజాన్ పండుగ అంటారు. ముస్లిం సమాజం జరుపుకునే రెండుముఖ్యమైన పండుగల్లో ఇది మొదటిదీ, అతి పవిత్రమైనదీను. ఈ నెలలో ముస్లింలు అత్యంత నియమనిష్టలతో రోజా వ్రతం పాటిస్తారు. భక్తి శ్రద్ధలతో రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. పవిత్రఖురాన్ గ్రంథాన్ని భక్తితో పారాయణం చేసి, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స)వారిపై సలాములు పంపుతూ ఉంటారు. దైవ నామస్మరణలో అనునిత్యం వారి నాలుకలు నర్తిస్తూ ఉంటాయి. ప్రతిరోజూ తరావీహ్ నమాజులో పాల్గొని తన్మయం చెందుతుంటారు. దానధర్మాలు, ఫిత్రాల చెల్లింపులో ఆనంద పరవశులవుతుంటారు. ఈ విధంగా రమజాన్ చంద్రవంక దర్శనంతో ప్రారంభమైన ఉపవాస దీక్షలు నెలరోజుల తరువాత షవ్వాల్ మాసం నెలవంక దర్శనంతో సమాప్తమవుతాయి. షవ్వాల్ మొదటి తేదీన జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినాన్నే మనం రమజాన్ పండుగ అంటున్నాము. ఈ పండుగ సంబంధం రమజాన్ నెలతో ముడివడి ఉన్న కారణంగా ఇది రమజాన్ పండుగగా ప్రసిద్ధి చెందింది .రమజాన్ ఉపవాస దీక్షలు, పవిత్రఖురాన్ అవతరణతో దీని సంబంధం పెనవేసుకు పోయి ఉంది. సామరస్యం వెల్లివిరిసే రోజు రమజాన్ నెల ఆరంభం నుండి ముగింపు వరకు ఒక క్రమపద్ధతిలో ధర్మం చూపిన బాటలో నడుస్తూ, దైవప్రసన్నత, పుణ్యఫలాపేక్షతో ఈ నెలను గడిపినవారు ధన్యులు. నిజానికి ఇలాంటివారే పండుగ శుభకామనలకు అర్హులు. అందుకే ‘ఈద్’ (పండుగ)ను శ్రామికుని వేతనం (ప్రతిఫలం) లభించే రోజు అని చెప్పడం జరిగింది. సదాచరణల సంపూర్ణ ప్రతిఫలం లభించిన సంతోషంలో అంబరాన్నంటేలా సంబరాలు జరుపుకొని ఆనందతరంగాల్లో తేలియాడే రోజు ఈదుల్ ఫిత్ర్. ఆ రోజు ముస్లిములందరూ ఈద్ నమాజ్ ముగించుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారుచేసిన సేమియా పాయసాన్ని తమ హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ సోదరులందరికీ ఆప్యాయంగా రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు. ‘ఈద్ ముబారక్ ’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుంటారు. ఈ విధంగా రమజాన్ పర్వదినం మనిషిని ఒక ఉన్నత మానవీయ విలువలు కలవాడుగా తీర్చిదిద్ది, సమాజంలో శాంతి, సమానత్వం, సామరస్యం, సోదరభావాలకు పునాది వేస్తుంది. ప్రేమత త్వాన్ని ప్రోదిచేస్తుంది. ఇదే ఈదుల్ ఫిత్ర్ – రమజాన్ పర్వదిన పరమార్థం. ఈద్ నాటి సంప్రదాయం రమజాన్ నెల పూర్తి రోజాలను నెరవేర్చడమంటే, దైవాదేశపాలనలో ఒక గురుతరమైన బాధ్యతను నెరవేర్చడం. ఇలాంటి సందర్భంలో ఒకమనిషిగా అతని హృదయం ఆనందంతో పొంగిపోవడం, ఒక విశ్వాసిగా అల్లాహ్ పట్ల కృతజ్ఞతా భావంతో నిండిపోవడం సహజం. ఈ సహజ భావోద్రేకాలే ’ఈదుల్ ఫిత్ర్’ రూపంలో బహిర్గతమవుతాయి. ఈ పండుగలో విశ్వాసి తాను రోజా విధి నెరవేర్చిన సందర్భంగా తన హృదయంలోని సంతోషాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తాడు. మరోవైపు అల్లాహ్ ఆదేశ పాలనలో ఒకవిధిని నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తాడు. ఇస్లాంలో పండుగ సంబరాలు ప్రాపంచిక లక్ష్యాలు పూర్తిచేసుకున్నందుకు కాక, ఒక ఆరాధనా విధి నెరవేర్చి పరలోక మోక్షానికి అర్హత సంపాదించుకున్నామన్న సంతోషంలో జరుగుతాయి. పండుగ సంప్రదాయం గుసుల్ చేయడం: ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం సంప్రదాయాన్ని అనుసరించి, ఈద్ గాహ్ కు వెళ్లే ముందు గుసుల్ (స్నానం) చేయాలి.మంచివస్త్రాలు ధరించడం: పండుగ సందర్భంగా అవకాశాన్ని బట్టి ఉన్నంతలో మంచి వస్త్రాలు ధరించాలి.సుగంధ ద్రవ్యాలు వాడటం : ఉన్నంతలోనే అత్యుత్తమ సుగంధ ద్రవ్యాలు వాడాలి.ఈద్ గాహ్ కు వెళుతూ బిగ్గరగా తక్బీర్ పలకడం : అల్లాహుఅక్బర్ అల్లాహుఅక్బర్, లాయిలాహ ఇల్లల్లాహు వల్లాహుఅక్బర్ అల్లాహుఅక్బర్ వలిల్లాహిల్ హంద్ అని బిగ్గరగా పలుకుతూ ఉండాలి.కాలినడకన ఈద్ గాహ్ కు వెళ్ళడం: నమాజు కోసం ఈద్ గాహ్ కు కాలినడకన వెళ్లాలి. ఒకదారిన వెళ్లి, మరోదారిన తిరిగి రావాలి.ఖర్జూరాలు తినడం : ఈద్ గాహ్ కు వెళ్లే ముందు బేసిసంఖ్యలో ఉండేలా పచ్చి లేక ఎండు ఖర్జూరాలు తినాలి. ఖర్జూరం లేని పక్షంలో ఏదైనా తీపివస్తువు తినవచ్చు. 3,5,7 ఇలా బేసి సంఖ్యలో ఖర్జూరాలు తిని ప్రవక్త మహనీయులు ఈద్ గాహ్ కు వెళ్లేవారు. – మదీహా అర్జుమంద్ -
అపురూపంగా చూసుకోవాలి
కొత్తగా పెళ్లయిన జంట భోజనానికి కూర్చుంది. ‘‘మీ అమ్మగారిని కూడా పిలవండి’’ అని చెప్పింది భార్య. ‘‘మా అమ్మ సంగతి వదిలేయి.’’ అని విసుక్కున్నాడు భర్త. అందుకు ఆమె ఒప్పుకోలేదు. మీ అమ్మగారు తినకుండా మనం తినడం భావ్యం కాదని చెప్పింది. పెళ్లికొడుక్కి చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఇద్దరూ పెళ్లైన రోజే విడిపోయారు. ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఎవరికి తోచిన సంబంధం వాళ్లు చూసుకుని వేరే పెళ్లి చే సుకున్నారు. ఇలా ముప్ఫై ఏళ్లు గడిచిపోయాయి. ఆ మహిళకు మగ సంతానం కలిగింది. పిల్లలు ప్రయోజకులయ్యారు. పిల్లల్ని ధార్మికంగా తీర్చిదిద్దడంతో పిల్లలు కూడా తల్లిని రాణిలా చూసుకోసాగారు. కాళ్లకు మట్టి కూడా అంటనివ్వకుండా ఎంతో అపురూపంగా చూసుకోసాగారు. దగ్గరుండి హజ్ యాత్ర చేయించారు. హజ్ యాత్ర తిరుగు ప్రయాణంలో ఒక చోట ఒక వ్యక్తి చింపిరి జుట్టుతో రోడ్డుపక్కన దుర్భరస్థితిలో పడి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి చలించిపోయిన ఆ మహిళ ఆ అభాగ్యుడిని లేపి ఏదైనా తినిపించి మంచినీళ్లు తాగించాలని తన పిల్లలను కోరింది. పిల్లలు ఆ వ్యక్తిని లేపి కూర్చోబెడుతుండగా ఆ వ్యక్తిపై ఆమె దృష్టి పడింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిందా మహిళ. ఆ వ్యక్తి ఎవరో కాదు, తన మొదటి భర్త అని గుర్తుచేసుకొంది. ఈ దుస్థితికి కారణమేమిటని అడిగింది. దానికా వ్యక్తి ‘‘మా పిల్లలు నా ఆస్తినంతా కాజేసి నన్ను బయటకు గెంటేశారు’’ అని తన దీనస్థితిని చెప్పుకొచ్చాడు. అప్పుడామె కలగజేసుకొని ‘‘నీ ఈ దుస్థితిని మన పెళ్లయిన మొదటి రాత్రే అంచనా వేశాను. నువ్వు మీ అమ్మానాన్నల హక్కులు నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేశావు. వాళ్లను చులకనగా చూశావు. రేపటి రోజు నాకూ ఇదే గతి పడుతుందనే ఆ రోజు నీ నుంచి విడిపోయాను’’ అని చెప్పింది. మన వృద్ధాప్యం ఎలా గడపాలని కోరుకుంటున్నామో మన తల్లిదండ్రులకూ అలాంటి వృద్ధాప్యాన్ని అందించాలి. ముసలితనంలో వాళ్లను ఆదరించాలి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే బతికుండగానే ఆ పాపం మన మెడకు చుట్టుకుంటుందని ముహమ్మద్ ప్రవక్త (స) హెచ్చరించారు. – ముహమ్మద్ హమ్మాద్ -
మకుటంలేని మహారాజు
ముహమ్మద్ ప్రవక్త (స), ఆయన అనుచరులు మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళిన దగ్గరి నుండి మక్కా ఖురైషీలు ఆగ్రహంతో రగిలిపోయేవారు. చివరికి భావికార్యాచరణ గురించి సమాలోచనలు జరిపి మదీనాపై దాడికి పథకం రచించారు. మక్కాలో శతృవుల పోరుపడలేక ప్రవక్త, ఆయన అనుచరులు మదీనాకు వలస వస్తే, ఇక్కడ కూడా కొంతమంది విశ్వాసుల రూపంలో కపటులు పోగయ్యారు. అబ్దుల్లాబిన్ ఉబై వీరికి నాయకుడు. అయినా ప్రవక్త మహనీయులు ఈ దుష్టుల కుటిల పన్నాగాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. రోజురోజుకూ ఆగడాలు మితిమీరిన క్రమంలో జరిగిన కొన్ని పరిణామాల నేప«థ్యంలో ఆత్మరక్షణకోసం శతృవుతో తలపడడం అనివార్యమంది. ‘బద్ర్’ పేరుతో ప్రసిద్ధిగాంచిన ఈ సమరంలో విజయం విశ్వాసులనే వరించినప్పటికీ, ముహమ్మద్ ప్రవక్త (స) జీవితం నిరంతరం సంఘర్షణలతోనే గడిచిపోయింది. సత్యాసత్యాల పోరులో ఎన్నో త్యాగాలు చేయవలసివచ్చింది. దుష్టశక్తులతో పోరాటాలు సలుపవలసి వచ్చింది. తరువాతి పరిణామ క్రమంలో ఉహద్, కందక పోరాటాలు కూడా సంభవించాయి. ఒప్పందాలూ, ఒడంబడికలూ జరిగాయి. ఎట్టి పరిస్థితిలోనూ పోరుకంటే సంధికే అధిక ప్రాధాన్యతనిచ్చేవారు ప్రవక్త మహనీయులు. విలువల పునాదులపైనే చివరికి మక్కాను కూడా జయించారు. విజేతగా మక్కాలో అడుగు పెట్టిన ప్రవక్త మహనీయులు ఒక ప్రకటన చేశారు. కాబా గృహంలో రక్షణ పొందినవారిని మన్నించడం జరుగుతుంది. తమతమ ఇళ్ళలోనే ద్వారాలు మూసుకొని ఉన్నవారికి రక్షణ ఉంటుంది. అబూసుఫ్యాన్ ఇంట రక్షణ పొందిన వారికీ మన్నింపు ఉంటుంది. జన్మభూమిని వదిలి ఒంటరిగా, అవమానభారంతో మదీనాకు వలసవెళ్ళడానికి కారణమైన, చంపడానికి పథకాలు రచించిన శతృవులను సైతం కారుణ్యమూర్తి కనికరించారు. వారిపై ఎలాంటి పగ, ప్రతీకారమూ లేకుండా మనసారా మన్నించారు. ఈ విజయం సందర్భంగా ఆయన ఒక చారిత్రక ప్రసంగం చేశారు. దేవుని ఏకత్వాన్ని, ఆయన గొప్పదనాన్ని వేనోళ్ళ పొగిడారు. పగలు ప్రతీకారాలు, హత్యలు ప్రతిహత్యలను అంతం చేస్తున్నట్లు ప్రకటించారు. సమాజంలో మానవ హక్కుల్ని, మానవ సమానత్వాన్ని విశదీకరించారు. ఉచ్చనీచాల నిమ్నోన్నతాభేదభావాల్ని అంతమొందించారు. వడ్డీ వ్యవస్థను, జూదం, మద్యం లాంటి దురలవాట్లను నిషేధించారు. స్త్రీ పురుష హక్కుల్ని నిర్వచించారు. మానవులంతా ఒకే రాశికి చెందినవారని, ఎవరికీ ఎవరిపై ఎలాంటì æఆధిక్యమూ లేదని విడమరచి చెప్పారు. మూగజీవాల పట్ల బాధ్యతను ప్రోదిచేశారు. దైవాన్ని నమ్ముకున్నవాడు, సత్యధర్మంపై స్థిరంగా ఉన్నవాడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడని భరోసా ఇచ్చారు. ఆయన ఏనాడూ మానవీయ విలువలను, ఆదర్శాలను విడనాడలేదు. రణరంగానికి సైతం మానవత్వం నేర్పి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ప్రేమ, దయ, జాలి, కరుణ, సహనం, త్యాగం, పరోపకారం, న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ, విశ్వసనీయత ఆ మహనీయుని సుగుణాలలో కొన్ని. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మదీనాకు పయనం...
• ప్రవక్త జీవితం ముహమ్మద్ ప్రవక్తను వెతుక్కుంటూ వెంబడించిన శతృవులు సరిగ్గా గుహ దగ్గరికొచ్చి ఆగిపొయ్యారు. అక్కడినుండి ఎటువెళ్ళిందీ వారికి అంతుచిక్కలేదు. గుహలో దూరారేమో చూడండి అన్నాడో వ్యక్తి వెనుక నుండి అరుస్తూ.. కాని గుహ ముఖద్వారానికి ఓ పెద్ద సాలెగూడు అల్లుకొని ఉంది. అక్కడే రెండుపక్షులు గూళ్ళు కట్టుకొని, గుడ్లుపెట్టి పొదుగుతున్నాయి. అంతేకాదు దారికి అడ్డంగా ఓ పెద్దవృక్షం కూడా ఉంది. సంవత్సరాల తరబడి నర మానవుడెవరూ ఇటు తొంగి చూసిన ఆనవాళ్ళు కూడా లేని ఈ గుహలో మానవ జాడ ఉంటుందని అనుకోవడం పిచ్చితనంకాక మరేమీకాదు. అనుకొని ఉసూరుమంటూ తిరుగుముఖం పట్టారు ఖురైషీ దుండగులు. ఈ విధంగా ముహమ్మద్ ప్రవక్త, హ.అబూబకర్ లు మూడురోజుల వరకు సౌర్ గుహలో నే తలదాచుకున్నారు. ఈ మూడురోజుల పాటూ హ.అబూబకర్ తనయుడు హ. అబ్దుల్లాహ్, కూతురు హ. అస్మా తండ్రికి, ప్రవక్తవారికి అన్నపానీయాలు సమకూర్చేవారు. ఇదేమీ ఆషామాషీ వ్యవహారంకాదు. పులులతో చెలగాటం. ఏదోపని మీద ఎటో వెళుతున్నట్లు బయలు దేరి గుహకు దారితీసేవారు. వీరి సేవకుడు ఆమిర్ అడుగుజాడలు కనిపించకుండా మేకలు తోలుకొనివెనకాలే బయలు దేరేవాడు. వీరు అందించిన సమాచారం ఆధారంగా ప్రవక్తమహనీయులు, అబూబకర్ లు మదీనా బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. అస్మా, అబ్దుల్లాలు చివరిరోజు అన్నపానీయాలతో పాటు, రెండుమేలుజాతి ఒంటెల్ని, ఇబ్నెఅర్ఖత్ అనే ఓ ముస్లిమేతరవ్యక్తిని తీసుకొని వచ్చారు. ఇతనుఅబూబకర్కు చాలా నమ్మకస్తుడు. జనసంచారం లేని నిర్జనమార్గాలగుండా మదీనా తీసుకువెళ్ళడానికి అతనికి కొంతపైకం ఇచ్చిమార్గదర్శిగా నియమించుకున్నారు. హ.అబూబకర్ గారి కూతురు అస్మా ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు సిధ్ధంచేశారు. చివర్లో నీళ్ళతిత్తి కట్టడానికి సమయానికక్కడ ఏమీ లేకపోవడంతో కంగారు పడ్డారు. కాని వెంటనే మెరుపులాంటి ఆలోచన తట్టగానే క్షణంకూడా ఆలస్యం చెయ్యకుండా తన నడుముకు కట్టుకున్న ఓణీని రెండుముక్కలుగా చింపి మంచినీళ్ళతిత్తి కట్టేశారు. అలాంటి సమయంలో ఆమె సమయస్ఫూర్తికి అచ్చెరువొందిన ప్రవక్తమహనీయులు మందహాసం చేస్తూ, ‘జాతున్నితాఖైన్’ అని సంబోధించారు. అప్పటి నుండి ఆమె ’జాతున్నితాఖైన్ ’ (రెండు ఓణీల మహిళ) గా ప్రసిధ్ధిగాంచారు. ఇబ్నెఅర్ఖత్ మార్గదర్శకత్వంలో ప్రవక్తమహనీయులు, హ.అబూబక్ర్ , ఆయన సేవకుడు ఆమిర్‌లు మదీనాకు పయనమయ్యారు. ప్రవక్తకోసం వెతికి వెతికి వేసారిన Ôè త్రువులు ఇక తమవల్లకాదని, ముహమ్మద్ పట్టిచ్చినవారికి వందఒంటెలు బహుమతిని ప్రకటించారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతాది వచ్చేవారం) -
తిట్టిన వారికీ దీవెనలే!
వలస వచ్చిన విశ్వాసుల్లో అబూ తాలిబ్ తనయుడు హజ్రత్ జాఫర్ రజీ, చక్రవర్తి ప్రశ్నలకు సమాధానాలిస్తూ, ‘మహారాజా! మేము పూర్వం చాలా అజ్ఞానంగా ఉండేవాళ్ళం. విగ్రహారాధన చేసేవాళ్ళం. సారాయి, జూదం, అశ్లీలతల రొచ్చులో కూరుకు పోయి ఉండేవాళ్ళం. చచ్చిన జంతువులను తినేవాళ్ళం. పగలు, ప్రతీకారాలతో రగిలిపోతూ ఒకళ్ళనొకరు చంపుకునేవాళ్ళం. కక్షలు, కార్పణ్యాల పరంపర తరతరాలుగా కొనసాగేది. ఇలాంటి పరిస్థితిలో దేవుడు మాపై దయ దలిచాడు. మాలోనే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. ఆయనది ఎంతో గౌరవప్రదమైన వంశం. ఆయనగారి నీతి నిజాయితీ, సత్యసంధత మాకు మొదటి నుండీ తెలుసు. ఆయన మమ్మల్ని సత్యం వైపు, ధర్మం వైపు పిలిచాడు. దేవుని సందేశం మాకు బోధించాడు. సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యమే పలకాలనీ, జాలి, దయ, పరోపకారం లాంటి సుగుణాలు కలిగి ఉండాలనీ, సాటి మానవుల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలనీ, బంధువుల హక్కులు నెరవేర్చాలనీ, అనాధలను ఆదరించాలనీ, వారిసొమ్ము కబళించకూడదనీ, శీలవతులపై అపనిందలు మోపకూడదనీ, దానధర్మాలు చేస్తూ ఉండాలనీ ఆయన మాకు బోధించాడు. మేమాయన మాటలు విని, ఆయనను అనుసరిస్తున్న కారణంగా మా వాళ్ళు మమ్మల్ని హింసించడం ప్రారంభించారు. వారి దౌర్జన్యాలు భరించలేక, ఇక్కడైనా కాస్త ప్రశాంతంగా బ్రతకవచ్చని మీ దేశంలో తలదాచుకున్నాం. ఇదే మేము చేసిన నేరం’ అన్నారు. తరువాత జాఫర్ ద్వారా కొన్ని ఖురాన్ వాక్యాలు కూడా చదివించుకొని విన్నాడు – నీగస్ చక్రవర్తి. ఈసా ప్రవక్తకు సంబంధించి ఖురాన్ చెప్పిన విషయాలను ధ్రువీకరించాడు. అంటే, ముహమ్మద్ ప్రవక్త(స) వారి సందేశం మహోన్నతమైన నైతిక, మానవీయ ప్రమాణాలతో నిండి ఉందని మనకు అర్థమవుతోంది. జీవితంలోని ప్రతి రంగంలో నీతిని పాటించాలనీ, ఇంట్లోనైనా, వీధిలోనైనా, కార్యాలయాల్లోనైనా, న్యాయస్థానాల్లోనైనా, అధికార పీఠంపైనా ప్రతిచోటా నిజాయితీ, సౌశీల్యం తొణికిసలాడాలనీ, జీవితంలోని ఏ రంగమూ నీతి రహితంగా ఉండకూడదనీ ప్రవక్త అభిలషించారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకూ, మానవీయ సంబంధాల పెంపుదలకూ ఎంతటి ప్రాముఖ్యమిచ్చారో ప్రవక్త జీవితం ద్వారా మనకు తెలుస్తోంది. ప్రవక్త(స) తన సందేశ కార్యక్రమంలో భాగంగా ‘తాఝెఫ్’ అనే ఊరికి వెళ్ళారు. గ్రామ పెద్దలను కలుసుకొని తన సందేశం వినిపించారు. కానీ వారు చాలా అమర్యాదగా, అమానవీయంగా ప్రవర్తించారు. మంచిని బోధించినందుకు నానా మాటలన్నారు. రౌడీ మూకను ఆయనపైకి ఉసిగొలిపి రక్తసిక్తమయ్యేలా కొట్టించారు. అయినా ప్రవక్త పల్లెత్తుమాట అనలేదు. పర్వతాలపై అదుపు కలిగిన దైవదూతలు ప్రత్యక్షమై, తమరు అనుమతిస్తే రెండు కొండల మధ్య ఉన్న ఈ ఊరిని విసుర్రాయిలో పప్పులు నలిపినట్లు నలిపి పిండి చేస్తామన్నా, ఆ మానవతామూర్తి ససేమిరా ఒప్పుకోలేదు. చెడుకు చెడు సమాధానం కాదని ఉపదేశించారు. తనను హింసించిన వారిని దీవించి, వారికి సద్బుద్ధిని ప్రసాదించమని దైవాన్ని ప్రార్థించారు. (మిగతాది వచ్చేవారం) -
బలహీనుల ఆశాజ్యోతి
సమస్త సృష్టికీ కర్త అయిన ఏకైక దైవాన్నే ఆరాధించమని ప్రజలకు పిలుపునిచ్చిన మహనీయుడు ముహమ్మద్ ప్రవక్త. తల్లితండ్రులను గౌరవించాలనీ, వారిపట్ల విధేయతా భావం కలిగి ఉండాలనీ, వారి సేవ చేయని వారు నరకానికి పోతారనీ హెచ్చరించారాయన. బంధువులు, బాటసారులు, అనాథలు, వితంతువులు, నిస్సహాయుల పట్ల దయగా ఉండాలని బోధించారు. మానవ మహోపకారి ముహమ్మద్ (స) ఒక్క ముస్లిమ్ సముదాయానికే కాక సమస్త మానవ జాతికీ సంపూర్ణ మార్గదర్శకులు. ఆయన జన్మదినమైన ‘మిలాద్ –ఉన్–నబీ’ వేళ ఆయన బోధనలపై దృష్టి సారించాలి. సత్యమే పలకాలి. చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి. పలికే ప్రతిమాటకు, చేసే ప్రతి పనికీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని బాధ్యతా భావాన్ని ప్రవక్త నూరిపోశారు. అన్యాయానికీ, అధర్మ సంపాదనకు ఒడిగట్టవద్దన్నది ఆయన బోధ. అలాగే ధనాన్ని దుర్వినియోగం, దుబారా చేయవద్దని కూడా ఆయన హెచ్చరించారు. వ్యభిచారం దరిదాపులకు కూడా పోవద్దని, ఈ పాపానికి దూరంగా ఉండటమే కాకుండా, దానికై పురిగొలిపే ప్రసారసాధనాల్ని కూడా రూపుమాపాలని పిలుపునిచ్చారు. నిష్కారణంగా ఏ ప్రాణినీ చంపకూడదనీ, ప్రజల ధన, మాన ప్రాణాలు సురక్షితంగా లేని సమాజం ప్రగతిపథంలో పయనించజాలదనీ ఉపదేశించారు. వ్యాపార లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, లెక్కపత్రాలు, కొలతలు, తూనికలు చాలా ఖచ్చితంగా, నికార్సుగా ఉండాలని ముహమ్మద్ ప్రవక్త (స) బోధించారు. స్వార్థాన్ని, అహాన్ని త్యజించాలని, తోటి మానవ సోదరుల్ని తమకన్నా తక్కువగా చూడకూడదని ఆయన ఉపదేశించారు. స్త్రీ జాతిని గౌరవించాలనీ, అనాథలను ఆదరించని వారు మహాపాపాత్ములనీ, వారిని ఆదరించి, సంరక్షిస్తే స్వర్గార్హత సాధించవచ్చని ఆయన చెప్పారు. అదేవిధంగా ఖైదీల పట్ల కరుణతో వ్యవహరించాలని, వారిని హింసించకూడదని, అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న అమాయకుల విడుదలకు కృషి చేయాలని ఉపదేశించారు. వితంతువులను చిన్నచూపు చూడకూడదని, సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలని, శుభకార్యాల్లో వారిని ఆహ్వానించకపోవడం అన్యాయమని, ఈ దురాచారాన్ని మానుకోవాలని హెచ్చరించారు. అవసరం, అవకాశం ఉన్నవారి పునర్వివాహానికి ప్రయత్నించాలని, వారిని నిర్లక్ష్యం చేసిన సమాజం అథోగతి పాలవుతుందని కూడా ఆయన హెచ్చరించారు. వృద్ధులను ఆదరించాలని హితవు పలికారు. ఒక మార్గదర్శిగా ప్రవక్త (స) బోధించే ప్రతి విషయాన్ని స్వయంగా ఆచరించి చూపేవారు. ఆచరణ లేని హితబోధ జీవం లేని కళేబరం వంటిదని ఆయన చెప్పేవారు. ఆ మహనీయుని మంచితనానికీ, మానవీయ సుగుణానికీ అద్దం పట్టే ఓ సంఘటన... ఇది ముహమ్మద్ ప్రవక్త ధర్మప్రచారం చేస్తున్న తొలినాళ్ళ మాట. ఒకసారి ఆయన మక్కా వీధిలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఒక చౌరస్తాలో ఓ వృద్ధురాలు తన మూటాముల్లెతో సహా నిలబడి ఉంది. వృద్ధురాలు కావడంతో మూటల బరువు మోయలేక పరుల సహాయం కోసం అర్థిస్తోంది. దారిన వెళ్ళేవాళ్ళను బతిమాలుతోంది కాస్తంత సాయం చేయమని! చాలామంది ఆ దారిన వెళుతున్నారు కానీ, వృద్ధు్ధరాలిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతలో ముహమ్మద్ ప్రవక్త అటుగా వెళుతూ, వృద్ధు్ధరాలిని ఎవరూ పట్టించుకోకపోవడం చూసి, ఆమెను సమీపించారు. ‘అమ్మా! నేను మీకు సహాయం చేస్తాను’ అన్నారు. ‘బాబ్బాబూ! నీకు పుణ్యం ఉంటుంది. ఈ మూట చాలా బరువుగా ఉంది. మోయలేకపోతున్నాను. కాస్త అందాకా సాయం చేస్తే, నేను వెళ్ళిపోతాను’ అన్నదా వృద్ధురాలు. ‘అయ్యో! దీనికేం భాగ్యం’ అంటూ మూట భుజానికెత్తుకొని, ఆమె కోరిన చోటుకు చేర్చారు ప్రవక్త. ‘బాబూ! దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఏ తల్లి కన్నబిడ్డవో గాని ముక్కూమొహం తెలియని నా లాంటి ముసలిదానికి ఇంత సాయం చేశావు. బాబూ! ఒక్కమాట వింటావా! ఎవరో ముహమ్మద్ అట, ఏదో కొత్త మతాన్ని ప్రచారం చేస్తున్నాడట. అతని మాటల్లో ఏముందో గాని చాలామంది అతని ప్రభావంలో పడిపోతున్నారు. జాగ్రత్త నాయనా! అతని మాటల్లో పడకు. నేను కూడా అందుకే ఊరే విడిచి వెళ్ళిపోతున్నాను’ అని హితవు పలికింది. ‘సరేనమ్మా’ అంటూ ఆమె చెప్పినదంతా విని, వినయపూర్వకంగా అవ్వకు అభివాదం చేసి సెలవు తీసుకున్నారు ప్రవక్త. ఆ మహనీయుని మంచితనానికీ, వినయపూర్వకమైన ఆ వీడ్కోలుకూ ఆనందభరితురాలైన వృద్ధురాలు ఒక్కసారిగా భావోద్రేకానికి లోనై, ‘బాబూ!’ అని పిలిచింది ఆప్యాయంగా. ‘అమ్మా!’ అంటూ దగ్గరికి వచ్చిన ప్రవక్త తలపై చేయి వేసి నుదుటిని ముద్దాడుతూ, ‘బాబూ! నీ పేరేమిటి నాయనా!’ అని ప్రశ్నించింది ప్రేమగా. కాని ప్రవక్త మాట్లాడకుండా, మౌనం వహించారు. ‘బాబూ! పేరైనా చెప్పునాయనా! కలకాలం గుర్తుంచుకుంటాను’ అంటూ అభ్యర్థించింది. అప్పుడు ప్రవక్త మహనీయులు, ‘అమ్మా! నా పేరు ఏమని చెప్పను ? ఏ ముహమ్మద్‌కు భయపడి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావో ఆ అభాగ్యుణ్ణి నేనేనమ్మా!’ అన్నారు ప్రవక్త మహనీయులు. దీంతో ఒక్కసారిగా ఆ వృద్ధురాలు అవాక్కయిపోయింది. కాసేపటి వరకు ఆమెకేమీ అర్థం కాలేదు. ఏమిటీ.. నేను వింటున్నది ముహమ్మద్ మాటలనా..! నేను చూస్తున్నది స్వయంగా ముహమ్మద్నేనా..? నా కళ్ళు, చెవులు నన్ను మోసం చేయడం లేదు కదా..! ఇలా ఆమె మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఎవరి మాటలు వినకూడదనీ, ఎవరి ముఖం కూడా చూడకూడదనీ పుట్టిపెరిగిన ఊరినే వదిలేసిందో, అతనే తనకు సహాయం చేశాడు. ఎవరూ పట్టించుకోని నిస్సహాయ స్థితిలో ఆప్యాయత కురిపించాడు. సహాయం కంటే ఎక్కువగా ఆయన మాట, మంచితనం, వినమ్రత, మానవీయ సుగుణం ఆమెను మంత్రముగ్దురాలిని చేశాయి. కళ్ళ నుండి ఆనందబాష్పాలు రాలుతుండగా, ‘బాబూ ముహమ్మద్ ! నువ్వు నిజంగా ముహమ్మద్వే అయితే, నీ నుండి పారిపోవాలనుకోవడం నా దురదృష్టం. ఇక నేను ఎక్కడికీ వెళ్ళను. నీ కారుణ్య ఛాయలోనే సేద దీరుతాను’ అంటూ అదే క్షణాన ప్రవక్త వారి ప్రియ శిష్యురాలిగా మారిపోయింది. ఇదీ ప్రవక్త మహనీయుని ఆచరణవిధానం. ప్రజల పట్ల, ముఖ్యంగా నిస్సహాయులు, బడుగు, బలహీనులు, పీడిత తాడిత శ్రామిక వర్గాల పట్ల ఆ మహనీయుడు అవలంబించిన ఆచరణ శైలి. ఇందులో ఎంతో కొంతైనా మనం ఆచరించడానికి ప్రయత్నిస్తే నేటి మన సమాజం ఎలా ఉంటుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి. ఇలా మానవ మహోపకారి ముహమ్మద్ (స) ఊహ తెలిసినప్పటి నుండి అంతిమ శ్వాస వరకు సమాజ సంక్షేమం కోసం, సంస్కరణ కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. మానవాళికి సత్యధర్మాన్ని పరిచయం చేస్తూ, వారి ఇహ పర సాఫల్యాల కోసం అహర్నిశలు శ్రమించారు. ఆ మహనీయుని జీవన విధానం మానవాళికి అంతటికీ ఆదర్శం కావాలి. ప్రజలతో ఆయన ఏవిధంగా ప్రేమానురాగాలతో,స్నేహ సౌహార్దాలతో, సానుభూతితో వ్యవహరించేవారో, అవసరార్థులకు, ఆపదలో ఉన్నవారికి, ఏ విధంగా ఆపన్నహస్తం అందించేవారో, అలాంటి వ్యవహారశైలి నేడు మనలోనూ తొణికిసలాడాలి. ప్రవక్త తన చివరి హజ్‌యాత్ర సందర్భంగా ఇలా అన్నారు... ‘‘ప్రజలారా! ఒక మనిషికి మరో మనిషిపై ఎలాంటి ఆధిక్యతా లేదు. మీరు తినేదే మీ సేవకులకు పెట్టండి. కూలివాని చెమట బిందువులు ఆరక ముందే అతని వేతనం చెల్లించండి. మహిళల గురించి దైవానికి భయపడండి. మీకు వారిపై ఎలాంటి హక్కులున్నాయో, ధర్మం ప్రకారం వారికీ మీపై అలాంటి హక్కులే ఉన్నాయి. వడ్డీ తినకండి, దాన్ని త్యజించండి. సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి. ఆయనకు ఎవరి భాగస్వామ్యాన్నీ కల్పించకండి. బాధ్యతాభావం, జవాబుదారీతనం కలిగి ఉండండి. మీ కర్మలన్నింటికీ ఒకనాడు దైవం ముందు సమాధానం చెప్పుకోవాల్సి ఉంది...’’ ఇలా ప్రజానీకానికి అనేక హితోపదేశాలు చేశారు. అవన్నీ మనకు మార్గదర్శకం. రేపు‘మిలాద్–ఉన్–నబీ’ ముహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు -
అవిశ్వాసులపై దండయాత్ర!
ప్రవక్త జీవితం ఒక్క అబూ లహబ్ తప్ప, అందరూ అబూ తాలిబ్ మాటలతో ఏకీభవించారు. ముహమ్మద్ (స)ను ఒంటరిగా వదిలిపెట్టబోమని ప్రకటించారు. ‘ఇన్నాళ్ళూ సహించి ఊరకున్నాం. ఇక సహించే ప్రసక్తే లేదు’ అన్నారందరూ ముక్తకంఠంతో. అబూ లహబ్ మాత్రం కుటుంబ సభ్యులతో విభేదించి, శతృపక్షంలో చేరిపోయాడు.ఈ విషయం ముహమ్మద్‌కు చెబుదామని చాలా సంతోషంగా బయలుదేరారు అబూ తాలిబ్. కానీ ఆయన ఇంట్లో లేరు. ఎటువెళ్ళారో తెలియదన్నారు ఇంట్లోవాళ్ళు. అబూ తాలిబ్ మనసు కీడు శంకించింది. దుర్మార్గులు అబ్బాయికి ఏమైనా కీడు తలపెట్టారేమో అని తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే యువకులందర్నీ ఆయన సమీకరించి, కరవాలాలు తీసుకొని తన వెంట బయలుదేరమన్నారు. క్షణాల్లో యువకులంతా ఆయుధాలు తీసుకొని బయలుదేరారు. అబూ తాలిబ్ సూచన మేరకు అవి కనబడకుండా చొక్కాల లోపల దాచుకున్నారు. అబూ తాలిబ్ నేరుగా కాబా వైపు దారితీశారు. దారిలో ప్రవక్త పెంపుడు కొడుకు జైద్ బిన్ హారిసా (ర) ఎదురుపడి, ఏమిటీ విషయమని ఆరా తీశారు. ‘ముహమ్మద్ (స) హంతకులపై ప్రతీకారం తీర్చుకోవడానికి’ అని బదులిచ్చారు అబూ తాలిబ్. ‘అదేమిటీ! ఆయన నిక్షేపంగా కాబాలో ఉన్నారు. నేనిప్పుడు ఆయన దగ్గర నుండే వస్తున్నాను’ అన్నారు జైద్. జైద్ మాటలతో అబూతాలిబ్ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆయన మనసుకు ప్రశాంతత చేకూరింది. అయినా కాబా ఆలయానికి వెళ్ళి, అబ్బాయిని కళ్ళారా చూసుకోవాలని ముందుకు సాగారు.అకస్మాత్తుగా బనూహాషిం యువకుల్ని వెంటబెట్టుకొని అబూతాలిబ్ రావడం చూసి అవిశ్వాసులు ఆశ్చర్యపోయారు. ప్రశ్నార్థకంగా వాళ్ళంతా ఒకరి ముఖాలొకరు చూసుకొన్నారు. అది చూసి, అబూ తాలిబ్ ‘ఏమిటి ఆశ్చర్యపోతున్నారు? నేనిక్కడికి ఎందుకొచ్చానో తెలుసా?’ అని ప్రశ్నించారు. ‘దేవుని తోడు. మాకు అసలు ఏమీ తెలియదు’ అన్నారు వారంతా ముక్తకంఠంతో. అప్పుడు అబూ తాలిబ్ విషయం వివరించి, యువకుల వైపు సైగ చేశారు. వెంటనే బనూహాషిం యువకిశోరాలు తాము లోపల దాచిన ఆయుధాలు బయటికి ప్రదర్శించారు.అప్పుడు అబూతాలిబ్, ‘దైవసాక్షిగా చెబుతున్నాను. మీరు గనక మా ముహమ్మద్‌కు హాని కలిగించి ఉన్నట్లయితే, మిమ్మల్ని కత్తికో కండగా కోసి, కుక్కల పాలు చేసేవాణ్ణి. ఒక్కణ్ణి కూడా ప్రాణాలతో వదిలేవాణ్ణి కాదు. మా ప్రాణాలు పోయినా సరే, చివరి రక్తపుబొట్టు వరకు మీతో పోరాడేవాణ్ణి’ అన్నారు.యువకుల ఖడ్గప్రదర్శన, అబూ తాలిబ్ ఉగ్రరూప వాగ్ధాటిని చూసి అవిశ్వాసుల గుండెలు జారిపోయాయి. బిత్తరపోయి ఒకరి ముఖాలొకరు చూసుకోవడం ప్రారంభించారు. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అబ్బాయికి... బాబాయ్ అండ
ప్రవక్త జీవితం ప్రేమ, వాత్సల్యం నిండిన మాటలు ముహమ్మద్ ప్రవక్త(స)ను కదిలించాయి. ధర్మమార్గంలో ఒకదాని తర్వాత మరొకటిగా అనేక అవాంతరాలు. వీటన్నిటినీ అధిగమించి ముహమ్మద్ ప్రవక్త తన ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతారా? లేక వయసు పైబడిన బాబాయి ముఖం చూసి ఉద్యమాన్ని విరమించుకుంటారా? ప్రపంచం విశ్వాస కాంతితో పునీతమై, మిరుమిట్లు గొలుపుతుందా? అంధకారంలో కూరుకుపోతుందా? కాలం స్తంభించి, యావత్ సృష్టి అవాక్కయి, ముహమ్మద్ ప్రవక్త సమాధానం కోసం ఎదురుచూస్తోంది. ‘బాబాయీ! దైవసాక్షిగా చెబుతున్నా. ఒకవేళ ఈ అవిశ్వాసులు కుడి చేతిలో చంద్రుణ్ణి, ఎడమ చేతిలో సూర్యుణ్ణి తెచ్చిపెట్టి, నా పని మానుకోమన్నా నా ధర్మ ప్రచారాన్ని మానుకోను. నేను తలపెట్టిన (దైవం నాకు అప్పగించిన) కార్యమైనా పరిపూర్ణం కావాలి. లేక ఈ మార్గంలో నా ప్రాణమైనా పోవాలి’ అని ముహమ్మద్ ప్రవక్త అన్నారు స్థిరనిశ్చయంతో.. అబూ తాలిబ్ ఆశ్చర్యంతో ఆయన వైపు చూశారు. ఎంతటి దృఢనిర్ణయం! తన జాతి తనతో ఎలా ప్రవర్తిస్తుందన్న బెంగా లేదు. కళ్ళ ముందు అంతటి ప్రమాదాన్ని చూస్తూకూడా కించిత్ బెదురు లేకుండా నమ్మిన సిద్ధాంతం కోసం తనను తాను త్యాగం చేయాలన్న ఆ మనోైధర్యానికి అబూ తాలిబ్ కదిలిపోయారు. ఆయన ధైర్యానికీ, మనో నిబ్బరానికీ అబూ తాలిబ్ ఎంతో ప్రభావితులయ్యారు.ముహమ్మద్ (స) చిన్నగా బయటికి నడిచారు. ఆయన కళ్ళలో సన్నని కన్నీటి ధార. ‘బాబాయి అండ కూడా లేకుండా పోతుందా?’ ఆయన మనసు బాధతో బరువెక్కింది.అంతలో... ‘బాబూ... ముహమ్మద్...!’ అంటూ అబూ తాలిబ్ పిలుపు. ప్రవక్త వెనుదిరిగి చూశారు. ఆయన కళ్ళలో సన్నని కాంతి. రెండే అంగల్లో బాబాయిని సమీపించారు. ‘బాబూ..! నువ్వు ఏం చేయదలుచుకున్నావో నిరభ్యంతరంగా చేసుకో. నీ ధర్మప్రచారాన్ని కొనసాగించుకో. నా బొందిలో ప్రాణమున్నంత దాకా నేను నీకు తోడుగా ఉంటా’ అన్నారు అబూ తాలిబ్. బాబాయి నోట ఈ మాట వినగానే ఆయన మనసు ఆనంద తరంగాల్లో ఓలలాడింది. అబ్బాయి సహాయం కోసం అబూ తాలిబ్ నడుం కట్టారు. తమ వారందరినీ సమావేశపరిచారు. మక్కాలోని ఖురైష్ తెగల వారంతా ముహమ్మద్ వెంట పడ్డారనీ, వాళ్ళ బెదిరింపులు ఒక స్థాయిని దాటి ‘ముహమ్మద్‌ను చంపుతాం’ అనే దాకా వెళ్ళిందనీ చెప్పారు. ‘ముహమ్మద్ మాటలతో, అతని ప్రచారంతో వారికి విభేదం ఉంటే, దాన్ని వారు తిరస్కరించవచ్చు. అంతేగాని ముహమ్మద్‌ను తమకు అప్పగించమనీ, అతణ్ణి చంపేస్తామనీ అనే అధికారం వారికెలా ఉంటుంది? మనమంతా ఏకతాటిపై నిలిచి వాళ్ళ ఆగడాలను ఎదుర్కోవాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలు తెలుసుకుందామనే మిమ్మల్ని సమావేశ పరిచాను’ అన్నారు అబూ తాలిబ్ గంభీరంగా. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతాది వచ్చేవారం) ఒక్క అబూలహబ్ తప్ప, అందరూఅబూతాలిబ్ మాటలతో ఏకీభవించారు.ముహమ్మద్ (స) నుఒంటరిగా వదిలిపెట్టబోమని ప్రకటించారు. ఇన్నాళ్ళూసహించి ఊరుకున్నాం. ఇకసహించే ప్రసక్తేలేదు’. అన్నారందరూ ముక్తకంఠంతో..అబూలహబ్ మాత్రం కుటుంబ సభ్యులతో విభేధించి శతపక్షంలో చేరిపొయ్యాడు.ఈ విషయం ముహమ్మద్ కు చెబుదామని చాలా సంతోషంగా బయలుదేరారుఅబూతాలిబ్ . కాని ఆయన ఇంట్లోలేరు. ఎటువెళ్ళారో తెలియదన్నారు ఇంట్లోవాళ్ళు. అబూతాలిబ్ మనసు కీడుశంకించింది. దుర్మార్గులు అబ్బాయికి ఏమైనా కీడుతలపెట్టారేమో అని తీవ్రఆందోళన చెందారు. వెంటనే ఆయనయువకులందర్నీ సమీకరించి, కరవాలాలు తీసుకొని తనవెంట బయలు దేరమన్నారు. క్షణాల్లో యువకులంతా ఆయుధాలు తీసుకొని బయలుదేరారు. అబూతాలిబ్ సూచన మేరచుఅవి కనబడకుండా చొక్కాల్లోపల దాచుకున్నారు. అబూతాలిబ్ నేరుగా కాబాైవపుదారితీశారు. దారిలో ప్రవక్త పెంపుడు కొడుకు ైజద్ బిన్ హారిసా (ర) ఎదురు పడి ఏమిటీ విషయమని ఆరా తీశారు. ’ముహమ్మద్ (స) హంతకుల నుండి ప్రతీకారం తీర్చుకోవడాని కని బదులిచ్చారు అబూతాలిబ్ . ’అదేమిటీ..ఆయన నిక్షేపంగా కాబాలో ఉన్నారు. నేనిప్పుడు ఆయన దగ్గరినుండే వస్తున్నాను’. అన్నారు ైజద్ జద్ మాటలతో అబూతాలిబ్ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆయనమనసుకు ప్రశాంతత చేకూరింది. అయినా కాబాలయానికి వెళ్ళి అబ్బాయిని కళ్ళారా చూసుకోవాలని ముందుకు సాగారు. అకస్మాత్తుగా అబూతాలిబ్ బనూహాషిం యువకుల్ని వెంటబెట్టుకొని రావడం చూసి అవిశ్వాసులు ఆశ్చర్యపొయ్యారు. ప్రశ్నార్ధకంగా వాళ్ళంతా ఒకరిముఖాలొకరు చూసుకోవడం చూసి, అబూతాలిబ్ ’ ఏమిటి ఆశ్చర్యపోతున్నారు? నేనిక్కడికి ఎందుకొచ్చానో తెలుసా?’ అనిప్రశ్నించారు.’దేవుని తోడు. మాకసలు ఏమీ తెలియదు.’ అన్నారువారంతా ముక్తకంఠంతో..అప్పుడు అబూతాలిబ్ విషయం వివరించి, యువకులైవపు ైసగ చేశారు. వెంటనే బనూహాషిం యువకిశోరాలు తాము లోపల దాచినఆయుధాలు బయటికి ప్రదర్శించారు.అప్పుడుఅబూతాలిబ్ ,’ ైదవసాక్షిగా చెబుతున్నాను. మీరుగనక మా ముహమ్మద్ కు హాని కలిగించి ఉన్నట్లయితే మిమ్మల్నికత్తికో కండగా కోసికుక్కల పాలు చేసేవాణ్ణి. ఒక్కణ్ణికూడా ప్రాణాలతో వదిలేవాణ్ణికాదు. మాప్రాణాలు పోయినా సరే, చివరి రక్తపుబొట్టువరకూమీతో పోరాడేవాణ్ణి’. అన్నారుయువకుల ఖడ్గప్రదర్శన, అబూతాలిబ్ ఉగ్రరూప వాగ్ధాటిని చూసి అవిశ్వాసుల గుండెలు జారిపొయ్యాయి. బిత్తరపోయి ఒకరిముఖాలొకరుచూసుకోవడం ప్రారంభించారు. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతాది వచ్చేవారం) -
ముహమ్మద్‌కు అభ్యర్థన
ప్రవక్త జీవితం ‘అయ్యా! మేము అన్యాయం చేయలేదు. న్యాయమే చేశాం. ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఎన్నోసార్లు మా గోడు మీకు చెప్పుకున్నాం. కానీ ఒక్కసారీ మాపై దయ తలచలేదు. ఒక్క ప్రతిపాదనకూ సిద్ధపడలేదు’ అన్నాడు ఒక పెద్దమనిషి అనునయంగా! ‘అదేమీ కాదు. మీరసలు న్యాయంగానే మాట్లాడడం లేదు. నన్ను అగౌరవపరచడానికే నిర్ణయించుకున్నట్లు ఉన్నారు’ అన్నారు అబూ తాలిబ్ ఒకింత బాధగా! ‘లేదు లేదు. మీ పట్ల మేము న్యాయంగానే ప్రవర్తిస్తున్నాం. ముహమ్మద్ విషయంలో మేము ఎన్నోసార్లు మీకు ఫిర్యాదు కూడా చేశాం. అయినా మీరు పట్టించుకోలేదు. ఇకనైనా అతణ్ణి కాస్త మందలించి నోరు మూయించండి. ఇక నుండి ముహమ్మద్ గనక మా దేవతల్నీ, మా పూర్వీకుల్నీ పల్లెత్తు మాట అన్నా, మమ్మల్ని అజ్ఞానులని విమర్శించినా సహించేది లేదు. ఇన్నాళ్ళూ ఓపిక పట్టాం కానీ, ఇక ఊరకునేది లేదు. ఎంతదూరం వెళ్ళడానికైనా మేము సిద్ధం. ముహమ్మద్‌తో, మీతో, మీకు సహకరించే వారితో యుద్ధం చేయడానికి కూడా వెనుకాడేది లేదు’ అంటూ బెదిరింపు ధోరణిలో హెచ్చరించి వెళ్ళిపోయారు. అబూ తాలిబ్ తల పట్టుకున్నారు. తీవ్ర ఆలోచనలో పడిపోయారు. ఇప్పుడేం చెయ్యాలి? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.‘ఖురైషీయులతో శతృత్వం పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్లే! అలా అని ప్రాణసమానమైన ముహమ్మద్‌ను వదులుకోలేను. ఏం చేయాలి? ఏమిటీ కర్తవ్యం? ఏమైనా సరే... అబ్బాయిని పిలిచి మాట్లాడాలి. ఎలాగైనా ఇస్లామ్ ప్రచారం ఆపమని చెప్పాలి. ఎన్నాళ్ళింకా వీళ్ళతో ఈ గొడవ. దీనివల్ల ఖురైషుల ఐక్యతకూ భంగం కలుగు తోంది’ అనుకొన్నారు అబూ తాలిబ్. తర్జనభర్జనల తరువాత ఒక నిర్ణయానికి వచ్చారు. వెంటనే ముహమ్మద్ (స)ను పిలిచి, జరిగిన వృత్తాంతమంతా వినిపించారు. ఇస్లామ్ ప్రచారాన్ని ఆపమని నచ్చజెప్పారు. దీనివల్ల ఖురైషులకు కలిగే ఇబ్బందుల్ని కూడా విశదీకరించారు. ఇకనైనా ధర్మ ప్రచారం ఆపకపోతే భవిష్యత్తులో సంభవించే కష్టనష్టాలను పూసగుచ్చినట్లు వివరించారు. ఎందుకు చెబుతున్నానో వినమనీ, తన వయసును చూసైనా జాలిపడమనీ, మోయలేని భారాన్ని ఈ ముసలితనంలో తనపై వేయవద్దనీ ఒకింత ఆవేదనగా అభ్యర్థించారు. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతాది వచ్చేవారం) -
అవిశ్వాసుల బెదిరింపులు
ప్రవక్త జీవితం ‘అల్లాహ్ గొప్పవాడు, పరమ పవిత్రుడు. నేను కేవలం ఆయన సందేశ వాహకుణ్ణిమాత్రమే. ఆయన ఆదేశించింది చేయడమే నా బాధ్యత. ఆయన తలచుకుంటే ఏమైనా చేయగలడు. మీరడిగే తియ్యటి సెలయేర్లు, ఉద్యానాలు, అందమైన భవంతులు నాకు అనుగ్రహించగలడు’ అన్నారు ప్రవక్త ప్రశాంతంగా. ‘సరే, ముహమ్మద్ ! మేము నీ ముందు ఎన్నో ప్రతిపాదనలు ఉంచాం. నువ్వు దేనికీ అంగీకరించలేదు. ఇక మా తడాఖా ఏమిటో చూపిస్తాం. సిద్ధంగా ఉండు. ఎవరడ్డమొస్తారో మేమూ చూస్తాం’ అన్నారు బెదిరిస్తూ. చివరికి అంతా కలిసి ముహమ్మద్ ప్రవక్త అడ్డు తొలగించుకోవాలని తీర్మానించుకున్నారు. కానీ వారిలో ఒకడు ప్రవక్త హత్యానంతర పరిస్థితులపై భయసందేహాలు వ్యక్తపరిచాడు. ‘అవును. ముహమ్మద్‌ను చంపితే అబూతాలిబ్ ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకోడు. కచ్చితంగా ఎదురు తిరుగుతాడు. వాళ్ళ వంశం మొత్తం ఏకమైపోతుంది. పైగా వాళ్ళు ఖురైష్ జాతి అగ్రనాయకులు. అలాంటి వారి విషయంలో తీవ్ర నిర్ణయం సరికాదేమో’ అన్నాడు మరొకడు. దీంతో వారి ఉత్సాహమంతా జావగారిపోయింది. ఎక్కడి వాళ్ళక్కడ చల్లబడిపోయారు. ఇప్పుడేమిటి కర్తవ్యం? తల బద్దలు కొట్టుకున్నారు. చర్చోపచర్చల అనంతరం అందరూ కలసి ఒక స్థిరనిర్ణయానికొచ్చారు. దాని ప్రకారం - అందరూ కలిసి ఓ నవ యువకుణ్ణి వెంటబెట్టుకొని అబూతాలిబ్ దగ్గరికి వెళ్ళారు. ‘ఈ యువకుడి పేరు వలీద్. ఎంతో సౌందర్యవంతుడు, గొప్ప పరాక్రమ శాలి, వ్యూహకర్త. ఈరోజు నుండి ఇతను మీ కొడుకే. మీకు మంచి సలహాలు, సూచనలిస్తూ అన్ని విధాలా అండదండగా ఉంటాడు. కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఇతనికి బదులుగా మాకు ముహమ్మద్‌ను అప్పగించండి చాలు. అతని సంగతి మేము చూసుకుంటాం. లేని పోనివి సృష్టించి అతడు మన జాతిని కకావికలం చేశాడు. అతని చేష్టల పట్ల మీరుకూడా సంతృప్తిగా లేరనే అనుకుంటున్నాం. మీకు కూడా ఒకమంచి యువకుడు, ముహమ్మద్ కంటే యోగ్యుడు లభించినట్లవుతుంది’ అన్నారు ఛీ..! ఎంత నీచానికి దిగజారారు? సంఘంలో పెద్దమనుషులుగా చలామణి అవుతున్నవారి నోట ఇలాంటి మాటలా! ఎంతటి అమానుషత్వం... ఎంతటి క్రూరత్వం! అనుకున్నారు మనసులో.. పెద్దమనుషులుగా వచ్చినవారి నోట ఇలాంటి మాటలువిని అబూతాలిబ్ మనసు చాలా బాధ పడింది. కొద్దిసేపటి తరువాతగాని ఆయన తేరుకోలేకపోయారు. ‘చాలు చాలు.. ఇక ఆపండి మీ ప్రేలాపనలు. ఈ యువకుణ్ణి ఉంచుకొని, బదులుగా నా ముహమ్మద్‌ను మీకు అప్పగించాలా..! నేను మీ వాణ్ణి దగ్గరుంచుకొని చక్కగా మేపుతుంటే, మీరు మావాణ్ణి చిత్రహింసల పాలుచేస్తూ చంపేస్తారా? ఎంత అన్యాయం.. ఎంత అమానవీయం.. ఎంతటి అమానుషం! దైవసాక్షిగా చెబుతున్నాను. ఇది జరగని పని. ముమ్మాటికీ జరగని పని. ఏం చేసుకుంటారో చేసుకోపోండి’ అన్నారు అబూతాలిబ్ ఆగ్రహంతో. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతాది వచ్చే వారం) -
త్యాగాల స్మరణ
ప్రతి సంవత్సరం కోట్లాదిమంది ప్రజలు ముహమ్మద్ ప్రవక్త మనమడైన ఇమామ్ హుసైన్ త్యాగాలను స్మరించుకుంటూ ఆయన అమరత్వం పట్ల సంతాపం వ్యక్తపరుస్తూ ఉండే సందర్భమే మొహర్రమ్. హుసైన్ ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం నిండు ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారో ఆ లక్ష్యాన్ని, దాని చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ముహమ్మద్ ప్రవక్త నిర్యాణం తరువాత ప్రజాస్వామ్య పద్ధతిలో పాలనా బాధ్యతలు చేపట్టిన తొలి నలుగురు ఖలీఫాలు- అబూబక్,్ర ఉమర్, ఉస్మాన్, అలీ గార్ల పరిపాలనాకాలం ప్రపంచ మానవ ఇతిహాసంలోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని సృజించింది. కాని తరువాతి కాలంలో పరిస్థితులు మారాయి. అధికారం కోసం పోరు ప్రారంభమైంది. ప్రజలు ముహమ్మద్ మనమడు, హుసైన్ సోదరుడు అయిన హజ్రత్ హసన్‌ని ఖలీఫాగా ఎన్నుకున్నారు. కాని సిరియా ప్రాంత గవర్నరుగా ఉన్న అమీర్ ముఆవియా అధికారం కోసం పోటీ పడగా యుద్ధవాతావరణం నెలకొని హసన్ ఖలీఫా పదవి నుండి తప్పుకున్నారు. దీంతో గత్యంతరం లేని స్థితిలో ప్రజలు అమీర్ ముఆవియాకు అధికారం కట్టబెట్టారు. ఆ తరువాత అమీర్ ముఆవియా తన కొడుకు యజీద్‌ను రాజకీయ వారసుణ్ణి చేయడానికి భయప్రలోభాల ద్వారా ప్రజల్ని దారికి తెచ్చుకున్నాడు. ఈ పరిణామాన్ని ప్రజాస్వామ్యవాదులు, న్యాయప్రేమికులు ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోయారు. అందుకే కూఫా ప్రజలు హసన్ తమ్ముడైన ఇమామ్ హుసైన్‌కు మద్దతు ప్రకటిస్తూ ఆహ్వానించారు. దీంతో ఇమామ్ హుసైన్ కూఫాకు పయనమయ్యారు. అదే గనక జరిగితే యజీద్ పీఠానికి ప్రమాదం తప్పదు. అందుకని యజీద్ ఇమామ్ హుసైన్ కూఫా చేరకుండా మార్గాలన్నీ సైనికులతో మూసివేశాడు. దాంతో ఇమామ్ బృందం ‘కర్బలా’ చేరుకుని ఆగిపోయింది. అక్కడ తనను అడ్డుకున్న సేనాధిపతితో ఇమామ్ హుసైన్ మూడు విషయాలను ప్రతిపాదించాడు. 1. నన్ను యజీద్ దగ్గరకు వెళ్ళనివ్వండి. నేరుగా ఆయనతో మాట్లాడతాను. 2. నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి నన్ను అక్కడికి వెళ్ళనివ్వండి. 3. లేదా నన్ను ఏదైనా సరిహద్దు ప్రాంతంలో వదిలేయండి. కాని యజీద్ సైన్యం ఏ ప్రతిపాదననూ అంగీకరించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య భీకర సంగ్రామం మొదైలంది. చూస్తూ చూస్తూనే ‘కర్బలా’ మైదానం రుధిర ధారలతో ఎరుపెక్కింది. ఇమాం శిబిరంలోని సుమారు 72 మంది ఒక్కొక్కరుగా నేలకొరిగారు. చివరికి మిగిలింది ఇమామె హుసైన్ ఒక్కరే. అది హి.శ. 61. ‘మొహర్రం’ నెల, పదవ తేదీ. ఇమామ్ హుసైన్ ఒక్కరే ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మ పరిరక్షణ కోసం వీరోచితంగా పోరాడుతూ అమరగతులయ్యారు. ఇమామ్ హుసైన్ నేలకొరగగానే సేనాని ఇబ్నెజియాద్ ఆదేశంతో అతడి సైనికులు ఆ అమరవీరుని శిరస్సును ఖండించారు. పార్థివ దేహం నుండి శిరస్సునూ, చేతులను ఖండించి బాణాలు, బరిశలకు తగిలించి కూఫా వీధుల్లో ఊరేగించారు. పలావులు వండుకొని, పానకాలు చేసుకొని తిన్నారు, తాగారు. ఇదీ సంక్షిప్తంగా ఆనాడు జరిగిన ఘోరదుర్ఘటన. కాని న్యాయప్రేమికులు, ప్రజాస్వామ్యవాదుల దృష్టిలో అది హుసైన్ చేసిన త్యాగానికి న్యాయపోరాటానికి తార్కాణం. దుష్టరాజకీయ శక్తుల ఆటకట్టించి, సమాజంలోని అన్నివర్గాలూ సముదాయాల ప్రజలకు సమాన న్యాయం అందించగలిగే ధీరోదాత్తులు నేటి అవసరం. దీనికోసం న్యాయప్రేమికుడైన ఇమామ్ హుసైన్ ప్రజాస్వామ్య స్పూర్తిని, ఆయనగారి పోరాట పటిమను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఆశయ సాధనకోసం ఇమామ్ అమరుడయ్యారో దానికోసం అలుపెరుగని ప్రయత్నం చేయడమే ఇమామ్ హుసైన్‌కు నిజమైన నివాళి. - యండి.ఉస్మాన్ ఖాన్ -
దేవుడు ఒక్కడే అనండి...సాఫల్యం పొందుతారు!
రోజులు గడిచి పోతున్నాయి. ప్రియ ప్రవక్త(స) సందేశప్రచారం వల్ల విశ్వాసుల సంఖ్య క్రమక్రమంగా పెరగసాగింది. అవిశ్వాసులకు ఈవిషయం మింగుడుపడడం లేదు. ముహమ్మద్‌ను ఇలాగే వదిలేస్తే, అతని ధర్మం విస్తరిస్తుంది. అతను విజయం సాధిస్తాడు. మన పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోతాయి. మన నగరం అభాసు పాలవుతుంది. మన వ్యాపారాలు మందగించి పోతాయి. ఇంకా ఉపేక్షించడం ఎంతమాత్రం సరికాదు. ఏదో ఒకటి తేల్చేయాల్సిందే’ అని అంతా కలిసి మరోసారి అబూతాలిబ్ వద్దకు వెళ్ళారు. ‘అయ్యా! మీరు మాపెద్దలు. మాకు అత్యంత గౌరవనీయులు. ఇదివరకు కూడా ఒకసారి తమర్ని కలిశాం. అబ్బాయి విషయంలో కాస్త మాకు న్యాయం చేయండి. మా తాత ముత్తాతల ధర్మాన్ని గురించి, మా దేవతా విగ్రహాల గురించి, మా బుద్ధీజ్ఞానాల గురించి మాట్లాడ వద్దని ముహమ్మద్‌కు నచ్చజెప్పండి. లేదంటారా, మీరు పక్కకు తప్పుకోండి అతని సంగతి మేముచూసుకుంటాం. ఎలాగూ మీరు కూడా అతని మాటలు వినీ వినీ విసుగెత్తే ఉంటారు. మీకు కూడా కాస్త ప్రశాంతత లభిస్తుంది.’ అని మొరపెట్టుకున్నారు. అబూతాలిబ్ సంకట స్థితిలో పడి పొయ్యారు. వీళ్ళను ఎలా శాంతపరచాలో అర్థం కావడం లేదు. ఇక లాభం లేదనుకొని ముహమ్మద్ ప్రవక్తను పిలవనంపారు. ‘బాబూ ! వీళ్ళంతా మనజాతి అగ్ర నాయకులు. గొప్ప ధనసంపన్నులు. నువ్వేదో కొత్తమతాన్ని ప్రచారం చేస్తున్నావని ఫిర్యాదు చేస్తున్నారు. బాబూ ! ఎందుకొచ్చినగొడవ. నువ్వువాళ్ళజోలికి పోకు, వాళ్ళూనీజోలికి రారు’. అన్నారు అనునయంగా ‘బాబాయ్..! వాళ్ళ శ్రేయోసాఫల్యాలు ఎందులో ఎక్కువ ఉన్నాయో, ఆవైపుకు వాళ్ళను పిలవ వద్దని అంటున్నారా ?’. ‘శ్రేయో సాఫల్యాలా ..! ఏమిటది..?’ ‘ఒక్కమాట .. ఒకే ఒక్క సద్వచనం. దాన్ని వాళ్ళు ఉచ్చరిస్తేచాలు. అరేబియా అంతా వారికి దాసోహమంటుంది.ప్రపంచమంతా వారి పాదాక్రాంతమవుతుంది’. అన్నారుముహమ్మద్ . ఇది విని అబూజహల్ ఉత్సాహంగా ముందుకొచ్చాడు. ‘దైవసాక్షి! ఒక్కసారి కాదు, పదిసార్లు వల్లిస్తాం. ఏమిటో చెప్పు.’ అన్నాడు అబూజహెల్ .. అప్పుడు ప్రవక్త మహనీయులు, ’దేవుడు ఒక్కడే’ అని పలకండి. గౌరవప్రతిష్టలు మీ పాదాక్రాంతమవుతాయి. దైవకారుణ్యం మీపై వర్షిస్తుంది’. అన్నారు ప్రవక్తమహనీయులు. దీంతో ఒక్కసారిగా వారిముఖ కవళికలు మారిపొయ్యాయి. ఆగ్రహంతో వారికళ్ళుఎరుపెక్కాయి. పళ్ళు పదునెక్కాయి. ‘ఇదేనా నువ్వు చెప్పదలచుకున్నమాట. సరే చూడు నీగతి ఏమవుతుందో..!’అంటూ, పళ్ళునూరుతూ విసవిసా వెళ్ళిపోయారు. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతా వచ్చేవారం) -
బంధుజనులకు విందు
‘బాబూ ముహమ్మద్ ! నాకు కూడా ఈ ధర్మాన్ని అవలంబించాలని ఉంది, కాని నేను మనతాతముత్తాతల ధర్మాన్ని విడిచి పెట్టలేనయ్యా. అయితే ఒకమాట. నువ్వు నిరభ్యంతరంగా ఈధర్మాన్ని అనుసరించవచ్చు. నిన్నెవరూ అడ్డుకోలేరు. నా బొందిలో ప్రాణమున్నంతవరకూ నేను నీకు అండగా ఉంటాను’. అన్నారు అబూతాలిబ్ తరువాత, తనయుడు అలీ నుద్దేశించి, ‘‘ముహమ్మద్ చాలా మంచి విషయాలు చెబుతున్నాడు. ఆయన అవలంబిస్తున్న ధర్మం చాలా బాగుంది. నువ్వు కూడా దాన్ని అనుసరించు. దాని పైనే స్థిరంగా ఉండు. ముహమ్మద్ చెప్పినట్లు నడుచుకో. ఆయన్ని ఎప్పటికీ విడువబాకు’ అని హితవు చేశారు. తరువాత జాఫర్‌తో, ‘బాబూ! నువ్వుకూడా నీసోదరునితో కలిసి ఈ ధర్మాన్ని అనుసరించు’ అన్నారు. అబూతాలిబ్ అయితే ధర్మాన్ని స్వీకరించలేదు కాని, కొడుకులకు మాత్రం స్వీకరించమని హితవుచేశారు. బాబాయి అబూతాలిబ్ మాటలతో ముహమ్మద్ ప్రవక్త (స)కు కొండంత ధైర్యం కలిగింది. ఆయన చాలా సంతోషించారు చూస్తూ చూస్తూనే మూడేళ్ళు గడిచి పొయ్యాయి. ఈమధ్యకాలమంతా ధర్మప్రచారం రహస్యంగానే కొనసాగింది. సఫా కొండ దిగువ భాగంలో ఉన్న హజ్రత్ అర్ఖమ్ గారి ఇల్లు సామూహిక నమాజులకు నెలవుగా మారింది. కాని తరువాత బహిరంగంగా ధర్మప్రచారం కొనసాగించాలన్న దైవాదేశం మేరకు ముహమ్మద్ ప్రవక్త తన కార్యాచరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా బంధుజనులందరినీ విందుకు ఆహ్వానించారు. విందుముగిసిన తరువాత నాలుగు మంచిమాటలు చెబుదామని, దైవసందేశం అందజేద్దామని అనుకున్నారు ప్రవక్తమహనీయులు. అయితే అవకాశం కోసం ఎదురు చూస్తున్న అబూలహబ్ వెంటనే అందుకొని, ‘చూడు ముహమ్మద్! ఇక్కడ నీ బాబాయిలు, సోదరులు, ఇతర కుటుంబీకులు, బంధుజనమంతా ఉన్నారు. వీళ్ళంతా నీ మేలు కోరేవారే. వారంతా ఏ రాగమాలాపిస్తే, నువ్వు కూడా అదేరాగం అందుకో. అంతేగాని, నువ్వేదో కొత్తకొత్తగా మాట్లాడితే కుదరదు. తాతల కాలం నుండి వస్తున్న మతాన్ని కాదని, ఈరోజేదో కొత్తమతం అంటే ఊరుకునేది లేదు. ఇలాంటి పిచ్చి పనులన్నీ వెంటనేమానేయి. అరేబియా అంతా ఒకటైతే నువ్వొక్కడివి ఏంచేస్తావు? నీ సోదరులందరిపై ఆపద తెచ్చి పెడదామనుకుంటున్నావా?’ అంటూ విందుకొచ్చిన బంధువులందరినీ రెచ్చగొడుతూ..,’ తప్పో ఒప్పో తరువాత సంగతి గాని, ముందుమీరంతా కలిసి ముహమ్మద్‌ను నిలువరించండి. వేరే ఎవరో వచ్చి మీదపడకముందే మీ అంత మీరే మేలుకోండి. ఇక పదండి, ఇంకా ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు’. అంటూ లేచాడు అబూలహబ్ . దాంతో అందరూ ఒక్కొక్కరుగా అక్కడినుండి నిష్ర్కమించారు. దైవప్రవక్త ముహమ్మద్ (స) ఉద్దేశ్యం నెరవేరలేదు. మనసులో మాట మనసులోనే ఉండిపోయింది. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతా వచ్చేవారం) -
అబూబకర్ దైవ విశ్వాస ప్రకటన
ప్రవక్త జీవితం అలీతో ముహమ్మద్ (స) పెంపుడు కొడుకు జైద్‌కు మంచి స్నేహం ఉండేది. ఎటు వెళ్లినా ఇద్దరూ కలిసి వెళ్లేవారు. ఏ పని చేసినా ఇద్దరూ కలిసి చేసేవారు. ఈ కారణంగా జైద్ కూడా అలీ బాటలోనే నడిచి ధర్మాన్ని స్వీకరించాడు. వీరిద్దరూ ముహమ్మద్ ప్రవక్తను అమితంగా అభిమానించేవారు.ఆయన మాటను రవ్వంతైనా జవ దాటేవారు కాదు. ఆయన(స) కూడా వారిని అంతగానే ప్రేమించేవారు. కంటికి రెప్పలా చూసుకునేవారు. ఈక్రమంలోనే ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) ప్రియ స్నేహితుడు అబూబకర్ ఆయన వద్దకు వచ్చారు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుకున్నారు. చర్చ ఆధ్యాత్మిక విషయాలవైపు మళ్లింది. ‘అబూబకర్! నా గురించి నీకు పూర్తిగా తెలుసు గదా!’ అన్నారు ముహమ్మద్ (స). ‘ఏమిటి ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావు. నీగురించి నాకు తెలియకపోవడం ఏమిటి? చిన్నప్పటినుండీ చూస్తున్నాను నిన్ను’. ‘అది సరే, నేనేదైనా చెబితే నువ్వు నమ్ముతావా?’ ‘అదేమిటీ అలా అడుగుతావు? నువ్వు ఏనాడైనా అబద్ధమాడావా, నేనీరోజు నమ్మకపోడానికి? నువ్వు అత్యంత సత్యసంధుడవని, నిజాయితీ పరుడవని, మానవతా మూర్తివని నేనే కాదు, యావత్ జాతి నమ్ముతోంది’ అన్నారు అబూబకర్. ‘నేను దేవుని ప్రవక్తను అంటే నమ్ముతావా?’ మళ్లీ రెట్టించారు ముహమ్మద్ (స). ‘తప్పకుండా నమ్ముతాను. అసత్యం అన్నది నీ జీవితంలో నేను చూడలేదు, వినలేదు’ అన్నారు అబూబకర్ స్థిర నిశ్చయంతో. ‘అయితే విను. దైవం నన్ను తన ప్రవక్తగా ఎంచుకున్నాడు. దైవదూత జిబ్రీల్ నావద్దకు వస్తున్నారు. నాపై దేవుని సందేశం అవతరిస్తోంది. కనుక నువ్వు కూడా దైవేతర శక్తులన్నిటినీ వదిలిపెట్టి, ఒక్క దైవాన్నే నమ్ముకో. ఆయనే సర్వ సృష్టికర్త. విశ్వ వ్యవస్థను, సమస్త జీవకోటిని ఆయనే సృజించాడు. అందరి జీవన్మరణాలూ ఆయన చేతుల్లోనే ఉన్నాయి’ అన్నారు ముహమ్మద్ ప్రవక్త (స). ‘అవును, నిస్సందేహంగా నువ్వు దైవ ప్రవక్తవే. నేను నమ్ముతున్నాను. విశ్వ సృష్టికర్త అయిన ఏకేశ్వరుణ్ణి విశ్వసిస్తున్నాను. నువ్వు చెప్పే ధర్మాన్నీ స్వీకరిస్తున్నాను’ అని స్పష్టంగా ప్రకటించారు అబూబకర్ (ర). ఈ ప్రకటన విన్న బీబీ ఖదీజ (ర) పరమ సంతోషంతో పొంగిపోయారు. సంతోషం పట్టలేక తలపై చెంగు కప్పుకొని బయటకొచ్చారు. ‘అబూ ఖహాఫా కుమారా నీకు శుభం. దేవుడు నీకు రుజుమార్గం చూపించాడు. ఆయనకు కృతజ్ఞతలు’అన్నారు. అబూబకర్ (ర) విశ్వాస ప్రకటన పట్ల ముహమ్మద్ ప్రవక్త (స) కూడా చాలా ఆనందించారు. ఆయన ఇస్లామ్ స్వీకరణతో ముహమ్మద్ (స) కు మంచి ఊతం లభించింది.ప్రచారమార్గం కూడా సుగమం అయింది. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతా వచ్చేవారం) -
దైవవాణి అవతరణా పరంపర!
ప్రవక్త జీవితం ముహమ్మద్ (స) తలపెకైత్తి చూశారు. దైవదూత జిబ్రీల్ భూమ్యాకాశాల మధ్య శూన్యంలో ఆసనంలో కూర్చుని ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన ముహమ్మద్ (స) మనసు దైవంపట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. దేవా! నువ్వు మహా కరుణగలవాడవు. ఈ దాసుని పట్ల నీ ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అనిపించింది మనసుకు. దూతను చూడగానే ముచ్చెమటలు పోశాయి. శరీరం కంపించసాగింది. మొదటిసారి హిరా గుహలో కూడా ఆయన నిలువెల్లా వణికిపోయారు. గాలిలో ఆకులు ఊగినట్లు. కాని అప్పటి వణుకుకు, ఇప్పటి వణుకుకు, అప్పటి భయానికి, ఇప్పటి భయానికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పటి స్థితి అత్యంత భయానకమైనది. ఇప్పటి స్థితి ఆనందంతో కూడుకున్నది. ఇందులో ఆత్మసంతృప్తి, ఆత్మసంతోషం ఉన్నాయి. అదేస్థితిలో ఆయనగారు ఇంటికి వచ్చేశారు. వచ్చీరాగానే ‘ఏమైనా కప్పు.. ఏమైనా కప్పు’ అన్నారు. వెంటనే బీబీఖదీజా ఓ వస్త్రం తెచ్చి కప్పారు. అంతలో అదే దూత దైవవాణితో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వస్త్రం కప్పుకుని పడుకున్నవాడా! లే, లేచి (ప్రజలను) హెచ్చరించు. నీ ప్రభువు ఘనతను చాటిచెప్పు. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. మాలిన్యానికి దూరంగా ఉండు. ఎక్కువ పొందాలనే కాంక్షతో ఉపకారం చేయకు. నీ ప్రభువుకొరకు సహనం వహించు. (అల్ ముద్దస్సిర్ 1-7) దైవవాణి అవతరణతో అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. గుండెమంట చల్లారింది. మేధస్సుకు ప్రశాంతత చేకూరింది. మనసుకు స్థిమితం, నిలకడ ప్రాప్తమైంది. ఇక బీబీ ఖదీజా విషయమైతే చెప్పనే అక్కరలేదు. ఆమె ఆనందానికి అవధులే లేవు. ముఖవర్ఛస్సు దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మనసంతా సంతోషంతో విరబూసిన పూదోట అయిపోయింది. ఎందుకంటే ఆమె నిరీక్షణ ఫలించింది. కోరిక ఈడేరింది. దైవవాణి అవతరించింది. ఇక తరువాత దైవవాణి అవతరణా పరంపర కొనసాగుతూనే ఉంది. దైవసందేశం వస్తూనే ఉంది. కాని దైవ నిర్ణయమేమిటోగాని, అకస్మాత్తుగా మళ్ళీ దైవవాణి అవతరణ ఆగిపోయింది. సందేశప్రచారపరంపర ప్రారంభం కాగానే తిరస్కారుల నుండి వ్యతిరేకత కూడా మొదలైంది. వ్యతిరేకించడానికి పెద్దపెద్ద కారణాలేమీ అవసరం లేదు. చిన్నసాకు చాలు. దైవవాణి ఆగిపోవడం నిజంగా పెద్దవిషయమే. ఇక తిరస్కారులు ఊరుకుంటారా! వారు దీన్నొక ఆయుధంగా ఉపయోగించుకున్నారు. ‘అబ్బో, ఈయనగారు దైవప్రవక్త అట. నాలుగు రోజులపాటు ఆకాశవాణితో ముచ్చట్లు నడిచాయి. జిబ్రీల్ రాకపోకలూ సాగాయి. అంతలోనే అంతా మాయం. మాటాముచ్చట అంతా బంద్. సోదరా ముహమ్మద్! నీ ప్రభువు నీపై ఆగ్రహం చెందాడేమో చూడు. అందుకే ముఖం చాటేశాడు’ అంటూ తిరస్కారులు వ్యంగ్యబాణాలు సంధించడం మొదలుపెట్టారు. వహీ ఆగిపోవడమనేది నిజంగా చాలా బాధాకర విషయమే, దానికంటే ఎక్కువ గోరుచుట్టుపై రోకటిపోటులా ఈ వ్యతిరేకుల వ్యంగ్యబాణాలు మనసును ఇంకాస్త బాధిస్తున్నాయి. ముహమ్మద్ (స) చాలా అశాంతికి గురయ్యారు. కాని ఎక్కువ రోజులు గడవకముందే హ.జిబ్రీల్ (అ) మళ్ళీ వచ్చేశారు. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం) -
దైవవాణికోసం నిరీక్షణలో... ప్రవక్త జీవితం
తరువాత ముహమ్మద్ (స) ఇంటికి తిరిగొచ్చారు. ఆయన ముఖారవిందం విచారంగా ఉంది. రకరకాల ఆలోచనలతో ఆయన మనసు నిండిపోయింది. ‘ఈ బలహీన భుజస్కంధాలపై దౌత్యభారమా ! దీని పర్యవసానం ఏమి కానుందో!? దీన్ని నేను ఎలా మోయగలను? ప్రజల్ని సత్యంవైపు, సన్మార్గం వైపు ఎలా పిలవడం? వీరు మార్గవిహీనులై, దైవానికి దూరంగా ఉన్నారు. సత్యానికి దూరంగా ఉన్నారు. విగ్రహారాధన, బహుదైవారాధన వీరి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంది. మూఢాచారాల్లో పీకలదాకా మునిగి ఉన్నారు. అన్నిరకాల దుష్కార్యాలు, దుర్మార్గాలు వారిని పరివేష్టించి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో నా కర్తవ్యం ఏమిటి? దాన్ని నేను నిర్వర్తించడం ఎలా??’ మనసులో ఆలోచనల తుఫాను చెలరేగింది. దీంతో ఆయన దైవవాణి కోసం నిరీక్షించసాగారు. నిరీక్షణ. దైవదూత కోసం .. దైవవాణి కోసం ... వరఖా బిన్ నౌఫిల్ ధృవీకరించిన దూతకోసం.. ఖదీజా విశ్వసనీయంగా చెప్పిన దైవదూత కోసం..! కానీ ఫలించలేదు. జిబ్రీల్ దూత రాలేదు.. ఎలాంటి దైవవాణీ అవతరించలేదు... మళ్ళీ మనసులో అలజడి, పెనుతుఫాను.. ‘ఇప్పుడు నేనేంచేయాలి.. నా కర్తవ్యం ఏమిటి? ప్రజలకు ఏమి సందేశమివ్వాలి?’ ఈ విషయాలు చెప్పడానికి జిబ్రీల్ (అ) ఎందుకు రాలేదు? జిబ్రీల్ రాక ఎందుకు ఆగిపోయింది. మళ్ళీ సందేశం ఎందుకు తేలేదు! ఒకటే ఆలోచన. మనసంతా అంధకారమైన భావన. నిర్మల తేజంతో ప్రకాశించే సుందరవదనం కళా విహీనమైపోయింది. మనసును చీకట్లు ముసురుకున్నాయి. అటు బీబీ ఖదీజా పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఆమె మనసులో కూడా ఆందోళన మొదలైంది. రేయింబవళ్ళు లోలోనే కుమిలిపొయ్యారు. కాని ఎక్కడా బయట పడలేదు. భర్తకు ధైర్యవచనాలు చెబుతూ, ఊరడించడానికి శక్తిమేర ప్రయత్నించేవారు. ముహమ్మద్ (స) మళ్ళీ హిరాగుహను ఆశ్రయించారు. రేయింబవళ్ళు అక్కడే దైవధ్యానంలో గడిపేవారు. తన ప్రభువుతో సంభాషించేవారు. ప్రభూ! నువ్వే కదా నన్ను ప్రవక్తగా నియమించావు. మళ్ళీ అంతలోనే విడిచిపెట్టావా స్వామీ? అని మొరపెట్టుకునేవారు. బాధతో గుండెలు అవిసిపోయేవి. ఆందోళన.. ఆక్రందన.. ఏమీ అర్థంకాని పరిస్థితి.. ఏమీ పాలుపోక ఎటెటో తిరిగేవారు.. రాళ్ళురప్పల మధ్య.. కొండకోనల మధ్య.. ఒక్కోసారి తనువుచాలిద్దామన్నంత నిరాశతో కొండశిఖరం పైకి ఎక్కేవారు. అంతలో హజ్రత్ జిబ్రీల్ దూత వచ్చేవారు. ఆయన్ని శాంతపరిచేవారు. ‘ముహమ్మద్ ! మీరు నిస్సందేహంగా దైవప్రవక్తే.’ అని భరోసా ఇచ్చేవారు. దీంతో ఆయనకు సాంత్వన చేకూరేది. వెనుదిరిగి వెళ్ళిపోయేవారు. కొద్దిరోజుల తరువాత మళ్ళీ అదే పరిస్థితి ఎదురయ్యేది. మళ్ళీ పర్వత శిఖరంపైకి చేరుకునేవారు ఆత్మత్యాగం చేద్దామని! హజ్రత్ జిబ్రీల్ మళ్ళీ వచ్చి ఆయన్ని ఓదార్చేవారు, ఆయన వెనుదిరిగి వెళ్ళేవారు. ఆయన మనసు ఎంత గాయపడి ఉండాలి! ఆత్మ ఎంతగా రోదించి ఉండాలి! మనోమస్తిష్కాలపై ఎంతటి భారం పడిఉండాలి! దైవవాణి అవతరణ ఆగిపోవడం మామూలు శిక్షకాదు. దైవం నన్ను వదిలేశాడా అన్న భావన గుండెలో గునపాలు గుచ్చినంతగా బాధించేది. ఇవే ఆలోచనలు మనసును తొలుస్తుండగా, ఒకరోజు ఆయన ఎటో బయలు దేరారు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఓ శబ్దం వినిపించింది. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం) -
దైవవాణి ధ్యాసలో ముహమ్మద్ (స)
ప్రవక్త జీవితం దైవదూత గొంతు పిసికేస్తాడేమో అన్నంత బాధ కలిగింది. ఆ బాధలోనే ఆయన ‘ఏం చదవాలి?’ అన్నారు? అప్పుడా దైవదూత, ‘‘చదువు! సృష్టికర్త అయిన నీ ప్రభువు పేరుతో. ఆయనే మానవుణ్ణి కరుడుకట్టిన రక్తంతో సృష్టించాడు. చదువు! నీ ప్రభువు ఎంతో పునీతుడు, శ్రేష్టుడు. ఆయన కలం ద్వారా జ్ఞానం ప్రసాదించాడు. మానవుడికి తెలియనిదంతా నేర్పాడు (96.1-5). ఈవాక్యాలను దైవదూత ఎలా పలికాడో అలానే యథాతధంగా పఠించాడు ముహమ్మద్ (స). చదివీ చదవగానే ఆయనకది కంఠస్థమై పోయింది, హృదయ ఫలకంపై ముద్రించుకు పోయింది. దైవదూత వెళ్ళిపోయాడు. ముహమ్మద్ (స) అలానే నిశ్చలనంగా నిచుండిపొయ్యాడు. ఒళ్ళంతా భయంతో చెమట పట్టాయి. కొన్ని క్షణాల తరువాత కాస్తంత తేరుకొని గుహ అంతా కలియజూశాడు భయంభయంగా. ఎటువంటి అలికిడిగాని, ఎలాంటి ఆకారం కాని కనిపించలేదు. ఏమిటి? తనకేమైంది? ఏదైనా పిశాచంగాని ఆవహించిందా? ఇప్పటి వరకు తనను చదువు, చదువు అని బలవంత పెట్టిందెవరు??. రకరకాల ఆలోచనలు, అవమానాలు మనసును ముసురుకున్నాయి. గబగబా గుహలోంచి బయటికొచ్చి నేరుగా ఇంటిదారి పట్టారు. పరుగులాంటి నడకతో వడివడిగా ఇంటికి చేరుకున్నారు. వచ్చీరాగానే మంచానికి అడ్డంపడి, ‘ఖదీజా! దుప్పటి కప్పు, దుప్పటి కప్పు’ అని పలవరించారు. ‘అయ్యో! ఏమిటండీ, ఏమైందండీ?’అంటూ కంగారుపడుతూ పరుగు పరుగున వచ్చారు ఖదీజా (ర). దుప్పటి కప్పి, విసురుతూ కూర్చున్నారు. భార్య సపర్యలతో కొద్దిసేపటి తరువాత ఆయన కొద్దిగా తేరుకున్నారు. అప్పుడామె ‘అసలు ఏమైందండీ, ఇప్పుడెలా ఉంది?’ అని ప్రశ్నించారు ఆర్తిగా. సమాధానంగా ఆయన శ్రీమతి వైపు దీనంగా చూస్తూ, ‘ఖదీజా! నాకేదో అయింది. భయంగా ఉంది.’ అన్నారు. ‘ఏమీ భయంలేదు. మీకేమీ కాదు. మీరిలా భయపడితే ఎలా? అసలేమైందో చెప్పండి’ అన్నారు ఖదీజా ధైర్యాన్ని కూడగట్టుకుంటూ... ముహమ్మద్ (స) హిరాగుహలో జరిగిన వృత్తాంతమంతా పూస గుచ్చినట్టు వివరించారు. అంతా విన్న ఖదీజా, ఏమాత్రం అధైర్య పడకుండా, ‘ఇది నిస్సందేహంగా శుభవార్తే. భయపడాల్సింది ఏమీలేదు. శుభఘడియ సమీపించింది. సంతోషించండి. మీ దినచర్య యధావిధిగా కొనసాగించండి. ఏ శక్తి చేతిలో ఖదీజా ప్రాణముందో, ఆ శక్తి సాక్షిగా చెబుతున్నాను. మీరు దేవుని ప్రవక్త కాబోతున్నారు. మీరు సత్యసంధులు, వాగ్దాన పాలనకు, నిజాయితీపరులు, అమానత్తుదారులు, బంధువుల హక్కులు నెరవేర్చేవారు, పేదసాదలను, అనాధలను ఆదుకునేవారు, అతిధిమర్యాద చేసేవారు, సత్కార్యాల్లో పరులకు సహాయపడేవారు.. అలాంటి మీకు దేవుడు అన్యాయం చేస్తాడా? అలాఎన్నటికీ జరగదు. మీరు విచారించకండి’ అంటూ ధైర్యం నూరి పోశారు ఖదీజా. శ్రీమతి ఓదార్పు మాటలతో ఆయన మనసుకు కాస్తంత స్థిమితం కలిగింది. వాడిన ముఖారవిందం మళ్ళీ వికసించింది. ధైర్యం చెప్పి ఓదార్చినందుకు శ్రీమతికి కృతజ్ఞత చెప్పారు. అలానే మంచంపై పడుకొని నిద్రలోకి జారుకున్నారు. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం) -
రమజాన్ మాసంలో... హిరా గుహల్లో...
ప్రవక్త జీవితం ‘విన్నారు కదా బాబు అభిప్రాయం’ అంటూ ఆయన జైద్ చేయి పట్టుకొని ఖురైష్ పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళారు.‘ఖురైష్ వంశ పెద్దలారా! వినండి. ఈరోజు నుండి ఈ అబ్బాయి నా కొడుకు. ఇతను నా వారసుడు. నేను ఇతనికి వారసుణ్ణి. దీనికి మీరే సాక్ష్యం’ అంటూ బహిరంగంగా పెద్దల సమక్షంలో ప్రకటించారు. ఈ అపురూప దృశ్యాన్ని అవాక్కయి వీక్షిస్తున్న హారిసా ఆనందానికి అవధులు లేకుండా పొయ్యాయి. కొడుకును మక్కాలోనే ముహమ్మద్ గారి దగ్గర వదిలి పరమ సంతోషంగా వెళ్ళిపోయాడు. తరువాత కొన్నాళ్ళకు అలీ కూడా ఆయన సంరక్షణలోకొచ్చారు. అదెలాగంటే, అబూతాలిబ్‌కు గంపెడు సంతానం, సంసార సాగరం ఈదలేక పాపం ఆయన సతమతమవుతున్నారు. అంతలో అరేబియాలో వచ్చిపడిన కరువు రక్కసి ఆయన్ని మరింత కుంగదీసింది. ఇదంతా గమనిస్తున్న ముహమ్మద్ గారి మనసు తల్లడిల్లిపోయింది. బాబాయి అబ్బాస్ గారిని కలిసి, బాబాయి సంతానంలోంచి ఓ ఇద్దరిని మనం మన సంరక్షణలోకి తీసుకుందాం. ఇలానైనా ఆయనకు కాస్త భారం తగ్గుతుందేమో! అన్నారు. తరువాత ఇద్దరూ కలిసి బాబాయి అబూతాలిబ్ గారి వద్దకు వెళ్ళి విషయం చెప్పారు. ఆయన పరమ సంతోషంతో అంగీకరించారు. ఈవిధంగా అబ్బాస్ జాఫర్‌ను, ముహమ్మద్ గారు అలీని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ఇప్పుడు జైద్, అలీలు ఇద్దరికీ ఆయన తండ్రి అయిపోయారు. కాలం గడిచిపోతోంది. ముహమ్మద్ వయసు ఇప్పుడు నలభైకి చేరుకుంది. అయినా ఆయన దినచర్యలో ఎలాంటి మార్పూలేదు. అనాథల్ని, దిక్కూమొక్కూ లేనివారిని ఆదరించడం, సాటివారి కష్టాల్లో పాలుపంచుకోవడం, సమాజ సంక్షేమం, లోకకల్యాణం, మానవ మోక్షాలే ఆయన జీవితాశయంగా అహోరాత్రులు దైవ చింతనలో, సత్యాన్వేషణలో పవిత్ర జీవితం గడుపుతున్నారు. అంతలో రమజాన్ మాసం వచ్చింది. దీంతో ఆయన ఆరాధనలలో ప్రత్యేక శ్రద్ధ కనబరచడం ప్రారంభించారు. రమజాన్ మాసంలో కొన్నిరోజులు గడిచాయి. ఆయన యధాప్రకారం ‘హిరా’గుహలో విశ్రాంతి తీసుకుంటున్న ప్రాతఃకాల సమయాన, ఒక్కసారిగా, అకస్మాత్తుగా హిరా గుహ కళ్ళు మిరుమిట్లు గొలిపే దివ్య కాంతులతో దగద్ధగాయమానంగా వెలిగిపోయింది. ఈ హఠాత్పరిణామాన్నుండి ముహమ్మద్ తేరుకోకముందే, ఒక దైవదూత ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. అద్భుతమైన ముఖవర్ఛస్సుతో, అసాధారణ దివ్యతేజస్సుతో ఉన్న ఆ దైవదూత వచ్చీరాగానే ‘చదువు’ అని ఆదేశించాడు. ‘నాకు చదువురాదు’ అన్నారు ముహమ్మద్ కాస్త భయంభయంగా. ఈసారి దైవదూత ముహమ్మద్‌ని వాటేసుకొని అదిమి, ‘చదువు’ అని మళ్ళీ ఆదేశించాడు. మరలా అదే సమాధానం... ఈసారి మరి కాస్తగట్టిగా అదిమి వదిలేస్తూ, ‘చదువు’ అని మళ్ళీ పురమాయించాడు. ఈసారి మరింత బాధతో, ఊపిరాడనంతపనయింది. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం) -
వివేక స్రష్ట ముహమ్మద్ (స)
ఐదు రోజులు గడిచినా సమస్య ఓ కొలిక్కి రాలేదు. ఎవరికివారు ‘హజ్రె అస్వద్’ను ప్రతిష్టించే హక్కు తమకే ఉందని పట్టుబట్టారు. ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. రణరంగానికి రంగం సిధ్ధమైంది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కరవాలాలు ఒరల్లోంచి సర్రున బయటికి కొచ్చాయి...అంతలో.. ‘ఆగండి’ అంటూ మారు మోగిందో కంఠం. అందరూ గిర్రున తిరిగి ఎవరా అని చూశారు. ఆ పెద్దమనిషి ఖుైరె ష్ తెగలోని కురు వృద్ధుడు. అబూ ఉమయ్యాబిన్ ముగీరా. అందరూ అతన్ని గౌరవిస్తారు. ఆయన మాట ఎవరూ కాదనరు. అందరూ అతని వైపు ప్రశ్నార్ధకంగా చూశారు. ‘గౌరవోన్నతుల విషయంలో మీరు ఎవరూ ఎవరికీ తక్కువ కారు. అంతా సమాన హోదా కలిగిన వారే. దైవ గృహంలో అనవసర రక్తపాతం మంచిదికాదు. విచక్షణా జ్ఞానంతో ఆలోచించండి. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తేకండి. నా సలహా ఏమిటంటే, సఫా ద్వారం నుండి మొట్టమొదట ఎవరైతే కాబాగృహంలోకి అడుగు పెడతారో వారిని న్యాయనిర్ణేతగా ఎంచుకోండి. అతను చెప్పిన తీర్పుకు కట్టుబడి ఉండండి.’ అన్నాడు పెద్దాయన ఉమయ్యా. ‘ఈ సలహా మాకు సమ్మతమే’ అన్నారు అందరూ ముక్తకంఠంతో. తరువాత కొంత సమయం గడిచి పోయింది. అందరూ ఊపిరి బిగబట్టి సఫా ద్వారంవైపే చూస్తున్నారు. అంతలో వారి ఉత్కంఠకు తెరలేపుతూ ఓ అందమైన యువకిశోరం ఆ ద్వారం గుండా కాబాలో అడుగుపెట్టాడు. అంతా ఒక్కసారిగా ‘అమీన్.. అమీన్.. ముహమ్మద్ .. ముహమ్మద్.. అమీన్ ’ అంటూ ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేశారు. ఎంత నమ్మకం..! ఎంత విశ్వసనీయత..!! మక్కా మాత్రమేకాదు, మొత్తం అరేబియా వెదికినా అలాంటి నిజాయితీ పరుడు, సత్యసంధుడు, విశ్వసనీయుడు మరొకరు దొరకరు. ఆయన ఎలాంటి తీర్పుచెప్పినా ప్రజలు దాన్ని కిమ్మనకుండా శిరసావహించవలసిందే. చూడాలిక ఈ విషయంలో ఆయన తీర్పు ఎలా ఉండబోతోందో..! ముహమ్మద్ (స)కు ఏమీ అర్ధంగాక అయోమయంగా చూశారు. అంతలో వివిధ తెగలకు చెందిన అగ్రనాయకులంతా ఆయన చుట్టూ మూగి, సమస్యను వివరించి, పరిష్కరించమని విన్నవించుకున్నారు. వెంటనే ముహమ్మద్ దుప్పటిలాంటి ఒక వస్త్రం తెప్పించి నేలపై పరిచారు. తానే స్వయంగా ‘హజ్రెఅస్వద్’ దానిపైన పెట్టారు. తరువాత పోటీ పడుతున్న అన్నితెగలనుండీ ఒక్కొక్క నేతను పిలిచి అందరితో దుప్పటి చెంగుల్ని పట్టించారు. అన్నితెగలవారూ ‘హజ్రె అస్వద్’ను పట్టుకొని అమర్చవలసిన చోటుకి తెచ్చారు. తరువాత ముహమ్మద్ తన స్వహస్తాలతో కాబా గోడలో దాన్ని అమర్చారు. అనంతరం కాబానిర్మాణం దిగ్విజయంగా పూర్తయింది. - మహమ్మద్ ఉస్మాన్‌ఖాన్