దైవవాణికోసం నిరీక్షణలో... ప్రవక్త జీవితం
తరువాత ముహమ్మద్ (స) ఇంటికి తిరిగొచ్చారు. ఆయన ముఖారవిందం విచారంగా ఉంది. రకరకాల ఆలోచనలతో ఆయన మనసు నిండిపోయింది. ‘ఈ బలహీన భుజస్కంధాలపై దౌత్యభారమా ! దీని పర్యవసానం ఏమి కానుందో!? దీన్ని నేను ఎలా మోయగలను? ప్రజల్ని సత్యంవైపు, సన్మార్గం వైపు ఎలా పిలవడం? వీరు మార్గవిహీనులై, దైవానికి దూరంగా ఉన్నారు. సత్యానికి దూరంగా ఉన్నారు. విగ్రహారాధన, బహుదైవారాధన వీరి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంది. మూఢాచారాల్లో పీకలదాకా మునిగి ఉన్నారు. అన్నిరకాల దుష్కార్యాలు, దుర్మార్గాలు వారిని పరివేష్టించి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో నా కర్తవ్యం ఏమిటి? దాన్ని నేను నిర్వర్తించడం ఎలా??’ మనసులో ఆలోచనల తుఫాను చెలరేగింది. దీంతో ఆయన దైవవాణి కోసం నిరీక్షించసాగారు.
నిరీక్షణ. దైవదూత కోసం .. దైవవాణి కోసం ... వరఖా బిన్ నౌఫిల్ ధృవీకరించిన దూతకోసం.. ఖదీజా విశ్వసనీయంగా చెప్పిన దైవదూత కోసం..! కానీ ఫలించలేదు. జిబ్రీల్ దూత రాలేదు.. ఎలాంటి దైవవాణీ అవతరించలేదు... మళ్ళీ మనసులో అలజడి, పెనుతుఫాను.. ‘ఇప్పుడు నేనేంచేయాలి.. నా కర్తవ్యం ఏమిటి? ప్రజలకు ఏమి సందేశమివ్వాలి?’ ఈ విషయాలు చెప్పడానికి జిబ్రీల్ (అ) ఎందుకు రాలేదు? జిబ్రీల్ రాక ఎందుకు ఆగిపోయింది. మళ్ళీ సందేశం ఎందుకు తేలేదు! ఒకటే ఆలోచన. మనసంతా అంధకారమైన భావన. నిర్మల తేజంతో ప్రకాశించే సుందరవదనం కళా విహీనమైపోయింది. మనసును చీకట్లు ముసురుకున్నాయి. అటు బీబీ ఖదీజా పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఆమె మనసులో కూడా ఆందోళన మొదలైంది. రేయింబవళ్ళు లోలోనే కుమిలిపొయ్యారు. కాని ఎక్కడా బయట పడలేదు. భర్తకు ధైర్యవచనాలు చెబుతూ, ఊరడించడానికి శక్తిమేర ప్రయత్నించేవారు.
ముహమ్మద్ (స) మళ్ళీ హిరాగుహను ఆశ్రయించారు. రేయింబవళ్ళు అక్కడే దైవధ్యానంలో గడిపేవారు. తన ప్రభువుతో సంభాషించేవారు. ప్రభూ! నువ్వే కదా నన్ను ప్రవక్తగా నియమించావు. మళ్ళీ అంతలోనే విడిచిపెట్టావా స్వామీ? అని మొరపెట్టుకునేవారు. బాధతో గుండెలు అవిసిపోయేవి. ఆందోళన.. ఆక్రందన.. ఏమీ అర్థంకాని పరిస్థితి.. ఏమీ పాలుపోక ఎటెటో తిరిగేవారు.. రాళ్ళురప్పల మధ్య.. కొండకోనల మధ్య.. ఒక్కోసారి తనువుచాలిద్దామన్నంత నిరాశతో కొండశిఖరం పైకి ఎక్కేవారు. అంతలో హజ్రత్ జిబ్రీల్ దూత వచ్చేవారు. ఆయన్ని శాంతపరిచేవారు. ‘ముహమ్మద్ ! మీరు నిస్సందేహంగా దైవప్రవక్తే.’ అని భరోసా ఇచ్చేవారు. దీంతో ఆయనకు సాంత్వన చేకూరేది. వెనుదిరిగి వెళ్ళిపోయేవారు. కొద్దిరోజుల తరువాత మళ్ళీ అదే పరిస్థితి ఎదురయ్యేది. మళ్ళీ పర్వత శిఖరంపైకి చేరుకునేవారు ఆత్మత్యాగం చేద్దామని! హజ్రత్ జిబ్రీల్ మళ్ళీ వచ్చి ఆయన్ని ఓదార్చేవారు, ఆయన వెనుదిరిగి వెళ్ళేవారు. ఆయన మనసు ఎంత గాయపడి ఉండాలి! ఆత్మ ఎంతగా రోదించి ఉండాలి! మనోమస్తిష్కాలపై ఎంతటి భారం పడిఉండాలి!
దైవవాణి అవతరణ ఆగిపోవడం మామూలు శిక్షకాదు. దైవం నన్ను వదిలేశాడా అన్న భావన గుండెలో గునపాలు గుచ్చినంతగా బాధించేది. ఇవే ఆలోచనలు మనసును తొలుస్తుండగా, ఒకరోజు ఆయన ఎటో బయలు దేరారు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఓ శబ్దం వినిపించింది.
- ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్
(మిగతా వచ్చేవారం)