ప్రవక్త జీవితం
అంతకు మునుపే ముహమ్మద్ వ్యక్తిత్వాన్ని గురించి, నీతి, నిజాయితీ, సచ్ఛీలతల గురించి కొద్దోగొప్పో విని ఉన్న ఖతీజా ఇప్పుడు స్వయంగా తన మనుషులే దానికి సాక్ష్యంగా నిలవడంతో చాలా సంతోషించారు. మానవత్వం మూర్తీభవించిన అలాంటి మచ్చలేని మనిషి తన వ్యాపారానికి లభించినందుకు ఎంతో సంబరపడ్డారు. ఇలాంటి సచ్చీలుడు తనకు జీవిత భాగస్వామి కూడా అయితే బావుండునన్న భావన ఆమెకు కలిగింది. భర్తచనిపోయిన తరువాత, యావత్తూ అరేబియా దేశంలోని ఎందరో గొప్పింటిబిడ్డలు, మహామహులు, సంపన్నులు వివాహ సంబంధాలు పంపినా ఆమె వాటన్నిటినీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
కాని ఇప్పుడామె మనసులో ప్రేమ కుసుమాలు మొగ్గతొడుగుతున్నాయి. మనసులో సంఘర్షణ మొదలైంది. ఎలా? తన మనసులోని మాట ముహమ్మద్ బాబాయి అబూతాలిబ్‌కు తెలియజేయడం ఎలా? అంతకు ముందు ముహమ్మద్ అభిప్రాయం తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు ఏమిటి చేయడం? దీర్ఘాలోచనలో మునిగిపోయారామె.
అంతలో ‘‘ఏంటమ్మా అంతలా ఆలోచిస్తూ కూర్చున్నారూ?’’ అంటూ వచ్చింది స్నేహితురాలు నఫీసా.
‘‘ఏం లేదు నఫీసా. నేనొక విచిత్రమైన పరిస్థితిలో పడిపోయాను. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు’’
‘‘అంతటి దీర్ఘాలోచనలో పడేసిన విషయం ఏమిటీ ఇంతకీ?’’ ప్రశ్నించింది నఫీసా.
మనసులో ఉన్న విషయం స్నేహితురాలితో చెప్పారు ఖతీజా. ‘‘ఓస్! ఇంతేనా?’’ ‘‘అంటే?’’
‘‘ఏముంది? అంతటి సుగుణాల పోగు, సత్యసంధుడు అయిన వ్యక్తిని వివాహమాడేందుకు వెనుకా ముందూ ఆలోచించాల్సిన అవసరమే లేదు’’ తన అభిప్రాయం చెప్పింది నఫీసా.
అంతటితో ఆగకుండా వెంటనే నఫీసా ముహమ్మద్ దగ్గరకు వెళ్లింది. ఆ మాటా ఈ మాటా మాట్లాడి, మరి పెళ్లెప్పుడు చేసుకుంటారు?’’ అని అడిగింది. ‘‘ఏమో! ఇంతవరకు పెళ్లి ఆలోచన రాలేదు. ఎవరైనా ఉన్నారా ఏమిటి నీ దృష్టిలో?’’
‘‘అవును.’’‘‘ఎవరేమిటి?’’ ‘‘ఖదీజా.’’ ఈ పేరు వింటూనే ముహమ్మద్ అవాక్కయ్యారు.
ఖతీజా గుణగణాలను గురించి, ఆమె వ్యక్తిత్వాన్ని గురించి ఆయన ఏది విన్నారో ఆమెలో అదే చూశారు. ఆమె సత్‌ప్రవర్తన, సచ్ఛీలతల కారణంగా ప్రజలు ఆమెను ‘తాహి రా’ అని పిలుచుకునేవారు. ఖదీజాతో వివాహమన్న విషయం కనీసం ఆయన కలలో కూడా ఊహించలేదు.
గొప్ప గొప్ప సంబంధాలను ఆమె కాలిగోటితో తిరస్కరించారు. అరేబియాలోని ఎందరో మహానుభావులు ఆమె వద్దకు వివాహ సందేశాలు పంపి భంగపడ్డారు. అందుకే ఆయన, ‘‘ఏమిటి నువ్వంటున్నది?’’ అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు.
‘‘అవును, నేను నిజమే చెబుతున్నాను’’ ‘‘మరి ఇది ఎలా సాధ్యం?’’
నఫీజా ఖదీజాకు చెప్పిన సమాధానమే ఇక్కడా చెప్పింది. ఆ విషయం నాకొదిలేయండి’’ అన్నదామె.
- ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం)