దయాగుణంతో దైవప్రీతి
ఒక సందర్భంలో ముహమ్మద్ ప్రవక్త మహనీయులు ఇలా అన్నారు. ‘ఎవర్ని గురించీ చెడుగా మాట్లాడకండి. ఏ చిన్న సత్కార్యాన్నీ అల్పమైనదిగా భావించకండి. మంచి పని ఎంత స్వల్పమైనదైనా దాన్ని చేస్తూనే ఉండండి. తోటివారిని చిరునవ్వుతో పలకరించడం కూడా గొప్ప సత్కార్యమేనని గుర్తుంచుకోండి.
దైవప్రవక్త ముహమ్మద్ (స) అనుక్షణం మానవాళి సంక్షేమం కోసం, వారి ఇహ, పర సాఫల్యం కోసం తపించారు. శత్రువును సైతం ప్రేమతో గుండెలకు హత్తుకోగలిగిన దయామయుడాయన. తనను చంపెయ్యాలని పగబట్టి వెంటాడిన అగర్భ శత్రువులను సైతం ఆయన క్షమించారు. తన బాబాయిని చంపి, కిరాతకంగా, ఆయన కాలేయాన్ని నమిలిన హంతకురాల్ని ఆయన మన్నించారు. మంచిని బోధించినందుకు రక్తసిక్తమయ్యేలా కొట్టిన ‘తాయిఫ్’ ప్రజలను క్షమించమని, వారికి సన్మార్గం చూపమని విశ్వప్రభువును ప్రార్థించారు.
శత్రువును శపించమని స్నేహితులు కోరినప్పుడు, ‘నేను ప్రపంచానికి కారుణ్యంగా వచ్చాను. శాపంగా రాలేదు’ అని బదులిచ్చారు. ‘మీరు, మీ చెడు కోరేవారి శ్రేయాన్ని కాంక్షించండి. మిమ్మల్ని శపించే వారికోసం మీరు ప్రార్థించండి. మీకు కష్టనష్టాలు కలిగించేవారికి మీరు న్యాయం చెయ్యండి’ అని ఆ దయాగుణ సంపన్నుడు ఉపదేశించారు. దైవప్రవక్త( స) ప్రవచనాలకు దర్పణం పట్టే దివ్యవాక్యాలు దైవగ్రంథంలో ఇలా ఉన్నాయి:
‘విశ్వసించిన ప్రజ లారా! అల్లాహ్ కోసం, నీతి నిజాయితీలకు కట్టుబడి ఉంటూ, న్యాయబద్ధమైన సాక్ష్యం పలకండి. ఇతరుల పట్ల విరోధం ఉన్నా సరే, న్యాయానికి తిలోదకాలు ఇవ్వకండి. ఎల్లప్పుడూ న్యాయంగానే వ్యవహరించండి. దైవభీతి పరాయణతకు ఇది నిదర్శనం. ప్రతివిషయంలోనూ దైవం పట్ల భయభక్తులతో మసలుకోండి. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు(పవిత్ర ఖురాన్ 5-9).
మంచి చెడులు ఒకటి కావు. కనుక అత్యంత శ్రేష్ఠమైన మంచి ద్వారా చెడును నిర్మూలించండి(పవిత్రఖురాన్ 41:34).
ఒకసారి ఒక మనిషి మహమ్మద్ ప్రవక్త మహనీయుల వారివద్దకొచ్చి, ‘దైవప్రవక్తా! ఏ పని చేస్తే స్వర్గం లభిస్తుందో అది ఉపదేశించండి’ అని అడిగాడు. అప్పుడు ప్రవక్త మహనీయులు కొన్ని విషయాలు చెప్పారు. వాటిలో, ‘నీతో శత్రుత్వం నెరిపే బంధుజనులపై నువ్వు కారుణ్యం కురిపించు’ అని సెలవిచ్చారు. అలాగే నిన్ను ప్రేమించే బంధువుల్ని నువ్వు ప్రేమించడం మాత్రమే బంధుప్రేమ కాదు. నిన్ను ప్రేమించని (నిన్ను ద్వేషించే) వారిని ప్రేమించడమే నిజమైన బంధుప్రేమ’ అని కూడా ప్రవచించారు.
అంటే, స్నేహితులతో స్నేహం చేయడం విశేషం కాదు. శత్రువులతో సైతం స్నేహం చేయగలగడం గొప్ప విశేషం. ఒక సందర్భంలో ముహమ్మద్ ప్రవక్త మహనీయులు ఇలా అన్నారు. ‘ఎవర్ని గురించీ చెడుగా మాట్లాడకండి. ఏ చిన్న సత్కార్యాన్నీ అల్పమైనదిగా భావించకండి. మంచి పని ఎంత స్వల్పమైనదైనా దాన్ని చేస్తూనే ఉండండి. తోటివారిని చిరునవ్వుతో పలకరించడం కూడా గొప్ప సత్కార్యమేనని గుర్తుంచుకోండి. కోపాన్ని విసర్జించండి. దాని నుండి దూరంగా పారిపోండి. ఎందుకంటే, కుస్తీలో ప్రత్యర్థిని మట్టి కరిపించే వాడికంటే, ఆగ్రహంలో నిగ్రహం పాటించినవాడే నిజమైన బలవంతుడు, పరాక్రమవంతుడు.
అందుకని ప్రతి ఒక్కరూ సర్వకాల సర్వావస్థల్లో, ఏదోవిధంగా పరులకు మేలు చేయాలన్న సత్సంకల్పం, మంచి ఆలోచన కలిగి ఉండాలి. పగ, ప్రతీకార భావనలను నిఘంటువులోంచి తీసేసి, పరులకు మేలు చేయలేకపోయినా కనీసం కీడు చేయకుండా ఉండడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయాలి.
- యండి ఉస్మాన్‌ఖాన్