ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పలు కళాశాల విద్యార్థులను ‘సాక్షి’ పలుకరించ గా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రేమంటే ప్రేయసీ ప్రియులకే పరిమితం కాదు...ఇందులో ఓ పెద్ద కుటుంబం ఇమిడి ఉంది. తీసుకొనే నిర్ణయం వెనుక రక్త సంబంధాలు ముడిపడి ఉన్నాయి. ఇద్దరు ఒక్కటవ్వడానికి పెద్దలంతా వెనుకనుంటేనే కొండంత అండ అంటోంది నేటి తరం.
పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే భవిష్యత్తును దీటుగా దిద్దుకోవాలి. టీనేజీ వృథా చేసుకుంటే భవిత ప్రశ్నార్థకమే అంటోంది నేటి తరం.
అమ్మాయిలు ఇలా...
⇒ మొదట్లో ప్రేమంటారు..., తరువాత కట్నాలు పిచ్చి పట్టుకుంటుంది. తన స్నేహితులు లక్షల్లో డబ్బులు తేవడాన్ని చూసి ఆశ పుట్టుకొస్తుంది. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న యువతి ఆ సమయంలో ఎక్కడికి వెళ్తుంది? ఎవరిని ఆశ్రయిస్తుంది? అన్నీ తానై భావించి వచ్చిన ఆ యువతి భవిత అగమ్య గోచరమే కదా... అందుకే ప్రేమ పెళ్లంటే కాస్తా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
⇒ అబ్బాయిలకైతే ఎన్నో అవకాశాలుంటాయి. ప్రేమ విఫలమైనా ఇంకో అమ్మాయిని ఇవ్వడానికి ఇంకొకరు సిద్ధంగా ఉంటారు. కానీ అమ్మాయిని పెళ్లి చేసుకొనే పెద్ద మనసు ఎంతమందికి ఉంటుంది. ఎండిన మోడులా జీవితమంతా గడపాలి.
⇒ తేడా వచ్చినా అబ్బాయి ఎలాగో బతికేస్తాడు. కానీ అమ్మాయి ఎలా బతుకుతుంది. ఒంటరిగా ఎక్కడ ఉంటుంది.
⇒ పెద్దలు కుదిర్చిన పెళ్లైతే అబ్బాయి తప్పు చేసినా మందలించడానికి ఓ కుటుంబం వెనుక ఉంటుంది. కాపురాన్ని చక్కదిద్దుతారు. ప్రేమ పెళ్లిలో అదేమీ ఉండదు కదా.
⇒ ఎడబాటు కూడా ప్రేమ బలపడడానికి ఓ కారణంగా చెబుతారు. భర్తతో గొడవలు వచ్చినా పుట్టింటికి వెళ్లిపోతే...కొద్ది రోజులు ఎడబాటు...భర్త వచ్చి బతిమాలి తీసుకువెళ్తే ఆ థ్రిల్లే వేరులెండి.
⇒ చక్కగా చదువుకొని జీవితంలో స్థిరపడిన తరువాత పెళ్లి చేసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు.
అబ్బాయిలు ఇలా...
⇒ ప్రేమ ఓ మైకం. ఆ మైకంలో పడి అమ్మాయి కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం. ఎక్కడికైనా తిప్పుతాం. పెళ్లయిన తరువాత కూడా అలాగే కొనసాగమంటే ఎలా.. అందుకే ప్రేమ పెళ్లే వద్దు.
⇒ అమ్మానాన్నను ఒప్పించి ఇంటికి తీసుకువస్తాం. కానీ ఇంట్లో వాతావరణం పడక పెద్దలమీదే తిరగబడితే ఏం చేయాలి. అందరూ అబ్బాయినే తప్పు పడతారు. ముక్కూ, మొహం తెలియని అమ్మాయితో మాట పడాల్సి వస్తోందని ఇంట్లో వాళ్లు బాధ పడితే ఇక నరకమే. అదే పెద్దలు చూసే పిల్లనే పెళ్లి చేసుకుంటే ఏ సమస్య వచ్చినా వాళ్లే చూసుకుంటారు.
⇒ పెద్దలు కుదిర్చిన పెళ్లయితే అమ్మాయి అల్లరి చేసినా అటువైపు వాళ్లు నచ్చజెబుతారు. సరైన దారిలో పెడతారు. అదే ఇరు కుటుంబాలను కాదని పెళ్లి చేసుకుంటే కొట్లాడుకున్నా, తిట్లాడుకున్నా తీర్చేవాడే కనిపించడు. మీ ఇష్ట ప్రకారం చేసుకున్నారు కదా... మీ ఇష్టమని వదిలేస్తారు.
⇒ కెరియర్‌లో స్థిరపడాక పెళ్లి చేసుకుంటే ఓ పరిణతి వస్తుంది. కష్ట సుఖాలు తెలుస్తాయి. లేదంటే తరువాత పెళ్లాం ముందే అవమానాలు పడాలి.
అందరి ప్రేమ కావాలి
Published Sat, Feb 14 2015 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM
Advertisement