కాబా పునర్ నిర్మాణంలో ముహమ్మద్ (స) | reconstruction of the Kaaba Muhammad (S) | Sakshi
Sakshi News home page

కాబా పునర్ నిర్మాణంలో ముహమ్మద్ (స)

Published Sun, May 8 2016 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

reconstruction of the Kaaba Muhammad (S)

ముహమ్మద్ కుటుంబ బాధ్యతల నుండి తప్పించుకోలేదు. అర్ధాంగి హక్కులను విస్మరించలేదు. భార్యగా ఖదీజా హక్కులన్నింటినీ ఆయన నెరవేర్చేవారు. ఆమె ఇష్టాయిష్టాలను, మనోభావాలను గౌరవించేవారు. ఆమె సంపద సంరక్షించేవారు. ముహమ్మద్ గారి సహచర్యంలో ఖదీజా ఎంతో ఆనందంగా గడిపేవారు. ఆయన తోడు ఆమెకు సంతోషంతోపాటు, శాంతిని, సంతృప్తిని ప్రసాదించేది.

 ముహమ్మద్ (స) ఏకాంతాన్నే ఇష్టపడేవారు కాని, ప్రజలందరితో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. వారి కష్టసుఖాలను విచారించేవారు. ఎక్కువశాతం మౌనంగానే ఉండేవారు. అవసరమనుకుంటే సంక్షిప్తంగా, మనోహరంగా మాట్లాడేవారు. ఇతరులు చెప్పేది చాలా శ్రద్ధ్ధగా వినేవారు. వాదించేవారు కాదు. ఎప్పుడూ చిరునవ్వు పెదాలపైనే ఉండేది. ఇతరుల అవసరాల్ని కూడా తన అవసరాలుగానే భావించేవారు. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సిద్ధంగా ఉండేవారు. ఇలాంటి అనేక సుగుణాల కారణంగా ప్రజలు ఆయన్ని అమితంగా అభిమానించేవారు. ఎంతగానో గౌరవించేవారు. ఆయన మాటకు ఎంతో విలువ ఇచ్చేవారు. ఏ విషయమైనా, ఆయనగారి సలహా తీకునేవారు.

 ఒకసారి మక్కాలో తీవ్రమైన ముసురు పట్టింది. ముసురు కాస్తా కుండపోతగా మారింది. రోజుల తరబడి ఒకటే వర్షం. మంచిమంచి కట్టడాలు కూలిపోయాయి. కాబా గృహం కూడా ప్రభావితమైంది. దాని పునాదులు బలహీనపడ్డాయి. ఇది చూసి మక్కావాసుల్లో తీవ్రమైన ఆందోళన ప్రారంభమైంది. తమ ఆరాధనాలయానికి ఏమవుతుందో, ఎలాంటి అపచారం జరిగిందోనని ఆవేదన చెందసాగారు. వెంటనే మక్కా పెద్ద, ఇతర తెగల నాయకులందరు సమావేశమై చర్చించారు. మరమ్మతులు చేపట్టాలని తీర్మానించుకున్నారు.

 మక్కా ప్రజలకు కాబాయే సర్వస్వం. అది వారి పవిత్ర ఆరాధనాలయం. దూరతీరాల నుండి కూడా ప్రజలు కాబా దర్శనానికి వస్తుంటారు. దాని కారణంగా అక్కడ వ్యాపారం విస్తరించింది. ఎక్కడెక్కడి ప్రజలో అక్కడికి రావడం మూలాన అదొక వాణిజ్య కూడలిగా విరాజిల్లుతోంది. కాబా కారణంగా మక్కా నగర కీర్తిప్రతిష్టలు దశదిశలా వ్యాపించాయి. మక్కావాసుల గౌరవోన్నతులకూ అదే కారణం. ఇప్పుడు కాబాకు ఏమైనా జరిగితే..? ఈ ఆలోచనే వారిని కలచివేస్తోంది.

 ఒకవేళ కట్టడాన్ని పూర్తిగా కూల్చేసి పునర్ నిర్మాణం చేపడితే..? బాగానే ఉంటుంది. కాని ఎవరు ముందుకు రావాలి?  కాబాపై పలుగో పారో ఎవరెత్తాలి? అంత ధైర్యం ఎవరికుంది? దీర్ఘచర్చల అనంతరం, పాతకట్టడాన్ని కూల్చి నూతనంగా నిర్మించాలని తీర్మానించుకున్నారు.

 అయితే పునర్ నిర్మాణానికి కావలసిన సామగ్రి, నిష్ణాతులైన పనివాళ్ళను సమకూర్చుకోవడం ఎలా అన్న ప్రశ్న మరలా ఉత్పన్నమైంది. కాని అదృష్టవశాత్తూ, వెతకబోయిన తీగ కాలికే చుట్టుకున్నట్టు, అప్పుడే రోమ్ నుండి అబీసీనియాకు నిర్మాణ సామగ్రితో వెళుతున్న ఒక నౌక సౌదీ అరేబియాలోని జిద్దా ఓడరేవుకు ఢీకొని శిధిలమైపోయింది.

దాంతో నిర్మాణ సామగ్రినంతా ఒడ్డుకు చేర్పించి, అబీసీనియా నౌక కోసం ఎదురు చూస్తున్నాడు యజమాని. ఈ విషయం తెలుసుకున్న మక్కా పెద్ద జిద్దా రేవుకు చేరుకొని, అతనికి విషయమంతా పూసగుచ్చినట్టు వివరించారు. దైవకార్యానికి సహకరించమని అభ్యర్ధించారు. కాబా గృహానికి సేవలందించడం కంటే మహాభాగ్యమేముందని భావించిన నిర్మాణ సామగ్రి యజమాని పరమసంతోషంగా అంగీకరించాడు. మరొక విశేషమేమిటంటే, ఆ వ్యక్తి ఆలయాల నిర్మాణంలో కూడా నిష్ణాతుడు.

 నిర్ణీత రోజు రానేవచ్చింది. ఇక కాబా గోడ పడగొట్టాలి. మరోసారి అందరినీ భయం ఆవహించింది. తమ సంకల్పం ఆలయ పునర్ నిర్మాణమేగాని, దాన్ని నాశనం చెయ్యాలన్నది కాదు గదా అన్న ఆలోచన కొంత ధైర్యాన్నిచ్చింది.

 పాతకట్టడం పడగొట్టడానికి ముందు వారు రకరకాల పూజలు నిర్వహించారు. అనంతరం అందరూ ఊపిరి బిగబట్టి చూస్తుండగా, వలీద్ అనే వ్యక్తి వణుకుతున్న చేతులతోనే గడ్డపలుగుతో వేటువేశాడు. అంతా నిశ్శబ్దం. ఏ ఆపద విరుచుకుపడుతుందోనని, కొన్ని క్షణాలు గడిచిపోయాయి. ఎవరికీ ఏమీ కాలేదు. తరువాత అందరూ కలిసి కాబా గోడ పడగొట్టాలి. పని శరవేగంతో జరుగుతోంది. పునర్ నిర్మాణ పనిలో ముహమ్మద్ (స), అతాలిబ్ కూడా చురుగ్గా పాల్గొన్నారు.

 గోడల నిర్మాణం పూర్తయి ‘హజెఅవ్వద్ ’ (నల్లనిరాయి) అమర్చే సమయం వచ్చింది. హజెఅవ్వద్‌కు చాలా ప్రాముఖ్యం ఉంది. అందుకని ఈ పవిత్ర శిల కాబా గోడలో ఎవరు అమర్చాలి? అన్న సమస్య తలెత్తింది. ప్రతి పెద్దమనిషీ తనకే ఆ పుణ్యం దక్కాలని కోరుకున్నాడు. ప్రతి తెగా ఆ పుణ్యకార్యం చేసే హక్కు తమకే ఉందని భావించింది. ఎవరికి వారు పట్ట్టుదలకు పోవడంతో అదొక పెద్ద సమస్యగా మారి, చినికి చినికి గాలివాన అయ్యింది.  - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement