సాక్షి, హైదారాబాద్: ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అక్కడి రిడ్జి రోడ్డులో అరెస్టు చేసిన ఐసిస్ ఉగ్రవాది మహ్మద్ ముస్తాఖిమ్ ఖాన్ అలియాస్ అబు యూసుఫ్ ఖాన్ కదలికలు హైదరాబాద్‌లోనూ సాగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. సౌదీ అరేబియా నుంచి డిపోర్టేషన్ ద్వారా తిరిగి వచ్చిన ఇతగాడు కొన్నాళ్లు హైదరాబాద్‌లో పెయింటర్‌గా పని చేసినట్లు స్పెషల్ సెల్ గుర్తించింది. ఇతడు సౌదీలో ఉండగానే ఉగ్రవాదం వైపు మళ్లినట్లు ఆధారాలు లభించడం.. అక్కడ నుంచి వచ్చాక హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలడంతో ఇక్కడి కార్యకలాపాలపై ఆరా తీయడానికి కేంద్ర నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లా బధియా బైషాహి గ్రామానికి చెందిన అబు యూసుఫ్ తొమ్మిదో తరగతిలో చదువుకు స్వస్తి చెప్పిన ఇతగాడు ఆపై బతుకుతెరువు కోసం పెయింటర్‌గా మారాడు. కొన్నాళ్లు తన స్వస్థలంలోనే పని చేసిన ఇతగాడు బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లాలని భావించాడు. (ఐసిస్ టెర్రరిస్టు అబు యూసుఫ్ ఖాన్ అరెస్టు)
దీంతో అప్పటికే అక్కడ ఉన్న తన సోదరుడి సహకారంతో 2006లో సౌదీ అరేబియా చేరుకున్నాడు. సౌదీలో ఉండగా తన సెల్‌ఫోన్ సహాయంతో ఎక్కువ సేపు ఇంటర్‌నెట్‌లో గడిపేవాడు. ఇలా ఐసిస్, అల్ కాయిదా వీడియోలకు ఎక్కువగా వీక్షించేవాడు. ఈ విషయం ఆన్‌లైన్ ద్వారా గుర్తించిన సిరియాకు చెందిన ఐసిస్ హ్యాండ్లర్ ఉగ్రవాదం వైపు మళ్లించాడు. అతడే మహ్మద్ ముస్తాఖిమ్ ఖాన్ పేరును అబు యూసుఫ్ అల్ హింద్‌గా మార్చాడు. దాదాపు నాలుగేళ్ల పాటు అక్కడే ఉన్నప్పటికీ వర్క్ పర్మిట్ పునరుద్ధరించుకోలేదు. దీంతో అక్కడి అధికారులు యూసుఫ్‌ను డిపోర్టేషన్ పద్ధతిలో బలవంతంగా అక్కడ నుంచి తిప్పి పంపారు. అక్కడ నుంచి ఇతగాడు తన స్వగ్రామమైన బధియా బైషాహికి చేరుకున్నాడు. (ఐసిస్ కొత్త లీడరే అమెరికా టార్గెట్: ట్రంప్)
అక్కడ ఉండగానూ ఐసిస్ హ్యాండ్లర్‌తో ఆన్‌లైన్ ద్వారా టచ్‌లో ఉన్నాడు. తన స్వస్థంలో కొన్నాళ్లు పని చేసిన యూసుఫ్ అక్కడ నుంచి ముంబైకి వెళ్లాడు. అట్నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇతగాడు దాదాపు రెండేళ్లు పెయింటర్‌గా నివసించాడు. హైదరాబాద్‌లోనూ ఐసిస్ ఛాయలు, ఆ ఉగ్రవాదుల కదలికలు ఉండటం, ఇతడు ఇక్కడ నివసించడంతో అతడి కార్యకలాపాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆ సమయంలో ఎవరెవరిని కలిశాడు? ఎక్కడెక్కడ సంచరించాడు? అనే విషయాలపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ఈ కోణంలో ఇతడిని విచారించడానికి రాష్ట్ర నిఘా విభాగానికి చెందిన ఓ ప్రత్యేక బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment