ఇస్లాం
నిప్పులు కురిసే ఎండ, ఎడారి మార్గం. పైగా దూరతీరాల ప్రయాణం. మంచివాహనం ఉన్నవాళ్లు వడివడిగా పట్నం చేరుకొని, సంపన్నుల బిడ్డలను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంటే, హలీమా, హారిస్ దంపతులు బక్కచిక్కిన వాహనంపై ఆశనిరాశల మధ్య ప్రయాణం కొనసాగిస్తున్నారు.
ముహమ్మద్ పుట్టాడు. కొడుకు అందాలను చూసుకొని ఆనందంతో మురిసిపోతోంది. ఆ అందాల బాల శశాంకుడు అమాయకపు చూపులతో అప్పుడే ఏదో మూగసందేశం ఇస్తూ దినదినప్రవర్ధమానమవుతున్నాడు. నింగిలోని తారలతో ఆడుకుంటూ, తనదైన భాషలో సంభాషిస్తున్నాడు.
పుట్టిన దగ్గరినుండి తల్లిపాలు తాగిన ముహమ్మద్‌కు, అబూలహబ్ ఇంట్లో పనిమనిషి సౌబియా పాలుపట్టే అదృష్టానికి నోచుకుంది. సౌబియా వద్ద వారం రోజులు పాలు తాగిన ముహమ్మద్, ఆచారం ప్రకారం పల్లెవాతావరణానికి పయనమయ్యే సమయం ఆసన్నమైంది.
సాధారణంగా అరేబియా వాసుల్లో తమ పిల్లలను పసిప్రాయంలోనే పల్లెవాసాలకు పంపించే ఆచారం ఉండేది. పల్లె వాతావరణంలో పిల్లలు ఆరోగ్యంగా, ఆహ్లాదంగా, స్వేచ్ఛగా పెరుగుతారని, అంతేగాక పల్లెవాసుల భాష నాగరికుల భాషకంటే స్వచ్ఛంగా, నిర్మలంగా, కల్లాకపటం లేకుండా ఉంటుందని, తమ పిల్లలు స్వచ్ఛమైన అరబీ భాష నేర్చుకోవాలన్న ఉద్దేశంతో పల్లెసీమలకు పంపేవారు.
పల్లె పట్టులనుండి ఎంతోమంది ఆయాలు గంపెడాశలతో మక్కాకు చేరుకున్నారు. నిప్పులు కురిసే ఎండ, ఎడారి మార్గం. పైగా దూరతీరాల ప్రయాణం. మంచివాహనం ఉన్నవాళ్లు వడివడిగా పట్నం చేరుకొని, సంపన్నుల బిడ్డలను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంటే, హలీమా, హారిస్ దంపతులు బక్కచిక్కిన వాహనంపై ఆశనిరాశల మధ్య ప్రయాణం కొనసాగిస్తున్నారు.
మక్కాకు చేరుకోగానే పిల్లల సంరక్షణార్థం వచ్చిన మహిళలు సంపన్న పిల్లలకోసం గాలింపు మొదలుపెట్టారు. ముందుగా మక్కా చేరుకున్న మాటకారి మహిళలంతా తమ వాక్చాతుర్యంతో పిల్లల తల్లులను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సంతృప్తి చెందిన తల్లులు తమకు నచ్చిన ఆయాలను ఎంచుకుంటున్నారు.
కాని అందరికన్నా ఆలస్యంగా మక్కా చేరుకున్న దాయి హలీమా ఎవరి దృష్టినీ ఆకర్షించలేకపోయింది. తన వాహనమే కాదు, స్వయంగా తన తన బాహ్య ఆకారమూ బలహీనంగానే ఉంది మరి. ఇలాంటి బలహీన మహిళ తమ పిల్లల ఆలనా పాలన ఎలా చూడగలుగుతుంది?
ఎముకలగూడులాంటి ఆ బలహీన దేహంలో పాలెక్కడుంటాయి? అందుకే తల్లులెవరూ హలీమాకు తమ పిల్లల్ని అప్పగించడానికి ముందుకు రాలేదు.
అటు అమినా తనయుడి పరిస్థితి కూడా అలాగే ఉంది, పుట్టక ముందే తండ్రి నీడను కోల్పోయి అనాథగా మిగిలిన ముహమ్మద్‌ను పెంచడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. కలిగిన వారైతే కానుకలు దండిగా వస్తాయని, పాపం అనాథ తల్లి నుండి ఏమి ఆశించగలమని ఎవరికి వారు వెనక్కి తగ్గారు.
ఆయాలంతా సంపన్నుల బిడ్డలను దక్కించుకొని మురిసిపోతూ ఇంటి ముఖం పట్టారు.తన బాబును తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాకపోవడం ఆమినాను తీవ్రంగా కలచివేసింది. ‘తన బిడ్డ తండ్రి నీడ కోల్పోయిన అభాగ్యుడు. అందుకే ఎవరూ ముందుకు రాలేదు.’ అనుకుంటూ భర్త జ్ఞాపకాలను తలుచుకొని కుమిలిపోతున్నారు ఆమినా.
అంతలో ‘అమ్మా! మీ బాబును నాకప్పగించండమ్మా! శాయశక్తులా సంరక్షిస్తానమ్మా’! అంటూ ముందుకొచ్చింది హలీమా.
హలీమా మాటలతో అడుగంటిన ఆశలు చిగురించాయి ఆమినాలో.
- యం.డి. ఉస్మాన్‌ఖాన్
(వచ్చేవారం మరికొన్ని విశేషాలు)
ముహమ్మద్‌కు పాలుపట్టే అదృష్టం
Published Sun, Dec 27 2015 5:07 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM
Advertisement
Advertisement