ఇస్లాం/ప్రవక్త జీవితం
అసలే తండ్రి నీడలేని బిడ్డ. ఇప్పుడు తను కూడా దూరమైతే బిడ్డ ఏమైపోతాడో అన్న ఆలోచనలు ఆమె గుండెను మెలిపెడుతున్నాయి.
మక్కా చంద్రుడు మదీనాలో కనువిందు చేస్తున్నాడని, అతని నుదుటి భాగాన ప్రగతీ వికాసాల అదృష్టజ్యోతి దేదీప్యమానంగా ప్రకాశిస్తోందని ప్రజలు వింతగా చెప్పుకోవడం ప్రారంభించారు. అమృతభరితమైన ఆ చిన్నారి ముద్దుముద్దు పలుకులు జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మదీనా పిల్లలకు కాస్త సంస్కారం తక్కువ. అల్లరి చిల్లరగా ప్రవర్తించేవారు. వారి ఆటపాటల్లో ఆ అల్లరితనం కొట్టవచ్చినట్లు కనబడేది. కాని చిన్నారి ముహమ్మద్ (స)కు అలాంటి చౌకబారు ఆటల పొడే గిట్టేది కాదు. అయితే ఎవరైనా విలువిద్య సాధన చేస్తుంటే శ్రద్ధకనబరిచేవారు. కోనేటిలో ఈతకొట్టడానికి ఆసక్తి కనబరిచేవారు.
ఈ విధంగా మదీనాలో ఓ నెల రోజులపాటు గడిపిన తరువాత, భర్త సమాధిని దర్శించుకొని తిరుగుప్రయాణమవ్వాలని నిర్ణయించుకున్నారు ఆమినా. మార్గమధ్యంలో ‘అబ్ వా’ అనే చోట అబ్దుల్లా సమాధి ఉంది. భర్త సమాధిని చూస్తూనే ఇన్నాళ్లూ కడుపులో దాచుకున్న దుఃఖం ఒక్కసారిగా పెల్లుబికింది. అప్పుడప్పుడే కాస్త మానుతున్న మనోగాయం మళ్లీ పచ్చి పుండుగా మారిపోయింది. వాతావరణం మార్పో, ప్రయాణ బడలికో, మనోవేదనో ఏదైతేనేం ఆమినా ఆరోగ్యం ప్రభావితమైంది. రోజురోజుకూ జ్వరతీవ్రత అధికం కాసాగింది. వెంట ఉన్న పరిచారిక శక్తివంచన లేకుండా సేవలందిస్తూనే ఉంది. ఆ కాలంలో అబ్ వా పరిసరాల్లోనే కాదు, యావత్తు అరేబియాలోనే వైద్యశాలలు లేవు. ఎవరికి ఎలాంటి వ్యాధిసోకినా నాటుమందులు, మంత్రతంత్రాలను ఆశ్రయించేవారు. ఇప్పుడు ఆమినాకు ప్రాణభయంకన్నా, తనకేమైనా అయితే బిడ్డ పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఎక్కువైంది. తనేమైపోయినా ఫరవాలేదు. తన బిడ్డ క్షేమంగా ఉండాలి. అదీ తనక్కావలసింది.
ఉమ్మెమన్ ఆమెలో ధైర్యాన్ని నూరిపోయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ‘అమ్మా! కొత్త వాతావరణం, కొత్త నీరు, కొత్త గాలి తదితర కారణాలవల్ల ఇలా జరిగింది. మీరు ఆందోళన చెందకండి. రెండు మూడు రోజుల్లో మీ ఆరోగ్యం తప్పకుండా కుదుటపడుతుంది. నా మాట నమ్మండి’. కాని ఆమినాకు ఇవేమీ అర్థం కావడం లేదు. అసలే తండ్రి నీడలేని బిడ్డ. ఇప్పుడు తను కూడా దూరమైతే , బిడ్డ ఏమైపోతాడో అన్న ఆలోచనలు ఆమె గుండెను మెలిపెడుతున్నాయి. అవును. నిజమే! తల్లిదండ్రులు లేని లోటును ఎవరు మాత్రం ఎలా తీర్చగలరు? ఎంత ప్రేమ చూపించినా అది తల్లిదండ్రుల ప్రేమకు సాటిరానేరాదు.
- యం.డి. ఉస్మాన్‌ఖాన్
(వచ్చేవారం మరికొన్ని విశేషాలు)
అనారోగ్యంలో ముహమ్మద్ తల్లి
Published Sat, Jan 30 2016 11:15 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM
Advertisement