శుభాల పర్వం ప్రారంభమైంది! | islam special story | Sakshi
Sakshi News home page

శుభాల పర్వం ప్రారంభమైంది!

Published Sun, Jan 10 2016 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

islam special story

• ఇస్లాం

 చిన్నారి ముహమ్మద్ (స)దాయీ హలీమా ఒడిలోకి రాగానే ఆమె అదృష్టానికి అంతులేకుండా పోయింది. హలీమా పుణ్యమా అని ఆమె తెగ బనూసయ్యద్ రూపురేఖలు కూడా మారిపోయాయి.
 
 హలీమా ఇంత తొందరగా ఇంటికి తిరిగి రావడం చూసి, అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. కదులుతున్న ఎముకల గూడులా ఉన్న హలీమా ఒంటె, ఎప్పుడు గుటుక్కుమంటుందోనని అందరూ అనుకుంటుంటే, ఏకంగా రెక్కలే మొలిచినట్లు, వాయువేగంతో తిరిగిరావడం వారికి మింగుడుడలేదు. ఇదే విషయం కొందరు మహిళలు హలీమా వద్ద ప్రస్తావించగా... ‘అవునమ్మా! ఇదంతా మీరు ‘అనాథ’ అని ఎగతాళి చేసిన ఈ చిన్నారి బాలుని శుభాల ఫలం.
 
  దైవసాక్షి! ఇక నుండి మన ఊరి రూపురేఖలే మారిపోనున్నాయి. అది మన అదృష్టం’ అన్నది హలీమా మురిసిపోతూ. చిన్నారి ముహమ్మద్ (స) హలీమా ఇంట పాదం మోపుతూనే శుభాల పర్వం ప్రారంభమైంది. ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఎముకల గూడులా చిక్కి శల్యమైన ఒంటె బాగా ఒళ్లు చేసింది. పొదుగు పాలతో నిండిపోయింది. ఎప్పుడూ చుక్క పాలు కూడా లేని ఒంటె పొదుగులో అన్నన్ని పాలు చూసి భార్యాభర్తలిద్దరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ముందుగా ఆశ్చర్యం నుండి తేరుకున్న హలీమా భర్త వెంటనే పాలు పితికి కడుపునిండా తాగాడు. తరువాత భార్యకూ ఇచ్చాడు.
 
 ‘హలీమా! ఇదంతా ఏదో మాయలా ఉంది. నా కళ్లను నేనే నమ్మలేకపోతున్నాను. ఇది కలా, నిజమా!’ అన్నాడు హలీమా భర్త ఈ వింతలు చూస్తూ. ‘అప్పుడే ఏం చూశావయ్యా! కాస్త ఓపిక పట్టు. ఇప్పుడే కదా ఈ చిన్నారి ముహమ్మద్ (స) శుభాలపర్వం మొదలైంది. ముందు ముందు మరెన్ని అద్భుతాలు చూస్తామో! ఇక నుండి మన బాధలు, కష్టాలన్నీ దూరమైనట్లే. ఏమో అనుకున్నాం కాని, మనమెంత అదృష్టవంతులమో!’ అననది హలీమా ఆనందంతో పొంగిపోతూ.

 ఈవిధంగా, చిన్నారి ముహమ్మద్ (స)దాయీ హలీమా ఒడిలోకి రాగానే ఆమె అదృష్టానికి అంతులేకుండా పోయింది. హలీమా పుణ్యమా అని ఆమె తెగ బనూసయ్యద్ రూపురేఖలు కూడా మారిపోయాయి. చిన్నారి ముహమ్మద్ రాకతో మిగతా తెగలన్నింటిలో కలికితురాయిగా వెలిగిపోతూ, కీర్తిశిఖరాలనందుకుంటోంది సయ్యద్ తెగ.
 
 హలీమా తనపాలలో ప్రేమానురాగాలను రంగరించి చిన్నారి ముహమ్మద్‌కు తాగిస్తోంది. ఈ విధంగా, ఈ చిన్నారి ముహమ్మదే లోకంగా రెండేళ్లు గడిచాయి. ఒకరోజు దాయీ హలీమా చిన్నారి ముహమ్మద్‌ను ఒళ్లో కూర్చోబెట్టుకొని ఆడిస్తోంది. ఆ సమయాన అబీసీనియాకు చెందిన ఒక క్రైస్తవ బృందం అటుగా వెళుతూ హలీమా ఒళ్లో ఆడుకుంటున్న చిన్నారి ముహమ్మద్‌ను చూసింది. అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బాలుని చూసి, ‘ఈ పిల్లాడు ఎవరు? పేరేమిటి?’ అంటూ ఆరా తీసింది కుతూహలంగా.
 
                 - యం.డి. ఉస్మాన్‌ఖాన్
                 (వచ్చేవారం మరికొన్ని విశేషాలు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement