తాతయ్య సంరక్షణలో చిన్నారి ముహమ్మద్ బాధను మరచిపోయి దైనందిన జీవితానికి అలవాటు పడుతున్నారు. అప్పుడప్పుడూ అమ్మ జ్ఞాపకాలు ఆ పసి హృదయాన్ని కలచివేస్తూ ఉండేవి. అయితే తాతయ్య అందిస్తున్న ప్రేమానురాగాలు, ముద్దుముచ్చట్ల కారణంగా త్వరగానే యథాస్థితికి చేరుకునేవాడు.
అబ్దుల్ ముత్తలిబ్ అనుక్షణం ఆయన్ని కనిపెట్టుకొని ఉంటూ, ఏ లోటూ రాకుండా చూసుకునేవారు.
దేవుని లీల ఏమిటో గాని, అమ్మ పోయిన ఏడాదికే ఆ పసిప్రాణంపై మరో విపత్తు వచ్చి పడింది. మనుమణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటున్న అబ్దుల్ ముత్తలిబ్ జబ్బున పడ్డారు. ఎన్ని చికిత్సలు చేయించినా ఆరోగ్యం కుదుట పడలేదు. వృద్ధాప్యం లో వచ్చిన జబ్బు వదిలిపెట్టిపోతుందా? శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోయింది పెద్దాయనకు. కొడుకులు, కోడళ్లు, బంధుమిత్రులు, ఇరుగుపొరుగు అంతా చుట్టూ మూగారు. చిన్నారి ముహమ్మద్ (స) అయితే తాతయ్య మంచాన్ని వదలడం లేదు. అమాయకత్వం ఉట్టిపడే ఆ పసి మోముపై దుఃఖవిచారాలు ప్రస్ఫుటమవుతున్నాయి. అలా చూస్తూచూస్తూనే అబ్దుల్ ముత్తలిబ్ శ్వాస శాశ్వతంగా ఆగిపోయింది.
‘తాతయ్యా! నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయావా?’ అంటూ చిన్నారి ముహమ్మద్ (స) మళ్లీ బోరుమన్నాడు. రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడిపోయాడు. ఆ చిన్నారిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.
అందరి వదనాల్లో ఆందోళన, బాధ, విచారం, విషాదం. ‘అయ్యో! ఎంతపని జరిగిపోయింది. ఇక ఆ చిన్నారిని ఎవరు చూసుకుంటారు? అమ్మానాన్నా ఇద్దరూ లేరు. అల్లారుముద్దుగా చూసుకునే తాతయ్య కూడా వెళ్లిపోయాడు. ఈ అనాథ బాబుకు ఇక దిక్కెవరు?మానవ సహజమైన ఇలాంటి సానుభూతి వ చనాలు అక్కడ గుమికూడిన వారి నోట వెలువడుతున్నాయి. కాని దైవం భావిజగతికి దిక్సూచిగా తయారు చెయ్యదలచిన వ్యక్తిని అలానే వదిలేస్తాడా? వెంటనే బాబాయి అబూతాలిబ్ చిన్నారి ముహమ్మద్‌ను తన సంరక్షణలోకి తీసుకున్నారు. ఎంతో ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు.
ఎంత దగ్గరివారైనా అనాథ పిల్లలను లోకుల మెప్పుకోసమే ప్రేమిస్తారని, సహజసిద్ధమైన ప్రేమానురాగాలు వారి మనసుల్లో ఉండవని, సహజంగా సమాజంలో ఉన్న అభిప్రాయం తప్పని అబూతాలిబ్ చాలా కొద్దికాలంలోనే నిరూపించారు. -ఎండీ ఉస్మాన్‌ఖాన్
మక్కా నగరమంతా విషాదంలో మునిగిపోయి ఉంది. ఊరికి పెద్ద దిక్కు, కాబా గృహం ధర్మకర్త అయిన అబ్దుల్ ముత్తలిబ్ పార్థివ దేహాన్నికడసారి చూసుకోవడానికి జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు.
(మిగతావచ్చేవారం)