md Usmankhan
-
పినతండ్రి ప్రేమను పొందిన పసివాడు
తాతయ్య సంరక్షణలో చిన్నారి ముహమ్మద్ బాధను మరచిపోయి దైనందిన జీవితానికి అలవాటు పడుతున్నారు. అప్పుడప్పుడూ అమ్మ జ్ఞాపకాలు ఆ పసి హృదయాన్ని కలచివేస్తూ ఉండేవి. అయితే తాతయ్య అందిస్తున్న ప్రేమానురాగాలు, ముద్దుముచ్చట్ల కారణంగా త్వరగానే యథాస్థితికి చేరుకునేవాడు. అబ్దుల్ ముత్తలిబ్ అనుక్షణం ఆయన్ని కనిపెట్టుకొని ఉంటూ, ఏ లోటూ రాకుండా చూసుకునేవారు. దేవుని లీల ఏమిటో గాని, అమ్మ పోయిన ఏడాదికే ఆ పసిప్రాణంపై మరో విపత్తు వచ్చి పడింది. మనుమణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటున్న అబ్దుల్ ముత్తలిబ్ జబ్బున పడ్డారు. ఎన్ని చికిత్సలు చేయించినా ఆరోగ్యం కుదుట పడలేదు. వృద్ధాప్యం లో వచ్చిన జబ్బు వదిలిపెట్టిపోతుందా? శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోయింది పెద్దాయనకు. కొడుకులు, కోడళ్లు, బంధుమిత్రులు, ఇరుగుపొరుగు అంతా చుట్టూ మూగారు. చిన్నారి ముహమ్మద్ (స) అయితే తాతయ్య మంచాన్ని వదలడం లేదు. అమాయకత్వం ఉట్టిపడే ఆ పసి మోముపై దుఃఖవిచారాలు ప్రస్ఫుటమవుతున్నాయి. అలా చూస్తూచూస్తూనే అబ్దుల్ ముత్తలిబ్ శ్వాస శాశ్వతంగా ఆగిపోయింది. ‘తాతయ్యా! నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయావా?’ అంటూ చిన్నారి ముహమ్మద్ (స) మళ్లీ బోరుమన్నాడు. రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడిపోయాడు. ఆ చిన్నారిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. అందరి వదనాల్లో ఆందోళన, బాధ, విచారం, విషాదం. ‘అయ్యో! ఎంతపని జరిగిపోయింది. ఇక ఆ చిన్నారిని ఎవరు చూసుకుంటారు? అమ్మానాన్నా ఇద్దరూ లేరు. అల్లారుముద్దుగా చూసుకునే తాతయ్య కూడా వెళ్లిపోయాడు. ఈ అనాథ బాబుకు ఇక దిక్కెవరు?మానవ సహజమైన ఇలాంటి సానుభూతి వ చనాలు అక్కడ గుమికూడిన వారి నోట వెలువడుతున్నాయి. కాని దైవం భావిజగతికి దిక్సూచిగా తయారు చెయ్యదలచిన వ్యక్తిని అలానే వదిలేస్తాడా? వెంటనే బాబాయి అబూతాలిబ్ చిన్నారి ముహమ్మద్‌ను తన సంరక్షణలోకి తీసుకున్నారు. ఎంతో ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు. ఎంత దగ్గరివారైనా అనాథ పిల్లలను లోకుల మెప్పుకోసమే ప్రేమిస్తారని, సహజసిద్ధమైన ప్రేమానురాగాలు వారి మనసుల్లో ఉండవని, సహజంగా సమాజంలో ఉన్న అభిప్రాయం తప్పని అబూతాలిబ్ చాలా కొద్దికాలంలోనే నిరూపించారు. -ఎండీ ఉస్మాన్‌ఖాన్ మక్కా నగరమంతా విషాదంలో మునిగిపోయి ఉంది. ఊరికి పెద్ద దిక్కు, కాబా గృహం ధర్మకర్త అయిన అబ్దుల్ ముత్తలిబ్ పార్థివ దేహాన్నికడసారి చూసుకోవడానికి జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. (మిగతావచ్చేవారం) -
శుభాల పర్వం ప్రారంభమైంది!
• ఇస్లాం చిన్నారి ముహమ్మద్ (స)దాయీ హలీమా ఒడిలోకి రాగానే ఆమె అదృష్టానికి అంతులేకుండా పోయింది. హలీమా పుణ్యమా అని ఆమె తెగ బనూసయ్యద్ రూపురేఖలు కూడా మారిపోయాయి. హలీమా ఇంత తొందరగా ఇంటికి తిరిగి రావడం చూసి, అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. కదులుతున్న ఎముకల గూడులా ఉన్న హలీమా ఒంటె, ఎప్పుడు గుటుక్కుమంటుందోనని అందరూ అనుకుంటుంటే, ఏకంగా రెక్కలే మొలిచినట్లు, వాయువేగంతో తిరిగిరావడం వారికి మింగుడుడలేదు. ఇదే విషయం కొందరు మహిళలు హలీమా వద్ద ప్రస్తావించగా... ‘అవునమ్మా! ఇదంతా మీరు ‘అనాథ’ అని ఎగతాళి చేసిన ఈ చిన్నారి బాలుని శుభాల ఫలం. దైవసాక్షి! ఇక నుండి మన ఊరి రూపురేఖలే మారిపోనున్నాయి. అది మన అదృష్టం’ అన్నది హలీమా మురిసిపోతూ. చిన్నారి ముహమ్మద్ (స) హలీమా ఇంట పాదం మోపుతూనే శుభాల పర్వం ప్రారంభమైంది. ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఎముకల గూడులా చిక్కి శల్యమైన ఒంటె బాగా ఒళ్లు చేసింది. పొదుగు పాలతో నిండిపోయింది. ఎప్పుడూ చుక్క పాలు కూడా లేని ఒంటె పొదుగులో అన్నన్ని పాలు చూసి భార్యాభర్తలిద్దరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ముందుగా ఆశ్చర్యం నుండి తేరుకున్న హలీమా భర్త వెంటనే పాలు పితికి కడుపునిండా తాగాడు. తరువాత భార్యకూ ఇచ్చాడు. ‘హలీమా! ఇదంతా ఏదో మాయలా ఉంది. నా కళ్లను నేనే నమ్మలేకపోతున్నాను. ఇది కలా, నిజమా!’ అన్నాడు హలీమా భర్త ఈ వింతలు చూస్తూ. ‘అప్పుడే ఏం చూశావయ్యా! కాస్త ఓపిక పట్టు. ఇప్పుడే కదా ఈ చిన్నారి ముహమ్మద్ (స) శుభాలపర్వం మొదలైంది. ముందు ముందు మరెన్ని అద్భుతాలు చూస్తామో! ఇక నుండి మన బాధలు, కష్టాలన్నీ దూరమైనట్లే. ఏమో అనుకున్నాం కాని, మనమెంత అదృష్టవంతులమో!’ అననది హలీమా ఆనందంతో పొంగిపోతూ. ఈవిధంగా, చిన్నారి ముహమ్మద్ (స)దాయీ హలీమా ఒడిలోకి రాగానే ఆమె అదృష్టానికి అంతులేకుండా పోయింది. హలీమా పుణ్యమా అని ఆమె తెగ బనూసయ్యద్ రూపురేఖలు కూడా మారిపోయాయి. చిన్నారి ముహమ్మద్ రాకతో మిగతా తెగలన్నింటిలో కలికితురాయిగా వెలిగిపోతూ, కీర్తిశిఖరాలనందుకుంటోంది సయ్యద్ తెగ. హలీమా తనపాలలో ప్రేమానురాగాలను రంగరించి చిన్నారి ముహమ్మద్‌కు తాగిస్తోంది. ఈ విధంగా, ఈ చిన్నారి ముహమ్మదే లోకంగా రెండేళ్లు గడిచాయి. ఒకరోజు దాయీ హలీమా చిన్నారి ముహమ్మద్‌ను ఒళ్లో కూర్చోబెట్టుకొని ఆడిస్తోంది. ఆ సమయాన అబీసీనియాకు చెందిన ఒక క్రైస్తవ బృందం అటుగా వెళుతూ హలీమా ఒళ్లో ఆడుకుంటున్న చిన్నారి ముహమ్మద్‌ను చూసింది. అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బాలుని చూసి, ‘ఈ పిల్లాడు ఎవరు? పేరేమిటి?’ అంటూ ఆరా తీసింది కుతూహలంగా. - యం.డి. ఉస్మాన్‌ఖాన్ (వచ్చేవారం మరికొన్ని విశేషాలు)