పాణసమానమైన చిన్నారి ముహమ్మద్‌ను దాదికి అప్పగించడం ఇష్టం లేకపోయినా, తరతరాల నుండి వస్తున్న సంప్రదాయాన్ని పాటించవలసిందేనని సర్దిచెప్పుకున్నారు ఆమినా. బోసినవ్వులు చిందిస్తున్న చిన్నారిని తనివితీరా చూసుకొని, గుండెలకు హత్తుకున్నారు. అనంతమైన మమతానురాగాలతో ముద్దులు కురిపించారు. తరువాత బాబును ఆయా చేతుల్లో పెడుతూ.. ‘హలీమా! ఈ పసిబిడ్డ అనాథ అని బాధపడకు.
దైవసాక్షిగా చెబుతున్నా. ఈ పసిబిడ్డే ముందుముందు మహిమాన్వితుడవుతాడు. మహోజ్వల చరిత్రను సృష్టిస్తాడు’ అన్నారు దృఢనిశ్చయంతో. ‘అమ్మా! ఇక్కడికి రాకముందు సంపన్నుల బిడ్డ దొరకలేదని బాధపడ్డ మాట నిజమే. కాని నీ బిడ్డ చిరునవ్వు నా బాధను పటాపంచలు చేసింది. లోగడ నేను ఎంతోమంది పిల్లల్ని చూశాను. ఎంతోమందికి పాలు పట్టాను. కాని నీ ముద్దుల బిడ్డ మోములో ఏదో దివ్యతేజస్సు ఉంది. ఆ చిరునవ్వులో మాత్రం ఖచ్చితంగా ఏదో లక్ష్యం, ఏదో సందేశం ఉన్నట్లు అనిపిస్తోంది. నాకు ఈ రోజు కలిగినంత ఆనందం మునుపెన్నడూ కలుగలేదు. అది నేను మాటల్లో వ్యక్తం చెయ్యలేను’ అన్నది. దాయీహలీమా అమితానందపడుతూ...
ఆమె మాటలకు ఆమినా చిరునవ్వు నవ్వారు. తరువాత హలీమా ఆమినా ఆశాజ్యోతిని తన ఒడిలోకి తీసుకుంటుండగా... తన ముద్దుల బిడ్డ నుదుటిని తనివితీరా ముద్దాడారు ఆమినా. ప్రాణ సమానమైన బిడ్డ ఎడబాటు, తన హృదయేశ్వరుని మరణం వల్ల అయిన గాయాన్ని కెలికింది. అప్రయత్నంగా ఆమె కళ్లు అశృపూరితాలయ్యాయి.
హలీమా, హారిస దంపతులిద్దరూ చిన్నారి ముహమ్మద్‌ను తీసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. అబ్దుల్ ముత్తలిబ్ మక్కా పొలిమేరల వరకు తోడువెళ్లి వారిని సాగనంపుతూ...
‘‘హలీమా! బాబును అనాథగా భావించి, ఆదరణలోగాని, పోషణలోగాని ఎలాంటి లోటు రానీయకు. ఖురైష్ వంశ చరిత్రలో ఇప్పటివరకూ ఇలాంటి మహిమాన్వితమైన విశిష్ట బాలుడు జన్మించలేదు. ‘ఏదో ఒక రోజు యావత్ ప్రపంచం ముహమ్మద్ పాదాల ముందు మోకరిల్లుతుంది.’
ఇది నేనొక్కడినే చెబుతున్న మాటకాదు. అనేకమంది సాధుసన్యాసులు, యోగులు, జ్యోతిష్యులు, పండితులు చెప్పినమాట’ అన్నారు అబ్దుల్ ముత్తలిబ్ గద్గద కంఠంతో.
‘అయ్యా! తమరు నిశ్చింతగా ఉండండి. మీ మనుమడి మీద ఈగ కూడా వాలనివ్వను. దైవసాక్షిగా చెబుతున్నా. ఈ చిన్నారి కడుపారా పాలుతాగి నిద్రపోయే వరకు నేను నా బిడ్డకు కూడా పాలివ్వను. నన్ను నమ్మండి’ అన్నది హలీమా ఎంతో నమ్మకంగా.
అబ్దుల్ ముత్తలిబ్ హలీమాకు మరికొన్ని జాగ్రత్తలు చెప్పి, తనివి తీరా మనుమణ్ణి ముద్దాడి ఇంటికి తిరుగుముఖం పట్టారు.
అదేమి విచిత్రమోగాని, వచ్చేటప్పుడు ఈసురోమంటూ వచ్చిన బక్క ఒంటె, తిరుగు ప్రయాణంలో మాత్రం పరుగులాంటి నడకతో అనుకున్న సమయం కంటే ముందే గమ్యానికి చేర్చింది. అంతేకాదు, మార్గమధ్యంలో కూడా హలీమా అనేక వింతలు, విశేషాలను చూసింది. ఏదో తెలియని అనిర్వచనీయ ఆనందానుభూతులను అనుభవించింది.
లోగడ నేను ఎంతోమంది పిల్లల్ని చూశాను. ఎంతోమందికి పాలు పట్టాను. కాని నీ బిడ్డ మోములో ఏదో దివ్యతేజస్సు ఉంది. ఆ చిరునవ్వులో ఏదో లక్ష్యం, ఏదో సందేశం ఉన్నట్లు అనిపిస్తోంది. నాకు ఈ రోజు కలిగినంత ఆనందం మునుపెన్నడూ కలుగలేదు.
- యం.డి. ఉస్మాన్‌ఖాన్
(వచ్చేవారం మరికొన్ని విశేషాలు)