తలాక్‌ అంటే..? ఈ వివరాలు తెలుసా? | what is talaq in islam | Sakshi
Sakshi News home page

తలాక్‌ అంటే..? ఈ వివరాలు తెలుసా?

Published Thu, Feb 13 2025 9:56 AM | Last Updated on Thu, Feb 13 2025 10:33 AM

what is talaq in islam

 ఇస్లాం వెలుగు

దివ్య ఖుర్‌ఆన్‌ ఇలా చెబుతోంది...
తమ భార్యలను ముట్టుకోము అని ఒట్టు పెట్టుకునే వారికి నాలుగు నెలల గడువు ఉంటుంది. 2:226వివరణ: పండితుల ప్రకారం షరిఅత్‌ పరిభాషలో దీనిని ‘ఈలా’ అని అంటారు. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ సుహృద్భావ పూర్వకంగా ఉండవు. అపశ్రుతులు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ ఉభయలు చట్టబద్ధంగానైతే దాంపత్య బంధంలోనే ఉంటూ క్రియాత్మకంగా ఇద్దరు భార్యాభర్తలు కానట్టుగానే వేరుగా మసులుకునేటటువంటి విధానాన్ని దైవ శాసనం (షరిఅత్‌) ఇష్టపడదు. ఇలాంటి అపసవ్యత కొరకు అల్లాహ్‌ నాలుగు నెలలు గడువు నిర్ణయించాడు. ఈ మధ్యకాలంలో వారు తమ సంబంధాలను సరి చేసుకోవాలి లేదా దాంపత్య బంధాన్నైనా తెంచి వేయాలి. అప్పుడైనా ఆ ఇరువురు పరస్పరం స్వేచ్ఛ   ఉంది తమకు కుదురుగా ఉన్న వారితో పెళ్లి చేసుకోగలరు. 

తన భార్యతో దాంపత్య సంబంధం కలిగి ఉండనని భర్త ఒట్టు పెట్టుకున్న సందర్భానికే ఈ ఆదేశం వర్తిస్తుంది. పోతే ఒట్టు పెట్టుకోకుండా భార్యతో సంబంధాలను తెంచుకునే సందర్భంలోనయితే– అలా ఎంత కాలం సాగినా ఈ ఆదేశం దానికి అతకదని ఈ (ఆయత్‌) వాక్యం ఉద్దేశం.

మరొక విషయం ఏమిటంటే ప్రమాణం చేసినా, చేయకపోయినా రెండు సందర్భాల్లోనూ బంధాన్ని విరమించుకుంటే దానికి గడువు కాలం ఈ నాలుగు మాసాలే. ఈ ఆదేశం కేవలం ఏవైనా మనస్పర్ధల వల్ల ఏర్పడే సంబంధాల ప్రతిష్టంబనకు వర్తిస్తుంది. కానీ మరేదైనా కారణంగా భర్త భార్యతో శారీరక సంబంధాన్ని విరమించుకుంటే సాధారణ సంబంధాలు సుహృద్భావ పూర్వకంగా కొనసాగే పక్షంలో ఈ ఆదేశం వర్తించదు. అయితే కొందరు ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాన్ని తెంచివేసే ఏ ప్రమాణమైన సరే అది ఇలా పరిగణించబడుతుంది. ఇది నాలుగు నెలలకు పైగా నిలవరాదు. ఇష్టంలేని పక్షంలోనైనా ఇష్టపూర్వకంగానైనా సరే.

ఒకవేళ వారు వెనక్కి మరలినట్లయితే అల్లాహ్‌ క్షమించేవాడు, దయ చూపేవాడు: 2:227
కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం ఈ గడువు లోపల తమ ప్రమాణాన్ని భగ్ననపరిచి తిరిగి దాంపత్య సంబంధాలను పునరుద్ధరించుకుంటే వారికి ప్రమాణ భంగం చేసినందుకు  ప్రాయశ్చిత్తం లేదు. అల్లాహ్‌ అట్టే క్షమించి వేస్తాడు.

మరికొంతమంది పండితుల అభిప్రాయంలో ప్రమాణభంగానికి  ప్రాయశ్చిత్తం చెల్లించవలసి ఉంటుంది. వారనేది ఏమిటంటే దేవుడు ‘గఫూరుర్రహీం’ (మన్నించేవాడు కరుణించేవాడు) అన్న విషయానికి భావం ప్రాయశ్చిత్తం మాఫీ జరిగిందని కాదు మీ ప్రాయశ్చితాన్ని స్వీకరిస్తాడని, సంబంధ విరామ కాలంలో ఇరువురు పరస్పరం చేసుకున్న అన్యాయాన్ని మన్నించి వేయడం జరుగుతుందని మాత్రమే.

– మొహమ్మద్‌ అబ్దుల్‌ రషీద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement