తలాక్‌పై దుష్ప్రచారం వివక్షే..!
సందర్భం
తలాక్ ముసుగులో ముస్లిం మహిళల స్థితిగతులను సంస్కరించదలుస్తున్న ఎవరైనా సరే దేశంలోని భర్తలు వదిలేసిన 23 లక్షల మంది మహిళల బాధలను పట్టించుకుంటే మంచిది. వీరిలో 19 లక్షలమంది హిందూ సోదరీమణులే అనేది మర్చిపోవద్దు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కలసి ప్రజల మనస్సులను ఏమార్చడంలో ఆరితేరిపోతున్నారు ‘గత 65 ఏళ్లుగా ముస్లిం సమాజంలో సంస్కరణల లేమి వల్ల ముస్లిం మహిళలు సామాజికంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు’ అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటూ 2016 అక్టోబర్ 7న సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ అక్టోబర్ 24న బుందేల్‌ఖండ్‌లో పరివర్తన్ మహార్యాలీలో ప్రసంగిస్తూ ‘ఎవరైనా ఫోన్ ద్వారా తలాక్, తలాక్, తలాక్ అని చెప్పగానే వారి జీవితం ధ్వంసం కావడానికి నా ముస్లిం సోదరిలు చేసిన నేరం ఏమిటి?’ అని ప్రశ్నించారు.
ఇతర మతాలకు చెందిన సోదరీమణులతో పోలిస్తే ముస్లిం మహిళల స్థితి దుర్భరంగా ఉందని కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్, ప్రధాని ప్రసంగం ప్రకటిస్తున్నాయి. కానీ జనాభా లెక్కలకు చెందిన మత సామాజిక బృంద వివాహ స్థితి, సెక్స్–2011 సి–3 పట్టిక మరొక విధంగా సూచి స్తోంది. హిందూ (86.2 శాతం), క్రిస్టియన్ (83 శాతం), ఇతర మతాల (85.8 శాతం) మహిళలతో పోల్చి చూస్తే వివాహ జీవితంలో కొనసాగుతున్న ముస్లిం మహిళల శాతం అత్యధికంగా 87.8 శాతం ఉంటోందని ఈ పట్టిక తెలిపింది. విడిపోయిన, భర్తలు వదిలేసిన మహిళల శాతం ముస్లింలలో కనిష్టంగా అంటే 0.49 శాతంగా ఉండగా హిందువులలో 0.69 శాతం, క్రైస్తవులలో 1.19 శాతం, ఇతర మతపరమైన మైనారిటీలలో 0.68 శాతంగా ఉంటూండటం గమనార్హం.
వాస్తవాలు ఇలా ఉండగా మూడుసార్లు తలాక్ అనే అంశాన్ని ప్రభుత్వం, మీడియా సంచలనాత్మక ధోరణితో చూస్తూ ముస్లిం సమాజంలో తలాక్ విస్తృతస్థాయిలో ఉందని ప్రచారం చేస్తున్నట్లుంది. దేశంలో 34 కోట్ల మంది వివాహిత మహిళల్లో 9.1 లక్షల మంది మహిళలు విడాకులు తీసుకున్నారని, వారిలో ముస్లిం మహిళల సంఖ్య 2.1 లక్షలేనని సెన్సెస్ డేటా సూచిస్తోంది. విడాకులు తీసుకున్న మహిళల సంఖ్య హిందువులలో 0.22 శాతం, క్రైస్తవులలో 0.47 శాతం, ఇతర మతపరమైన మైనారిటీలలో 0.33 శాతంగా ఉండగా ముస్లిం మహిళల సంఖ్య కాస్త ఎక్కువగా 0.49 శాతం మేరకు ఉందని తెలుస్తోంది.
ఇస్లాంలో రెండు రకాల విడాకులు ఉన్నాయి. భార్య విడాకులకు చొరవ చేస్తే ‘ఖులా’ అని భర్త విడాకులు ప్రతిపాదిస్తే ‘తలాక్’ అని అంటారు. ముస్లిం మహిళ తనకు తానుగా వివాహం రద్దు చేసుకునే హక్కును ఖులా కల్పిస్తోంది. సర్వే ప్రకారం ముస్లిం మహిళల విడాకుల్లో 59 శాతం ఖులా ద్వారా జరుగుతుండగా, 41 శాతం తలాక్ ద్వారా జరుగుతున్నాయని తెలుస్తోంది. మూడుసార్లు తలాక్ అనేది భర్త వైపు నుంచి జరిగే తలాక్‌కి చెందిన ఒక రూపం. హైదరాబాద్‌లో ‘ఖులా’ లేక ‘తలాక్’ అమలుపై అధికారం ఉన్న అయిదుగురు క్వాజీలను సర్వే నిర్వహించిన రచయితలు సంప్రదించారు. వారు చెప్పినదాని ప్రకారం 7 నుంచి 25 ఏళ్ల వారి అనుభవంలో 460 విడాకుల ఘటనలు జరగగా, 275 విడాకులు ఖులా రూపంలో, 162 విడాకులు తలాక్ రూపంలోనూ జరిగాయని, 23 విడాకులు మాత్రమే మూడుసార్లు తలాక్ రూపంలో చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. అంటే మూడుసార్లు తలాక్‌కి చెందిన ఘటనలు అరుదుగా జరిగాయన్నమాట.
పైగా, అరుదుగానైనా సరే.. దురదృష్టవశాత్తూ చోటు చేసుకున్న అలాంటి విడాకుల సందర్భంలో కూడా ముస్లిం సమాజం చాలావరకు బాధితురాలి వైపునే నిలిచినట్లు దాఖలాలున్నాయి. సుప్రీంకోర్టు, ముస్లిం మహిళా చట్టం, గృహహింస చట్టం వంటి వాటి ద్వారా ముస్లిం మహిళలు న్యాయం పొందుతున్నారు కూడా. కాబట్టి నరేంద్రమోదీ, భారత ప్రభుత్వం అత్యంత స్వల్ప స్థాయిలో ఉన్న ఈ మూడుసార్లు తలాక్ బాధితుల సమస్యపట్ల ప్రదర్శిస్తున్న తీవ్ర ఆతృతను నిలిపివేసి, 4 కోట్ల 30 లక్షలమంది వితంతువులు, 23 లక్షలమంది విడాకులు తీసుకున్న మహిళల సమస్యలను చిత్తశుద్ధితో పట్టించుకుంటే మంచిది.
అత్యున్నత స్థాయిలోని ప్రధానమంత్రి భార్య లేదా దారిద్య్రంలో చిక్కుకున్న కడు నిరుపేద భార్య.. ఎవరైనా సరే.. భర్త నుంచి వేరైపోయిన ప్రతి మహిళ పరిస్థితీ దుర్భరంగానే ఉంటుంది. తమ భర్తతోటే జీవించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ వారినుంచి ఒక్క పిలుపు వస్తే చాలని ఎదురు చూస్తుంటారు. గత 43 ఏళ్లుగా నరేంద్రమోదీతో కలసి జీవించనప్పటికీ, ఆయన శ్రీమతి యశోదాబెన్ మోదీ 2014 నవంబర్ 24న మీడియాతో మాట్లాడుతూ ‘ఆయన ఒక్కసారి పిలిస్తే చాలు తన వద్దకు వెళతాను’ అన్నారు. కానీ ఆమె భర్త ఎన్నడూ స్పందించలేదు. ప్రధానమంత్రి భార్య అయినా సరే.. భర్త వదిలివేస్తే ఆమెకు పాస్‌పోర్టు కూడా దొరకదు. 2015లో యశోదాబెన్ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేస్తే దాన్ని తిరస్కరించారు.
ఇలాంటి మహిళల బాధాకరమైన జీవితాలు చూసిన తర్వాత ఏ సోదరుడైనా తన సోదరి యశోదాబెన్లా జీవిం చాలని కోరుకుంటాడా? మూడుసార్లు తలాక్ ముసుగులో ముస్లిం మహిళల స్థితిగతులను సంస్కరించాలని ప్రయత్నిస్తున్న ఎవరైనా సరే దేశంలోని భర్తలు వదిలేసిన 23 లక్షల మంది మహిళల బాధలను కాస్త లోతుగా తెలుసుకుంటే మంచిది. వీరిలో 19 లక్షలమంది హిందూ సోదరీమణులే అనేది కూడా మర్చిపోవద్దు. కాబట్టి పడికట్టు మాటలకు దూరంగా, వాస్తవాలపై దృష్టి సారించి ప్రధాని మోదీ చేతల్లో చర్యలు చూపించాలి. అలాగే మైనారిటీలను ప్రత్యేకించి ముస్లింలను లక్ష్యంగా చేసుకోవటం మానుకోవాలి.
(వ్యాసకర్త సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్
మొబైల్ : 98852 08187)