తొలి ‘తలాక్‌’ కేసు | Implementation of Muslim Women Marriage Security Act 2019 | Sakshi
Sakshi News home page

తొలి ‘తలాక్‌’ కేసు

Published Thu, Oct 24 2019 3:28 AM | Last Updated on Thu, Oct 24 2019 5:29 AM

Implementation of Muslim Women Marriage Security Act 2019 - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ముస్లిం మహిళలకు వివాహ భద్రతను కల్పించే చట్టం అమల్లోకి వచ్చిన తరువాత తెలంగాణలో తొలి కేసు కరీంనగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది. ఈ ఏడా ది జూలై 31న చట్టం అమలులోకి రాగా.. సరిగ్గా 15 రోజులకు తన భర్త అదనపు కట్నం తేలేదనే సాకుతో ట్రిపుల్‌ తలాక్‌ చెప్పినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు ఆగస్టు 14న ఇన్‌స్పెక్టర్‌ పి.దామోదర్‌రెడ్డి కేసు నమోదు చేశారు.  

పెళ్లయిన మూడేళ్లకే... 
కరీంనగర్‌ జిల్లా ఆదర్శనగర్‌కు చెందిన ముస్లిం మహిళకు 2016లో జగిత్యాలకు చెందిన మీర్‌ ఖాజా అఫ్సరుద్దీన్‌తో వివాహమైంది. దుబాయిలో డ్రైవర్‌గా పనిచేస్తున్న అఫ్సరుద్దీన్‌కు వివాహం జరిపించారు. మూడు నెలల తర్వాత భార్యను దుబాయికి తీసుకెళ్లాడు. అక్కడ భర్తకు చేదోడుగా ఈ మహిళ కూడా ఉద్యోగం చేసింది. వీరికి 8 నెలల వయసున్న బాబు ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో భార్యతో కలసి అఫ్సరుద్దీన్‌ జగిత్యాల వచ్చాడు. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం అఫ్సరుద్దీన్, అతని కుటుంబసభ్యులు వేధించడం ప్రారంభించారు. రూ.10 లక్షలు కట్నంగా తేవాలని, లేదంటే ‘తలాక్‌’చెబుతామని బెదిరించారు. కట్నం తేవడానికి మహిళ ఒప్పుకోకపోవడంతో ‘ముమ్మారు తలాక్‌’ చెప్పి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు.  

ధైర్యంగా ముందుకొచ్చిన ముస్లిం మహిళ 
మూడేళ్లు కాపురం చేసి అదనపు కట్నం తేలేదనే కారణంగా ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి బయటకు పంపడంతో సదరు మహిళ ఆగస్టు 14న కరీంనగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో అఫ్సరుద్దీన్, ఇతర కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 498(ఎ), సెక్షన్‌–4 ఆఫ్‌ డీపీ యాక్ట్, సెక్షన్‌ 4 ఆఫ్‌ ముస్లిం మహిళ వివాహ భద్ర త హక్కు చట్టం కింద కేసులు నమోదు చేశారు. అఫ్సరుద్దీన్‌ను ఆగస్టు 27న రిమాండ్‌ చేసి, కుటుంబసభ్యులకు అరెస్టు నోటీస్‌ జారీ చేశారు. కాగా కరీంనగర్‌లో నమోదైన ఈ తలాక్‌ కేసులో చార్జిషీటు దాఖలు చేసేందుకు కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌కు ప్రతిపాదన పంపినట్లు ఇన్‌స్పెక్టర్‌ ‘సాక్షి’కి తెలిపారు. కమిషనర్‌ అనుమతి రాగానే చార్జిïÙటు దాఖలు చేస్తామని చెప్పారు. 

మూడేళ్ల వరకు జైలు, జరిమానా 
ముస్లిం వర్గానికి చెందిన భర్త తన భార్యకు నోటి మాటగా గానీ, రాత ద్వారా గానీ, ఎలక్ట్రానిక్‌ సాధనాల ద్వారా లేదా ఇంకేరకంగానైనా ‘తలాక్‌’ను వాడడం అక్రమం అని ముస్లిం మహిళ వివాహ భద్రత చట్టం–2019 (యాక్ట్‌ నంబర్‌ 20 ఆఫ్‌ 2019) చాప్టర్‌–2లో పొందుపరచబడింది. ఎవరైనా ముస్లిం భర్త ‘తలాక్‌’పదాన్ని అతని భార్యపై ప్రయోగిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.  

తలాక్‌ చెప్పడంతో చట్టాన్ని ఆశ్రయించా 
నా వివాహం సమయంలో సంప్రదాయ పద్ధతిలో లాంఛనాలు అందించాం. మా తల్లిదండ్రులు వరకట్నంతోపాటు బంగారం, ఫర్నిచర్‌ ఇచ్చారు. మరో పది లక్షల రూపాయలు తీసుకురావాలని నా భర్త మీర్‌ఖాజా అఫ్సరుద్దీన్‌తోపాటు అతని కుటుంబ సభ్యులు వేధించారు. అడిగిన కట్నం తేనందుకు ముమ్మారు తలాక్‌ చెప్పడంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. చట్ట ప్రకారం నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా.    
– బాధిత మహిళ

తెలంగాణలో తొలి కేసు  
ముస్లిం మహిళ ఫిర్యాదు మేరకు మూడుసార్లు తలాక్‌ చెప్పడాన్ని నేరంగా పరిగణించి ‘ముస్లిం మహిళ (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ ఆన్‌ మ్యారేజ్‌) యాక్టు – 2019’ప్రకారం కేసు నమోదు చేశాం. ట్రిపుల్‌ తలాక్‌ యాక్టు అమలులోకి వచి్చన తర్వాత నమోదైన మొదటి కేసు ఇది. ముస్లిం వర్గానికి చెందిన బాధిత మహిళలు తమకు అండగా తీసుకొచ్చిన చట్టాలను వినియోగించుకుంటే న్యాయం చేసేందుకు మా వంతు కృషి చేస్తాం.    
– పి. దామోదర్‌ రెడ్డి, మహిళా పోలీస్‌స్టేషన్, కరీంనగర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement