
సాక్షి హైదరాబాద్: ముస్లిం మహిళలను ఉద్ధరించాలని కేంద్రం తీసుకొస్తున్న ట్రిపుల్ తలాక్ చట్టంతో మహిళలకు లాభం కంటే నష్టం ఎక్కువని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అఖిల భారత సున్నీ ఉలేమా బోర్డు అధ్యక్షుడు మౌలానా సయ్యద్ హమేద్ హుస్సేన్ షుత్తరీ పేర్కొన్నారు. విడాకుల వ్యవస్థ ముస్లిం సమాజంలోనే స్త్రీ, పురుషులిద్దరికీ సమ న్యాయం జరిగే విధంగా ఉందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కేంద్ర హరిస్తుందని మండిపడ్డారు. డబీర్‌పురాలోని సంస్థ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఇతర మతస్తుల కంటే ముస్లింలలోనే విడాకుల శాతం చాలా తక్కువగా ఉందన్నారు.
ముస్లిం సమాజంలో భార్యాభర్తలిద్దరూ కలసి జీవించలేనప్పుడు 3 నుంచి 4 నెలల వ్యవధిలో స్వేచ్ఛగా విడిపోయే అవకాశాన్ని ఇస్లామీయా షరియత్ ఇచ్చిందన్నారు. ముస్లిం వివాహాన్ని ఓ సివిల్ కాంట్రాక్టుగా పరిగణించాలని ఆయన కోరారు. కేంద్రం తీసుకొస్తున్న బిల్లు ద్వారా ట్రిపుల్ తలాక్ ఇచ్చిన భర్త జైలుకు పోతే అతని భార్య, పిల్లల పోషణ ఎవరు చూస్తారని ప్రశ్నించారు. బిల్లులో మార్పులు చేయాలన్నారు. ముస్లిం మహిళలకు కేంద్రం ఏదైనా మేలు చేయాలని భావిస్తే వారికి ఉచిత విద్యను అందించాలని కోరారు.