సాక్షి, న్యూఢిల్లీ : ‘ట్రిపుల్ తలాక్’ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ఆర్డినెన్స్‌ను తీసుకరావడం పట్ల ముస్లింలు, మహిళా హక్కుల కార్యకర్తల్లో కొందరు ఆనందాన్ని వ్యక్తం చేయగా, కొందర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ ముస్లిం వ్యక్తి ఏ రకంగానైనా భార్యకు మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నించినట్లయితే అతనికి మూడేళ్ల వరకు శిక్ష విధించేలా కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. 2017, డిసెంబర్‌లో లోక్‌సభ ఆమోదించిన ‘ముస్లిం మహిళల పెళ్లి హక్కుల పరిరక్షణ బిల్లు’ స్థానంలో ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు.
లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లులో పలు మార్పులు, చేర్పులు చేయాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు పట్టు పట్టడంతో నాడు రాజ్యసభలో సంపూర్త బలంలేని బీజేపీ ప్రభుత్వం ఆ సభలో బిల్లును ప్రవేశపెట్టలేక పోయింది. చివరకు కేంద్ర కేబినెట్ ప్రతిపక్షాలతోపాటు, పలు ముస్లిం సంస్థలు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని ఆగస్టు 9వ తేదీన బిల్లులోని కొన్ని సవరణలను తీసుకొచ్చింది. ఆ మరుసటి రోజే ఆ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాలు బిల్లులో చేసిన సవరణలను పరిగణలోకి తీసుకోకుండా గుడ్డిగా సభా కార్యక్రమాలను స్తంభింపచేయడంతో బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో బిల్లు స్థానంలో కేంద్ర కేబినెట్ ట్రిపుల్ తలాక్‌పై ఆర్డినెన్స్‌ను తీసుకరావాల్సి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ పట్ల ముస్లింలో ఓ వర్గం హర్షం వ్యక్తం చేస్తుండగా, మరో వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణించరాదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వర్గం వాదిస్తోంది.
ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని 2017, అక్టోబర్ నెలలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కొన్ని దశాబ్దాలుగా దీనిపై వివాదం కొనసాగుతోంది. ట్రిపుల్ తలాక్‌లు చెల్లవని కోర్టులు తీర్పులు ఇచ్చిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. షమీమ్ ఆరా వర్సెస్ ఉత్తర ప్రభుత్వం మధ్య కొనసాగిన కేసులో ట్రిపుల్ తలాక్ చెల్లదని 2002లోనే సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 2017, ఫిబ్రవరి నెలలో ట్రిపుల్ తలాక్, బహు భార్యత్వం, నిఖా హలాలా (భర్త నుంచి విడిపోయి మళ్లి కలుసుకోవాలంటో మరో వ్యక్తినిపెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం)ను వ్యతిరేకిస్తూ ట్రిపుల్ తలాక్ బాధితురాలు షయారా బానో, పలువురు ముస్లిం మహిళలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో వ్యవహారం ఇంతవరకు వచ్చింది. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నాన్‌బెయిలబుల్ నేరంగా పరిగణిస్తూ, మూడేళ్ల వరకు జైలు, జరిమానా విధించేలా తొలుత బీజేపీ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. ఫలానా వ్యక్తి ట్రిపుల్ తలాక్ చెప్పాడంటూ ఎవరైన పోలీసు ఫిర్యాదు ఇచ్చేలా ఆ బిల్లును రూపొందించారు.
ఈ బిల్లు వల్ల ముస్లిం మహిళలు నష్టపోయే అవకాశం ఉందంటూ ప్రతిపక్షాలు, పలు సంస్థలు గొడవ చేయడంతో కేంద్రం భార్య, లేదా అమె సమీప బంధువలు మాత్రమే ట్రిపుల్ తలాక్‌పై ఫిర్యాదు ఇచ్చేలా సవరణ తీసుకొచ్చింది. ట్రిపుల్ తలాక్ కేసుల్లో భార్యను విచారించి హేతుబద్ధంగా భర్తకు మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చేలా మరో మార్పు చేయడంతోపాటు, భార్యా భర్తలు అవసరమైతే రాజీకి వచ్చేందుకు కూడా వీలు కల్పిస్తూ ముఖ్యమన సవరణకు చేర్చారు. ఆర్డినెన్స్‌ను భారతీయ ముస్లిం మైనారిటీ ఆందోళన్ సంస్థ పూర్తిగా సమర్థించింది. సవరణలను కూడా స్వాగతించింది.
ఆర్దినెన్స్ పట్ల అసంతృప్తి
ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ పట్ల ప్రతిపక్ష పార్టీలతోపాటు కొన్ని మానవ హక్కుల సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడానికి, అది శిక్షార్హమైన నేరంగా పరిగణించడానికి ఎంతో తేడా ఉంది. ముస్లిం మహిళల పేరిట ముస్లిం పురుషులను వేధించేందుకు ఈ ఆర్డినెన్స్ ఉపయోగపడుతుంది’ అని ‘బెబాక్ కలెక్టివ్’ అనే మానవ హక్కుల సంఘం వ్యవస్థాపకులు హసీనా ఖాన్ వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్‌కు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి బదులుగా గృహ హింస నేరంగా పరిగణించి గృహ హింస చట్టం కింద విచారించేలా ఉంటే బాగుంటుందని మానవ హక్కుల కార్యకర్త జావెద్ ఆనంద్ అభిప్రాయపడ్డారు. ట్రిపుల్ తలాక్ ఇస్తే భర్త నుంచి భరణం కోరే హక్కును కూడా కల్పించారుగానీ, జైల్లో ఉండే భర్త ఎలా భార్యకు భరణం చెల్లించగలరని ఆయన ప్రశ్నించారు. మెజారిటీ ముస్లింలలో మగవాళ్లు పనిచేస్తేగానీ కుటుంబం గడవదన్న విషయం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment